World Peace

India and Pakistan

Articles - World Peace - India Pakistan Peace


సమస్త జగత్తులో శాంతి నెలకొల్పడం ఎలా?


ఈ జగత్తులో నివసించు సమస్త జీవరాశి అంతా కూడా ‘Survival of the Fittest’ అనే చార్లెస్ డార్విన్ సిద్ధాంతాన్ని అనుసరించి నడుస్తుంది. అనగా శక్తిమంతుడే జీవిస్తాడు. మనం జీవించి ఉండడానికి కావలసింది వేరు, కాని మనం ఆశించేది వేరు. మనం జీవించడానికి గాలి, నీరు, ఆహరం కావాలి. శరీరాన్ని కాపాడుకొనుటకు వస్త్రం మరియు గృహం కావాలి. మిగిలినవన్నీ కూడా వీటిని మించి మనం కోరుకోనేవి మరియు సమకూర్చుకోనేవి. అసలు ఈ పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి? నా దేవుడు గొప్పవాడని ఒకడు. కాదు నా దేవుడు గొప్పవాడని మరియోకడు. నా మతం గొప్పదని ఒకడు, కాదు నా మతం గొప్పదని మరియోకడు. నా కులం గొప్పదని ఒకడు కాదు నా కులం గొప్పదని మరియోకడు. ఆస్తుల కొరకు పోరాటం, రాజ్యాల కొరకు, భూముల కొరకు పోరాటం, ధనం కొరకు పోరాటం. కోరుకున్న స్త్రీ కొరకు లేదా పురుషుడిని పొందడానికి చేయు కుట్రలు, పోరాటాలు. పొరుగున ఉన్నవాడు బాగుపడితే చూడలేని స్థితి. వాడిని ఏవిధంగా నైనా అణిచి వేయాలనే సంకల్పం. పొరుగు రాష్ట్రం, పొరుగు దేశం వారు సుఖపడితే చూడలేని స్థితి. ఇవన్నీ కూడా మానవుడి లోని ‘అహం’ మరియు అహంకార ప్రవృత్తి. ఈ ప్రవృత్తి మారాలి. ఇది మారాలంటే ఒక్కడు మారితే సరిపోదు. అందరిలో ఈ మార్పు రావాలి. అందరి ఆలోచనలు మారాలి. ఒకేసారి ఉన్నపళంగా మారడం సాధ్యం కాదు. ఆ విధంగా మారాలంటే పరిణామ క్రమంలో విధ్వంసం జరగాలి. ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం| ధర్మ సంస్థాపనార్థాయ సమ్భవామి యుగే యుగే||’ అని శ్రీ కృష్ణ భగవానుడి ఉవాచ. అనగా ఈ దుష్కృతం తారాస్థాయికి చేరి ధర్మం సమూలంగా నాశనమయ్యే స్థితి వచ్చిన నాడు సృష్టి అంతా కూడా నాశనం కాక తప్పదు. ఆ విధంగా జరిగిన నాడు దుర్మార్గం సమూలంగా నాశనమౌతుంది. ఎదో కొంతమంది కూర్చుని శ్రీ గాయత్రి జపం చేయడం వలనను లేదా శ్రీ చండీ యాగాలు చేయడం వలననో, శ్రీ అరుణ యాగాలు చేయడం వలననో జరిగేది కాదు. బ్రహ్మ తత్త్వం వ్యాప్తి చెందాలి. ఇట్టి జ్ఞానం గల వారు ప్రతి ఒక్కరు తమ వద్ద గల విద్వత్తుతో చేతనైనంత మందిని మార్చడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా మార్పు వచ్చిన నాడు లోక కళ్యాణం జరుగుతుంది. ఇందులో గల వేదాంత సూక్ష్మాన్ని ఇప్పుడు మనం గ్రహిద్దాం:


బ్రహ్మైవేదమమృతం పురస్తాద్బ్రహ్మ పశ్చాద్బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ |

అధశ్చోర్ధ్వం చ ప్రమృతం బ్రహ్మైవేదం విశ్వమిదం చరిష్ఠమ్ || 

(ముండకోపనిషత్తు 2-2-11)


ఇదం – ఈ యొక్క; అమృతం – మరణము లేదా నాశనము లేనిది; బ్రహ్మ పురస్తాత్ – బ్రహ్మన్ ముందు భాగంలో అనగా పూర్వ భాగంలో; ఏవ – అంతేకాదు; బ్రహ్మ పశ్చాత్ – వెనక వైపు అనగా పశ్చిమం వైపు; బ్రహ్మ దక్షిణతః – కుడి వైపున అనగా దక్షిణ భాగంలోనూ; ఉత్తరేణచ – ఉత్తర భాగం లోను అనగా ఎడమ దిక్కున; అధః – అధో భాగంలోనూ; ఊర్ధ్వం – మరియు ఊర్ధ్వ భాగంలో; చ ప్రమృతం – మరియు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు; ఇదం విశ్వం వరిష్టం – ఈ విశ్వమంతా కూడా బ్రహ్మమే. (బ్రహ్మన్ లేదా బ్రహ్మ అనగా బ్రహ్మ దేవుడు అని భావించ రాదు. పరబ్రహ్మ మరియు భగవానుడు అని మాత్రమే భావించాలి). మన కంటికి కనిపించి ప్రతి ఒక్కటి; తూర్పు పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వ మరియు అధో భాగములందు; సర్వత్రా వ్యాపించి యున్న వాడు భగవానుడు. ఈ విశ్వమంతా కూడా అయన యొక్క విరాట్ రూపం. అట్టి పరిస్థితిలో భగవానుడు ఎక్కడో దేవాలయం లోను, కొండ పైననో లేదా ఇతర క్షేత్రములందో ఉన్నాడని భావించడం మూఢత్వానికి నిదర్శనమౌతుంది. భగవానుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడనే సత్యమును గ్రహించ గలిగిన నాడు ఆయనను అన్ని చోట్లా, అందరిలో, ప్రతి జీవ మరియు నిర్జీవ రాశిలో మనం ఆయన ఉనికిని గ్రహించ గలము. సృష్టి అంతా కూడా ఒక పధ్ధతి ప్రకారం నడుస్తుంది. ఈ విధంగా నడవడానికి గాను ఒక అదృశ్య రూపంలో గల, అతీతమైన శక్తి సహకరిస్తుంది. దాని సహకారం లేనిదే ఈ సృష్టి ఈ విధంగా నడవదు. గ్రహాలన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కక్షలో నడిచే ఆస్కారం ఉండదు. ఆ శక్తే లేని ఎడల గ్రహాలన్నీ కూడా ఒకదానికి మరొకటి గుద్దుకొని విశ్వమంతా కూడా భస్మీపటలం అవుతుంది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈ శక్తిని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ విధమైన అతీతమైన శక్తి సృష్టి అంతా కూడా ఒకే విధంగా పనిచేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ లో వీచే గాలి భారత దేశంలో కూడా వేస్తుంది. అక్కడ కురిసే వర్షం ఇక్కడ కూడా కురుస్తుంది. అక్కడ ఉన్న భూమిలో మరియు మన వద్ద ఉన్న భూమిలో తేడా లేదు. అక్కడ ఉన్న అగ్ని తత్త్వము ఇక్కడ కూడా ఉన్నది. అట్టి గాలిలో, వర్షంలో, ప్రకృతిలో భేదమే లేదు. భేదమున్నదల్లా మన మనస్సుల్లోనే. అట్టి ప్రకృతిని, శక్తిని గ్రహించలేని మనుజుడు ఈనాడు ‘ఈ భూమి నాది, ఈ గాలి నాది’ అనే పోరాటం చేస్తున్నాము. ఈ విధమైన నాది అనే స్థితి మనుజుడిని అంధకారంలోకి నెట్టి వేస్తుంది. అదే వాడి వినాశనానికి కారణం కూడా అవుతుంది. కావున సృష్టి అంతటిని నడిపే ఒక అతీతమైన శక్తి అందరికీ సమానమైనదే అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలి. ఆ విధంగా వచ్చిన నాడు ఈ మతాలు నశించి పోతాయి, కులాలు ఉండవు, ప్రాంత విభేదాలు ఉండవు, భాష భేదాలు ఉండవు, అసలు భేదమన్నదే ఉండదు. సర్వ మానవ సౌభ్రాతృత్వం నెలకొల్పబడుతుంది. ఆ స్థితి ప్రతి ఒక్కరిలో వచ్చిన నాడు. ‘లోకాః సమస్తా సుఖినో భవన్తు’. ‘స శాన్తిం అది గచ్ఛతి’ అంతే కాదు ‘బ్రహ్మనిర్వాణమ్ ఋచ్ఛతి’.


కావున ఇట్టి స్థితిని నెలకొల్పడానికి గాను పండితులు విద్వాంసులైన వారు కుల మతాలను, భాష భేదాలను, ప్రాంత ఇత్యాది భేదాలను ప్రక్కన పెట్టి ఈ భగవత్ తత్వాన్ని వ్యాప్తి చేయాలి. ప్రతి ఒక్క పండితుడు ఒక్కడిని మార్చ గలిగినా చాలు. మార్చడం అంటే – వాడి ఆలోచనను మార్చ కలిగితే చాలు, లోకమంతా శాంతి నెలకొల్పబడుతుంది.


‘లోకాః సమస్తా సుఖినో భవన్తు’


నమిలికొండ విశ్వేశ్వర శర్మ


image38