Vaikuntha Ekadashi - Mukkoti EkadAshi

Vaikuntha Ekadashi - Mukkoti Ekadashi - Tattvam

Vaikuntha Ekadashi - Mukkoti Ekadashi - Tattvam


వైకుంఠ ఏకాదశి – ముక్కోటి ఏకాదశి

(వేదాంత సూక్ష్మం)


ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించు కున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.


ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం.


విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. తిరుపతిలో మరియు శ్రీరంగంలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. అంతేకాదు భక్తులు అశేష సంఖ్యలో తిరుపతి మరియు శ్రీరంగం లో శ్రీ మహావిష్ణువును ఉత్తరా ద్వారం గుండా ప్రవేశించి దర్శనానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు.


పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమం లోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ‘ఏకాదశి’ అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏలననగా వరిబియ్యం తో వండిన అన్నం భుజించడం వలన మనిషిని ఒక విధమైన మత్తు ఆవహిస్తుంది. అట్టి మత్తులో వాడి బుద్ధి మందగిస్తుందని వైజ్ఞానిక శాస్త్ర చెపుతుంది. అందుకే,  ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశి నాడు ‘పారణ’ అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి కూడా తెలుస్తుంది.


గీతోపదేశం జరిగిన రోజు కనుక 'భగవద్గీత' పుస్తకదానం చేయడం వలన శ్రీ కృష్ణానుగ్రహం లభిస్తుందని నమ్మకం.


వైకుంఠ ఏకాదశి పేరు:

వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం అకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు "వైకుంఠః" (వైకుంఠుడు) అయ్యాడు. అదే కాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛా విహారాన్ని అణచేవాడు - అని అర్ధాలున్నాయి.


ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి

వైఖానసుడి కథ

పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!


మురాసురుడి కథ

కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.


పుత్రద ఏకాదశి కథ

వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ : పూర్వం ‘సుకేతుడు’ అనే మహారాజు 'భద్రావతి' రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య 'చంపక'; మహారాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ, ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే 'వార్త' తెలుసుకొని, వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి, మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు 'పుత్రద ఏకాదశి' గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని, వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య 'చంపక'కు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశీ వ్రతాన్ని' చేస్తారు. అనంతరం కొద్దికాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లితండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు. ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు.


తాత్త్విక సందేశం:


విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయ గుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచ జ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞాన ప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞాన వంతులవుతారు.


సరే! ఇంతవరకు ఉన్న సమాచారం దాదాపుగా అందరికీ తెలిసి ఉంటుంది. ఇట్టి సమాచారం పలు గ్రంథాలలో,మాధ్యమాల్లో కూడా లభిస్తుంది. ఏకాదశి వ్రతం ఆచరించిన ప్రతి ఒక్కరికీ మోక్షం లభిస్తుందా? ప్రతి ఒక్కరూ జ్ఞాన వంతులౌతారా? వైకుంఠ ద్వార లేదా శ్రీ మహావిష్ణు దేవాలయాలలో ఉత్తరద్వార ప్రవేశం చేసి స్వామిని దర్శించు కున్న ప్రతి ఒక్కరూ కూడా మోక్షాన్ని పొందెదరా? ఇత్యాది ప్రశ్నలు అందరి మనస్సులో వెలుగుతూ ఉంటాయి. దీన్ని కాస్త తాత్త్విక దృష్టితో విచారించే ప్రయత్నం చేద్దాము:


పురార్జితాని పాపాని నాశమాయాంతి యస్య వై ।

రామాయణే మహాప్రీతిః తస్య వై భవతి ధ్రువమ్ ।।

అనగా పూర్వజన్మలో చేసికొన్న పాపాల నుండి విముక్తులైన వారికే ఈ జన్మలో రామాయణము నందు ప్రీతి కలుగుతుంది. అని అర్థము. పాపాల నుండి విముక్తుడైన వారు మాత్రమే కాదు, పాపాల నుండి విముక్తి పొందే ప్రయత్నంలో ఉన్న వారికి కూడా శ్రీ రామాయణం లో ప్రీతి కలుగుతుంది. అదే విధంగా ఏ వ్రతము ఆచరించ వలెనన్నా, ఏకాదశి వ్రతం ఆచరించ వలెనన్నా, లేదా ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారా దర్శనం ద్వారా స్వామి దర్శన భాగ్యం కలగాలన్నా అట్టి వాడు తన పాపాలను విముక్తి చేసుకొనుటకు ప్రయత్నించు చున్నాడని భావించాలి. కాని సాధకులు గ్రహించ వలసిన విషయం ఒకటున్నది. అవన్నీ కూడా భక్తిమార్గం లోని భాగాలు మరియు వివిధ పద్ధతులు. ఈ విధమైన ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుటకు గాను ముందుగా సాధకుడు తన కర్మలందు నియంత్రణ కలిగి ఉండడం అవసరం. దిక్కుమాలిన కర్మలన్నీ ఆచరిస్తూ, నిషిద్ద కర్మలను ఆచరిస్తూ ఇట్టి వ్రతాలు ఆచరించుట వలన మరియు వైకుంఠ ద్వారా దర్శనం ద్వారా ముక్తి లభించదు. పాపాలు ప్రక్షాళనం కావు. ‘భోగేన త్వితరే’ అని శాజ్ఞ్కర భాష్యం. అనగా కర్మ ఫలాలు అనుభవించుట వలన మాత్రమే దహించ బడతాయి. భగవంతుడి భక్తులు చాలా కష్టాలను అనుభవిస్తారు. కష్టాలను అనుభవించడం భౌతికమైనది. శరీరం ద్వారా ఆచరించిన కర్మ యొక్క ఫలాలను శరీరమే అనుభవించ వలసి ఉంటుంది. అందుకే శారీరిక బాధలు. కావున సాధకుడు ప్రధానంగా గ్రహించాల్సిన విషయమేమిటంటే – ముందుగా కర్మలను నియంత్రించాలి. మనం ఆచరించే కర్మలు సంపూర్ణ శాస్త్ర విహితమైన కర్మలై ఉండాలి. కామ్యాపేక్ష లేని కర్మలను ఆచరించడం అలవాటు చేసుకోవాలి. మనం ఆచరించే కర్మల ద్వారా లోక సంగ్రహం జరగాలి. మనకొరకు మనం, స్వార్థ ప్రవృత్తితో ఇన్ని సంవత్సరాలు మనం కర్మలను ఆచరిన్చాము. ఇకనైనా ఇతరులకు లాభం చేకూరే కర్మలను ఆచరిద్దాము. ఆ విధంగా లోక సంగ్రహార్థం కర్మలను ఆచరిస్తూ పొతే భగవానుడే మనకు వైకుంఠ ద్వారా ప్రవేశాన్ని కల్పిస్తాడు. మోక్షాన్ని ఆశించడం కూడా కామ్యాపేక్ష నే. మోక్షాన్ని ఆశించి కర్మలు చేసే వారికి మోక్షం లభించదు. కావున ‘ఇహ జన్మని జన్మాన్తరేవ’ అని శ్రీ రామానుజ భాష్యం అనగా ఈ జన్మలో గాని జన్మాన్తరము లందు గాని ఆచరించిన కర్మలను అనుభవించుట ద్వారా కర్మ ప్రక్షాళన జరిగి, సంపూర్ణ ఫలాపేక్ష రహితమైన కర్మలను ఆచరిస్తూ తద్వారా పొందిన ఫలాన్ని ఈశ్వరార్పణం చేయడం ద్వారా లోక సంగ్రహం జరుగుతుంది.


జీవిత కాలంలో చాలా సంపదను మనము కూడబెట్టి ఉంటాము. ధన సంపత్తి, ఆస్తులు, జ్ఞాన సంపత్తి ఇత్యాది వాటిని మనం గడించి ఉంటాము. ఇట్టి సంపద ద్వారా మనకు ప్రయోజనం జరగడం అన్నది ప్రధానం కాదు, ఇతరులకు ఏదైనా ప్రయోజనం జరిగిందా అన్నదే ప్రశ్న!

ఆదాన దోషేణ భవేద్దరిద్రో దారిద్ర దోషేణ కరోతి పాపం ।

పాపాదవశ్యం నరకం ప్రయాతి,పునర్దరిద్రే పునరేపి పాపిః ।।

అనగా దాన ధర్మాదులు ఆచరించని వాడు దరిద్రుడై జన్మించు చున్నాడు. దరిద్రుడై జన్మించుట వలన పాప కర్మలను ఆచరించు చున్నాడు. ఆ విధంగా పాప కర్మలను ఆచరించుట వలన వాడు నరకానికి పోవు చున్నాడు. అట్టి వారు పునః దరిద్రుడికి గా జన్మించి పునః పాప కర్మలను ఆచరించు చున్నాడు.


కావున ప్రతి ఒక్కడు దాన ధర్మాదులను ఆచరించాలి. ధన దానం, శ్రమ దానం, విద్యా దానం, వస్త్ర దానం, జ్ఞాన ధనం ఇత్యాదివన్నీ కూడా దానాలే. మన వద్ద గల పలు విధములైన సంపదలను దానం చేయడం. ఈ విధంగా దానం చేయడం వలన లోక సంగ్రహం జరుగుతుంది. ఇట్టి వారే వైకుంఠ ద్వార దర్శనానికి అర్హులు. దేవాలయంలో గల వైకుంఠ ద్వారాన్ని ప్రవేశానికి లక్షలాది మంది ఆరాటపడుతూ ఉంటారు. కాని ‘దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః’ దేహమే దేవాలయం అట్టి దేహంలో గల జీవుడే పరమాత్ముడు. అట్టి పరమాత్మ దర్శనం చేసుకోవాలి. అది జరగాలంటే అన్తఃకరణ శుద్ధి జరగాలి. అన్తఃకరణ శుద్ధి జరగాలంటే కర్మ శుద్ధి జరగాలి. ఇది సాధన ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. కావున ఈ రోజే ఇట్టి సాధనకు శంఖుస్థాపన చేద్దాము. లక్షలాది మంది ప్రజలు దర్శనం చేసుకునే చోట భక్తులకు ఇబ్బంది జరగడం సహజం. ఆ విధంగా రద్దీగా ఉండే ప్రాంతం కాకుండా మనలోనే నిక్షిప్తమై యున్న పరమాత్ముడిని ధ్యానం చేసుకొందాము. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని సంపూర్ణ ధ్యానం చేస్తూ భగవానుడిని వాస్తవిక దర్శనం చేసుకోవచ్చు. పూర్తి భక్తి తో ధ్యానం చేయు భక్తుడికి భగవానుడు తప్పక వాస్తవిక దర్శనం కలుగ చేస్తాడు. ఇది సత్యం.


స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం - న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం - లోకాస్సమస్తా స్సుఖినోభవంతు. ।।
 

स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां- न्यायेन मार्गेण महीं महीशाः ।
गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं- लोकाः समस्ता सुखिनो भवन्तु ।।


నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति

image56