Sri Krishna's Upadesha for Students

Sri Krishna's Upadesha for Students - As per Srimad Bhagavad Gita

ఓం శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః

శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః


విద్యార్థులకు శ్రీ కృష్ణ భగవానుని బోధ


విద్యార్థులకు పరీక్షల సమయం ఆసన్నమైంది. విద్యార్థులకు పరీక్షలోచ్చాయంటే వారి తల్లిదండ్రులకు ముందు భయం మొదలౌతుంది. తమ సంతానం క్లాసు లో ఫస్ట్ వస్తాడో లేదో అనే భయం, అత్యధిక మార్కులు సంపాదిస్తాడో లేదో అనే భయం, అద్భుతమైన ర్యాంక్ సంపాదిస్తాడో లేదో అనే భయం. ఈ విధంగా పలు విధాలైన భయాలు నేడు తల్లిదండ్రులను వెంటాడుతూ ఉంటాయి. అసలు వారి సంతానం ఎంతవరకు జ్ఞానాన్ని సంపాదించు కుంటున్నాడో ఎవరూ చూడడం లేదు. ఇక విద్యార్థులు పరిస్థితి మరీ దుర్భరంగా ఉంటుంది. వాడిపై విపరీతమైన ఒత్తిడి. ఒకవైపు స్కూల్ యాజమాన్యం ఒత్తిడి,మరొక వైపు ఇంట్లో తల్లిదండ్రుల ఒత్తిడి. ఈ ఒత్తిడి భరించ లేక బలవన్మరణానికి కూడా వెనకాడడం లేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు విద్య సంస్థల యజమానులు ఆలోచించాలి. మనం ఎన్నో సందర్భాలలో చూస్తూ ఉన్నాము, పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకున్న వారు మరియు తక్కువ ర్యాంక్ తో పాస్ అయిన వారు త్వరగా ఉద్యోగాలను సంపాదించుకో గలుగుతున్నారు. దీనికి ప్రధాన కారణం, ఉద్యోగం సంపాదించు కోవాలంటే వాడిలో అట్టి చతురత ఉండాలి. జ్ఞానం ఉండాలి. కాబట్టి జ్ఞానానికే ప్రథమ ప్రాధాన్యత.


ఎంతమంది విద్యార్థులకు నేడు చదివిన చదువులు జీర్ణమౌతున్నాయి? వారికి జీర్ణం కావడం లేదు కాబట్టే దాని ఫలితాన్ని వారు అనుభవించ లేక పోతున్నారు. జీర్ణం కాని విద్య లేదా జీర్ణం కాని ఆహారం రెండూ విషతుల్యమైనవే. అందుకే:

అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం ।

మూర్ఖస్య చ విషం గోష్టి వృద్ధస్య తరుణీ విషం ।।

సరిగా అభ్యసించని శాస్త్రం (విద్య) విష తుల్యమైనది. జీర్ణం కాని భోజనం కూడా విషతుల్యమైనదే. మూర్ఖుడికి శాస్త్ర విషయము లందు గోష్ఠి విషతుల్యమైనది. మరియు వృద్ధుడికి ఒక అందమైన యువతి కూడా విషతుల్యమైనది. కావున విద్య సంపూర్ణంగా జీర్ణం కావాలి. ఆ విధంగా జీర్ణమయ్యే వరకు దాన్ని ‘చర్విత చర్వణం’ చదువుతూనే ఉండాలి. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అన్నిటికంటే ప్రధానమైనది,అసలు మనకు శ్రద్ధ గల విద్యను మాత్రమే అభ్యసించాలి. ఇతరులను సంతృప్తి పరచుటకు శ్రద్ధ లేని విద్యను చదివి ప్రయోజనం లేదు. దాని ద్వారా జీవితాలు నాశనం అవ్వడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి.


విద్యాభ్యాసములో మార్కులకు ద్వితీయ ప్రాధాన్యత. ముందు మనం విషయం అర్థం చేసుకొని దాన్ని జీర్ణించుకోగలిగితే మార్కులు తమకు తాముగా వస్తూనే ఉంటాయి. గణిత శాస్త్రంలో ఒక సమీకరణమును పరిష్కరించుట కొరకు (Solving an Equation), అట్టి ఈక్వేషన్ వెనక గల సిద్ధాంతాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ముందుగా ఆ సిద్ధాంతం అర్థమయితే ఈక్వేషన్ ను అత్యంత సులువుగా పరిష్కరించ వచ్చు. అంతే కానీ పుస్తకంలో ఇచ్చిన సమీకరణాన్ని ఉన్నది ఉన్నట్లుగా బట్టీకొట్ట రాదు. నేటి విద్యా సంస్థలు విద్యార్థులకు నేర్పుతున్నది ఇదే. అత్యంత సులువుగా పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా వారికి చెప్పి పరీక్ష వ్రాయిస్తున్నారు. అందుకే వాడికి మార్కులు వస్తున్నాయి కాని జ్ఞానం మాత్రం ఉండడం లేదు. వీటన్నిటికీ మించి వారిపై గల ఒత్తిడి. భయంకరమైన ఒత్తిడితో వారు పరీక్షలకు సిద్ధం అవుతారు. అందుకే వారికి ఫలితం కూడా అనుకున్నంతగా లభించదు. ఇక్కడ శ్రీ కృష్ణ భగవానుడి ఉపదేశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా గ్రహించాలి:


మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా ।

నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ।। (భగీ ౩/౩౦)

సమస్త కర్మలను నా యందు అధ్యాత్మచిత్తముతో, వివేకవంతమైన బుద్ధి ద్వారా సమర్పించి  కామనా రహితుడవై, మమతా రహితుడవై మరియు సంతాప రహితుడవై యుద్ధ రూపమైన కర్మను మరియు కర్తవ్యమును ఆచరించుము.


ఈ శ్లోకాన్ని అనుసరించి ప్రతి విద్యార్థి కూడాను ముందుగా సంపూర్ణ చిత్తం తో, శ్రద్ధతో తన వివేకాన్ని సంపూర్ణంగా వినియోగించి విద్యను అభ్యసించాలి. ఆ విధంగా చదువుతున్నపుడు, వాడిలో పరీక్షల గూర్చిన ఆలోచన ఏమాత్రం ఉండరాదు. మార్కుల పట్ల గల మమత, ర్యాంక్ ల పట్ల గల శ్రద్ధ ఉండ రాదు. వాడిలో ఉండ వలసిందల్లా, జ్ఞాన సముపార్జన పై శ్రద్ధ. వాడు చదివే చదువును సంపూర్ణంగా జీర్ణం చేసుకోవాలి. ఆ విధంగా చదివి పరీక్ష వ్రాసిన నాడు అట్టి పరీక్షలో మార్కులు తమకు తాముగా వస్తాయి. మార్కుల గూర్చి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టనవసరం లేదు. ఒకవేళ అనుకున్నంత స్థాయిలో మార్కులు రాకున్నా కూడాను వాడు సంతాపము చెందరాదు. ఇదే శ్రీ కృష్ణ భగవానుడు మనకు చేసిన బోధ. ‘సంపూర్ణ శ్రద్ధ’ అనునది చాలా ప్రధానమైనది. నేడు విద్యార్థులకు విద్యాభ్యాసము కంటే కూడా ఇతర వ్యాపకాలు ఎక్కువ అయినాయి. మనిషి ఏక కాలం లో ఏదేని ఒక దాన్ని మాత్రమే సాధించ గలదు. విద్యార్థికి చదువు తప్ప ఇతర ధ్యాస ఉండరాదు. ఇట్టి వ్యాపకాలు విద్యార్థి యొక్క మనస్సును చలింప చేస్తాయి. ఆ విధంగా మనస్సు చలించిన విద్యార్థి జీవిత కాలంలో సాధించేది ఏదీ ఉండదు. కావున విద్యార్థి - ‘నిరాశీః’ ఈ విధమైన ఆశ లేకుండా (అనగా విద్య మరియు జ్ఞాన సముపార్జన మాత్రమే వాడికి ప్రధానం. ఇతర విషయములపై వాడికి ఆశ ఉండరాదు), ‘త్యక్తాశీః’విద్య మరియు జ్ఞానము తప్ప ఇతర ఆశలన్నిటినీ వదులుకొని, ‘నిర్మమః’ ఇతర విషయముల పట్ల ఏవిధమైన మమత లేనివాడై, ‘విగతజ్వరః విగతసన్తాపః, విగతశోకః’ భయం అనే మానసిక వ్యాధి నుండి విముక్తుడవై, పరీక్షలో ఫెయిల్ అవుతానేమో లేదా అనుకున్నంత ర్యాంక్ వస్తుందో లేదో అన్న సన్తాపము మరియు దుఃఖమును వీడి విద్యను అభ్యసించాలి. ఇది పైన ఇవ్వబడిన శ్లోకానికి శ్రీ శాజ్ఞ్కర భగవత్పాదుల వారి భాష్యం. ఆ విధంగా చేసిన వాడు పొందిన జ్ఞానం వలన లోక కల్యాణం జరుగుతుంది.


ఈ సిద్ధాంతాన్ని ప్రతి తల్లిదండ్రులు మరియు విద్యను బోధించు వారు విద్యార్థులకు చెప్పాలి. అప్పుడే ఆ విద్యార్థి గొప్ప ఫలితాన్ని సాధించ గలడు. అట్టి విద్యార్థి వలన సమాజ శ్రేయస్సు జరుగుతుంది. దాన్నే శ్రీ కృష్ణ భగవానుడు ‘లోక సంగ్రహం’ అని అన్నాడు.


స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం - న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం - లోకాస్సమస్తా స్సుఖినోభవంతు. ।।
स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां- न्यायेन मार्गेण महीं महीशाः ।
गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं- लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।


నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति

image67