नास्ति नारायण समं - न भूतं न भविष्यति
नास्ति नारायण समं - न भूतं न भविष्यति
Why Gnani also commit mistakes in his life - Sri Krishna Bhagavan answers:
జ్ఞానులైన వారు కూడా తమ జీవిత కాలంలో తప్పులు ఎందుకు చేస్తారు? - శ్రీ కృష్ణ భగవానుని సమాధానం
శ్లో:
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ।
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ।।33।। -152-
జ్ఞానవాన్ అపి = జ్ఞానవంతుడైనను; స్వస్యాః = తన యొక్క; ప్రకృతేః = ప్రకృతికి (స్వభావమునకు); సదృశమ్ = అనుగుణముగానే; చేష్టతే = ప్రవర్తించు చున్నాడు; భూతాని = ప్రాణులు; ప్రకృతిమ్ = తమ ప్రకృతిని (స్వభావమును); యాన్తి = అనుసరించి నడుచు చున్నవి; (కాబట్టి) నిగ్రహః = నిగ్రహము లేదా నిరోధము; కిం కరిష్యతి = ఏమి చేయగలదు?
జ్ఞానవంతుడైనను (శాస్త్ర పాండిత్యము లేదా లౌకిక జ్ఞానము కలిగి యున్న వాడైనను) తన ప్రకృతికి (జన్మాన్తర సంస్కారము వలన కలిగిన స్వభావమునకు) అనుగుణముగానే ప్రవర్తించు చున్నాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించియే నడుచు చున్నవి. కావున ఇక నిగ్రహం ఏమి చేయగలదు?
శ్రీ శాజ్ఞ్కర భాష్యం:
33.1 సదృశం ఇతి ।। సదృశం అనురూపం చేష్టతే చేష్టతాం కరోతి । కస్య? స్వస్యాః స్వకీయాయాః ప్రకృతేః । ప్రకృతిః నామ పూర్వకృతధర్మాధర్మాదిసంస్కారాః వర్తమానజన్మాదౌ అభివ్యక్తాః, సా ప్రకృతిః । తస్యాః సదృశమ్ ఏవ సర్వః జన్తుః జ్ఞానవాన్ అపి చేష్టతే, కిం పునః మూర్ఖః? తస్మాత్ ప్రకృతిం యాన్తి అనుగచ్ఛన్తి భూతాని ప్రాణినః । నిగ్రహః నిషేధరూపః కిం కరిష్యతి మమ వా అన్యస్య వా? (దుర్నిగ్రహా ప్రకృతిః ఇతి వాక్యశేషః) ।।
‘సదృశం అనురూపం చేష్టతే చేష్టతాం కరోతి’ తదనుగుణంగా ప్రవర్తిస్తాడు. ‘కస్య?’ దేనికి అనుగుణంగా? ‘స్వస్యాః స్వకీయాయాః ప్రకృతేః’ తన ప్రకృతికి (స్వభావము) అనుగుణంగా ప్రవర్తిస్తాడు. ‘ప్రకృతిః నామ పూర్వకృతధర్మాధర్మాదిసంస్కారాః వర్తమానజన్మాదౌ అభివ్యక్తాః, సా ప్రకృతిః’ ప్రకృతి అనగా పూర్వం ఆచరించిన ధర్మ మరియు అధర్మ సంస్కారాలు వర్తమాన జన్మలోను మరియు రాబోవు జన్మలోను అభివ్యక్తమగుట లేదా వ్యక్తమగును. అదియే ‘ప్రకృతి’. ‘తస్యాః సదృశమ్ ఏవ సర్వః జన్తుః జ్ఞానవాన్ అపి చేష్టతే, కిం పునః మూర్ఖః?’ అట్టి ప్రకృతికి అనుగుణంగా ప్రతి జీవి కూడాను, వాడు జ్ఞానవంతుడైన నేమి, ప్రవర్తించును. ఇక మూర్ఖుల గూర్చి చెప్పనేమి? ‘తస్మాత్ ప్రకృతిం యాన్తి అనుగచ్ఛన్తి భూతాని ప్రాణినః’ కావున ప్రాణులన్నీ లేదా జీవులన్నీ కూడాను వాటి ప్రకృతికి అనుగుణంగానే ఉంటాయి. ‘నిగ్రహః నిషేధరూపః కిం కరిష్యతి మమ వా అన్యస్య వా? (దుర్నిగ్రహా ప్రకృతిః ఇతి వాక్యశేషః)’ కావున నేను గాని మరే ఇతర వ్యక్తి గాని నిగ్రహించడం లేదా నిషేధించడం వలన ఉపయోగమేమి? వారి స్వభావము ప్రకృతికి అనుగుణంగా ఉంటుంది, అట్టి ప్రకృతి యొక్క స్వభావాన్ని అణచివేయ లేము, దాన్ని నిగ్రహించడం గాని లేదా జయించడం గాని కష్టం.
34.0 యది సర్వః జన్తుః ఆత్మనః ప్రకృతిసదృశమ్ ఏవ చేష్టతే – న చ ప్రకృతిశూన్యః కశ్చిత్ ఆస్తి – తతః పురుషకారస్య విషయానుపపత్తేః శాస్త్రానర్థక్యప్రాప్తౌ ఇదం ఉచ్యతే --
క్రింది అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం: ‘యది సర్వః జన్తుః ఆత్మనః ప్రకృతిసదృశమ్ ఏవ చేష్టతే’ ఒకవేళ జీవులన్నియూ తమ ప్రకృతికి అనుగుణంగా ప్రవర్తిస్తే లేదా జీవిస్తే, మరియు ‘న చ ప్రకృతిశూన్యః కశ్చిత్ ఆస్తి’ తన ప్రత్యేకమైన స్వభావము లేదా ప్రకృతి లోపించిన వారు ఎవరూ కూడా లేని ఎడల, ‘తతః పురుషకారస్య విషయానుపపత్తేః’ మానవ ప్రయత్నానికి తావు ఉండదు. ‘శాస్త్రానర్థక్యప్రాప్తౌ’ శాస్త్రాలు, శాస్త్ర ప్రమాణాలు కూడా నిరర్థక మౌతాయి లేదా అర్థం లేనివి అవుతాయి. ‘ఇదం ఉచ్యతే’ ఈ అభ్యంతరానికి భగవానుడు క్రింది విధంగా సమాధానం ఇచ్చు చున్నాడు:
శ్రీ రామానుజ భాష్యం:
ప్రకృతివివిక్తమ్ ఈదృశమ్ ఆత్మస్వరూపమ్, తదేవ సర్వదానుసన్ధేయమ్, ఇతి చ శాస్త్రాణి ప్రతిపాదయన్తి; ఇతి జ్ఞానవాన్ ఆపి స్వస్యాః ప్రకృతేః ప్రాచీనవాసనాయాః సదృశం ప్రాకృతవిషయేషు ఏవ చేష్టతే; కుతః? ప్రకృతిం యాన్తి భూతాని అచిత్సంసృష్టా జన్తవః అనాదికాలప్రవృత్తవాసనామ్ ఏవ యాన్తి, తాని వాసనానుయాయీని భూతాని శాస్త్రకృతో నిగ్రహః కిం కరిష్యతి ।।౩౩।।
‘ప్రకృతివివిక్తమ్ ఈదృశమ్ ఆత్మస్వరూపమ్, తదేవ సర్వదానుసన్ధేయమ్, ఇతి చ శాస్త్రాణి ప్రతిపాదయన్తి’ ‘ఈ విధమైన ఆత్మ స్వరూపం ప్రకృతి కంటే కూడా భిన్నమైనది, దానిని సదా మరియు సర్వదా అనుసంధానించాలి’. ఈ విషయాన్ని శాస్త్రాలు ప్రతిపాదించాయి. ‘ఇతి జ్ఞానవాన్ ఆపి స్వస్యాః ప్రకృతేః ప్రాచీనవాసనాయాః సదృశం ప్రాకృతవిషయేషు ఏవ చేష్టతే’ ఈ విషయమును ఎరిగిన జ్ఞాని కూడా తన ప్రకృతి – తన ప్రాచీన వాసనలకు అనుగుణంగా సదృశుడై ప్రాకృత విషయము లందు చేష్టుడై ఉంటాడు. ‘కుతః?’ ఎందుకు? ‘ప్రకృతిం యాన్తి భూతాని అచిత్సంసృష్టా జన్తవః అనాదికాలప్రవృత్తవాసనామ్ ఏవ యాన్తి’ ఎందుకంటే ప్రాణులన్నీ కూడా ప్రకృతిని సంతరించు కొంటాయి. జడ ప్రకృతిని కలిగి యున్న ప్రాణులు అనాదికాల ప్రవృత్త వాసనలకు అనుగుణంగా ప్రకృతిని సంతరించుకొని అట్టి ప్రకృతినే అనుసరిస్తాయి. ‘తాని వాసనానుయాయీని భూతాని శాస్త్రకృతో నిగ్రహః కిం కరిష్యతి’ ఇట్టి వాసనలను అనుసరించు ప్రాణుల శాస్త్ర జనిత నిగ్రహం ఎలా కుదురుతుంది?
ప్రకృత్యయాయిత్వప్రకారమ్ ఆహ ---
ప్రాణులు ఏ ప్రకారముగా ప్రకృతి అనుయాయి ఏవిధంగా ఔతారు? అనగా ప్రకృతిని ఏ ప్రకారముగా అనుసరిస్తారు? భగవంతుడు వివరించు చున్నాడు ---
శ్రీ మధ్వాచార్య భాష్యం:
ఏవం చేత్ కిమితి తే మతమ్ నానుతిష్ఠతి లోక ఇత్యత ఆహ – సదృశమితి ।। ప్రకృతిః పూర్వసంస్కారః ।।౩౩।।
అదే అయితే, లోకమంతా కూడా నీ మతాన్ని ఎందుకు అనుసరించరు? శ్రీ కృష్ణ భగవానుడు వివరించు చున్నాడు.
ఆలోచనామృతం (సామాజిక వ్యాఖ్య):
ఇది ఒక అద్భుతమైన శ్లోకము. భగవానుడు మనిషి యొక్క మానసిక స్థితికి గల కారణాలను ఈ శ్లోకంలో ఆవిష్కరించి యున్నారు. అంతేకాదు, మనిషి యొక్క ప్రవర్తనకు, స్వభావానికి గల కారణాలు శ్రీ కృష్ణ భగవానుడు మనకు వివరించి యున్నారు. దానికి తోడు అద్బుతమైన శ్రీ శాజ్ఞ్కర మరియు శ్రీ రామానుజుల వారి భాష్యాలు. ఆధునిక మానసిక విజ్ఞాన శాస్త్ర వివరాలు కూడా మనకు ఈ బోధనలో కనిపిస్తాయి. ‘సిల్వియా బ్రౌన్’ లాంటి ప్రముఖ మానసిక శాస్త్ర వేత్తలు మనిషి యొక్క ప్రవృత్తి, స్వభావము మరియు ప్రకృతి గూర్చి మరియు దాని పూర్వాపరాల గూర్చి గొప్ప పరిశోధనలు చేసి యున్నారు. ఎంత గొప్ప జ్ఞాని అయినా, ఎంతటి పాండిత్యం ఉన్నా కొన్ని ప్రత్యేకమైన సమయం మరియు సందర్భాలలో వారి మానసిక ప్రవృత్తి చాలా భిన్నంగా ఉంటుంది, అంతేకాదు వికృతంగా కూడా ఉంటుంది. అంతటి గొప్పవాడు,పండితుడు, మేధావి ఆ విధంగా ఎందుకు ప్రవర్తించాడో ఎవరికీ తెలియదు, వాళ్ళ స్వంతానికి కూడా తెలియదు. ఎంతోమంది ఉత్తములుగా గుర్తింపును పొందిన వారు కూడా తమ జీవిత కాలంలో ఊహించని విధంగా ఏదో ఒక దుష్కర్మను ఆచరించి దానికి తగిన విధంగా శిక్షను అనుభవిస్తూ ఉంటారు. ఇంకా గమ్మత్తేమిటంటే అలాంటి వారికి ముందు శిక్ష పడుతుంది. అలాంటి వారు దుర్మార్గుల కంటే కూడా ముందుగా శిక్షను అనుభవిస్తారు. ఇందంతా కూడా శ్రీ శాజ్ఞ్కర భగవత్పాదుల వారు చెప్పిన విధంగా ‘పూర్వకృతధర్మాధర్మాదిసంస్కారాః వర్తమానజన్మాదౌ అభివ్యక్తాః, సా ప్రకృతిః’ ఇతః పూర్వం జీవుడు ఆచరించిన ధర్మ అధర్మ సంస్కారాలకు అనుగుణంగా వర్తమానంలోను మరియు రాబోవు జన్మల లోనూ వాడి ప్రకృతి లేదా స్వభావము వ్యక్తమౌతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు మరియు ఈ విధమైన కర్మ శేష ప్రభావం తొలగిపోవాలంటే వాడు ఆ విధమైన కర్మను ఆచరించాలి మరియు శిక్షించ బడాలి కూడాను. అప్పుడే కర్మ దహించి వేయబడుతుంది.
‘ప్రకృతి’ అనే పదాన్ని చాలా సందర్భాలలో ప్రయోగించ బడింది. ‘ప్రకృతి’ అనగానే ప్రతి ఒక్కరికీ బాహ్య ప్రకృతే గుర్తుకు వస్తుంది. ప్రకృతి బాహ్యంగా కనబడేది మాత్రమే కాదు, మనలో అంతర్గతంగా కూడా ఉంటుంది. బాహ్యంగా కనబడే శరీరము, ఇంద్రియాలు మరియు మనస్సు ఈ మూడింటితో కలిసిన క్లిష్టమైన ఒక మిశ్రమము. ఇది బాహ్య ప్రకృతితో సమానమైనది. ఈ రెండూ కూడా పరిణామ క్రమంలో ఒకే పదార్థం నుండి ఆవిర్భవించి యున్నాయి. ఇదే వేదాంత బోధన మరియు ఆధునిక శాస్త్రీయ బోధన. కావున ప్రకృతి బయట మాత్రమే లేదు. మనలో కూడా అంతర్లీనమై యున్నది. మన శరీరము, ఇంద్రియాలు మరియు మనస్సు అన్నీ కూడా బాహ్య ప్రకృతి యొక్క స్థావరాలుగా భావించాలి. ఈ మూడింటితో కలిసిన ప్రకృతి ఒక బలమైన గొప్ప శక్తిని విడుదల చేస్తుంది. అదే పూర్వ జన్మల వాసనలతో కూడిన ప్రకృతి. ఇట్టి ప్రకృతిని నియంత్రించ లేని వాడు ఒక సామాన్యమైన జంతువు వలే జీవిస్తాడు. నిజానికి పూర్వజన్మ వాసనలతో కూడిన ఇట్టి ప్రకృతి నిగ్రహించుటకు వీలు కానిది. అట్టి ప్రకృతికి అనుగుణంగానే మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. జ్ఞానులైనా లేదా అజ్ఞానులైనా, వీరి ప్రవృత్తి వారి పూర్వజన్మ వాసనలను అనుసరించి మాత్రమే ఉంటుంది. అజ్ఞాని లేదా మూర్ఖుడు సహజంగా మూర్ఖంగా లేదా అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. కాని చాలా సందర్భము లందు జ్ఞానులు, బుద్ధిమంతులు కూడా మూర్ఖంగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉంటుంది. జ్ఞాని మరియు బుద్ధిమంతుడు ప్రకృతి ద్వారా ప్రేరేపింప బడి, వాడి సహజ ప్రభావానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ‘సదృశం చేష్టతే స్వస్యాః’ మనిషి యొక్క స్వభావము వాడిని ప్రవర్తింప చేస్తుంది. అంతేకాదు వాడి ప్రవృత్తి వాడికి ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది. అట్టి ఆదేశాలకు అనుగుణంగా వాడి చేష్టలు ఉంటాయి. మనం ఏమి చేయాలో ఏమి చేయ కూడదో అదే మనకు ఆదేశాలు ఇస్తుంది. ఇట్టి ప్రకృతి యందు ఇంద్రియాలకు చెందిన ప్రేరణలు మరియు ప్రచోదనలు నిక్షిప్తమై ఉంటాయి. ఇట్టి ప్రేరణలు మనిషిని బాహ్య ప్రపంచం వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. బాహ్య ప్రపంచం లో కనబడే ప్రతి వస్తువు మరియు పదార్థం ఇంద్రియాలను ప్రభావితం చేస్తాయి. ఈ ప్రక్రియలో మనస్సు కూడా పాలుపంచుకుంటుంది. మనస్సు ఇన్ద్రియాలను అనుసరిస్తుంది. అనుసరిస్తూ బాహ్యం ప్రపంచంలో లభ్యమయ్యే వస్తువు లేదా పదార్థాల ద్వారా ఇన్ద్రియ తృప్తిని పొందుతూ ఉంటుంది. ఈవిధంగా చేయడం ద్వారా మనలో మనకు అనుగుణంగా ఉండు ఒక భిన్నమైన ప్రకృతిని ఏర్పాటు చేసుకుంటాము. ఇట్టి ప్రకృతినే ‘సహజ ప్రవృత్తి’ అని ఆధునిక విజ్ఞానం అంటే, వేదాంతిక మానసిక శాస్త్రములో దీన్ని ‘సంస్కారాలు లేదా వాసనలు’ అని అద్భుతంగా వర్ణించారు. ఇట్టి వాసనలు మరియు సంస్కారాలు మనిషి యొక్క మనస్సులోను, చేతనావస్థకు క్రిందను (below the conscious level) మరియు సుప్తచేతనావస్థ (subconscious) యందును మరియు అచేతనా (unconscious) లేదా స్మృతి రహిత స్థితి, ఈ నాలుగు విధములైన స్థితులందు కూడా నిక్షిప్తమై ఉంటాయి. అనగా మనిషి ఏ స్థితిలో ఉన్నా కూడాను వాడిలో ఈ జన్మాంతర వాసనలు లేదా సంస్కారాలు తప్పనిసరిగా ఉంటాయి. దీన్ని మరికాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము:
ఏదేని ఒక బాహ్య విషయమునకు చెందిన స్పందన మనిషి యొక్క మనస్సులో ముందుగా ఆలోచనా తరంగాల రూపంలో ఉత్పన్నం అవుతాయి. అవి కొంత వరకు ఉండి, పిదప సాధారణ చేతనా స్థాయి క్రిందికి వెళ్ళిపోతాయి. అవి క్రమంగా చేతనావస్థలో గల మనస్సు నుండి, మరింత లోతుగా ఉపచేతన మనస్సు (చిత్తం) లోకి ప్రవేశిస్తాయి. ఉపచేతన లో ప్రవేశించిన ఇట్టి తరంగాలు అక్కడ బలపడతాయి. అవి సూక్ష్మంగా మహత్తరంగా పనిచేస్తూ ఉంటాయి. ఆ విధంగా పనిచేస్తూ కూడా అది ఒక సంస్కారంగా మారిపోతుంది. అనగా మనం జాగరూక స్థితిలో ఆచరించిన కర్మ – అట్టి కర్మ స్మృతిలో ఉన్నదైనా,ఉద్వేగపూరిత మైనది అయినా లేదా సంకల్ప యుక్తమైనది అయినా కూడా – చేతనావస్థకు క్రిందనే ఒక సూక్ష్మ మైన అవ్యక్త రూపంలో ఉంటుంది. దాన్నే మనం ‘వాసన లేదా సంస్కారం’ అని అంటాము. ఇవి ఉపచేతనా మనస్సు లేదా చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయి. ఉప చేతనా మనస్సునే అచేతనా మనస్సు అని అంటారు. ఇవన్నీ కూడా మనిషి యొక్క చిన్న మెదడులో సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి ఏనాడు నష్టపోవు. ‘మీ మెదడులో వచ్చిన ఆలోచనలను తుడిచేయ్’ అని ఎవడైనా అన్నా కూడా, నిజంగా తుడిచి వేయడం అసంభవం. ఈ విధంగా సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో గల ఆలోచన ఉపచేతనా మనస్సు అనగా చిత్తం నుండి చేతనా మనస్సు యొక్క ఉపరితలానికి చేరుకుంటాయి. ఇవే సూక్ష్మ రూపంలో గల వాసనలు, ప్రకృతి మరియు సంస్కారాలు. ఇవి చేతనా మనస్సు యొక్క ఉపరితలానికి వచ్చిన పిదప వాటినే పురాతన జ్ఞాపకాలు లేదా స్మృతి అని అంటాము. అనగా సంస్కారాలు స్మృతులుగా మారాయి. ఇట్టి స్మృతి కర్మకు దారితీస్తుంది. అనగా వాసనలు లేదా సంస్కారాలు లేనిదే స్మృతి లేదు. స్మృతి వలననే కర్మ ఉత్పన్నం అవుతుంది. ఇన్ద్రియ భూమికలో (Physical sphere) ఏర్పడిన అనుభవం చిత్తం లోతుల్లోకి అనగా ఉపచేతనా మనస్సులోకి ప్రవేశించి అక్కడ అది సంస్కారంగా మారుతుంది. మనస్సు దేన్నైనా అనుభూతి చెందిన మరుక్షణం, ఆ అనుభూతికి చెందిన సంస్కారం ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడుటకు గాను సమయ భేదం ఏమాత్రం ఉండదు. ఏదేని ఒక వస్తువు యొక్క ప్రతిబింబం అద్దంలో ఎంత త్వరగా కనిపిస్తుందో అంతే సమయ భేదం లేకుండా బాహ్య వస్తు లేదా విషయ అనుభూతి సంస్కారంగా మారిపోయి అచేతనా మనస్సులో నిక్షిప్తమై పోతుంది. ఇవే బాహ్య విషయాల ద్వారా ఉత్పన్నమైన వాసనలు. ప్రతి విషయానికి చెందిన అనుభూతి ఒక వాసనగా మారిపోతుంది. అనగా వాసన లేదా సంస్కారం లేనిదే స్మృతి ఉండదు. ప్రతి స్మృతి మరియు జ్ఞాపకం వెనుక ఒక వాసన మరియు సంస్కారం ఉందని గ్రహించాలి. అట్టి స్మృతులే ప్రకృతి లేదా స్వభావం గా మారిపోతాయి. మరి ఇక్కడ సాధకుడికి ఒక సంశయం రావచ్చు. ‘ఈ స్మృతులు మన మెదడుకు చెందినవే అయి ఉంటే, శరీరం మరణించిన మరుక్షణం ఈ స్మృతులన్నీ కూడా నశించి పోవాలి కదా!’ అని. స్మృతి నశిస్తుందేమో కాని వాసన, సంస్కారం నశించదు. ‘వాసన’ అనునది భౌతికమైన శరీరానికి చెందినది కాదు. అది సూక్ష్మ మరియు కారణ శరీరాలకు చెందినది. భౌతిక శరీరం నశించినా ఆత్మను లేదా సూక్ష్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్న వాసనలు లేదా సంస్కారాలు మరు జన్మకు కూడా ప్రయాణించి, పునః వాడు శరీర ధారణ చేసిన నాడు వాడి చిన్న మెదడులోకి బదిలీ అయి, అక్కడ తిష్ఠ వేసుకొని, స్మృతులుగా మారి, తద్వారా వాడి స్వభావం ఏర్పడుతుంది. కావున శ్రీ శాజ్ఞ్కర భగవత్పాదుల వారు బోధించిన విధంగా ఇవి జన్మాన్తర సంస్కరణలుగా మారిపోతాయి. ఒక జన్మకే కాదు. పలు జన్మలకు కూడా ఇవి మన వెంట ప్రయాణం చేస్తాయి. ప్రయాణం చేసి, మనం ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ సంస్కారాలు లేదా వాసనలు పునః స్మృతులుగా మారి వ్యక్తమౌతూ ఉంటాయి. శ్రీ శాజ్ఞ్కర భగవత్పాదుల వారు చెప్పిన విధంగా ‘పూర్వకృతధర్మాధర్మాదిసంస్కారాః వర్తమానజన్మాదౌ అభివ్యక్తాః, సా ప్రకృతిః’ ప్రకృతి అనగా పూర్వం ఆచరించిన ధర్మ మరియు అధర్మ సంస్కారాలు వర్తమాన జన్మలోను మరియు రాబోవు జన్మలోను అభివ్యక్తమగుట లేదా వ్యక్తమగును. ఈ సిద్ధాంతం జ్ఞానులకు, అజ్ఞానులకు మరియు సమస్త జీవరాశికి కూడా వర్తిస్తుంది. దీనికి నువ్వు నేను అనే భేదం లేదు. ప్రతి జీవి కూడా ఈ సిద్దాంతం యొక్క పరిధిలోనే ప్రవర్తిస్తుంది. ‘జ్ఞానవాన్ అపి’ వాడు ఎంత జ్ఞాని అయిన నేమి, వాడి ధర్మ మరియు అధర్మ సంస్కారాలు వాడిని తగిన విధంగా కర్మలను ఆచరించే విధంగా చేస్తాయి.
ఒక చక్కని వాహనము చూసిన మరుక్షణం అట్టి వాహనం పట్ల ఏర్పడిన శ్రద్ధ దాన్ని సమకూర్చుకోవాలనే సంకల్పంగా మారి, వాసన రూపంలో నిక్షిప్తమై పోతుంది. అదే విధంగా ఆస్తులు కొనాలి, విలాసాలను అనుభవించాలి,రాజ్యాధికారాన్ని చేపట్టాలి, విశేషమైన ధన సంపత్తిని సమకూర్చుకోవాలి, గొప్ప పండితుడిగా గుర్తింపును పొందాలి, ఒక అందమైన స్త్రీ ని అనుభవించాలి, ఒక అందమైన మగాడిని స్వంతం చేసుకోవాలి, ఒక మంచి ఐఫోన్ కొనాలి,విదేశాలలో స్థిరపడాలి ఇత్యాది పలు విధములైన కోరికలు, సంకల్పాలు వాసనలుగా మారిపోతాయి. వాడు ఈ జన్మకు కాకపోయినా మరొక జన్మలోనైనా దాన్ని సాధించే ప్రయత్నం చేస్తాడు. ఇట్టి సంకల్పాల సాధన ధర్మ బద్ధంగా వీలుకాకపోతే అధర్మ బద్ధంగా నైనా సాధించే ప్రయత్నం చేస్తాడు. అందుకే శ్రీ శాజ్ఞ్కర భగవత్పాదుల వారు ‘ధర్మాధర్మాదిసంస్కారాః’ అని అన్నారు. వీడికి ఆశయ సాధన ఒక్కటే తెలుసు, కాని అది ధర్మ బద్ధమా లేదా అధర్మ బద్ధమా అనే విచక్షణ వాడిలో ఉండదు. ఈ విధమైన వాసనలు జీవితంలో ఏ మార్గాన్ని నిర్దేశిస్తే మనిషి అదే మార్గంలో పయనిస్తాడు. భౌతికమైన శరీరం నశించినా కూడా వాడి వాసనలు వాడితో సహా జన్మజన్మలకు ప్రయాణిస్తాయి. ఇది చాలా మందికి నమ్మశక్యంగా ఉండదు. కాని ఇది సత్యం. వాసనలు అదృశ్య రూపంలో ఉంటాయి. అవి కార్యరూపం దాల్చితే తప్ప బహిర్గతం కావు. వాసన కనబడాలంటే అది కార్య రూపం దాల్చాలి. అప్పుడే వాడిలో ఏవిధమైన వాసనలు ఉన్నాయో తెలుస్తాయి. ఇవి జన్మజన్మలకు సూక్ష్మ మరియు కారణ శరీరాలతో సహా ప్రయాణం చేస్తాయి. అదృశ్య రూపంలో గలది కార్య రూపం ఎలా దాల్చుతుంది? అనే సందేహం రావచ్చు. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అను రెండు కంటికి కనబడని వాయువులు ఒక స్థిర నిష్పత్తిలో కలిస్తే, అనగా రెండు పరమాణువులు హైడ్రోజన్ మరియు ఒక పరమాణువు ఆక్సిజన్ కలిస్తే నీరు ఏర్పడుతుంది. నీరు కంటికి కనబడుతుంది. వాయువు కంటికి కనబడదు. వాయువును స్పర్శ ద్వారా మాత్రమే గ్రహించ గలము. నీటి ద్వారా పలు ఉత్పత్తులు లభిస్తాయి. పంటలు పండుతాయి, ఆహారం లభిస్తుంది, వర్షాలు కురుస్తాయి ఇత్యాది ప్రయోజనాలు చేకూరతాయి. అనగా వాయువు జలంగా మారుట వలన పలు ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు, అదృశ్య రూపంలో గల వాయువు కర్మ రూపం దాల్చడం వలన ప్రయోజనం చేకూరుతుంది. అదే విధంగా వాసనలు బహిర్గతం అయిన నాడు, మనిషి అట్టి వాసనలకు అనుగుణంగా కర్మను ఆచరిస్తాడు, ప్రవర్తిస్తూ ఉంటాడు. అట్టి కర్మను అనుసరించి వాడిలో గల వాసనలను మనం గ్రహించ వచ్చు. అంతేకాదు శుద్ధి కావించ బడిన వాసనలు, లోక సంగ్రహార్థం ఉండే వాసనల వలన లోక కల్యాణం జరుగుతుంది. స్వార్థ ప్రయోజనానికి ఏర్పడు వాసనల వలన మనిషి కర్మలందు బంధించబడి తనకుతానుగా క్రమంగా నశించి పోతాడు, లేదా నిరంతర జనన మరణాలకు గురి అవుతుంటారు. శుద్ధ జలం వలన ఎంత ప్రయోజనం చేకూరుతుందో అదే విధంగా శుద్ధ వాసనల వల్ల కూడా సాధకుడు ఉద్ధరించ బడతాడు. అదే విధంగా కలుషిత జలము లేదా ఆహారము వలన ఏవిధంగా శరీరానికి నష్టం చేకూరుతుందో అదే విధంగా దోష యుక్తమైన వాసనల వల్ల సాధకుడికి ప్రాణాంతకం అగు సూచనలున్నాయి.
ఈ విధంగా మనిషిని నడిపే శక్తులు చాలా బలమైనవి. ఆ శక్తులు ఏవో మరియు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలని వేదాంతం బోధిస్తుంది. వేదాంతాన్ని అనుసరించి ఇట్టి శక్తులు రెండు విధములుగా ఉంటాయి. ఒకటి బాహ్య రెండు అంతర్గత. అధికశాతం మనుషులు బాహ్య శక్తుల యందే దృష్టిని కేంద్రీకరిస్తారు. అంతర్గత శక్తుల గూర్చి పెద్దగా పట్టించుకోరు. అంతేకాదు ఇట్టి అంతర్గత శక్తులను అశ్రద్ధ చేస్తారు. అందుకే, వీరికి కష్టాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే, అంతర్గత శక్తి సహకారము లేనిదే బాహ్య శక్తులకు మనను బాధపెట్టే అవకాశం ఉండదు. అది గ్రహించని అజ్ఞాని అంతర్గత శక్తిని నియంత్రించ లేక బాహ్య శక్తి యొక్క అధీనంలోకి వెళ్లి దాని ద్వారా కష్టాన్ని అనుభవిస్తాడు. ఒకవేళ మన అంతర్గత శక్తిని నియంత్రించ గలిగిన ఎడల లేదా నియంత్రించ గలిగే విధానం తెలిస్తే, బాహ్య శక్తుల దాష్టికానికి మనం గురయ్యే అవకాశాలు ఉండవు. జీవితం ఆనందమయం అవుతుంది. అట్టి వారు ప్రశాంతమయ జీవనాన్ని గడిపే వారగుదురు. దీని గూర్చి రాబోయే శ్లోకాలలో భగవానుడు బోధించ బోవు చున్నాడు. అందుకే ‘ప్రకృతేర్ జ్ఞానవాన్ అపి’ జ్ఞానులు మరియు జ్ఞానులుగా గుర్తింపును పొందిన వారు కూడా వారిలో నిక్షిప్తమై యున్న ప్రకృతి యొక్క శక్తి ప్రభావంలో ఉండి అది చూపిన మార్గం లోనే పయనిస్తారు. పయనించు విధంగా అట్టి ప్రకృతి ప్రేరేపిస్తుంది. దాని ఒత్తిడికి మరియు ప్రేరేపణలకు అనుగుణంగానే వాడి కర్మలు ఉంటాయి. ‘ప్రకృతిం యాన్తి భూతాని’ సమస్త జీవరాశి అంతా ప్రకృతి యొక్క ప్రేరణకు అనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటి చేష్టలన్నీ కూడా ప్రకృతి ప్రేరణలకు అనుగుణంగానే ఉంటాయి. ‘నిగ్రహః కిం కరిష్యతి’ నిగ్రహించడం వలన ప్రయోజనం ఏమున్నది. కేవలం నిగ్రహిస్తే ప్రయోజనం ఏమున్నది?ఇట్టి ప్రేరణలను నిగ్రహించడం సరియైన పధ్ధతి కాదు. అట్టి ప్రేరణలకు జ్ఞానాన్ని జత చేయాలి. జ్ఞానం ద్వారా విశ్లేషణ చేయాలి. ‘ఇట్టి ప్రేరణల యొక్క దిశను మార్చి క్రొత్త దిశను ఇవ్వాలి’ అని శ్రీ రామకృష్ణ పరమహంస బోధించారు. నైతికమైన లేదా నీతివంతమైన, ఆధ్యాత్మికమైన క్రొత్త దిశను ఈ ప్రేరణలకు చూపించాలి. అంతేగాని వాటిని నిగ్రహించ రాదు. ఇది చెప్పడానికి సులువుగానే ఉంటుంది, కాని ఆచరణలో చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే మనను ప్రేరేపించు శక్తులు అత్యంత శక్తి వంతమైన విస్ఫోటనాన్ని సృష్టించగల శక్తి గలవి, ఎందుకంటే ఇవి బాహ్య వస్తువు లేదా పదార్థాలకు చెందినవి. కావున వాటికి ఆధ్యాత్మిక మార్గ నిర్దేశన చేయడం చాలా కష్టం. ఇక్కడే సాధకుడికి సహాయకుడి అవసరం ఉంటుంది. అనుభవజ్ఞుడైన ఉత్తముడైన గురువు గారి మార్గ నిర్దేశనం కావాలి. శాస్త్రాలను అధ్యయనం చేయాలి. ప్రధానంగా శ్రీ కృష్ణ భగవానుడి బోధనలు అనుసరించాలి. ఇతర ఆధ్యాత్మిక గ్రంథ రాజాలను చదవాలి. ఇవన్నీ కూడా మనకు మార్గనిర్దేశనం చేస్తాయి. సాధకుడికి ఈ బాహ్యమైన, నశించిపోవు స్వభావము గల వాటికంటే కూడా విలువైనది, సదా నాశనం లేనిది,ఎప్పుడు మనతోనే ఉండి పోయేది, అరుదైనది మరియు అసాధారణమైనది మరొక్కటి మరియు ఒకేఒక్కటి కలదని తెలియాలి. అదే ‘భగవంతుడు’, ఆయనను మించి విలువైన వస్తువు సృష్టిలో మరొకటి లేదు. శాశ్వతమైనది కూడా ఏదీ లేదు. దీని రుచి ఎరిగిన సాధకుడికి ఇతరములు రుచించవు. ఇట్టి రుచి ఎరిగిన మానవుడు, విస్ఫోటనాలను సృష్టించు వాసనల దిశను ఆధ్యాత్మిక చింతనతో ఎదుర్కొని అట్టి వాసన పునః విస్ఫోటనాన్ని సృష్టించకుండా చూసుకుంటాడు. అనగా వాడిలో అంతర్లీనమై ఉన్న వాసనలన్నీ కూడా తుడిచి వేయబడతాయి. వాటి స్థానంలో భగవత్ చింతన స్థాపించ బడుతుంది. ఈ విధమైన సమస్య మానవ మాత్రులకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనస్సు మరియు చిత్తంతో జత అయిన పలు విధములైన వాసనలు ఒక మానవుడిలో మాత్రమే ఉంటాయి. ఇతర ప్రాణులు, జంతువు లందు ఆకలి మరియు సంతానోత్పత్తి మినహా ఇతర ప్రేరణలు ఉండవు. ఒక్క మానవుడిలో మాత్రమే అంతఃకరణ ఉంటుంది. అంతేకాదు బాహ్య మరియు అంతర్ ప్రకృతి ఉంటుంది. వీటన్నిటినీ మించింది ‘ఆత్మ’. శరీర మరియు మనస్సు యొక్క సంక్లిష్ట రూపమైన ‘ఆత్మ’ సదా స్వతంత్రాన్ని ఆశిస్తుంది. ‘నా జీవితాన్ని నా చేతులలోకి తీసుకొని దాన్ని నేను కోరిన విధంగా మలుచు కుంటాను’ అనే భావన ఉండాలి. అంతేకాదు ‘ప్రకృతి యొక్క నియంతృత్వం లో నేను ఉండను’ అనే భావన రావాలి. తదనుగుణంగా సాధన కూడా కావాలి. ఇట్టి సాధనకే ఆధ్యాత్మిక సూత్రాలను అవలంబించాల్సిన అవసరం ఉంటుంది. దానికి గాను గురువు మార్గ దర్శనం కావాలి. ఇది మనిషి తన బాల్యం నుండి అలవరచు కోవాలి. ఎందుకంటే గత జన్మల వాసనలు బాల్యంలోనే అధికంగా ఉంటాయి. బాల్యమే వాడి భవిష్యత్తుకు నాంది. బాల్యంలో అలవరచుకున్న పద్దతులను ఎదిగిన పిమ్మట ఆచరిస్తాడు. బాల్యంలో వాడి పూర్వ వాసనలకు అనుగుణంగా తన ప్రకృతిని ఏర్పరచు కుంటాడు. తదనుగుణంగానే భవిష్యత్తులో జీవిస్తాడు. కావున బాల్యంలోనే మనిషి తప్పుడు మార్గాల బారిన పడకుండా కాపాడాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ వయస్సులో రాని మార్పు, వాడిలోని వాసనలు వాడి జీవితాన్ని నియంత్రిస్తూ ఉంటే ‘నిగ్రహః కిం కరిష్యతి’ నిగ్రహించడం వలన ప్రయోజనం ఏమున్నది.
మానవ నిర్మాణ వ్యవస్థను ‘చిత్ జడ గ్రంథి’ అని వేదాంతం సంబోధిస్తుంది. అనగా మానవ నిర్మాణంలో ‘చిత్ – చైతన్యము మరియు జడ – జడ లేదా అచేతనావస్థ’ ఈ రెండు విధములైన వ్యవస్థలు కలిపి ముడి వేయబడి లేదా సంధించబడి ఉంటాయి (గ్రంథి అనగా ముడివేయుట). ఈ విధమైన వ్యవస్థలు ఇతర జన్తు నిర్మాణంలో మనకు కనబడదు. మనలో గల ‘ప్రకృతి’ జడ స్వభావము గలది. ‘చిత్’ అనగా ‘పరా ప్రకృతి’. ఇది పరిణామ క్రమంలో చైతన్య స్వభావము గలది. ఇది జ్ఞాన మూలాలు కలది. ఇదే ‘ఆది’ స్థితి. ఇదే పరమాత్మ మూలం. ఈ స్థితిలో పరమాత్మను గ్రహించగల స్థాయిలో సాధకుడు ఉంటాడు. ఈ రెండు విధములైన స్థితులలో ‘జడ’ స్థితి ప్రమేయం అధికమైన అనగా ప్రకృతి ప్రమేయం అధికమైన ఎడల, మనిషికి అన్నీ కష్టాలే. ఈ స్థితిలో వాసనల ఆధిపత్యం పెరుగుతుంది. అవి మన ప్రకృతిని నియంత్రిస్తూ ఉంటాయి. ‘చిత్’ చైతన్య స్థితిలో, పరా ప్రకృతి యొక్క ఆధిపత్యం ఉంటుంది. పరా ప్రకృతి ఆధిపత్యం గల చోట జడ స్వభావం గల ప్రకృతి ప్రమేయం ఉండదు. మనలో నిక్షిప్తమై యున్న వాసనలన్నీ కూడా పరమాత్మ యందు కేంద్రీకరించబడి ఉంటాయి. కావున వాటి దిశ తనకుతానుగా మారిపోతుంది. అట్టి వాసనలు మనను బాధపెట్టే అవకాశం ఉండదు. చిత్ లేదా చైతన్యం గల చోట జీవితంలో పోరాటం ఉండదు. చైతన్యం ప్రకృతిని నియంత్రిస్తుంది. కాబట్టి ప్రకృతి ద్వారా లేదా జడ స్థితి వలన కలిగే కష్టాలు ఉండవు. ఒకవేళ మనిషిలో చిత్ లేదా చైతన్య స్థితి లేని ఎడల, అట్టి మనిషి సదా జడ స్థితి అయిన ప్రకృతితో ముడి వేసుకొని ఉంటాడు. ఇట్టి స్థితిలో వాసనలు తీవ్రరూపం దాల్చి వాడికి జీవితంలో అన్నీ కష్టాలే ఉండే విధంగా చేస్తాయి. ఇట్టి సాధారణ జడ స్థితిలో వాసనల ద్వారా ఉత్పన్నమైన ప్రతి ప్రేరణను మనిషి పరిగణనలోకి తీసుకుంటాడు. పలు విధాలైన ప్రేరణలు ఉత్పన్నమగుట వలన ఇవన్నీ కూడా వాడి జీవితాన్ని నికృష్ట మైన స్థితికి దిగజార్చుతూ ఉంటాయి. కాని చిత్ లేదా చైతన్య స్థితిలో గల మానవుడి ఇట్టి ప్రేరణల దాడిని తిప్పికొట్టే సామర్థ్యం కలిగి ఉంటాడు. ప్రతి వాసనతో ఉత్పన్నమైన ప్రేరణను పరమాత్మ యందు నిక్షిప్తం చేస్తాడు. అనగా వీడు ప్రకృతి కి ఎదురీదు వాడు. ఇట్టి ఎదురీతలో వాడికి నైతిక జీవనం లభిస్తుంది, సంస్కృతి మరియు నాగరికత అలవడుతుంది, శాస్త్ర విహితమైన కర్మలను ఆచరిస్తాడు. ధర్మ బద్ధమైన జీవనాన్ని అనుసరిస్తాడు. ధర్మాధర్మ విచక్షణ పెరుగుతుంది. సంపూర్ణ చైతన్యవంతుడై ఉంటాడు. కర్మల పట్ల పూర్తి నియంత్రణ ఉంటుంది. సంపూర్ణ జ్ఞానంతో కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. వాడి ప్రతి కర్మ లోకసంగ్రహానికి దారితీస్తుంది. అట్లు కాని వాడు, అనగా జడ స్థితి లేదా ప్రకృతి నియంత్రణలో గల ప్రతి జ్ఞాని కూడా ‘ప్రకృతేర్ జ్ఞానవానపి’ అట్టి ప్రకృతి నియంత్రణలోకి వెళ్ళిపోయి అది ఆడించిన విధంగా ఆడే ప్రమాదం ఉందని శ్రీ కృష్ణ భగవానుడు బోధించు చున్నాడు. అనగా ‘చిత్ జడ గ్రంథి’ లో అట్టి గ్రంథిని లేదా ముడిని విప్పి వేయాలి. జడ స్థితిని పారద్రోలి చిత్ స్థితిని మాత్రమే అనుసరించాలి.
ఓం జ్ఞానినాం ఆపి చేతాంసి దేవి భగవతి హి సా ।
బలాద్ ఆకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి ।।(దేవీ మహాత్మ్యం ౧-౫౫)
శ్రీ దేవి యొక్క మహామాయ జ్ఞానుల మనసులను కూడా బలాత్కారముగా ఆకర్షించి మోహవశము చేయును. శ్రీ దేవి భగవతి మహామాయ గా అభివ్యక్త మౌతుంది. భగవంతుడి ద్వారా సృష్టించ బడిన ఈ సృష్టి అంతటిలో కూడా శ్రీ దేవి యొక్క మహామాయ సదా పని చేస్తూనే ఉంటుంది. మనలోని విజ్ఞానాన్ని అది కప్పివేసి ఉంచుతుంది. అంతేకాదు జ్ఞానులైన వారి మనస్సును కూడా భ్రమింప చేస్తుంది. ఇట్టి భ్రమకు గురియగుట మరియు భ్రమతో కూడిన జీవనాన్ని వీరు గడుపుతారు. అదేమిటి, భగవంతుడే మాయను సృష్టించి అందరినీ మోహితులను చేయడం ఎందుకు? అది చేయకుండా ఉంటే సరిపోతుంది కదా! అంతేకాదు ఈ మోహము నుండి బయటపడే మార్గం లేదా? ఉంటే అదేమిటి అనే సందేహం రావచ్చు. ఇట్టి సందేహాన్ని తీర్చుటకు గాను శ్రీ దేవి ఈ విధంగా చెప్పు చున్నది:
ఓం తయా విసృజ్యతే విశ్వం, జగ దేత చ్చరాచరం ।
నై షా ప్రసన్నా వరదా, నృణాం భవతి ముక్తయే ।। (దేవీ మహాత్మ్యం ౧-౫౬)
ఆమె చేతనే ఈ చరాచర జగత్తు అంతయూ సృష్టించ బడినది. ఆమె ప్రసన్న మైన ఎడల నరులకు మోక్షమును అనుగ్రహించును. అనగా శ్రీ దేవి ప్రసన్నమగు విధంగా మనిషి కర్మలను ఆచరించాలి. శ్రీ మహాదేవి లోకాన్ని రక్షించుటకు చాలా అవతారాలను స్వీకరించింది. లోకానికి కీడు జరిగిన ప్రతిసారి భగవానుడు అవతార స్వీకరణ చేసి యున్నారు. లోక సంగ్రహార్థం కర్మలను ఆచరించు వారు భగవానుడికి ప్రీతి పాత్రులు. అట్టి వారు మాత్రమే ఈ మహామాయను తప్పించుకొన గలరు. ఇట్టి మహామాయను తప్పించుకున్న వాడికి భగవత్తత్త్వం బోధపడుతుంది.
కావున మానవ జీవనం అనుకున్నంత సులువైనది కాదు. బాహ్య శక్తులతో సులభంగానే పోరాడ వచ్చు. బాహ్య శక్తులపై విజయాన్ని కూడా సులభంగా సాధించ వచ్చు. కాని అంతః శక్తులతో పోరాడడమే చాలా కష్టమైనది. వాటిని జయించడం చాలా కష్టం. వీటిని జయించడానికే మనిషి విజ్ఞతతో పోరాడవలసి ఉంటుంది. జంతువులకు ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అంతకంటే కూడా ఉత్తమమైన జీవితాన్ని పొందవలేనను కోరిక వాటిలో ఉండదు. వాటి పోరాటమంతా కూడా అవి జీవించి ఉండడానికి చేసే ప్రయత్నాలే. సమయానికి ఏదోవిధంగా ఆహరం సమకూర్చుకోవాలి, త్రాగడానికి నీటి వేట మరియు సంతానోత్పత్తి. మనిషిగా జన్మించిన వాడు కూడా ఈ మూడింటి మినహా ఇతర కార్యములు ఏవీ చేయని ఎడల వాడు కూడా జంతువుతో సమానమైన వాడు గానే పరిగణింప బడును. ఉన్నత మరియు ఉత్తమ మైన జీవనాన్ని పొందాలనుకునే వాడు మాత్రం పలు విధాలైన పోరాటాలను జరపవలసి ఉంటుంది. అప్పుడే వాడు ఉన్నత ప్రమాణాలు గల జీవనాన్ని గడుపు వాడగును. వాడు జీవించి ఉండుటకు మాత్రమే కాకుండా వాడిలో గల అంతః శక్తులతో పోరాడవలసి ఉంటుంది. ఈ శరీరము మరియు మనస్సు యొక్క క్లిష్టమైన సమ్మేళనముతో పోరాడవలసి ఉంటుంది. ఆ విధంగా పోరాడు వాడే ఒక చక్కని సంస్కృతిని అలవరచు కుంటాడు. అది కూడా ప్రకృతిని వద్దనుకునే సంస్కృతి. ప్రకృతి కంటే కూడా భిన్నమైన దాన్ని పొందు సంస్కృతి. ఎండలో ఎండమని మరియు వర్షంలో తడవమని ప్రకృతి మనిషిని ఆదేశిస్తుంది. కాని తడుస్తే జలుబు చేస్తుంది, ఎండలో ఉంటే వడదెబ్బ తగులుతుందని మానవుడు ఒక గృహాన్ని నిర్మించుకొని అందులో నివసిస్తూ ప్రకృతి నుండి తనను తాను కాపాడుకుంటాడు. అట్టి గృహంలో నివసిస్తున్న వాడిని కూడా ప్రకృతి వదిలి పెట్టడం లేదు. వాడిలో అంతర్గతంగా వాసనల రూపంలో గల ప్రకృతి వాడి మనో నిగ్రహాన్ని నిరంతరం దెబ్బతీస్తూనే ఉంటుంది. ప్రకృతి వాసనలకు అనుగుణంగా కర్మలను ఆచరించుటకు గాను ప్రేరేపిస్తూ ఉంటుంది. దాని ప్రేరేపణలకు గురియైన వాడు ఇన్ద్రియ నిగ్రహాన్ని కోల్పోతాడు. వాసనలకు లోబడి పలు విధములైన పదార్థాలను సమకూర్చుకొంటాడు. తన విలాసాలకు, సుఖాలకు కావలసిన ప్రతి వస్తువును సమకూర్చుకొంటాడు. అవన్నీ సమకూర్చుకోనుట మరియు కలిగి యుండుటయే నవ నాగరికత గా భావిస్తారు. వాడే ఉత్తముడు, ఉన్నతమైన వ్యక్తిగా భావించ బడతాడు. కాని వాడు ప్రకృతికి బానిస అయి ఉన్నవాడని గ్రహించడు. ఆధునిక నాగరికతలో పలు విధాలైన, సుఖాలు, వాహనాలు, పలు విధములైన పరికరాలు ఇత్యాదివి కలిగి ఉండడమే నాగరికతకు కొలబద్ద. కాని ఈ నాగరికతలో గల వాడు తన మనస్సుపై నిగ్రహం లేని వాడు. వాసనల ఆధీనంలో గల వాడు. ప్రకృతికి బానిసగా మారిన వాడు.
‘The European talks of progress because by the aid of scientific discoveries, he has constructed a society which mistakes comfort for civilization. అనగా ఐరోపా వారు వారి శాస్త్ర పరిశోధనల ద్వారా అభివృద్ధి చెందామని వాదిస్తారు. వారి పరిశోధనల ద్వారా సృష్టించిన సమాజాన్ని పొరపాటున నాగరికతగా భావిస్తారు’ అని బెంజామిన్ డిస్రేలి అను ఒకప్పటి బ్రిటిష్ ప్రధాని అనేవారు. శాస్త్రీయ పరిశోధనల ద్వారా నిర్మితమైన సమాజం నిజానికి ఒక సమాజం కాదు. అది ఒక యాంత్రిక జీవనాన్ని గడిపే యంత్రశాల. ఇట్టి జీవనాన్ని గడుపుతున్న ఏ ఒక్కడు కూడా వాడి అంతర్గత శక్తులను జయించిన వాడు కాదు. వీడు భయంకరమైన మానసిక ఒత్తిడిలో జీవనాన్ని గడుపుతున్నాడు. నేటికీ ప్రపంచం ఇదే విధంగా ఉంది. ఆయన చెప్పి దాదాపు రెండు వందల సంవత్సరాలు అయ్యింది. నాటికి మరియు నేటికి రెండు వందల రెట్లు మనిషిలో ఒత్తిడి పెరిగింది. శారీరిక సుఖాలు మరియు విలాసాలు నాగరికతకు చిహ్నాలు కావు. పైన తెలిపిన విధంగా జీవిస్తున్న వారు జంతువులు. వీరికి వ్యక్తిగత నిర్మాణం జరగలేదు. అందుకే వీరు జీవితం లో ఏ చిన్న సమస్య ఎదురైనా కూడా తట్టుకోలేని స్థితిలో ఉంటారు. ఈ విధమైన సమాజం కాదు మనకు కావలసింది. మనలో అంతర్గతంగా నిక్షిప్తమై యున్న ప్రకృతిని జయించాలి. ఆ విధంగా జయించిన నాడే నీతి బయటకు వస్తుంది, నైతికత నెలకుంటుంది, అంతేకాదు ఉన్నత ఆధ్యాత్మిక జీవనాన్ని మానవుడు గడుపుతాడు. సాధకుడికి ఒక సందేహం రావచ్చు! జీవిత కాలంలో మరి ఉద్యోగం చేయడం ఎందుకు? ధనార్జన ఎందుకు? పలు విధాలైన విలాస వంతమైన వస్తువులను సమకూర్చుకోవడం ఎందుకు? పని చేయకుంటే కడుపు ఎలా నిండేది? అంతెందుకు, కర్మను ఎందుకు ఆచరించాలి? శ్రీ కృష్ణ భగవానుడు కర్మాచరణ మానుకొమ్మని ఏనాడు అనలేదు. యాంత్రిక కర్మలు, ప్రకృతికి లోబడి కర్మలు, ఫలాపేక్ష లేదా ఫలాన్ని అనుభవించుటకు కర్మలను ఆచరించ వద్దని సూచించి యున్నాడు. కష్టపడాలి, ధనాన్ని సంపాదించాలి, శరీర యాత్రకు సరిపోగా మిగిలినదాన్ని లోక సంగ్రహార్థం వినియోగించాలి. అది ధనం మాత్రమే కాదు, మనం ప్రకృతి నుండి సమకూర్చుకున్న ప్రతి పదార్ధం ద్వారా ప్రకృతికి ప్రయోజనం జరిగిన ఎడల ప్రకృతికి మనం బానిసలుగా మారే అవకాశాలు ఉండవు.
ప్రకృతిలో ఒక స్వభావము కలదు. అది తనకు అవసరం లేని దాన్ని ఉంచుకోదు. జీవిలో ఉత్పత్తి ప్రక్రియ జరిగినన్ని రోజులు ప్రకృతికి అట్టి జీవి పట్ల శ్రద్ధ ఉంటుంది. ఏ జీవిలో నైనా ఉత్పత్తి సామర్థ్యం తగ్గినా లేదా నశించిన మరుక్షణం ప్రకృతికి అది దూరం అవుతుంది. ప్రకృతి దాన్ని తిరస్కరిస్తుంది. అంటే ఉత్పత్తి మరియు వృద్ధి ప్రక్రియ జరిగినన్ని రోజులు మాత్రమే ప్రకృతికి మనపట్ల ప్రీతి ఉంటుంది. ఈ రెండు నశిస్తే అది మరణించిన దానికి సమానము. కాని ఈ రెండింటినీ మించింది మరొకటి ఉంటుంది. మనిషికి ఈ రెండింటి కంటే కూడా ఉన్నత స్థాయిని చేరగలిగే సామర్థ్యం కలదు. అట్టి స్థాయిలో మనిషికి ప్రకృతి తో సంబంధం ఉండదు. ప్రకృతికి బానిస కాడు. ప్రకృతి యొక్క నియంత్రణలో ఉండడు. అంతేకాదు, ప్రకృతిని కూడా నియంత్రించ గల శక్తిని కలిగి ఉంటాడు. కావున మనిషి ప్రకృతితో కలిసి జీవించడం కంటే ప్రకృతి కంటే కూడా ఉన్నత స్థాయిని చేరుకునే సాధన చేస్తూ ఉండాలి. గీత బోధిస్తున్నది కూడా ఇదే. ప్రకృతితో సహజీవనం చేయడం కాదు, ప్రకృతి కంటే కూడా ఉన్నత స్థాయిలో జీవించే ప్రయత్నం చేయాలి. ప్రకృతి అవసరం మనకు కాదు, మన అవసరం ప్రకృతి ఉండే విధంగా చేయాలి. సింహభాగం మనుషులు అందరూ కూడా ప్రకృతితో కలిసి సహజీవనం చేస్తారు. అందుకే దాని చెప్పుచేతల్లో ఉంటారు. కావున దాని బానిసత్వం నుండి మనిషి బయటపడాలి. మనను మనం కాపాడుకోవాలి. అనగా మనలో గల అట్టి శక్తిని ప్రేరేపించాలి. అది వేదాన్తమయ జీవనం వలననే సాధ్యపడుతుంది. ఇది అత్యుత్తమమైన సాధన. ఇట్టి సాధనలో ప్రకృతికి మరియు వేదాంత సంబంధ జ్ఞానానికి మధ్య పోరాటం జరుగుతుంది. అట్టి పోరాటంలో వేదాన్తమయ జీవన సాధన గెలవాలి. అప్పుడే మనిషి ప్రకృతి యొక్క బానిసత్వం నుండి బయటపడ గలడు. అట్టి స్థితిలో జ్ఞాని కూడా ప్రకృతి ప్రేరణలను స్వీకరించు స్థితిలో ఉండడు. ఈ స్థితిలో వాసనలను మరియు ప్రకృతిని నిగ్రహించే అవసరం ఉండదు. ఇది కర్మ ద్వారా మాత్రమే సాధ్యం కావాలి. ఉదాహరణకు ఒక 20 సంవత్సరాల యువకుడు వేదాన్తమయ జీవనాన్ని గడుపుటకు గాను యోగసాధన చేస్తూ నిరంతరం ధ్యాన ముద్రలో ఉండడం సరికాదు. కష్టపడి పనిచేయాలి, డబ్బు సంపాదించాలి, వాడి జీవితానికి కావలసిన ప్రతి వస్తువును సమకూర్చు కోవాలి. ఆ వయస్సులో గల వారు కృషి చేయని ఎడల వాడు జీవిత కాలంలో ఏదీ సాధించ లేడు. అంతేకాదు వాడి వలన సంఘానికి ప్రయోజనం లేదు,లోక సంగ్రహం జరగదు. అంతేకాదు, ఈ విధమైన ప్రవృత్తి గల వాడు చేపట్టిన ప్రతి పనిలో విఫలమౌతాడు. విజయ సాధనకు కృషి చేయాలి. తన కృషి ద్వారా సంపాదించిన దాన్ని తన అవసరాలు తీరిన పిమ్మట మిగిలిన దాన్ని లోకసంగ్రహానికి వినియోగించే ప్రవృత్తి వాడిలో వృద్ధి చెందాలి. వాడిని ప్రేరేపించు వాసనల దిశ లోకసంగ్రహం వైపు మరలాలి. అప్పుడే వాడిలో కలిగిన ప్రేరణలను నిగ్రహించే అవసరం లేకుండా వాడు కర్మను ఆచరిస్తూ కర్మ యోగిగా మారు అవకాశం ఉంది.
శ్రీ కృష్ణ భగవానుడు అద్భుతమైన మానసిక తత్త్వ శాస్త్రమును ఆవిష్కరించు చున్నాడు. అచేతన స్థితిలో గల వాసనలు బహిర్గతం అయిన నాడు మనిషిలో అట్టి వాసనలకు చెందిన ఆలోచనలు ఉత్పన్నం అవుతాయి. ఈ విధంగా ఉత్పన్నం అయిన ఆలోచనలు తుడిచి వేయడం అసంభవం. ఈ విధంగా బహిర్గతమైన ఆలోచనను నొక్కిపెట్టిన ఎడల అది తిరిగి అచేతన స్థితిలోకి వెళ్లి అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. ‘సిగ్మండ్ ఫ్రాయిడ్’ ప్రసిద్ధ మానసిక తత్త్వశాస్త్ర వేత్తను అనుసరించి మనిషి యొక్క మనస్సు ఒక ఐస్ బెర్గ్ అనగా సముద్రంలో తేలే ఒక మంచు కొండ లాంటిది. ఇది సముద్రంలో తేలుతున్నప్పుడు దాని శిఖరము యొక్క అగ్రభాగం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇదే మనస్సు యొక్క చైతన్య స్థితి. ఇది మనిషి గ్రహించ గలుగు విధంగా ఉంటుంది. అనగా వాడి గ్రహణ శక్తి గ్రహించ గల స్థితి. ఈ స్థితిలో పలు విధములైన ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు ఇత్యాది వన్నీ కూడా చైతన్య స్థితిలో ఉంటాయి. కాని, ఆ మంచుకొండ యొక్క క్రింది భాగం అంతా కూడా అపారమైన మంచు భాగం తో నిండి ఉంటుంది. అది నీటి ఉపరితలం నుండి చూస్తే కనిపించదు. అదే మనస్సు యొక్క అచేతన స్థితి. ఈ స్థితిలో అపారమైన మంచు గడ్డ వలే అపారమైన ప్రచోదనలు, జ్ఞాపకాలు, కోరికలు,ఆలోచనలు, పలు విధములైన వాసనలు (జన్మాంతర కృత వాసనలు కూడా ఉంటాయి) ఇత్యాదివన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. వీటిని మనిషి గ్రహించలేడు. ఇవి వాడి గ్రహణ శక్తికి అందని విధంగా ఉంటాయి. మంచుకొండ యొక్క శిఖర భాగం కాస్త కరిగిన మరుక్షణం దాని క్రింద యున్న మంచు గడ్డ బయటపడుతూ ఉంటుంది. అది కరిగిన శిఖర భాగాన్ని భర్తీ చేస్తూ ఉంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ను అనుసరించి మనిషి యొక్క మానసిక ప్రవృత్తిని వాడి అచేతన స్థితిలో గల వాసనలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. దానికి అనుగుణంగా మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. చాలా సందర్భాలలో వాడి ప్రవర్తన చూసిన వాడికి చాలా భిన్నంగాను విచిత్రం గాను అనిపిస్తుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ రెండు విధములైన పద్ధతులను సూచించారు. ఒకటి Repression, రెండు Suppression. Repression ప్రక్రియ యందు అవాంఛిత ప్రచోదనలను తెలియకుండానే అవగాహన నుండి లేదా జ్ఞాపక శక్తి నుండి తొలిగించుట. Supression ప్రక్రియ యందు తెలిసిన లేదా గ్రహించిన ప్రచోదనలను బలవంతంగా మరిచి పోవుటకు చేయు ప్రయత్నము. ఈ రెండూ కూడా శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన ‘నిగ్రహః’ అను పదానికి దగ్గరగానే ఉంటాయి. మొదటి దానిలో అనగా Repression ప్రక్రియలో నిరంతర భగవన్నామ స్మరణ ద్వారా, శ్రీ కృష్ణ భగవానుడు సూచించిన మతాన్ని ఆచరించుట లేదా ఆయన సిద్ధాంతాలను ఆచరించుట ద్వారా అచేతన స్థితిలో నిక్షిప్తమై యున్న జన్మాంతర వాసనలన్నీ కూడా భగవంతుడి ఎడల కేంద్రీకరించ బడి, వాటి గుణము, స్వరూపము మరియు తత్త్వము తనకు తానుగా మారిపోతుంది. తద్వారా ఎంత బాధపెట్టే వాసన అయినా కూడా అది మనకు సంతోషాన్నే ఇస్తుంది. ఇక, రెండవ ప్రక్రియ Supression, నిగ్రహించు కోవడం,బలవంతంగా అణచిపెట్టు ప్రక్రియ. ఇది చాలా ప్రమాదకరమైనది. ఆలోచనలు చేతనా స్థితికి వచ్చిన వెంటనే వాటిని అణిచి పెట్టె ప్రక్రియలో అవి తమకు తాముగా అచేతనా స్థితిలోకి వెళ్ళిపోయి, పునః ఒక విస్ఫోటం వలే బయటపడుతూ ఉంటాయి. ఇట్టి అణిచి పెట్టే ప్రక్రియ స్వప్నావస్థకు దారి తీస్తుంది. మనను తృప్తి పరచని, మనకు సంతోషాన్ని ఇవ్వని, మనకు నచ్చని వాటిని మనస్సులో అణగదొక్కు అలవాటు సాధారణ మానవుడికి ఉంటుంది. ఈ విధమైన నిగ్రహం వలన ఆ ఆలోచనలు చేతనా స్థితి నుండి క్రమంగా అచేతనా స్థితికి జారిపోయి అక్కడా స్థిర నివాసాన్ని ఏర్పరచు కుంటాయి. అక్కడినుండి అవి పునః రూపాంతరం చెంది బయటకు చేతనా స్థితిలోకి వస్తాయి. అంతేకాదు, ఈ విధంగా అచేతనా స్థితికి చేరిన ఈ విధమైన వాసనలు స్వప్న రూపంలో కూడా బహిర్గతం అవుతూ ఉంటాయి. మనం జీవిత కాలంలో ఎన్నో సాధించాలని, అనుభవించాలని అనుకుంటాము. కాని దానికి తగిన విధంగా వాడి జీవితం లేకపోవట వలన అవి అణగదొక్కబడి అచేతన స్థితికి చేరిపోతాయి. అవే స్వప్న రూపంలో బహిర్గతం అవుతూ ఉంటాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ అభిప్రాయపడ్డారు. మనిషి యొక్క వక్రబుద్దికి, మానసిక వక్రీకరణకు, క్లిష్టమైన మానసిక ప్రవృత్తికి ఇదే ప్రధాన కారణం. వాడు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడో కూడా వాడికి తెలియని స్థితిలో ఉంటాడు. మానసిక వైద్యుడు మాత్రమే దీనిని గుర్తించి విశ్లేషించ గలడు. ఇట్టి స్థితిని హైప్నోటిక్ ప్రక్రియ ద్వారా వారు సరిచేయగలరు. ఉదాహరణకు: మనకు నచ్చినవారు మనకు జీవిత భాగస్వామిగా లభించని ఎడల, లేదా నచ్చని వారు మనకు లభించిన ఎడల, వారి పట్ల గల అయిష్టాన్ని మనస్సులో అణగదొక్కు కుంటాము. దాని ప్రభావం వలన వారిని చూస్తే మనకు చిరాకు కలుగుతుంది, వారు మాట్లాడితే చిరాకు వేస్తుంది, వారు ఏది చేసినా చిరాకు అనిపిస్తుంది. దీనికి గల ప్రధాన కారణం వారి పట్ల గల అయిష్టతను మనస్సులో అణగదొక్కు కోవడమే. ఇది తారా స్థాయికి చేరిన నాడు విస్ఫోటం ఏర్పడి ఇరువురి మధ్య యుద్ధం జరుగుతుంది, ఇరువురూ విడిపోయినా ఆశ్చర్య పడాల్సింది ఏమీ ఉండదు. అంతేకాదు,తనకు నచ్చిన వారు స్వప్నంలో కనిపిస్తూ ఉంటారు కూడాను. అందుకే, కొన్ని వ్యసనాలను బలవంతంగా అణచిపెట్టే వాడి మనస్సులో నుండి ఆ వ్యసనానికి చెందిన కోరిక తొలగిపోయే అవకాశం లేదు. దానికి ప్రధాన కారణం వాడికి రక్షణ లేదు. వాడు రక్షణ కవచాన్ని ధరించలేదు. ఇట్టి రక్షణ కవచమే ‘భగవంతుడు’ మరియు ఆయన బోధించిన సిద్ధాంతాలను అనుసరించుట. అది లేని వాడు పూర్తి అభధ్రతతో జీవిస్తాడు. అందుకే శ్రీ కృష్ణ భగవానుడు ‘నిగ్రహః కిం కరిష్యతి’ నిగ్రహించడం వలన ప్రయోజనం ఏమున్నదని అన్నారు. కేవలం నిగ్రహిస్తే ప్రయోజనం ఏమున్నది?
శ్రీ రామకృష్ణ పరమహంస ‘మోఢ్ ఫిరియే దావో (బెంగాలి)’ ఈ శక్తుల యొక్క దిశను మార్చండి అని అన్నారు. మనలో పలు విధములైన శక్తి కేంద్రాలు ఉంటాయి. మన ప్రతి కదలిక, భావోద్వేగం, ఉద్రేకం, మానసిక స్థితి, పలు విధములైన మానసిక అనుభవాలు ఇత్యాది వాటికి చెందిన పలు శక్తి కేంద్రాలు ఉంటాయి. ఈ శక్తులన్నీ కూడా పలు రకాలుగా వివిధ మార్గాలలో పనిచేస్తూ ఉంటాయి, పయనిస్తూ ఉంటాయి. అంతేకాదు శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి. పలు మార్గాలలో పయనించు శక్తులు మనిషి యొక్క మానసిక స్థితిని అస్తవ్యస్తం చేస్తాయి. మనిషి పలు విధాలుగా, పలు మార్గాలలో పయనించే విధంగా చేస్తాయి. వీటి ప్రభావంలో ఉన్న మనిషికి ఒక నిర్దిష్టమైన మార్గం మరియు నిర్దిష్టమైన ఆశయం కూడా ఉండదు. ఈ శక్తులన్నిటినీ శుద్ధి చేయగల శక్తి మనిషిలో ఉంటుంది. కాని దాన్ని వాడు వినియోగించడు. పలు విధాలైన వాసనల ద్వారా ఉత్పన్నమైన శక్తులు మనిషిని ఎటువైపు లాగితే అటు పయనిస్తాడు. కావున వాడి మార్గం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ శక్తులన్నిటినీ ఒక పధ్ధతి ప్రకారం విశ్లేషించి, జాగ్రత్తగా, ఏంతో ఔచిత్యంతో, వాటితో నేరుగా ఘర్షణ పడకుండా సంభాళించు కోవాలి. విడుదలగు చున్న ప్రతి శక్తిని ఒక పధ్ధతి ప్రకారం దాని దిశను మారుస్తూ క్రమంగా వాటిని నియంత్రించాలి. అందుకు మనిషికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. శ్రీ కృష్ణ భగవానుడి బోధనలు అనుసరించ వలసి ఉంటుంది. గొప్ప ఆధ్యాత్మిక శక్తి సంపన్నులు ఈ శక్తితో నేరుగా తలపడ గల వారగుదురు. నేరుగా తలపడుతూ వాటి దిశను మార్చగల శక్తి వారిలో ఉంటుంది. కాని సామాన్యుడికి ఇది సాధ్యం కాదు మరియు ఈ విధంగా నేరుగా తలపడడం వలన ప్రయత్నంలో విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కావున సామాన్యుడు నేరుగా తలపడుట, అనగా నిగ్రహించుట సరియైన పధ్ధతి కాదు. మరి వారు చేయాల్సింది ఏమిటి? వారు ఈ విధమైన ప్రకృతి స్వభావాలను ఒక్కొక్క దాన్ని ప్రత్యేకంగా విశ్లేషించి వాటి దిశను ఆధ్యాత్మిక మార్గానికి మార్చాలి. శ్రీ కృష్ణ భగవానుడి ఆజ్ఞ పాలన చేయాలి. ఈ విధంగా చేయడం వలన సాధనలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించ గలడు. వీరికి వైఫల్యాలు సాధారణంగా ఉండవు. సాధకుడు తన ‘వివేకాన్ని’ ఉపయోగించాలి. గుడ్డిగా వాసనలు ఎటు నడిపితే అటు నడవడం సరికాదు. వాసనల రూపంలో విడుదల ఔతున్న శక్తుల దిశను మార్చడం ద్వారా ఉత్పన్నమైన ఫలం లోకసంగ్రహానికి వినియోగపడుతుంది.
ఈ విధమైన వాసనల ప్రభావం భవిష్యత్తులో ఉండరాదని అనుకుంటే ఏమి చేయాలి? అనే ప్రశ్న ప్రతి సాధకుడి మనస్సులో ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ‘రాగ-ద్వేషాలు’, ఈ రెండూ కూడా మనిషి యొక్క ఆలోచనలను మరియు కర్మలను నియంత్రిస్తూ ఉంటాయి. అధిక శాతం మనుషుల ఆలోచనలో ఈ రెండూ కూడా విధిగా ఉంటాయి. ‘ప్రకృతిం యాన్తి భూతాని’ మనిషి ఎన్ని కర్మలను ఆచరిస్తాడో,అవి అన్నీ కూడా స్వభావము మరియు సిద్ధాంతానికి అనుగుణంగానే ఉంటాయి. మనిషి యొక్క స్వభావము సాధారణంగా రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి – రాగద్వేష రహితమైనది, రెండు – రాగద్వేష యుక్త అనగా రాగద్వేషాలతో కూడుకొని ఉన్నది. దీన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము: మనం రోడ్డుపై వెళ్తుంటే రోడ్డు ప్రక్కన మనకు సైన్ బోర్డు లేదా హోర్డింగ్ కనిపిస్తే దానిపై ఏమి వ్రాసి ఉందో చదివేస్తాము. ఈ చర్య యాదృచ్చికంగా జరిగి పోతుంది. ఆ బోర్డ్ పట్ల గాని దానిపై వ్రాసిన విషయం పట్ల గాని మనకు శ్రద్ధ లేదు, రాగ ద్వేషాలు లేవు. ఎదురుగా కనిపించింది కాబట్టి చదివాము, అంతే. కాని ఒక మిత్రుడి వద్ద నుండో లేదా ఒక ఆప్తుడి వద్దనుండి ఉత్తరం గాని, సంక్షిప్త సమాచారం గాని, ఫోన్ గాని, ఈమెయిలు గాని వస్తే దాన్ని రాగ పూర్వకంగా చదువుతాము. అనగా ప్రేమతో చదువుతాము. ఒక శతృవు నుండి గాని, ద్రోహి నుండి గాని విరోధి నుండి గాని వచ్చిన సమాచారాన్ని ద్వేషంతో చదువుతాము. ఈ మూడు సందర్భాలలో ‘చదువుట’ అనే ప్రక్రియ జరిగిపోతుంది. కాని ఇట్టి ప్రక్రియ వెనుక దాగి ఉన్న వాసనలు భిన్నంగా ఉన్నాయి. ఆ మూడు విధములైన విషయాలను వివిధ రీతులలో మన మనస్సు గ్రహించింది. ఈ మూడు విధములైన సందర్భాలలో ‘రాగద్వేషాలు’ ప్రధాన పాత్రను పోషించాయి. శ్రీమద్భగవద్గీత, శ్రీ రామాయణ మరియు శ్రీ మహా భాగవతాలను కూడా చదువుతాము. దీన్ని ‘సిద్ధాంత ప్రభావం’ అని అంటాము. మనిషి ధార్మిక జీవనాన్ని గడపాలి, శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండాలి ఇత్యాదివన్నీ కూడా సిద్ధాంతాలు. కావున వీటికి సంబంధించిన చదువు సిద్ధాంత సంబంధమైనది. ‘పరమాత్మ ప్రాప్తి’ ప్రతి మనిషి యొక్క ఆశయం, ఇట్టి ఆశయ సాధనకు గాను ఆచరించు కర్మలు సిద్ధాంత సంబంధమైనవి. కావున మనం ఆచరించు పలు విధములైన క్రియలు స్వభావ మరియు సిద్ధాంత సంబందమై ఉంటాయి. రాగద్వేష రహితమైన కర్మలు లేదా క్రియలు దోషరహితములు. రాగద్వేష సహిత కర్మలు లేదా క్రియలు దోషముతో కూడుకొని ఉంటాయి. ఇవే మనిషిని బంధిస్తాయి. ఎందుకంటే, వీటి స్వభావము అశుద్ధమై ఉంటుంది. రాగద్వేష రహిత క్రియలు బంధించవు. సిద్ధాంత సంబంధమైన కర్మలు మనిషిని ఉద్ధరిస్తాయి. ఒక లోభి అయిన వాడు, కర్మను ఆచరించు నపుడు అట్టి కర్మాచరణలో తనకు నష్టం జరగకుండా జాగ్రత్తగా సంపూర్ణ లాభాపేక్షతో కర్మను ఆచరిస్తాడు. అదే భగవానుని సిద్ధాంతాన్ని అనుసరించు సాధకుడు కూడాను వాడు ఆచరించు కర్మలు రాగద్వేష పూరితమైనయా? లేక రాగద్వేష రహితమైనయా? అని విశ్లేషించుకుంటూ కర్మలను ఆచరిస్తాడు. తద్వారా వాడు ఆచరించే కర్మలు వాడిని బంధించ జాలవు. అంతే కాదు, పరిణామ క్రమంలో క్రమముగా కర్మ బంధనాల నుండి విముక్తుడు ఔతాడు. ఇట్టి సాధనలో అచేతన స్థితిలో నిక్షిప్తమై యున్న ఆలోచనలు తమకు తాముగా ఆవిరై పోతాయి. ఇట్టి సాధకుడికి కర్తృత్వము లభించదు. అజ్ఞాని యైన వాడు తాను ఆచరించు కర్మలందు ఫలాపేక్షను కలిగి ఉండుట వలన కర్తృత్వము తనకుతానుగా సిద్ధిస్తుంది. తాను ఆచరించు కర్మలు మరియు క్రియలన్నిటికీ తానే కర్తననే భావనలో ఉంటాడు. ప్రకృతి సంబంధమైన పదార్థాలతో సంబంధాన్ని ఏర్పరచుకొని ఉండుట వలన వాడిలో ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు ఉత్పన్నమౌతాయి. ఇవే క్రమంగా పేరుకొని పోయి పలు విధాలైన వాసనలుగా మారి అచేతన స్థితిలో నిక్షిప్తమౌతూ ఉంటాయి. ఇవన్నీ వాడి స్వభావాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. మనిషి యొక్క స్వభావం లో రాగమున్నన్ని రోజులు అశుద్ద కర్మలు నిర్వహిస్తూనే ఉంటాడు.
జన్మాంతర మరియు వర్తమాన జన్మల యొక్క సంస్కారాలు, తల్లిదండ్రుల సంస్కారాలు, వర్తమాన స్థితిలో వాడి సఞ్గము అనగా ఎలాంటి వారి సాంగత్యం లో ఉన్నాడు, వాడు అభ్యసించిన విద్య (పరీక్షలు పాస్ అవుట ద్వారా పొందిన సర్టిఫికేట్ కాదు, విద్య ద్వారా పొందిన జ్ఞానం), వాడు పెరిగిన వాతావరణం, వాడు చేసిన శాస్త్ర అధ్యయనం, ఆచరించు ఉపాసన, వాడి చింతన (ఆలోచన క్రమం), వాడి క్రియలు మరియు వాడి భావం ఇత్యాది వాటిని అనుసరించి వాడి స్వభావం ఏర్పడుతుంది. ఇది జ్ఞానులకు కూడా వర్తిస్తుంది. జ్ఞాని అయినను లేదా అజ్ఞాని అయినను వీటికి అనుగుణంగానే ప్రవర్తించు చున్నాడు. ఇవన్నీ కూడా వాడికి చేతన మరియు జడ లేదా అచేతన స్థితిలో గల వాసనల ప్రభావం వలన ఏర్పడతాయి. తదనుగుణంగానే వాడి ప్రవృత్తి ఏర్పడుతుంది మరియు శుద్ధ మరియు అశుద్ద క్రియలను ఆచరిస్తూ ఉంటాడు. శుద్ధ క్రియలు ఆచరించు వాడి కర్మలు తమకు తాముగా శుద్ధి కావించ బడినవై ఉండుట వలన కర్మల ద్వారా బంధించ బడే అవకాశం ఉండదు. కాని అశుద్ద క్రియలను ఆచరించు వారు ప్రకృతి అధీనంలో ఉంటాడు. వాడి చేతన మరియు జడ స్థితులందు నిక్షిప్తమై ఉన్న వాసనలకు అనుగుణంగా కర్మలను ఆచరిస్తూ ఉంటాడు, వాటికి తోడూ వర్తమాన స్థితిలో ఆచరిస్తున్న కర్మలు కూడా పాత వాటితో కలిసి పేరుకొనిపోతూ ఉంటాయి. కావున వాడి స్వభావం మరియు ఆచరించు కర్మలు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. సంపూర్ణ రాగద్వేషాలతో నిండిపోయి ఉంటాయి. జ్ఞానులు ఆచరించు కర్మలు రాగద్వేష భరితమైన నాడు వారి ప్రవృత్తి కూడా ఇదే విధంగా ఉంటుంది. అశుద్ద ప్రకృతి గల వారి ప్రవృత్తి చెడిపోయిన వాహనం తో సమానమైనది. అట్టి వాహనాన్ని సరి చేయుటకు గాను రెండు విధాలైన పద్ధతులు ఉంటాయి. మనకు సరిచేయడం లేదా రిపేర్ చేయడం వస్తే స్వంతగా చేసుకోవడం, లేదా దాన్ని రిపేర్ చేసే మెకానిక్ షెడ్ కు తీసుకొని పోవడం. మనిషిలో గల అశుద్ద ప్రకృతిని సరిచేయడానికి కూడా రెండు మార్గాలు ఉంటాయి. రాగద్వేష రహిత కర్మలను ఆచరించడం, లేదా భగవంతుడి శరణు వేడుకోవడం ద్వారా ఆయన మతానికి అనుగుణంగా గల కర్మలను ఆచరించడం. ఎవరి బుద్ధిలో సంసారిక భోగాల పట్ల శ్రద్ధ మరియు వ్యామోహం ఉంటుందో అట్టి వారు ఎంత విద్వాంసులు అయిన నేమి, వారి పతనం అవశ్యం. ఎవరి బుద్ధిలో ఈ విధమైన సాంసారిక భోగాలు మరియు వ్యామోహం ఉండదో అట్టి వారు విద్వాంసులు కాకపోయినా కూడాను వారు భగవానుని ద్వారా ఉద్ధరించ బడతారు. ఎవరి మనస్సులో ఈ విధమైన భోగాలు మరియు విలాసాల పట్ల శ్రద్ధ ఉండక పరమాత్మ సాధన ఒక్కటే ఉంటుందో, అట్టి వాడి ప్రతి కర్మ యొక్క దిశ ఒకే వైపు ఉంటుంది, అదే పరమాత్మ సాధన. అంతేకాదు అట్టి కర్మలు వాడి ఉన్నతికి సహాయపడతాయి. కావున సాధకుడికి పరమాత్మ సాధన అన్న ఒకేఒక ఆశయం ఉండాలి. ఇట్టి ఆశయ సిద్ధికి రాగద్వేష రహితుడై కర్తవ్యాన్ని మరియు కర్మలను నిర్వర్తిస్తూ ఉండాలి. రాగద్వేష రహితులు అగుటకు గాను తన కర్మద్వారా పొందిన ఫలాన్ని లేదా పదార్థాన్ని లోకసంగ్రహార్థం వినియోగించడం. ఇట్టి ప్రక్రియలో రాగద్వేషాల ప్రమేయం ఉండదు. అంతేకాదు, ఇతరుల వద్ద గల దాన్ని ఆశించే స్వభావం కూడా ఉండరాదు.
ప్రకృతి వశం కావడం వల్ల జరిగే నష్టాల గూర్చి తెలుసుకొని యున్నాము. దాని బారి నుండి తప్పించుకోవడానికి కూడా మార్గాన్ని తెలుసుకొని యున్నాము. ప్రకృతి వశం కాకూడదని భావించిన సాధకుడు ఒక ఆదర్శాన్ని ముందుంచి కర్మలను ఆచరించాలి. ఈ ఆదర్శాలే సాధకుడికి సహాయం చేస్తాయి. ఈ ఆదర్శాలను మనం రెండు విధాలుగా విభజించ వచ్చు.
1. భగవంతుడి మతమ్ లేదా సిద్ధాంతం.
2. శ్రేష్ఠ లేదా మహా పురుషుల అనుసరణ.
ఈ రెండు విధాలైన ఆదర్శాలు కూడా సాధనలో సహాయ పడతాయి. ఇట్టి ఆదర్శాలను ముందుంచి కర్మను, కర్తవ్యాన్ని ఆచరించు వాడి కర్మలు శుద్ధములై ఉంటాయి. మరియు వీరికి పరమాత్మ తత్త్వము యొక్క అనుభవం కలుగుతుంది. దీనికి భిన్నంగా ఈ ఆదర్శాలను ముందుంచి కర్మను మరియు కర్తవ్యాన్ని ఆచరించని మనుష్యులయందు రాగద్వేషాలు అధికమౌతాయి. తద్వారా వారు పతనమై పోతారు. ‘నష్టాన్ విద్ధి (భగీ ౩-౩౨)’ అని క్రిందటి శ్లోకంలో మనం తెలుసుకొని యున్నాము. వేగంగా ప్రవహిస్తున్న నది యొక్క ప్రవాహాన్ని ఆపలేము, కాని అది ప్రవహిస్తున్న దిశను మార్చవచ్చు. అదేవిధంగా మనిషి నిస్స్వార్థంగా పరుల హితం కోరి లేదా లోక సంగ్రహార్థం కర్మలను ఆచరించుట వలన కర్మల ప్రవాహం యొక్క దిశ మారిపోతుంది. స్వార్థ ప్రయోజనం లేశమాత్రం ఉన్నా అట్టి కర్మల ప్రవాహ దిశ మారదు. లోకసంగ్రహార్థం ఆచరించు కర్మల యొక్క ప్రవాహం లోకం వైపు ఉంటుంది. లోకానికి ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాదు సాధకుడు కర్మ బంధనాల నుండి ముక్తుడై పోతాడు.
నమిలికొండ విశ్వేశ్వర శర్మ
Copyright © 2020 Sri Gayatri Veda Vision - All Rights Reserved.
The above published material is a part of The Srimad Bhagavadgita (Bhashya Trayam) Copyright ©. No part of this publication may be reproduced, distributed, or transmitted in any form or by any means, including photocopying, recording, or other electronic or mechanical methods, without the prior written permission of the publisher.
Copyright © 1995 - 2020 Sri Gayatri Veda Vision - All Rights Reserved.
No part of this publication may be reproduced, distributed, or transmitted in any form or by any means, including photocopying, recording, or other electronic or mechanical methods, without the prior written permission of the publisher.
Powered by GoDaddy
This website uses cookies. By continuing to use this site, you accept our use of cookies.