Sri Gita Gnana Maha Yagnam

Completed One Year

04.03.2019


మిత్రులకు శుభోదయం


అది శ్రీ హేవళంబి శివరాత్రికి ఒక మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన. నిత్యానుష్ఠానం లో ఉన్నాను నేను. అదే సమయంలో నా మొబైల్ మ్రోగింది. నా ముఖపుస్తక మిత్రుడు శ్రీ ఆచార్య గౌతమ్ మనోహ్య కాల్ అది. నేను సాధారణంగా అనుష్ఠానం లో ఉంటే ఫోన్ లు ఎత్తను. ఎందుకో తెలియదు. ఆ ఫోన్ కాల్ తీసుకొని సమాధానం ఇచ్చాను. అదే సమయంలో గౌతమ్ నన్ను ‘శ్రీ రుద్ర ప్రశ్న’ పై వ్యాఖ్య వ్రాయమని అడిగాడు. అది శివాజ్ఞ గా భావించి సరే అన్నాను. మరి కొంత సేపట్లో తిరిగి ఫోన్ చేసి రుద్ర ప్రశ్న కంటే కూడా శ్రీ భగవద్గీత పై కొన్ని ప్రధాన శ్లోకాలను ఎంచుకొని వాటికి సామాజిక వ్యాఖ్య వ్రాయమని అడిగాడు. శ్రీ గాయత్రి జపం చేసుకుంటున్న నేను నివ్వెర పోయాను. మా పితృదేవులు అయిన కీశే నమిలికొండ గోవింద్ రావు గారు, వృత్తి రీత్యా జిల్లా జడ్జీ గా రిటైర్ అయిన పిమ్మట శ్రీ భగవద్గీత పై విస్తృతంగా కృషి చేసారు. ఆ రోజుల్లో communism మరియు నాస్తికవాదం బలంగా ఉండేది. శ్రీ భగవద్గీత ప్రకారం ఇట్టి నాస్తిక వాదాన్ని సమూలంగా రూపుమాపుతాననే దృఢ నిశ్చయంతో కృషి చేసారు. కాని హఠాత్తుగా శివైక్యం చెందారు. వారి కోరిక నెరవేరక ఉండిపోయింది. దాన్ని నెరవేర్చే యోగం ఈ విధంగా నాకు వస్తుందని నేను అనుకోలేదు.


గౌతమ్ గారు నాకు ఫోన్ చేసిన రెండు రోజుల్లో శ్రీ మహాశివరాత్రి. శివ కేశవులకు భేదము లేదనే అభిప్రాయంతో శ్రీ హేవళంబి మహా శివరాత్రి నాడు శ్రీ మద్భగవద్గీత కు నాంది పలికాను. ఆ రోజు మొదలు శ్రీ గీత జ్ఞాన మహాయజ్ఞం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. భగవానుడి కృప మరియు మీ అందరి ఆదరణ వలన ఇది ఒక జీవనది వలే ప్రవహిస్తూనే ఉంది. శ్రీ మహాశివరాత్రి నాడు ప్రారంభమైన శ్రీ గీత జ్ఞాన మహాయజ్ఞము నకై చేసిన అగ్ని ప్రతిష్టకు చెందిన జ్వాల ప్రతినిత్యం వృద్ధి చెందుతున్న జ్వాలతో దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. ఇదంతా కూడా శ్రీ కృష్ణ భగవానుని కృపా కటాక్షం. నా మాతా పితరుల ఆశిస్సులు, మా గురువుగారి దీవెనలు, నేను అనుష్టించే శ్రీ గాయత్రి ప్రసాదించిన జ్ఞానం, పెద్దల ఆశిస్సులు, నా కుటుంబ సభ్యుల సహకారం, మీ అందరి ఆదరణ ఇత్యాది వన్నీ కూడా నాకు శక్తిని ప్రసాదిస్తున్నాయి. ఈ జీవనది ఇదేవిధంగా ప్రవహించి నిర్వాణమనే మహా సముద్రంలో కలవాలి. ఆ విధంగా కలిసే వరకు కూడా మన ప్రయత్నం కోన సాగుతూనే ఉండాలి. అందుకు ఆ భగవానుడు కూడా అనుగ్రహించాలి.


సర్వం శ్రీ కృష్ణ దివ్యచరణారవిన్దర్పణ మస్తు


నమిలికొండ విశ్వేశ్వర శర్మ

Srimad Bhagavad Gita

III Chapter - Karma Yoga

  

శ్లో:

అన్నాద్భవన్తి భూతాని పర్జన్యా దన్నసంభవః ।

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ।।14।। -133-

అన్నాత్ = అన్నము వలన; భూతాని = ప్రాణులు; భవన్తి = కలుగు చున్నవి; పర్జన్యాత్ = మేఘము (వర్షము) వలన; అన్నసంభవః = అన్నము కలుగు చున్నది; యజ్ఞాత్ = యజ్ఞము వలన; పర్జ్యన్య = మేఘము (వర్షము); భవతి = కలుగు చున్నది; యజ్ఞః = యజ్ఞము; కర్మసముద్భవః = కర్మాచరణ వలన కలుగు చున్నది.


ప్రాణులు అన్నము వలన కలుగు చున్నవి. అన్నము మేఘము (వర్షము) వలన కలుగు చున్నది. మేఘము (వర్షము) యజ్ఞము వలన కలుగు చున్నది. ఇట్టి యజ్ఞము కర్మ వలన కలుగు చున్నది.


భాష్యం:


14.1 అన్నాత్ ఇతి ।। అన్నాత్ భుక్తాత్ లోహితరేతఃపరిణతాత్ ప్రత్యక్షం భవన్తి జాయన్తే భూతాని । పర్జన్యాత్ వృష్టేః అన్నస్య సంభవః అన్నసంభవః । యజ్ఞాత్ భవతి పర్జన్యః ।

అగ్నౌ ప్రాస్తాఽహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే । 

ఆదిత్యాజ్జాయతే వృష్టిః వృష్టేరన్నం తతః ప్రజాః’ ।। ఇతి స్మృతేః (మను ౩.౭౬) ।

యజ్ఞః అపూర్వమ్ । స చ యజ్ఞః కర్మసముద్భవః ఋత్విగ్యజమానయోశ్చ వ్యాపారః కర్మ, సముద్భవః యస్య యజ్ఞస్య అపూర్వస్య సః యజ్ఞః కర్మసముద్భవః ।।


‘భూతాని’ సమస్త ప్రాణికోటి అంతా కూడాను, ‘అన్నాత్ భుక్తాత్’అన్నాన్ని భుజించుట వలన మరియు ఆ విధంగా భుజించిన అన్నం ‘లోహితరేతఃపరిణతాత్’రక్తము మరియు రేతస్సు గా మారి, జీవులు ‘జాయన్తే’ జన్మించు చున్నాయి. ‘పర్జన్యాత్ వృష్టేః అన్నస్య సంభవః అన్నసంభవః’ మేఘాలు కురియడం వలన అన్నం ఉద్భవించు చున్నది. ‘యజ్ఞాత్ భవతి పర్జన్యః’ ఇట్టి వర్షము యజ్ఞము ద్వారా సంభవమగు చున్నది. ‘అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే’ యజ్ఞము నందు అగ్నికి ఒక సరియైన పద్ధతిలో సమర్పించుకున్న ఆహుతులు నేరుగా సూర్య భగవానుడిని చేరు చున్నాయి. ‘ఆదిత్యాజ్జాయతే వృష్టిః’ అట్టి సూర్యుడి ద్వారా వర్షము సంభవించు చున్నది. ‘వృష్టేరన్నం తతః ప్రజాః’ అట్టి వృష్టి అనగా వర్షము వలన అన్నం లభించు చున్నది. మరియు ఇట్టి అన్నము వలన జీవరాశి జనియించు చున్నది. అని ‘మను స్మృతి (3.76)’ సూచించు చున్నది. ‘యజ్ఞః అపూర్వమ్’ యజ్ఞము అపూర్వమైనది. అనగా సరిపోలనిది. యజ్ఞము నందు ఆహుతులు సమర్పించుట, ‘ఋత్విగ్యజమానయోశ్చ వ్యాపారః కర్మ, సముద్భవః’ ఋత్త్విక్కులు మరియు యజమానులు కలిసి ఆచరించే కర్మ వలన ఒక ప్రత్యేకమైన, అపూర్వమైన శక్తి ఉద్భవిస్తుంది. ‘యస్య యజ్ఞస్య అపూర్వస్య సః యజ్ఞః కర్మసముద్భవః’ ఈ విధమైన కర్మాచరణ ద్వారా ‘అపూర్వ’అనబడే ఏకైక, సరిపోలని ఒక శక్తి ఉద్భవించు చున్నది. యజ్ఞమనగా ఒక అపూర్వమైన శక్తి.


15.0 తచ్చ ఏవంవిధం కర్మ కృతః జాతమిత్యాహ ---

ఈ విధమైన శక్తి ఎలాంటి కర్మాచరణ ద్వారా ఉద్భవిస్తుందో రాబోవు శ్లోకం లో తెలుసుకుందాము.


భాష్యం టీకా:

‘అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే’ యజ్ఞము నందు అగ్నికి ఒక సరియైన పద్ధతిలో సమర్పించుకున్న ఆహుతులు నేరుగా సూర్య భగవానుడిని చేరు చున్నాయి. ‘ఆదిత్యాజ్జాయతే వృష్టిః’ అట్టి సూర్యుడి ద్వారా వర్షము సంభవించు చున్నది. అనగా సూర్య భగవానుడు సమస్త సృష్టిని అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో నడిపే వాడుగా మనకు రుజువు అగు చున్నది. సూర్యుడు భూమిపై యున్న జలాలను ఆవిరిగా మార్చి తద్వారా వర్షాన్ని ప్రసాదిస్తాడని మరియు సమస్త ఓషధులన్నీ కూడా ఆయన ద్వారా మాత్రమే ఉత్పత్తి చెందుతాయని ‘శ్రీ తైత్తిరీయ కృష్ణ యజుర్వేద ఆరణ్యకం’ లో మనకు ప్రమాణం లభిస్తుంది.


వృష్టి కామశ్చిన్వీత । ఆపోవై వృష్టిః పర్జన్యో వర్షుకో భవతి । య ఏవం వేద (శ్రీ తైత్తిరీయ కృష్ణ యజుర్వేద సంహిత - ఆరణ్యకం – అరుణ ప్రశ్న షడ్విగ్౦శోనువాకః ౧౪)


ఉదకములు సూర్య కిరణాల ద్వారా మేఘముగా నొంది వర్షించు చున్నాయి. కాబట్టి వర్షమును కోరువాడు జల సంబంధమైన యజ్ఞమును చేయ వలయును. ఇది గ్రహించిన వాడు వర్షమును పొందు చున్నాడు.

ఈ ప్రమాణమును అనుసరించి సూర్య రశ్మి వలన భూమిపై ఉన్న ఉదకములు మేఘములు గా మారి, అవి పునః వర్షించు చున్నాయి. ఇట్టి వర్షము ద్వారా ఉత్పత్తి జరుగు చున్నది. ఇదే ప్రకృతి ధర్మం. ఈ విధమైన ప్రకృతి ధర్మం నిలబడాలంటే ముందుగా ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ముందుగా భూమిపై ఉదకం కనబడాలి. అప్పుడే అట్టి ఉదకం ఆవిరై, మేఘము గా మరి వర్షమై కురుస్తుంది. మనము ఈనాడు భూమిపై చుక్క నీరు నిలువ కుండా సిమెంట్, తార్ వేసి రోడ్ల నిర్మాణం చేస్తున్నాము. భూమిపై ఒక చుక్క నీరు కూడా కనబడదు. అట్టి పరిస్థితిలో అవిరీ లేదు – మేఘమూ లేదు. ఒక వేళా ఉన్నా అట్టి మేఘము కురియదు. ఎందుకంటే మేఘాలయందు పుష్కలంగా నీరు నిండి ఉన్న నాడు మాత్రమే అవి కురుస్తాయి. జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిన పిమ్మట ‘నీటి సాగు (Water Harvesting)’ అని, నీటిని కాపాడే విధానాన్ని గూర్చి ఆలోచిస్తున్నాము. నేడు భూమిలో జల వనరులు దాదాపుగా అడుగంటాయి. ఇక్కడ ప్రకృతిని కాపాడడమే ఒక యజ్ఞము. ఆ యజ్ఞాన్ని మనం ఆచరించడం లేదు. కావున ప్రకృతి తన సంతులతను కోల్పోయింది. ఈరోజు వరుణ హోమాలు చేస్తున్నారు. కాని ప్రయోజనం కనబడడం లేదు. దానికి కారణం ప్రకృతి తన సంతులతను సంపూర్ణంగా కోల్పోయింది. అందుకే యజ్ఞ ప్రభావం కూడా ఈనాడు కనిపించడం లేదు. కావున వర్షాభావ పరిస్థితిలో వరుణ యజ్ఞం చేయడం ప్రధానం కాదు, ప్రకృతి యజ్ఞమే అన్నిటికంటే ప్రధానమైనది. ప్రకృతిని కాపాడాలి. దాన్ని మించిన యజ్ఞం అనునది లేదు. భూమిపై ఉదకములు పుష్కలంగా ఉన్నన్ని రోజులు వర్షాలు చక్కగా కురుస్తాయి, అంతే కాదు ప్రజలందరూ చక్కని సంతాన ప్రాప్తిని కూడా పొంద గలరు. భూమిపైన ఉదకములు మాయమై పోతున్న ఈ రోజుల్లో సంతాన లేమితో బాధపడే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. జలము లందు అగ్ని నిక్షిప్తమై ఉన్నది. అట్టి జలమును పూజించు వాడు అగ్నిని పూజించు వాడే అగును. ఆ విధంగా అగ్నిని పూజించు వాడికి చక్కని సంతాన సౌఖ్యము కలుగు చున్నది. పురుషుడి వృషణము లందు అగ్ని నిక్షిప్తమై ఉంటుంది. అట్టి అగ్ని ఒత్తిడికి గురియైన నాడు వాడు సంతాన హీనుడగు చున్నాడు.


‘వృషావా అగ్నిః । వృషాణౌసగ్గ్ స్ఫాలయేత్ । హన్యేతాస్య యజ్ఞః । తస్మాన్నానుషజ్యః ।।‘

(శ్రీ తైత్తిరీయ కృష్ణ యజుర్వేద సంహిత - ఆరణ్యకం – అరుణ ప్రశ్న షడ్విగ్౦శోనువాకః ౧౦)


అగ్నిని సేవించు యజమానుడు తన రేతస్సు నుండి సంతానమును పుట్టింప గల శక్తి గల వాడగు చున్నాడు. అట్టి వృషణములు పీడించ బడిన నాడు, ఆయన ఆచరించిన యజ్ఞము ద్వారా పొందిన అగ్ని కొల్లగొట్టబడు చున్నది. తద్వారా వాడు సంతాన హీనుడగు చున్నాడు. ఇట్టి యజుర్వేద మన్త్రము, యజ్ఞము ద్వారా సంతానోత్పత్తి కలుగు చున్నదనే నిరూపణ చేయు చున్నది. వృషణము లందు నిక్షిప్తమై యున్న అగ్ని రేతస్సుగా మారి సంతానోత్పత్తికి దోహదపడు చున్నది. వృషణములు అతిగా పీడించ బడ్డ సందర్భాలలో రేతస్సు తనకు తానుగా నశించి పోవు చున్నది. అందుకే నేడు సంతానలేమితో బాధపడే పురుషులకు వైద్యులు ‘అతి బిగువుగా ఉండే లోదుస్తులను’ ధరించరాదని సూచన ఇచ్చు చున్నారు. అంతేకాదు, ‘వికిరణము - Radiation’ ప్రభావము వలన కూడా ఇట్టి ప్రమాదము అధికముగా సంభవించు సూచనలున్నాయి. నిరంతరం ఒక సుదీర్ఘకాలం పాటు అతి బిగుతుగా ఉండు లోదుస్తులు ధరించి పనిచేయడం, లాప్టాప్ లాంటివి ఒడిలో పెట్టుకొని సుదీర్ఘ కాలం పాటు పనిచేయడం వలన, బాహ్య వికిరణ ప్రభావము వలన వృషణములు ఒత్తిడికి లోనై, వృషణము లందు ఉష్ణోగ్రత తన సంతులతను కోల్పోవుట ద్వారా రేతస్సు నశించి పోవు చున్నది. అందుకే పూర్వకాలంలో పురుషులకు ధోవతులు తప్పనిసరిగా కట్టాలి అనే సంప్రదాయాన్ని నిర్ణయం చేసారు. ప్రధానంగా పితృ, దైవ, మరియు బ్రహ్మ యజ్ఞాలను ఆచరించు సమయంలో వదులుగా ఉండే ధోవతి ధరించడం ద్వారా శరీరంలోని రేతస్సుకు నష్టం జరగదు. అంతేకాదు అట్టి రేతస్సు అభివృద్ధి చెందుతుంది కూడానూ. నేడు యజ్ఞ యాగాలు కూడా ప్యాంటు మరియు షర్టు వేసుకొని చేయడానికి జనులు పూనుకుంటున్నారు. మన శాస్త్రాలు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలను మరియు సూత్రాలను మనకు అందించాయి. వాటిని ఆచరించడం మన ధర్మం. ఆ విధంగా ఆచరించిన వాడు అన్ని విధాలుగా సుఖపడ్డాడు,లేని వాడు పలు విధాలుగా కష్టాలను అనుభవిస్తున్నాడు. సూర్య భగవానుడికి అధిదేవత ‘అగ్ని’ మరియు ప్రత్యధి దేవత రుద్రుడు. శ్రీ సూర్యారాధన వలన అగ్నిని కూడా ఆరాధించిన వారమౌతాము. అట్టి అగ్ని జనులకు సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ‘అరుణ ప్రశ్న’ ను సంతాన ప్రాప్తికి కూడా ప్రయోగం చేయడం జరుగుతుంది. ఇంతటి శక్తి వంతమైన సూర్య భగవానుడికి ప్రతి నిత్యం అర్ఘ్యం వదిలే సమయం మరియు ఓపిక రెండూ కూడా నేడు తగ్గిపోయి ఉన్నాయి. దాని యొక్క పర్యవసానమే ఈనాడు మానవులకు విపరీతంగా పెరుగుతున్న అనారోగ్యాలు, పలు రకాలైన వ్యాధులు మరియు రుగ్మతలు, వన్ధ్యత్వము ఇత్యాది పలు విధములైన బాధలు.


‘అగ్నినా రయిమశ్నవత్పోషమేవ దివేదివే । యశస వీరవత్తమమ్ ।। (ఋగ్వేద ౧.౦౦౧.౦౩)


అగ్ని వలన ధనము, విజ్ఞానము, సంపద, శక్తి, సమృద్ధి కలుగుచున్నవి. అగ్ని వలన యశస్సు, సంతానము కలుగుచున్నవి. వృషణము లందలి వీర్య శక్తిని పెంపొందించు వాడు అగ్ని. అట్టి వీర్యము ద్వారానే సంతానోత్పత్తి జరుగుతున్నది కదా! అంతే కాదు శరీరంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుంది. మనలోని ప్రాణ శక్తి కూడా అగ్నియే. అందుకే ప్రాణం పోయిన శరీరం చల్లబడిపోతుంది. చర్మము తన స్థితిస్థాపక శక్తిని కోల్పోతుంది. అనగా చర్మము మరియు మాంసం గట్టిపడి పోతాయి. అంతే కాదు అగ్ని మనకు ధనాన్ని ప్రసాదించు వాడు. మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతి వెలిగించు వాడు. పలు విధములైన సిరి సంపదలను ప్రసాదించు వాడు. అందుకే మన పూర్వీకులు మనం నివసించే గృహము నందు రెండు పూటలా తప్పనిసరిగా దీపారాధన చేయమని చెప్పారు. దీపారాధన అనగా అగ్ని ప్రతిష్ఠ. అట్టి అగ్ని ప్రతిష్ఠ ద్వారా మనకు సర్వ శుభములు కలుగు చున్నాయి. అంతే కాదు యజ్ఞము నందు ప్రధాన దేవత అగ్ని. అందుకే:


అగ్ని మీళే పురోహితమ్ యజ్ఞస్య దేవ మృత్విజమ్ ।

హోతారం రత్నధాతమమ్ ।। (ఋగ్వేద ౧.౦౦౧.౦౧) 


అగ్ని యజ్ఞమునకు పురోహితుడు. అగ్ని దేవతల ఋత్విజుడు. అగ్ని హోత అగును. అగ్ని సమస్త సంపదల ప్రదాత. అంతే కాదు:

అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసమ్ ।

అస్య యజ్ఞస్య సుక్రతుమ్ ।। (ఋగ్వేద ౧.౦౧౨.౦౧)

అగ్ని దేవతల దూత అగును. అతడు సకల ధనములు కలవాడు. ఈ యజ్ఞమును చక్కగా నడిపించువాడు. అటువంటి అగ్నిని సేవించుచున్నాము.

అగ్ని మనకు పలు విధములైన సంపదలను ప్రసాదిస్తాడు. కాని అట్టి సంపదలన్నింటికీ యజమాని కూడా ఆయనే. అందుకే యజ్ఞ కర్మ ద్వారా పొందిన ఫలాని పునః యజ్ఞార్పణం చేయాలి. అప్పుడే కర్మ ఈశ్వరార్పణం అవుతుంది:


యద్ అఙ్గ దాశుషే త్వమ్ అగ్నే భద్రం కరిష్యసి ।

తవేత్ తత్ సత్యమ్ అఙ్గిరః ।। (ఋగ్వేద ౧.౦౦౧.౦౬)


అగ్నీ ! నిన్ను యజించువారలకు నీవు శుభములను సమకూర్తువు. ఆ శుభములు మరల నీకే అందుచున్నవి. అనగా అగ్ని మనకు అన్ని విధములైన సౌఖ్యములను ప్రసాదించు వాడు, కాని ఆయన ప్రసాదించిన ప్రతి దానికి ఆయనే యజమాని. అట్టి వస్తువులన్నియూ పునః ఆయనకు యజ్ఞము నందు అర్పించునది. అనగా కర్మ ద్వారా పొందిన ఫలాన్ని ఈశ్వరార్పణం చేయడం.

శ్రీ సూర్య భగవానుడికి అధిదేవత అగ్ని మరియు ప్రత్యధిదేవత రుద్రుడు. శ్రీ సూర్య భగవానుడు శివాంశ సంభూతుడు మరియు శ్రీమన్నారాయణ ప్రత్యక్ష అవతారం, అందుకే శ్రీ సూర్యారాధన వలన ఇరువురిని ఆరాధించిన ఫలం లభిస్తుంది. శ్రీ సూర్య భగవానుడు శివాలయము లందు నివసిస్తాడని శ్రీ పరాశర సిద్ధాంతము చెప్పుచున్నది. శ్రీ సూర్యారాధనకు మరియు శ్రీ శివారాధనకు చాలా అవినాభావ సంబంధ ఉంది. శ్రీ సూర్య భగవానుడిని వర్షాన్ని ప్రసాదించమని వేడుకుంటాము. ‘ఆదిత్యాజ్జాయతే వృష్టిః’ సూర్యుడి ద్వారా వర్షము సంభవించు చున్నదని శ్రీ శజ్ఞ్కర భగవత్పాదుల వారి భాష్యంలో మనం చదువుకున్నాము. అదే విధంగా శ్రీ శివుడు కూడా వర్షాన్ని ప్రసాదించు వాడు.


శ్రీ రుద్ర ప్రశ్నలో:

ఓం నమో వర్ష్యాయచావర్ష్యాయ చ – (అనువాకము 7.12)

‘ఓం నమో వర్ష్యా॑య చ అవర్ష్యాయ చ’ అనగా వర్షము ను ప్రసాదించు జలములు మరియు వర్షమును ప్రసాదించని జలములున్నూ ఆ రుద్రుడే. అనగా భూమిపై యున్న మరియు ఆవిరిగా మారి మనకు వర్షాన్ని ప్రసాదించే జలములు గల నదులు, సరస్సులు ఇత్యాదివి మరియు ఆవిరిగా మారని సముద్ర జలాలు. సర్వమూ శ్రీ శివమయమే. అట్టి శివునికి నమస్కరించు చున్నాను.


ఓం నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ - (అనువాకము 7.13)

జలరూపంలో గల మేఘాలు మరియు అట్టి మేఘాల ద్వారా ఉద్భవించిన మెరుపులు సర్వమూ శివమయమే. అట్టి శివునికి నమస్కరించు చున్నాను.

సమృద్ధిగా వర్షాలు కురియుటకు కూడా ఇట్టి రుద్ర పాశుపత మంత్రాలను ప్రయోగం చేస్తారు. దానికి ప్రధాన కారణం ఇదే. అగ్ని జలములను ఆవిరి చేయుట, అట్టి జలములు ఆవిరిగా మరి మేఘములగుట మరియు అట్టి మేఘములు వర్షములై కురియుట. అట్టి వర్షము వలన సమస్త జీవరాశి జీవించి ఉండుట. ఈ చక్రము ఒక క్రమ పద్ధతిలో నడచుటకు గాను ఆచరించ వలసింది ‘యజ్ఞము’ మరియు ఇట్టి యజ్ఞము కర్మ ద్వారా మాత్రమే సంభవమగు చున్నది.


శ్రీ రామానుజ భాష్యం:

అన్నాత్ సర్వాణి భూతాని భవన్తి పర్జన్యాద్ అన్న సంభవః ఇతి సర్వలోకసాక్షికమ్ । యజ్ఞాత్ పర్జన్యో భవతి ఇతి చ శాస్త్రేణ అవగమ్యతే--- 

‘అగ్నౌ ప్రాస్తాఽహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే ।

ఆదిత్యాజ్జాయతే వృష్టిర్వృష్టేరన్నం తతః ప్రజాః ।। (మను ౩-౭౬)

యజ్ఞః చ ద్రవ్యార్జనాదికర్తృపురుషవ్యాపారరూపకర్మసముద్భవః ।। ౧౪ ।।


‘అన్నాత్ సర్వాణి భూతాని భవన్తి’ సమస్త ప్రాణికోటి అన్నము ద్వారా జనించినది. ‘పర్జన్యాద్ అన్న సంభవః’ అట్టి అన్నము వర్షము ద్వారా మాత్రమే సంభవించినది. ‘ఇతి సర్వలోకసాక్షికమ్’ దీనికి సర్వ లోకమే సాక్షి. అనగా ప్రతి ఒక్కరికీ ఈ సిద్ధాంతం అవగతమగు చున్నది. ‘యజ్ఞాత్ పర్జన్యో భవతి’ యజ్ఞము ద్వారా వర్షము సంభవించు చున్నది, అనునది ‘ఇతి చ శాస్త్రేణ అవగమ్యతే’ క్రింద వివరించ బడిన శస్త్ర ప్రమాణము మనకు తెలుపు చున్నది:


‘అగ్నౌ ప్రాస్తాఽహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే ।

ఆదిత్యాజ్జాయతే వృష్టిర్వృష్టేరన్నం తతః ప్రజాః ।। (మను ౩-౭౬)

‘అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే’ యజ్ఞము నందు అగ్నికి ఒక సరియైన పద్ధతిలో సమర్పించుకున్న ఆహుతులు నేరుగా సూర్య భగవానుడిని చేరు చున్నాయి. ‘ఆదిత్యాజ్జాయతే వృష్టిః’ అట్టి సూర్యుడి ద్వారా వర్షము సంభవించు చున్నది. ‘వృష్టేరన్నం తతః ప్రజాః’ అట్టి వృష్టి అనగా వర్షము వలన అన్నం లభించు చున్నది. మరియు ఇట్టి అన్నము వలన జీవరాశి జనియించు చున్నది. అని ‘మను స్మృతి (3.76)’ సూచించు చున్నది. ‘యజ్ఞః చ ద్రవ్యార్జనాదికర్తృ’ కర్త యొక్క ద్రవ్యార్జన ద్వారా యజ్ఞము సంభవించు చున్నది. ‘పురుష వ్యాపారరూప కర్మ సముద్భవః’ ఆశయ సాధనకు ఆచరించు కర్మ ‘పరబ్రహ్మ’ ద్వారా ఉద్భవించినది. శరీరము ‘ప్రకృతి’ స్వరూపము. ఇది ప్రకృతి ద్వారా ఉద్భవించినది.


భాష్యం టీకా:

‘ప్రకృతి’ ద్వారా శరీరము ఉద్భవించింది. అట్టి దేహము నందు ప్రాణ రూపంలో గల భగవానుడి ద్వారా కర్మ జనియించింది. కర్మాచరణ ద్వారా యజ్ఞాచరణ కు గాను ద్రవ్యము లభిస్తుంది. అట్టి ద్రవ్యము ద్వారా యజ్ఞాన్ని ఆచరించాలి. యజ్ఞము వర్షాన్ని ప్రసాదిస్తుంది. అట్టి వర్షము సమస్త జీవ రాశి అంతటికీ అన్నాన్ని ప్రసాదిస్తుంది. అట్టి అన్నాన్ని గ్రహించిన మనుజుడు పునః యజ్ఞాన్ని ఆచరిస్తాడు. యజ్ఞము ద్వారా యజ్ఞము తద్వారా వర్షము....ఇది ఒక చక్రీయ ప్రక్రియ. దీన్నే ‘యజ్ఞ చక్రము’అని కూడా అంటాము. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇట్టి ప్రక్రియలో ఏవిధమైన అవరోధము సంభవించ రాదు. సంభవించిన ఎడల తప్పక ప్రకృతిలో సమతుల్యత నశించి పోతుంది. దీని గూర్చి భగవానుడు చాలా చక్కగా వివరించు చున్నాడు. ఇంకనూ దీని వివరణ టీకా (సామాజిక వ్యాఖ్య) లో వివరించబడి యున్నది.


శ్రీ మధ్వాచార్య భాష్యం:

హేత్వన్తరమాహ – అన్నాదితి ।। యజ్ఞః పర్జన్యాన్నత్వాత్ తత్కారణముచ్యతే । పూర్వయజ్ఞవివక్షాయాం తస్య (భావరత్నకోశరీత్యా ‘తస్య’ ఇతి నాస్తి) చక్రప్రవేశో న భవతి । తద్ధి ఆపాధ్యం కర్మవిధయే । న తు సామ్యమాత్రేణేదానీం కార్యమ్ । మేఘచక్రభిమానీ చ పర్జన్యః । తచ్చ యజ్ఞాద్ భవతి ।

‘అగ్నౌ ప్రాస్తాఽహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే ।

ఆదిత్యాజ్జాయతే వృష్టిర్వృష్టేరన్నం తతః ప్రజాః ।। (మను ౩-౭౬)

ఇతి స్మృతేః (స్మృతేశ్చ) । ఉభయవచనాద్ ఆదిత్యాత్ సముద్రాచ్చావిరోధః । అతశ్చ యజ్ఞాత్ పర్జన్యోద్భవః సమ్భవతి । యజ్ఞో దేవతాముద్దిశ్య ద్రవ్యపరిత్యాగః, కర్మ ఇతరక్రియా ।। ౧౪ ।।


‘హేత్వన్తరమాహ – అన్నాదితి’ అన్నము ద్వారా అని అనడం ద్వారా మరొక ప్రయోజనమును ఇక్కడ సూచించ బడినది. అనగా ‘యజ్ఞః పర్జన్యాన్నత్వాత్’ అన్నము ద్వారా యజ్ఞము, తద్వారా వర్షము. ‘పూర్వయజ్ఞవివక్షాయాం తస్య చక్రప్రవేశో న భవతి’ పూర్వము సూచించిన ‘యజ్ఞ చక్ర‘ పద్ధతికి ఇది భిన్నమైనది. ‘ఆపాధ్యం కర్మవిధయే’ భవిష్యత్తులో ఆచరించదగు కర్మల గూర్చి సూచించ బడినది. ‘న తు సామ్యమాత్రేణేదానీం కార్యమ్’ఇట్టి కర్మలను సామ్య మాత్రమూ కొరకు సూచించబడలేదు. ‘మేఘచక్రభిమానీ చ పర్జన్యః’వర్షము మేఘము ద్వారా జనియించు చున్నదనే విషయం విదితమే. ‘తచ్చ యజ్ఞాద్ భవతి’ఇట్టి మేఘము యజ్ఞము ద్వారా మాత్రమే సంభవించు చున్నది.


‘అగ్నౌ ప్రాస్తాఽహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే ।

ఆదిత్యాజ్జాయతే వృష్టిర్వృష్టేరన్నం తతః ప్రజాః ।। (మను ౩-౭౬)


‘అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే’ యజ్ఞము నందు అగ్నికి ఒక సరియైన పద్ధతిలో సమర్పించుకున్న ఆహుతులు నేరుగా సూర్య భగవానుడిని చేరు చున్నాయి. ‘ఆదిత్యాజ్జాయతే వృష్టిః’ అట్టి సూర్యుడి ద్వారా వర్షము సంభవించు చున్నది. ‘వృష్టేరన్నం తతః ప్రజాః’ అట్టి వృష్టి అనగా వర్షము వలన అన్నం లభించు చున్నది. మరియు ఇట్టి అన్నము వలన జీవరాశి జనియించు చున్నది. అని ‘మను స్మృతి (3.76)’ సూచించు చున్నది.


‘ఉభయవచనాద్ ఆదిత్యాత్ సముద్రాచ్చావిరోధః’ పై రెండు విధములైన వచనములు అనగా సూర్యుని వలన మరియు సముద్రము వలన వర్షము సంభవించు చున్నదని అనడంలో పరస్పర విరోధము గాని, భేదము గాని ఏమియూ కనబడుట లేదు. ‘అతశ్చ యజ్ఞాత్ పర్జన్యోద్భవః సమ్భవతి’  కావున యజ్ఞము ద్వారా వర్షము సంభవించు చున్నది. ‘యజ్ఞో దేవతాముద్దిశ్య ద్రవ్యపరిత్యాగః, కర్మ ఇతరక్రియా’ దేవతలను ఉద్దేశించి యజ్ఞ ద్రవ్యాన్ని పరిత్యాగం చేయడమే యజ్ఞము. అనగా యజ్ఞము నందలి పలు విధములైన ద్రవ్యములను దేవతలు అర్పించుకోనుట. ఈ విధంగా చేయు ద్రవ్య పరిత్యాగము వలన కర్మ శృంఖలాల నుండి విముక్తులమగు చున్నాము. అనగా కర్మాచరణ ద్వారా పొందిన ద్రవ్యాన్ని యజ్ఞము నందు పరిత్యాగము చేయుట వలన కర్మ ఫలాల నుండి విముక్తులము అగు చున్నాము. అనగా ఈ విధమైన ఉద్దేశ్యంతో ఆచరించు కర్మలు మనను బంధించ జాలవు.


భాష్యం టీకా:

‘ఆదిత్యుడికి అగ్నికి భేదము లేదు’ సూర్య భగవానుడి అధిదేవత ‘అగ్ని’దేవుడు. యజ్ఞ ద్రవ్యాన్ని అగ్ని గ్రహించడం అన్నా, సూర్య భగవానుడు గ్రహించడం అన్నా అర్థం ఒకటే అనే విషయం మనకు చాలా స్పష్టంగా విదితమగు చున్నది. అందుకే కల్పాలయందు వరుణ దేవుడి అనుగ్రహాన్ని పొందుటకు ‘అరుణ యాగాలను’ సూచించారు. మేఘాలు ఉత్పన్నం కావడానికి ప్రధాన కారణం శ్రీ సూర్య భగవానుడు. హోమ ద్రవ్యాలను అగ్నిదేవుడికి సమర్పించు కోవడం వలన, అట్టి ద్రవ్యాలు శ్రీ సూర్య భగవానుడిని చేరి మనకు మేఘము ద్వారా వర్షము ప్రసాదిస్తుంది. ‘యజ్ఞము ద్వారా ప్రకృతిని కాపాడుకొనుట’ అనునది ఇందులో గల ప్రధాన అంశం. ఒకవైపు ప్రకృతిని ధ్వంసం చేస్తూ, అనగా అడవులు నరుకుతూ, చెరువు లందు ఇళ్ళు కడుతూ, పర్వతాలను త్రవ్వి వాటి గుండా మార్గాలను నిర్మాణం చేస్తూ, అతి భయంకరం మైన పారిశ్రామిక వ్యర్థాలు మరియు వాహనాల ద్వారా విడుదల అవుతున్న కాలుష్యాల వలన ప్రకృతి నాశనం అగు చున్నది. ఇట్టి ప్రకృతిని కాపాడాలంటే యజ్ఞాన్ని ఆచరించాలి. అనగా ముందుగా ప్రకృతిని కాపాడాలి. అదే ఒక మహా యజ్ఞము. ఒకవైపు ప్రకృతిని ధ్వంసం చేస్తూ మరొక వైపు ఎన్ని యజ్ఞాలు ఆచరించినా కూడా ప్రయోజనం లేదు. నీటి ప్రాజెక్ట్ ల నిర్మాణం వలన ప్రయోజనం తప్పక ఉంటుంది. కాని వాటి చుట్టుపక్కల గల అడవులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంటుంది. అప్పుడే ప్రకృతిలో సమతుల్యత నశించక చక్కగా వర్షాలు కురిసి, పుష్కలంగా పంటలు పండుతాయి. యజ్ఞ ద్రవ్యాన్ని సమకూర్చుకోనుటకు ఆచరించు కర్మల ద్వారా జనించిన ఫలాన్ని,అట్టి ద్రవ్యమును యజ్ఞానికి అర్పించుకోనుట ద్వారా కర్మ ఫల విముక్తులమగు చున్నాము. అనగా కర్మల ద్వారా ఉత్పన్నమైన ఫలాన్ని ఈశ్వరార్పణం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ విధంగా ఈశ్వరార్పణం చేయడం ద్వారా కర్మ ఫలాలు మనను బంధింప జాలవు.


టీకా (సామాజిక వ్యాఖ్య):


‘అన్నాద్భవన్తి భూతాని’ అన్నం ద్వారా జీవోత్పత్తి, ‘యజ్ఞః కర్మసముద్భవః’ అట్టి జీవుడు కర్మలను ఆచరించి అన్నాన్ని ఉత్పన్నం చేయుట, అట్టి అన్నాన్ని యజ్ఞము నందు అగ్ని కి సమర్పించడం. అనగా యజ్ఞము కర్మ ద్వారా మాత్రమే సంభవమగుట. ‘యజ్ఞాద్భవతి పర్జన్యో’ అట్టి యజ్ఞము ద్వారా మేఘాల ఉత్పత్తి, మేఘాలు వర్షములై కురియుట. ‘పర్జన్యా దన్నసంభవః’ అట్టి వర్షము ద్వారా పునః అన్నం లభించుట. పునః అట్టి అన్నం ద్వారా జీవోత్పత్తి. ఇదే ‘యజ్ఞ చక్రం’. కర్మ ద్వారా ఉత్పన్నమైన ఫలాన్ని యజ్ఞానికి సమర్పించుకొనుట అనగా ‘కర్మ ఫల పరిత్యాగం’. అట్టి యజ్ఞము దేన్ని గ్రహిస్తుందో పునః దాన్నే మనకు ప్రసాదిస్తుంది. ఆ విధంగా పొందిన దాన్ని గ్రహించి కర్మను ఆచరించి, అన్నం ఉత్పత్తి చేసి దాన్ని పునః యజ్ఞార్పణం చేయాలి. అప్పుడే మనకు కావలసిన ప్రతిస్పందనలు యజ్ఞము ద్వారా లభిస్తూ ఉంటాయి. ఇదే ‘వేదోపదేశం’కూడాను. ఈ విధమైన యజ్ఞ సూత్రాన్ని ప్రకృతికి కూడా అన్వయించుకోవాలి. అప్పుడే ప్రకృతిలో కూడా సమతుల్యం ఉంటుంది. వర్షాలు చక్కగా కురుస్తాయి. పంటలు చక్కగా పండుతాయి. దేశం సస్యశ్యామలమై ఉంటుంది. మన శృతులు, స్మృతులు సూచించిన విధంగా కర్మలను ఆచరించుట, తద్వారా జనియించిన ఫలాన్ని ఈశ్వరార్పణం చేయుట ద్వారా కర్మ బంధముల నుండి విముక్తులము అగుట మరియు మోక్షానికి చేరువగుట అనునవి ఈ యజ్ఞ చక్రము ద్వారా సంభవమగు చున్నది. కనక మన శృతులు, స్మృతులు సూచించిన కర్మలను ఆచరించుట వలన మోక్షము సుగమమగు చున్నది. అనగా ’కర్మ ద్వారా మోక్షమును పొంద వచ్చును’. ఇదే శ్రీ కృష్ణ భగవానుడు ఈ శ్లోకము ద్వారా మనకు చేసిన ఉపదేశము.

యజ్ఞము నందు కర్త యొక్క సంక్షేమము మాత్రమే ప్రధానం కాదు, సమస్త జీవరాశి యొక్క సంక్షేమం కలుగుతుంది. ఇది చాలా ప్రధానమైనది. స్వలాభము గూర్చి ఆచరించు యజ్ఞాలు మనను కర్మ బంధముల నుండి విముక్తులను చేయజాలవు, అంతేకాదు కర్మ లందు మనము ఇంకనూ బంధింపబడు అవకాశము ఉంటుంది. సమస్త జీవరాశి శ్రేయస్సు జరిగిన నాడు మన శ్రేయస్సు కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలం చాలా రకాలైన సామాజిక మాధ్యమాలయందు మనకు కనిపిస్తుంది ‘అందరూ బాగుండాలి – అందులో నేనుండాలి’ అని. ‘అందరూ బాగుండాలి’ అనునది లోక కళ్యాణము, కాని ‘అందులో నేనుండాలి’ అనునది స్వార్థ ప్రవృత్తిని సూచిస్తుంది. అందరూ బాగుండి అందులో మనం లేకపోతే, అందరూ బాగుండాల్సిన అవసరం లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. మనం బాగుండడం అనేది మన చేతిలో ఉంది. అందరూ బాగుండడానికి మన చేసే కృషిలో మనం తప్పక బాగుంటాము. ఎందుకంటే లోక కల్యాణము భగవత్కార్యము. ఇట్టి కార్య సాధనకు కృషి చేయు వారిని భగవానుడు తప్పక కాపాడుతాడు. దానికి మనం ప్రత్యేకంగా ఈ విధంగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మన కర్మలే మనను కష్టపెడతాయి, మన కర్మలే మనకు సుఖాలను ప్రసాదిస్తాయి. ఇదే సత్యం. ఇందులో సందేహమే లేదు. ఇదే ‘యజ్ఞము’ మరియు ‘యజ్ఞ చక్రము’.


‘అన్నం న పరిచక్షీత । తద్వ్రతమ్ । ఆపో వా అన్నమ్ । జ్యోతిరన్నాదమ్ । అప్సు జ్యోతిః ప్రతిష్ఠితమ్ । జ్యోతిష్యాపః ప్రతిష్ఠితాః । తదేతదన్నమన్నే ప్రతిష్ఠితమ్ । స య ఏతదన్నమన్నే ప్రతిష్ఠితమ్ వేద ప్రతితిష్ఠతి । అన్నవానన్నాదో భవతి । మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన । మహాన్ కీర్త్యా ।।’ (తైత్తిరీయ ఉపనిషత్: భృగువల్లీ – ౮)


‘అన్నం’ అనగా ఆహరం, ఇట్టి ఆహారాన్ని ఉపేక్షించ రాదు. ఇది మీ కర్తవ్యమ్. జలమే (నీరే) ఆహరం. ఆహారాన్ని భక్షించేది అగ్ని. అగ్ని నీటిలో నెలకొని ఉన్నది. నీరు అగ్నిలో నెలకొని ఉన్నది. కనుక అన్నంలో అన్నం నెలకొని ఉన్నది. ఎవరు దీనిని తెలుసుకొంటాడో అతడు ఈ సత్యంలో సుప్రతిష్ఠితుడై ఉంటాడు. అతడు ఆహార సమృద్ధి గల వాడు అవుతాడు. ఆహారాన్ని భుజించి ఆనందిస్తాడు. సంతాన భాగ్యమూ, గోసంపత్తి గల వాడు అవుతాడు. బ్రహతేజస్సును పొందగలడు. కీర్తిని సంతరించుకున్న వాడు అవుతాడు.


ఇట్టి మన్త్రం ద్వారా అగ్ని నుండి నీరు ఉద్భవించినట్లు తెలియు చున్నది. కనుక అగ్నిలో నీటి అంశము మరియు నీటి లో అగ్ని అంశము ఉంటాయి. నీరు మరియు అగ్ని పరస్పర ఆధారితాలుగా ఈ మన్త్రము సూచించు చున్నది. అగ్ని ఆహారాన్ని గ్రహిస్తుంది. అనగా యజ్ఞము నందు మనం అర్పించిన హవిస్సులు (ఆహారము) అగ్నిద్వారా గ్రహించ బడతాయి. మనము సమర్పించిన ఆహారాన్ని అగ్ని భుజిస్తుంది. అనగా అగ్నిలో దాగి ఉన్న నీరు కూడా ఇట్టి ఆహారాన్ని భుజిస్తుంది. మన జీర్ణ కోశంలో ‘జఠరాగ్ని’ ఉంటుంది. ఇట్టి జఠరాగ్ని మనం భుజించిన అన్నాన్ని భక్షించి మనలో ప్రాణ శక్తిని నిలబెడుతుంది. కావున అగ్ని ఆహారాన్ని భుజిస్తుంది. అగ్ని ఆహారాన్ని భుజించడం వలన ప్రాణశక్తి నిలకడగా ఉంటుంది. అందుకే ఆహారాన్ని ఉపేక్షించ రాదు. ఆహారము రుచిగా లేదని దాన్ని తిరస్కరించ రాదు. ఈ విధంగా యజ్ఞము ద్వారా అగ్నికి సమర్పించిన ఆహారమును, అగ్నిలో దాగి ఉన్న జలము గ్రహించుట వలన అట్టి జలములు వర్షము రూపంలో కురుస్తాయి. అట్టి వర్షము వలన మనకు పునః ఆహారము లభిస్తుంది. ఇదే అగ్ని చక్రము లేదా యజ్ఞ చక్రము. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు చిరకాలం చక్కని ఆహారాన్ని భుజిస్తూ అన్ని విధాలైన సుఖ సంతోషాలతో ఉంటాడు. అందుకే ‘అన్నం బహు కుర్వీత (తైత్తిరీయ ఉపనిషత్: భృగువల్లీ – ౯)’ అని శృతి ప్రమాణం. ఆహారాన్ని విస్తారంగా ఉత్పన్నం చేయాలి. అనగా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కాని ఈనాడు మన దేశంలో వ్యవసాయానికి అతి తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల ఆహారాన్ని మనకు ప్రసాదించే వ్యవసాయమే ఈనాడు చిన్నచూపుకు గురియగు చున్నది. ఆహారాన్ని పండించే రైతును ఆదుకునేవాడు లేడు. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఆహారాన్ని విస్తారంగా పండించి, యజ్ఞమును ఆచరించి అట్టి యజ్ఞము ద్వారా ఆహారాన్ని అగ్నికి సమర్పించుకొనుట ద్వారా అది మేఘములు గా మారి వర్షించు చున్నది. అట్టి వర్షము ద్వారా పునః ఆహరం లభిస్తుంది, సమస్త జీవరాశి యొక్క శ్రేయస్సు జరుగుతుంది. కావున వ్యవసాయాన్ని ఏనాడు అశ్రద్ధ చేయరాదు. అదే విధంగా మన జీర్ణకోశంలో గల జఠరాగ్నికి సమయానుసారముగా ఆహారాన్ని అందిస్తూ ఉండాలి. జీర్ణకోశంలో గల ఈ అగ్నికి ఆహారాన్ని గ్రహించి మన శరీరంలోని ప్రాణ శక్తిని నిలబడే విధంగా చేస్తుంది. ఇదే విజ్ఞాన శాస్త్రం. కావున యజ్ఞాన్ని ఆచరించడానికి గాను కర్మాచరణ తప్పనిసరి. కర్మాచరణ ద్వారా ఆహరం లభిస్తుంది,అట్టి ఆహారాన్ని అగ్నికి ఆహుతి చేయడం ద్వారా ‘పర్జన్యో వర్షుకో భవతి’ వర్షం కురుస్తుంది. అట్టి వర్షం మనకు ఆహారాన్ని ప్రసాదిస్తుంది. ఇట్టి యజ్ఞ చక్రాన్ని నిలబెట్టుటకు కర్మాచరణ తప్పనిసరి అనే విషయం మనకు స్పష్టమగు చున్నది. అనగా కర్మను ఆచరించనిదే మనం జీవించి ఉండడం కూడా అసంభవమే. జీవించి ఉన్ననాడే కదా జ్ఞాననిష్ఠ!


సమస్త సృష్టి అంతటికీ ఆధారభూతమైన ఆహారమే పరబ్రహ్మము.

‘అన్నం ప్రాణం చక్షుశ్శ్రోత్రం మనో వాచమితి’ (తైత్తిరీయ ఉపనిషత్: భృగువల్లీ – ౧.౧)

అనగా ‘ఆహారము,ప్రాణము, చక్షువులు, చెవులు, మనస్సు మరియు వాక్కు’ ఇవే భగవంతుడు. అంతేకాదు:


‘యతో వా ఇమాని భూతాని జాయన్తే । యేన జాతాని జీవన్తి । యత్ప్రయన్త్యభిసంవిశన్తి । తద్విజిజ్ఞాసస్వా । తద్బ్రహ్మేతి ।‘

ఎవరి నుండి సమస్త జీవజాలం పుట్టుచున్నదో, పుట్టినవి ఎవరి వలన జీవించి ఉంటున్నాయో,మరణానంతరం ఎవరిలో లయం చెందు తున్నాయో ఆయనే భగవంతుడు. ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నించు.


ఆహారమే భగవంతుడు. భగవంతుడి ద్వారా సర్వ ప్రాణికోటి ఉద్భవించి పునః ఆయనలోనే విలీనం అగుచున్నది. అన్నమే భగవంతుడు అయినపుడు, అన్నము ద్వారా సర్వ ప్రాణికోటి ఉద్భవించి పునః అన్నములోనే కలిసిపోవు చున్నది. ఇదే సిద్ధాంతాన్ని క్రింద వివరించబడిన శృతి ప్రమాణం నిరూపించు చున్నది:


‘అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ । అన్నాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయన్తే । అన్నేన జాతాని జీవన్తి । అన్నం ప్రయన్త్యభిసంవిశన్తీతి ।‘ 

ఆహారమే పరబ్రహ్మము. ఎందుకంటే ఆహరం నుండే సమస్త జీవజాలం ఉద్భవిస్తున్నది; ఉద్భవించినవి ఆహరం వలననే జీవించి ఉంటున్నాయి; మరణానంతరం ఆహారంలోనే లీనం అవుతున్నాయి.


ఇట్టి శృతి ప్రమాణాల ద్వారా ‘అన్నం, అగ్ని, జలము, కర్మ’ అనునవి ఒకదానికి మరొకటి ముడిపడి ఉన్నాయనే విషయము మనము స్పష్టమగు చున్నది. ఆహారమే భగవంతుడు; సమస్త జీవరాశి భగవంతుడి ద్వారా ఉత్పన్నమగు చున్నది. అనగా ఆహారము ద్వారా సమస్త జీవరాశి ఉత్పన్నమగు చున్నది. పునః భగవంతుడిలో లీనమగు చున్నది. అన్నగా పరబ్రహ్మ స్వరూపమైన అన్నం లో లీనమగు చున్నది. అపర కర్మలందు ‘పిండ ప్రధానం’ వెనుక దాగి ఉన్న సూక్ష్మం ఇదే. ఇదే సృష్టి యొక్క పరిణామ క్రమమును సూచించు చున్నది. ఇట్టి పరిణామము ఒక క్రమ పద్ధతిలో జరగాలంటే కర్మాచరణ తప్పనిసరి అని మనకు స్పష్టమగు చున్నది. కర్మాచరణ ద్వారా మాత్రమే సృష్టి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. పరిణామ క్రమం ఒక పధ్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది.


జలము ద్వారా ఆహారము లభించు చున్నది. కావున జలములను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ఈ సూత్రం ఆధారంగానే నేడు భారీ ఎత్తున ‘డ్యాం - జలాశయ’ నిర్మాణం జరుగుతున్నది. వర్షము వలన నదులు పుష్కలంగా జలాలతో నిండి ఉంటాయి. ఇట్టి జలాన్ని ఒక పధ్ధతి ప్రకారం నిలువ చేసి అవసరానికి తగిన విధంగా ఆహారోత్పత్తికి వాడుకొనుటకు గాను ఏర్పాటు చేసినవే ఈ ‘డ్యాం’ లు లేదా ‘జలాశయాలు’. మేఘాల నుండి కురిసిన నీటిని కాపాడి అట్టి నీటిని వ్యవసాయానికి ఉపయోగించు పధ్ధతి ఇది. అదే విధంగా ఇట్టి జలాలు భూగర్భం లో నిలిచి ఉంటేనే మనకు త్రాగు నీరు లభిస్తుంది. కావున వర్షము ద్వారా లభించిన నీటిని భూమిలో ఇణికే విధంగా చేయాలి. లేని ఎడల భూగర్భంలో నీటి నిలువలు తగ్గి త్రాగు నీరు లభించదు, బావులు చెరువులు ఎండిపోతాయి. దాని ప్రభావం వ్యవసాయం పైన కూడా పడుతుంది. తత్ప్రభావము వలన మనకు ఆహరం తగినంతగా లభించదు. కావున ప్రతి నీటి చుక్కను కాపాడుకోవాలి. ఆ విధంగా కాపాడుకోలేని నాడు కరువు నెలకుంటుంది. జీవ రాశి ఆకలితో నశిస్తుంది.


‘అన్నం బహు కుర్వీత । తద్వ్రతమ్ ।’

ఆహారాన్ని విస్తారంగా ఉత్పన్నం చేయాలి. అది నీ కర్తవ్యం.


సమస్త జీవరాశి ఉత్పత్తి, స్థితి, లయలకు ప్రధాన కారణమైన ‘అన్నమును’ పుష్కలంగా పండించాలి. ఆ విధంగా పండించాలంటే తగిన విధంగా కర్మాచరణ చేయవలసి ఉంటుంది. కర్మను ఆచరించని వాడికి ఆహరం పొందే అర్హత కూడా లేదు. అన్నం పుష్కలంగా పండిన నాడు జీవి శరీర యాత్రకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. శరీరయాత్ర జరగని నాడు జ్ఞాననిష్ఠ కూడా సాధ్యపడదు.   

  

||సర్వం శ్రీ కృష్ణ దివ్య చరణారవిందార్పణమస్తు ||


నమిలికొండ విశ్వేశ్వర శర్మ 

image76

Srimad Bhagavad Gita

II Chapter - Sankhya Yoga

శ్లో:

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్ప్రుహః |

వీతరాగభయక్రోధః స్థితదీర్మునిరుచ్యతే ||56||                          -103-

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः |

वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ||५६||

దుఃఖేషు = దుఃఖము లందు; అనుద్విగ్నమనాః = ఆందోళన, ఉద్వేగము మరియు వ్యాకులత చెందని మనస్సు గల వారు; సుఖేషు = సుఖము లందు; విగతస్ప్రుహః = ఆసక్తి లేని వాడును; వీతరాగభయక్రోధః = అనురాగము, భయము మరియు క్రోధము తొలగిన వాడును; మునిః = మనన శీలుడు; స్థితధీః = స్థితప్రజ్ఞుడని; ఉచ్యతే = చెప్పబడు చున్నాడు.


దుఃఖము లందు కలతచెందని వాడు, ఉద్వేగము వ్యాకులత చెందని వాడు, సుఖము లందు నిస్పృహ గల వాడు (ఆసక్తి లేని వాడు) అనురాగము, భయము, కోపము తొలగిన వాడు ముని – స్థితప్రజ్ఞుడు అని చెప్పబడుదురు.


భాష్యం:

56.1 దుఃఖేషు ఇతి || దుఃఖేషు ఆధ్యాత్మికాదిషు (ప్రాప్తేషు) అనుద్విగ్నం న ప్రక్షుభితం దుఃఖప్రాప్తౌ మనః యస్య సోఽయం అనుద్విగ్నమనాః | తథా సుఖేషు ప్రాప్తేషు విగతా స్పృహా తృష్ణా యస్య, న అగ్నిః, ఇవ ఇన్ధనాధ్యాధానే, సుఖాని అనువివర్ధతే స విగతస్ప్రుహః | వీతరాగభయక్రోధః రాగశ్చ భయం చ క్రోధశ్చ వీతాః విగతాః యస్మాత్ సః వీతరాగభయక్రోధః స్థితధీః స్థితప్రజ్ఞః మునిః సంన్యాసీ తదా ఉచ్యతే ||

కిజ్ఞ్చ....


ఆధ్యాత్మికాది సుఖదుఃఖముల వలన చలించని వారు; అనగా వారి మనస్సు అధ్యాత్మికాది దుఃఖములు మరియు సుఖములు సంభవించినచో చలించదు (అధ్యాత్మికాది దుఃఖములు మరియు సుఖములు: 1 ఆధ్యాత్మిక, 2 ఆదిభౌతిక మరియు 3 ఆది దైవిక మనే మూడు విధాలైన దుఃఖాలు మరియు సుఖాలు. ఆధ్యాత్మిక – అనగా శరీరము నుండి ఉద్భవించినది, లేదా శరీరము ద్వారా ఉద్భవించినది. ఉదాహరణకు – జ్వరము, తల నొప్పి ఇత్యాదివి బాధలు లేదా దుఃఖమును కలిగించునవి. శరీరానికి సుఖాన్నిచ్చేవి, ఆనందాన్ని ఇచ్చేవి ఆధ్యాత్మిక సుఖాలు. మనము చాలా వరకు ఇట్టి వాటికి అధికముగా ప్రేరేపింప బడతాము. ప్రతివాడు శరీరానికి కష్టం రాకూడదు అని అనుకుంటాడు. దాని కష్టం వస్తే సహించ లేడు. తన శరీరం సదా సుఖపడుతూనే ఉండాలి అని ఆశించు వాడు అగును. శరీరానికి కష్టం కలిగిన నాడు దుఃఖిస్తాడు, దానికి సుఖం కలిగిన నాడు ఆనందిస్తాడు. కష్టం ఎప్పుడూ రావద్దని కోరుకుంటాడు, సుఖం శాశ్వతంగా ఉండాలని ఆశిస్తాడు. కాని శ్రీ కృష్ణ భగవానుని ప్రకారం ఇట్టి ద్వన్ద్వాలు ఒకదాని పిమ్మట మరియొకటి రావడం చాలా సహజం. ఈ రెండు స్థితులందు సమదృష్టి కలవాడు మరియు ఈ రెండు విధములైన స్థితులందు చలించని వాడు స్థితప్రజ్ఞుడు. ఇక రెండవ స్థితి - ఆది భౌతిక – భౌతికమైన వాటి ద్వారా కలిగిన దుఃఖము లేదా బాధ. ఉదాహరణకు – పులి, పాము, ఇతర క్రూర మృగాలు, క్రూరమైన మనుషులు ఇత్యాదివి మనకు దుఃఖాన్ని మరియు కష్టాన్ని కలుగ చేస్తాయి. మనకు ఇష్టమైన అందమైన జీవి, అందమైన మనిషి, నచ్చిన వాడు, నచ్చిన వస్తువు, నచ్చిన వాసన ఇత్యాదివి మనకు ఆనందాన్ని ఇస్తాయి. మన మనస్సు సదా తనకు ఆనందాన్ని ఇచ్చే వాటిని మాత్రమే ఆశిస్తుంది. శరీరము ద్వారా అది అనుభూతులను అనుభవిస్తూ ఉంటుంది. అయితే ఈ రెండు స్థితులు కూడా అశాశ్వతమైనవి. ఈ రెండు విధములైన స్థితులందు కూడా సమదృష్టి గల వాడే స్థితప్రజ్ఞుడు. అనగా తనకు నచ్చిన మరియు నచ్చని అనునది వారికి ఏదీ ఉండదు. అసలు ఈ విధమైన ప్రాపంచిక విషయాలు ఆయనను కదిలించ జాలవు. అట్టి వాడే స్థితప్రజ్ఞుడు. మూడవది - ఆది దైవిక – భగవానుని చర్యల వలన లేదా మన భాగ్యము అదృష్ట దురదృష్టముల వలన కలిగిన సుఖాలు, దుఃఖాలు లేదా బాధలు. ఉదాహరణకు – తుఫాను, భారీగా ఎడతెరిపి లేని వర్షాలు, విపరీతమైన చలి, విపరీతమైన ఎండ మరియు ఇతర ప్రకృతి వైపరిత్యాలు, దురదృష్టము వలన జీవిత కాలమున మనం ఎదుర్కోను సమస్యల వలన కలుగు దుఃఖము ఇత్యాదివి మనకు దుఃఖాన్ని ఇస్తాయి. ప్రకృతి సదా భగవానుని నియంత్రణలో ఉంటుంది. ప్రకృతి లో జరిగేవి మన చేతిలో ఉండవు. అందుకే ప్రకృతిని అనవసరంగా భిన్నం చేయరాదు. అనగా ప్రకృతి విరుద్ధమైన పనులు చేయరాదు. ఒకవేళ చేసిన ఎడల దాని పర్యవసానాన్ని భరించ వలసి ఉంటుంది. అంతే కాదు ప్రకృతి సిద్ధమైన వాటిని భరించ గలిగిన నాడు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఎండ పెరిగినా కష్టమే, చలి పెరిగినా కష్టమే, అధిక వర్షం కురిసినా కష్టమే. అంటే అంతా మనకు సంతృప్తినిచ్చే విధంగా జరిగి పోతుండాలి. అలా జరిగితే ఆనందం లేని ఎడల దుఃఖము.  చక్కని వర్షము, చల్లని వాతావరణము, చక్కగా పొడచిన ఇంద్ర ధనుస్సు, జీవిత కాలంలో మనం అనుభవించే విజయాలు ఇత్యాదివి మనకు సదా ఆనందాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఆనందం సదా ఉండిపోవాలని ప్రతివారు కోరుకుంటారు. ప్రకృతి సిద్ధమైన ఇట్టి ద్వంద్వాలను సంపూర్ణ సమత్వ దృష్టితో చూస్తాడు స్థితప్రజ్ఞుడు. ఈ విధంగా అన్ని విధాలైన ద్వంద్వ పరిస్థితులందు సమదృష్టి ని కలిగి ఉన్న వాడే స్థితప్రజ్ఞుడు). శారీరిక కష్టాలు మరియు శారీరిక సుఖాలు కలిగినపుడు వారి మనస్సు చలించదు. సుఖాలు కలిగి నపుడు ఆనందపడి పోడు, పొంగిపోడు కూడాను. ‘న అగ్నిః, ఇవ ఇన్ధనాధ్యాధానే, సుఖాని అనువివర్ధతే స విగతస్ప్రుహః’ అగ్నిపై ఆజ్యము పోసినపుడు అగ్ని ఎగిసి పడుతుంది కానీ స్థితప్రజ్ఞుడు మాత్రము సుఖము దుఃఖము కలిగిన నాడు ఏనాడు చలించడు. ‘రాగశ్చ భయం చ క్రోధశ్చ వీతాః విగతాః’ - భౌతికమైన వాటిని, వస్తు వ్యామోహాన్ని త్యజించిన వాడు, వారిలో భయం అనేదే ఉండదు. వస్తు వ్యామోహం నశించిన వాడికి క్రోధం అనేదే ఉండదు. ఎందుకంటే తను కోరుకున్నది దొరకని నాడు కోపము అసహనము పెరుగుతుంది. కాని కోరికలు అనేవే లేనపుడు తనకు లభించిన వస్తువును చూసి గాని లేదా తానూ పోగొట్టుకున్న వస్తువును చూసి గాని చలించరు. అట్టి వారు ‘స్థితధీః స్థితప్రజ్ఞః మునిః సంన్యాసీ తదా ఉచ్యతే’ – ముని స్వభావము గల వారు, అన్నిటినీ త్యజించిన వారు, జ్ఞానము ద్వారా కర్మలను దగ్ధం చేసిన వారు, స్థిరమైన ప్రజ్ఞ గల వారు అగుదురు. వీరినే స్థితప్రజ్ఞుడు అని అంటారు.

అంతే కాదు......


శ్రీ రామానుజ భాష్యం:


ప్రియవిశ్లేషాది దుఃఖనిమిత్తేషు ఉపస్థితేషు అనుద్విగ్నమనాః న దుఃఖీ భవతి, సుఖేషు విగతస్ప్రుహః ప్రియేషు సన్నిహితేషు అపి నిఃస్ప్రుహః వీతరాగభయక్రోధః అనాగతేషు స్పృహా రాగస్తద్రహితః ; ప్రియవిశ్లేషాప్రియాగమనహేతుదర్శననిమిత్తం దుఃఖం భయమ్, తద్రహితః; ప్రియవిశ్లేషాప్రియాగమనహేతుభూతచేతనానన్తరగతో దుఃఖహేతుః స్వమనోవికారః క్రోధః, తద్రహితః, ఏవంభూతో మునిః ఆత్మమననశీలః స్థితధీః ఇతి ఉచ్యతే ||౫౬||


‘ప్రియవిశ్లేషాది దుఃఖనిమిత్తేషు’ అనగా ప్రియమైన వారు దూరమగుట వలన ఏర్పడిన దుఃఖము వలన చలించని వాడు మరియు శోకించని వాడు; ‘ప్రియేషు సన్నిహితేషు అపి నిఃస్ప్రుహః’ తనకు కావలసిన మరియు ఇష్టమైనవి అన్నీ కూడా తన చుట్టూ ఉన్నా వాటిని అనుభవించుటకు శ్రద్ధ చూపని వాడు; ‘వీతరాగభయక్రోధః అనాగతేషు స్పృహా రాగస్తద్రహితః’ – రాగము భయము మరియు కోపము లేని వాడు; రాగము లేదా కోరిక – తన వద్ద లేని వస్తువును, తను ఇంతవరకు పొందని దానిని సమకూర్చుకోనుట యందు శ్రద్ధ లేని వాడు; ‘ప్రియవిశ్లేషాప్రియాగమనహేతుదర్శననిమిత్తం దుఃఖం భయమ్, తద్రహితః’ – తనకు ప్రియమైన వారినుండి దూరం చేసే పరిస్థితులను చూసి భయం, దేనినైతే చూడకూడదని అనుకుంటాడో అట్టి వాటిని చూడడం వలన, ఎవరినైతే కలవకూడదని అనుకుంటాడో వారు కనబడినచో కలిగే భయం – మొదలగునవి లేని వాడు; ఏదేని ఒకటి, ఒక సున్నితమైన ఆలోచన లేదా జీవి తనను తన సన్నిహితుల మరియు ప్రియమైన వారిని నుండి గాని దూరం చేసినా! లేదా, ప్రియమైన వాటి నుండి గాని దూరం చేయుచున్నదనే భావన మనస్సులో వచ్చిన నాడు, మనస్సు అలజడికి గురి అవుతుంది. అట్టి సున్నితమైన వస్తువు, జీవి, ఆలోచన ఇత్యాది వాటి పట్ల మనకు కోపము అధికమౌతుంది, కాని యోగి అయిన స్థితప్రజ్ఞుడి కి ఈ భావన ఉండదు. ఎందుకంటే వారికి ఏ ఒక్క దానిపైన వ్యామోహం ఉండదు. ఏదేని ఒక ఆలోచన మనకు కావలసిన వారితో మనకు విభేదాలను కలిగిస్తున్న తరుణంలో కూడా మన మనస్సు చాలా అలజడికి లోనై అది కోపంగా మారుతుంది. స్థితప్రజ్ఞుడి లో ఈ విధమైన భావన ఉండదు. ఎందుకంటే వారి మనస్సు వారి నియంత్రణ లో ఉంటుంది. వారు రాగ ద్వేషాలకు అతీతులై ఉంటారు. ఈ విధమైన ఒక ముని, ఆత్మను అనుష్టించు వాడు, స్థిర చిత్తమును మరియు ప్రజ్ఞను కలిగి ఉంటాడు.


(శ్రీ రామానుజ భాష్యం ప్రధానంగా వ్యక్తి పట్ల గాని వస్తువు పట్ల గాని మనకు గల వ్యామోహం మనను పలు విధములైన మానసిక అలజడులకు గురిచేస్తుందని స్పష్టీకరించారు. వస్తు వ్యామోహము, వ్యక్తి వ్యామోహము ఇత్యాది వాటి వలన సిద్ధ్యసిద్ధ్యః – అది లభిస్తుంది లేదా లభించడం లేదు, అది నా వద్ద నుండి వెళ్ళిపోతుంది ఇత్యాది ఆలోచనలు మనను మానసికంగా పలు విధాలైన ఒత్తిడులకు గురిచేసి వాటి తద్వారా మనం సహనాన్ని కోల్పోయి అది కోపానికి దారి తీస్తుంది. దీని గూర్చి భగవానుడు రాబోవు శ్లోకాలందు చక్కగా వివరించి ఉన్నాడు. స్థితప్రజ్ఞుడి వలే మారుటకు గాను ముందుగా వస్తు వ్యామోహము, వ్యక్తి వ్యామోహం పోవాలి. అప్పుడే మన మనస్సు ప్రశాంతంగా ఉండి భగవానుని అనుష్టించ గలము. పరమాత్మ స్వరూపమైన ఆత్మను అనుష్టించ గలము)


తతః అర్వాచీనదశా ప్రోచ్యతే....

తరువాత రాబోయే దశ గూర్చి క్రింద వివరించ బడినది.


శ్రీ మధ్వాచార్య భాష్యం:


తదేవ స్పష్టయతి ఉత్తరైస్త్రిభిః శ్లోకైః | ఏతాన్యేవ జ్ఞానోపాయాని తచ్చోక్తమ్ –

‘తద్వై జిజ్ఞాసుభిః సాధ్యం జ్ఞానినాం యత్తు లక్షణమ్ |’ ఇతి |

శోభనాధ్యాసో రాగః |

‘రసో రాగస్తథా రక్తిః శోభనాధ్యాస ఉచ్యతే |’....ఇత్యాభిదానమ్ (ఇత్యభిదానే)


రాబోవు 3 శ్లోకాలలో దీని వివరణ చాలా స్పష్టంగా ఇవ్వబడినది. ఇట్టి సూచనలు జ్ఞానులకు కూడా వర్తిస్తాయి. సాధకులకు సూచించ బడినది జ్ఞానులుగా ప్రసిద్ధి చెందినా వారికి కూడా సూచించ బడినది. ‘రసో రాగస్తథా రక్తిః శోభనాధ్యాస ఉచ్యతే’ రస – రాగ – రక్తి అనునవి చాలా ప్రధాన పాత్ర పోషించు చున్నాయి. ఏదేని ఒక దానిపట్ల ఉన్న వ్యామోహం లేదా దాన్ని పొందడం వలన ఆనందం లభిస్తుంది అని అనుకుంటే ఈ మూడు విధాలైన వాటి ప్రమేయం తప్పక ఉంటుంది. ‘రస’ – ఏదేని ఒక వస్తువు లేదా వ్యక్తి ఇత్యాది వాటి పట్ల ఉన్న ఇష్టా అయిష్టాలు; ‘రాగ’ – కోరిక మరియు అనుబంధము; మరియు ‘రక్తి’ – మైమరిపించే అందము మరియు ఆనందము; ఈ మూడు కూడాను అందమైన అనుభూతులు, అశాశ్వతాలు. పరిగణనలోకి తీసుకోవాల్సినవి కావు. (ఇవన్నీ కూడా విషయ, వస్తు మరియు వ్యక్తి వ్యామోహముతో ముడిపడి ఉంటాయి. కావున అశాశ్వతములు. ఈ మూడు విధములైన గుణాలు మానవుడి జీవితాన్ని తప్పక ప్రభావితం చేస్తాయి. అంతే కాదు ఒకదాని నుండి మరియొకటి పుడుతుంది. ప్రప్రథమంగా మనిషిలో ‘రస’ గుణము పుడుతుంది. వ్యక్తి పట్ల గాని వస్తువు పట్ల గాని ఇష్టం అయిష్టం పెరుగుతుంది. ఈ గుణము ‘రాగ’ ము గా మారిపోతుంది. ఇష్టాఽష్టాలు మొదలైన మరుక్షణం అది పొంద వలయునని గాని లేదా దానికి దూరంగా ఉండాలనే భావన మొదలౌతుంది. ఇదే రాగము. ఈ దశ ‘రక్తి’ గా మారుతుంది. వ్యక్తి లేదా వస్తువు పట్ల అంకిత భావం పెరుగుతుంది, దాన్ని పొందిన ఆనందం లభిస్తుంది, దాని పట్ల ఆప్యాయత పెరుగుతుంది, దాని వ్యామోహం లో పడి తను ఏ స్థితిలో ఉన్నాడో మానవుడు గ్రహించ లేడు. తన సహజ స్థితిని కోల్పోతాడు. తనపైన తనకు నియంత్రణ లోపిస్తుంది. ఇట్టి స్థితి దాదాపుగా పశు సమానమైన స్థితి. మనం ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ స్థితిలో మనిషి చాల రకాలైన దుష్కర్మలను, దుర్మార్గాలను తనకు తెలియకుండానే ఆచరిస్తాడు. ఆచరించిన పిమ్మట కూడా వాడికి దాని పరిణామము గూర్చి తెలియవచ్చు లేదా తెలియక పోవచ్చు. పరిణామము నకు చెందిన అవగాహన గల వాడు తనను తానూ మార్చుకోను ప్రయత్నం చేసే అవకాశం ఉంది, కాని దాని అవగాహన అసలేమాత్రం లేనివాడు మాత్రం అధఃపాతాళానికి నెట్టి వేయబడతాడు)


టీకా (సామాజిక వ్యాఖ్య):


స్థితప్రజ్ఞుడు ఒక ముని. ‘ముని’ అనగా ఎవరు? ‘మననశీలో మునిః’ – శ్రద్ధ గల వాడు, ఆలోచనలతో నిండిన వాడు ఒక ముని. ఆలోచనలను మనము ‘విశ్లేషణాత్మక శక్తి’ గా పరిగణించాలి. అనగా స్థితప్రజ్ఞుడు కర్మలను తన ఆలోచన మరియు విశ్లేషణాత్మక శక్తి ద్వారా నిర్వహిస్తాడు. అందుకే ‘స్థితధీః’ - ‘స్థిత’ అనగా స్థిరమైన ధీః అనగా బుద్ధి. స్థిరమైన బుద్ధి గల వాడు. ఇట్టి వారే మునులు. బయట నుండి శాంతంగా కనిపిస్తున్న వారిని మనము ప్రధానంగా ‘ముని’ అని అంటాము. కాని ఇది బాహ్యంగా కనబడేది మాత్రమే. కాని అది మనకు ప్రమాణం కాదు. బాహ్యంగా ఒక వ్యక్తి చాలా ప్రశాంతంగా కనిపించినా వాడి మనస్సు చాలా విధాలైన ఆందోళనలను ఎదుర్కొంటూ ఉంటుంది. అనగా వాడి మనసులో భయంకరమైన తుఫానులు ఉంటాయి. వాడు బయట చూడడానికి ఎంత ప్రశాంతంగా ఒక ముని వలే కనిపించినా కూడా ‘ముని’ లో ఉండవలసిన గుణాలు ఉన్న వాడు కాదు. అందుకే వాడిని ‘ముని’ అని అనకూడదు. మనిషి తన ఆలోచన వలన ‘ముని’ గా గుర్తింప బడాలి. వాడి మనస్సు ఒక ప్రశాంతమైన మరియు సంపూర్ణ విశ్లేషణాత్మక స్థితిలో ఉంటుంది. అట్టి ప్రశాంతత వారి ముఖములో మనకు కనిపిస్తూ ఉంటుంది. వారి మనస్సులో ఉండే ఆలోచనలు మరియు ప్రశాంతత వారి ముఖములో కనిపిస్తూ ఉంటుంది. ‘మనస్సులో ఉండేది ముఖంలో కనిపిస్తూ ఉంటుంది’ – Face is the index of mind అని అన్నారు. ముని యొక్క ముఖాన్ని బట్టి వారి మనస్సు ఎంత ప్రశాంతమైన స్థితిలో ఉందో కనిపెట్టవచ్చు. అదే విధంగా భయంకరమైన మానసిక ఆందోళనలు ఎదుర్కునే వారి ముఖాన్ని బట్టి కూడా వారి మనస్సును చెప్పవచ్చు. కాని ఇట్టి వారు మునులు కారు. స్థిరమైన బుద్దితో, ఏకాగ్రత కలిగి ఉండి ప్రశాంతమైన స్థితిలో ఉన్న వారు మాత్రమే మునులు. ఇట్టి మునులు తమ మనస్సును నిగ్రహించుకోగల శక్తిని కలిగి ఉంటారు. వారిలో సంపూర్ణ విచక్షణా జ్ఞానం ఉంటుంది. వారు ఆలోచించ కుండా ఏ ఒక్క పని కూడా చేయరు. వారు ఆచరించే కర్మ యొక్క ఫలం ఏవిధంగా ఉండబోతోందో గ్రహించి మాత్రమే కర్మలను ఆచరిస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ‘ముని’ గా మారిన నాడు వ్యక్తిగత ప్రగతితో సహా దేశ ప్రగతి కూడా ఉంటుంది. ప్రజలను మోసగించే రాజకీయాలు, రాజకీయ పార్టీలు మరియు తత్సంబంధిత వ్యక్తులు, లేదా ఏదేని ఒక మోసపూరితమైన చర్య వలన నష్టం జరగకుండా ప్రజలు ప్రతిరక్షక శక్తిని (Immunity) పొందుతారు. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి. మోసాలు ఉండవు. భ్రష్టాచారము ఉండదు. దౌర్జన్యాలు అసలు ఉండవు. సృష్టిలో గల సమస్త జీవరాశి మరియు పరమాత్మ స్వరూపమైన ప్రకృతి అంతా కూడా ఒక ప్రశాంత మయమైన స్థితిలో ఉంటుంది. ఇట్టి స్థితికి చేరాలంటే ప్రతి ఒక్కరు మునిగా మారాలి. మరియు ఇది సాధ్యమా? అనే ప్రశ్న మన మనస్సులందు మొలకెత్తవచ్చు. తప్పక సాధ్యమౌతుంది అని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు.

ఈ సందర్భంగా రెండు సామాజిక ఉదాహరణలు ఇవ్వదలచాను. ప్రజలు ఓటు వేసి నాయకుడిని ఎన్నుకొనే ముందు అసలు ఆ నాయకుడు ఎలాంటి వాడు, వాడు పనిచేస్తాడా? మన కష్టాలను వింటాడా? అసలు వాడిలో బుద్ధి ఏమైనా ఉందా? సామాజిక సేవ చేయగల తత్త్వం ఉందా? అనే ప్రశ్నలు మనం వేసుకొని అట్టి గుణాలు వారిలో ఉన్నాయో లేదో తెలుసుకొని ఓటువేస్తే దేశం చక్కగా అభివృద్ధి చెంది సస్యశ్యామలంగా ఉంటుంది. వారిచ్చే లేదా ఆశ చూపే ఎదో కొంత డబ్బుకు ఆశపడి, బిర్యాని తినిపించి మద్యం కూడా ఇస్తాడని ఆశపడి ఓటు వేసావా! ఇక రాబోవు 5 సంవత్సరాలు భగవంతుడు కూడా కాపాడ లేదు. భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు, ఇద్దరూ చనిపోతే పిల్లలకు పదవులు కట్టిపెట్టే వ్యవస్థను వ్యతిరేకించాలి. అసలు ఆ పదవికి వారు అర్హులా అనేది ముందు నిర్ధారణ జరగాలి. అది నిర్ణయించాల్సింది ప్రజలే.  ఇట్టి సందర్భంలో ప్రతి ఒక్కరు మునిగా మారి ఆలోచనతో నిర్ణయం తీసుకొంటే దేశం ఈ స్థితిలో ఉండదు. సస్యశ్యామలంగా ఉంటుంది. అందరూ ఆనందంగా ఉంటారు. ఇక రెండవ ఉదాహరణ – ఈ రోజుల్లో మనం చూస్తున్నాము: ఆవేశంతో అజ్ఞానంతో ప్రేమ వివాహాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పరువు హత్యలు. ఇక్కడ ఇరువర్గాలు ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ఇరువురు మునులుగా మారాల్సి ఉంటుంది. తాజాగా జరిగిన ఒక ఘటనలో వివాహమాడిన ఇరువురు విద్యార్థులే. అంటే వారికి జీవితం గూర్చిన పూర్తి అవగాహన అనేదే లేదు. కులం – మతం: ఈ రెండింటినీ ప్రక్కన బెట్టి జీవితమంటే అవగాహన లేని వారు ప్రేమ వివాహమాడినా లేక పెద్దలు చేసిన వివాహమాడినా అది కష్టాల మయమే అవుతుంది. ఇక పరువు హత్య చేసే వారు ఒక్క క్షణం ఆలోచించినట్లయితే అసలు వారు ఆ పని ఎందుకు చేసారో వారికే తెలియదు. చేసిన పిదప దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఒక్క క్షణ ఆలోచిస్తే వారు ఆ పనికి పూనుకోరు. ఈ రెండు సందర్భాలందు మానవుడు తన బుద్ధిని ఉపయోగించి కర్మాచరణ చేసినట్లయితే ఈ చిక్కులు ఉండవు. శ్రీ మధ్వాచ్యార భాష్యంలో ‘‘రసో రాగస్తథా రక్తిః శోభనాధ్యాస ఉచ్యతే’’ అని చెప్పిన విధంగా రస, రాగ మరియు రక్తి అనే ఈ మూడు మన మనస్సును ఏలకుండా చూసుకోవాలి. ఈ మూడు కూడా మన మనస్సును, మన ఆలోచనలను గాడినుండి తప్పిస్తాయి. చేయకూడని దిక్కుమాలిన పనులన్నీ చేస్తాము. ఇట్టి సందర్భాలందు ప్రతి వ్యక్తీ ఒక మునిగా మారాలి.


మనందరం మునులుగా మారాలంటే ‘దుఃఖేషు అనుద్విగ్నమనాః’ – దుఃఖము కలిగిన నాడు అణగారి పోరాదు. ఇట్టి దుఃఖము మన మనస్సులను చలించి వేయరాదు. మరియు ‘సుఖేషు విగతస్పృహాః’ – సుఖము కలిగిన నాడు మనము అతిగా ఉప్పొంగి పోరాదు, అతిగా కాదు అసలేమాత్రం ఉప్పొంగి పోరాదు. ఈ రెండూ కూడా మన నిత్య జీవితాలను చాలా భయంకరంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ రెండు స్థితులను చేరడానికి ఇంకనూ మనం ఆచరించాల్సిన వాటి గూర్చి భగవానుడు ఈ విధంగా చెప్పుచున్నాడు. ‘వీత రాగ భయ క్రోధః’ – రాగము భయము మరియు క్రోధము అను వాటిని త్యజించాలి. ఈ మూడు కూడా మానసిక స్థితులే. ఇట్టి మానసిక స్థితులు మనను అన్ని విధాలుగా ప్రభావితం చేస్తాయి. ‘రాగ’ – వస్తు వ్యామోహము లేదా ఇతర పలు విధములైన వ్యామోహాలు. ‘భయము’ – నమ్మకము లేని మనస్సులు; దీని ద్వారా అధికంగా బాధపడుతూ ఉంటారు. వస్తువు పట్ల వ్యామోహం అధికమై అది క్రమంగా భయంగా మారుతుంది. ఉదాహరణకు: ఒక కార్య సాధనకు పూనుకున్నపుడు, దాన్ని సాధించ గలమో లేదో అనే అపనమ్మకము భయానికి దారి తీస్తుంది. భయం వలన నిర్ణయాత్మక శక్తి తగ్గిపోతుంది. ‘క్రోధ’ – రాగము భయము పిమ్మట మన మనస్సు ఎదుర్కునే ప్రధాన సమస్య క్రోధము. ఒక వస్తువును ప్రేమించాము. అది దొరికితే సంతోషం, దొరకకపోతే దుఃఖము. దొరికింది మన వద్దనే ఉండిపోవాలన్న అతిగా కోరిక, ఎవరైనా తస్కరిస్తారేమో నని భయం. ఈ క్లిష్టమైన మానసిక స్థితి క్రోధానికి దారి తీస్తుంది. క్రోధము అతి భయంకరమైనది. ఇట్టి గుణాల గూర్చి శ్రీ కృష్ణ భగవానుడు రాబోవు శ్లోకాలందు చాలా చక్కగా వివరించి ఉన్నారు. అది మునుముందు మనము తెలుసుకోవచ్చును. ఈ మూడు గుణాలు హద్దులో ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. హద్దు మీరితేనే కష్టము. హద్దులో ఉండి మన నియంత్రణలో ఉంటే మనము ఆనందంగా ఉంటాము మరియు మన చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఆనందంగా ఉంటారు.


‘భయం’ అనునది అతి ప్రమాదకరమైనది అని దాదాపు అన్ని వేదాంతాలు ఘోషిస్తున్నాయి. ఈ భయాన్ని మనం రెండు విధాలుగా చెప్పుకోవచ్చును. ఏదేని ఒక క్రూర మృగాన్ని చూసినపుడు ఏర్పడ్డ భయం. ఈ భయం తాత్కాలికమైనది మరియు ఇట్టి భయం మన జీవన స్థితి గతులను ప్రభావితం చేయదు. కాని వాక్కుకు చెందిన భయం, ఆలోచనా భయం, అపనమ్మకంతో ఏర్పడ్డ భయం, కార్యాచరణ కు చెందిన ఇత్యాది భయాలు చాల భయంకరమైన ఫలితాలను ఇస్తాయి. మనం చిన్న పిల్లలకు భయాన్ని చిన్నప్పటి నుండే నూరిపోస్తాము. మొదటి విధమైన భయం కంటే రెండవ విధమైన భయాన్ని ఎక్కువగా నూరిపోస్తుంటాము. దాని వలన వాడు పిరికి వాడుగా మరి జీవిత కాలంలో ఎందుకూ పనికి రాకుండా పోతాడు. వాడికి చిన్న వయస్సు మొదలు సత్య వాక్కు, ధర్మ ప్రవృత్తి గూర్చిన బోధనలు చేయాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ రెండింటిని వదిలిపెట్ట వద్దనే బోధ చేయాలి. సత్య వాక్కు వలన మరియు ధర్మాచరణ వలన చాలా విధాలైన కష్టాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక బాలుడు తెలియక ఒక పెన్నును దొంగిలిస్తాడు. అది తల్లి తండ్రులకు తెలిస్తే వాడిని ఆ పెన్ను దాచేయాలి రా! లేదంటే ఆ పెన్ను కు చెందిన వాడు నిన్ను చూస్తె గొడవ చేస్తాడు. అని వాడికి నూరి పోస్తాము. వాడు ఆ పెన్నును తన మిత్రుడికి కనబడకుండా దాచి పెడతాడు. తన మిత్రుడు చూస్తాడేమో అనే భయంతో అనుక్షణం గడిపేస్తాడు. వాడి మనస్సులో భయం నిండిపోయి ఉంటుంది. వాడిని ‘ఇతరుల వస్తువులు తస్కరించడం తప్పు రా నాన్న! అని చెప్పి ఎవరి వస్తువు వారికీ తిరిగి ఇచ్చివేయాలి’ అని వాడికి హితవు నూరిపోసి ఆ పెన్నును వాడి మిత్రుడికి తిరిగి ఇచ్చివేసే విధంగా చేస్తే వాడు జీవితంలో ఆనందంగా ఉంటాడు. ఇది పెన్ను వరకు ఆగిపోదు. భవిష్యత్తులో చాలా వస్తువులు తస్కరిస్తూ వాడు దొంగ గా మారిపోతాడు. అడుగడుగునా వాడిలో భయం నిండిపోయి ఉంటుంది. ఈ పరిస్థితి రావద్దని అంటే మాత్రం – తల్లిదండ్రులు ఇట్టి వాటిని సమర్థించ రాదు. తాత్కాలికంగా కష్టాలు ఉన్నా భవిష్యత్తులో ఆ బాలుడి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక పిల్లల వరకే కాదు. ఒక మేధావి ఇంకొక మేధావిని సమర్థించడు, ఆయన చాలా గొప్ప పండితుడు అని ఏనాడు ఒప్పుకోడు. దానికి ప్రధాన కారణం ఒప్పుకుంటే తన ప్రాధాన్యత తగ్గి పోతుందేమో నాన్న భయం. అనగా భయం అందరిని వేధించి వెంటాడుతుంది. అసలు భయమన్నదే మనిషిలో ఉండరాదు. ఎదుటి వారిని జ్ఞాని లేదా మేధావి అని ఒప్పుకోవడం వల్ల ఆయనలో మనపట్ల ఉన్న గౌరవం రెట్టింపు అవుతుంది. కష్టమైనా కూడా సత్య వాక్కు, ధర్మాచరణ కు చెందిన మార్గంలోనే ఉండాలి. సత్య వాక్కు పలకడానికి సంకోచించ రాదు. ఈ సిద్ధాంతం పిల్లలకు మాత్రమే కాదు అన్ని వయస్సుల వాళ్లకు కూడా వర్తిస్తుంది.


ఇక ‘క్రోధము’. క్రోధము లేదా కోపాన్ని నియంత్రించడం చాలా కష్టం. ఒక క్షణ కాలంలో మనం విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ‘మీలో క్రోధము అధికముగా ఉందని మిమ్ములను శిక్షించరు, కాని ఆ క్రోధమే మిమ్ములను శిక్షిస్తుంది’...గౌతమ బుద్ధుడు. ఆహా! ఎంత అద్భుతమైన బుద్ధ భగవానుని వాక్కు. మనలో క్రోధము అధికంగా ఉందని మనను ఒకరు శిక్షించాల్సిన అవసరం లేదు. మన కోపమే మనను శిక్షిస్తుంది. ఇది సత్యం. క్రోధం అధికమైన నాడు విచక్షణ ను కోల్పోయే అవకాశం ఉంది. అట్టి స్థితిలో మనపై మనకు నిగ్రహం ఉండదు. నిగ్రహాన్ని కోల్పోయినపుడు మన కర్మలు మరియు చేష్టలు కూడా మన నిగ్రహంలో ఉండవు. దీని కి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఏ ఒక్క ఉదాహరణ ఇక్కడ ఉటంకించాల్సిన అవసరం లేదు. క్రోధాన్ని అణచుకోవాలి. క్రోధంలో చేసిన తప్పులు మనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. కాని కోపము తగ్గిన తరువాత మనకు తెలుస్తుంది మనం ఎంత పెద్ద తప్పు చేసామా అని. ఆ ఒక్క క్షణం కోపాన్ని నిగ్రహించుకోగలిగితే ఎన్నో ఘోరాలు జరగవు. అయితే కోపము లేదా క్రోధము అసలే ఉండకూడదా? ఇక్కడ కూడా శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన విధంగా ‘బుద్ధి యుక్తో జహాతీహ’ మన బుద్ధిని ప్రయోగించాలి. కోపము మన నియంత్రణలో ఉండాలి గాని దాని నియంత్రణలోకి మనము వెళ్ళరాదు. మన చుట్టూ అన్యాయం జరుగుతూ ఉన్నా చూస్తూ ఊరుకోవడం తప్పు, అది అధర్మం కూడాను. అన్యాయాన్ని, అధర్మాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అన్యాయాన్ని, అధర్మాన్ని చూసి ఆగ్రహించనివాడు వాడిని, అట్టి కర్మలను ప్రోత్సహించిన వారిక్రిందే లెక్కలోకి వస్తాడు. మన చుట్టూ జరుగుతున్న అన్యాయం, అధర్మం చూసి తప్పనిసరిగా ఆగ్రహించాలి. మనం దారిన పోతూ ఉంటే ఒక ఘోరాన్ని చూసినపుడు స్పందించని ఎడల మనదే తప్పు. అట్టి ఘోరము ఏదైనా కూడా మనం స్పందించాల్సిందే. అప్పుడే ధర్మం రక్షించ బడుతుంది. శ్రీ కృష్ణ భగవానుడు కూడా యుద్ధం చేయమన్నాడు. అధర్మాన్ని సహించ రాదు అని బోధించాడు. యుద్ధ భూమిలో ఉన్న వాడికి శతృ సేనను చూసి కోపం రాకపోతే వాడు యుద్ధం చేయలేడు మరియు దేశాన్ని రక్షించ లేదు కూడాను. కావున కోపము అన్ని సందర్భాలందు తప్పు కాదు. చాల సందర్భాలందు కోపం లాభం చేకూరుస్తుంది. కోపము తప్పు కాదు. కోపానికి గల ప్రధాన కారణం తప్పు. అట్టి కారణం ధర్మ రక్షణకు అయిన నాడు కోపము మంచిదే, కాని అధర్మానికి గాని అన్యాయానికి గాని దారితీయు కోపము మంచిది కాదు. అట్టి కోపాన్ని తప్పనిసరిగా నియంత్రించాల్సి ఉంటుంది. మనం పిల్లలకు వారి పిన్న వయస్సు నుండి ఇదే నేర్పాలి. కోపాన్ని హద్దుల్లో ఉంచుకోవాలి అని వారికి చెప్పాలి, కాని అధర్మం జరుగుతున్నపుడు మాత్రం నోరు మూసికొని కూర్చోవడం మన తప్పు. మన భారత దేశంలో పాలకులు ఎన్ని తప్పులు చేసినా వారిని గద్దె దించే అధికారం మన వద్ద లేదు. వారు తప్పులు చేస్తున్నపుడు ప్రజలు ఆగ్రహించని నాడు వారికి హద్దులు ఉండవు. ఒక సారి వాడు గద్దె ఎక్కాడంటే వాడికి రాబోవు 5 సం. మనం లైసెన్స్ ఇచ్చినట్లే. ఈ పద్దతి మారాలి. అన్యాయాన్ని, అధర్మాన్ని ఎదిరించే శక్తి మనలో రావాలి. దాన్ని ఎదిరించడానికి మనం ఎంత కోపగించాల్సి వచ్చినా తప్పేమీ లేదు. మనలోని ఆవేశము దేశ ప్రగతికి మరియు ధర్మ స్థాపనకు పనికి వచ్చేదిగా ఉండాలి. ఇట్టి సామాజిక స్పృహ ప్రతి ఒక్కరిలో రావాలి. అది రానంత వరకు మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. సమాజం మారడానికి భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చాలా విధాలైన సూచనలు మనకు అందించాడు. కాని మనం దాన్ని గ్రహించ లేకున్నాము. భగవద్గీతను శవ యాత్రలకు మినహా ఇతర బృహత్కార్యాలకు, బృహదాలోచనలకు వాడడం లేదు. దానిలో గల సామాజిక దృక్కోణాన్ని మనం గ్రహించ లేకున్నాము. కాని పాశ్చాత్యులు మాత్రం మన కంటే ముందుగానే అది గ్రహించ గలిగారు.

శ్రీ కృష్ణ భగవానుడు ‘స్థితధీః’ స్థిరమైన బుద్ధి మరియు ప్రజ్ఞ గల వాడే ‘మునిరుచ్యతే’ ముని లేదా స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు సర్వకాల సర్వావస్థలందు మనో నిగ్రహము కలిగి ఉండి, సమదృష్టి ని కలిగి ఉంటాడు. ‘రాగము భయము’ వారిలో ఉండవు. క్రోధము పట్ల పూర్తి నియంత్రణ గల వాడు. ఎక్కడ కోపగించాలో, ఏది కోపగించాలో తెలిసిన వాడు. కోపము ద్వారా నియంత్రించ బడ్డ వాడు కాదు, కోపాన్ని నియంత్రించే శక్తి గల వాడు. శ్రీ శంకర భగవత్పాదుల వారు చెప్పిన విధముగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక మనబడు మూడు విధాలైన దుఃఖాలకు అతీతుడు. ఇంకను భగవానుడు ఏమి చెప్పు చున్నాడో చూద్దాము: 

Copyright

Copyright © 2020 Sri Gayatri Veda Vision  - All Rights Reserved.
The above published material is a part of  The Srimad Bhagavadgita (Bhashya Trayam)

The Srimad Bhagavad Gita (Bhashya Trayam) is protected by Copy Right.
No part of this publication may be reproduced, distributed, or transmitted in any form or by any means, including photocopying, recording, or other electronic or mechanical methods, without the prior written permission of the publisher.