Sri Vikari Results

Sri Vikari Nama Samvatsara Phalam (Results)

Telugu Panchang - Sri Vikari Results (Yearly Results) with Rasi Phala


శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః

శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

శుభ గ్రహ


శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగ పఠనం


గణపతి ప్రార్థన - నవగ్రహా ప్రార్థన - మాతృ, పితృ మరియు గురు వందన - సభాయై నమః


పంచాంగ శ్రవణానికి విచ్చేసిన పూజ్యులు, పెద్దలు జ్ఞానులు, మరియు సమస్త సభకు నా నమస్సుమాంజలులు. ఈ పంచాంగ పఠనము లోక కళ్యానార్థము నిర్దేషించ బడినది. అంతే గాని వ్యక్తిగతముగా గాని, ఏదేని ఒక వర్గమును గాని ఉద్దేశించి చేసింది కాదు. శాస్త్రాన్ని నిష్కర్షగా విడమరచి చెప్పుటకు నేను చేసిన ఈ ప్రయత్నాన్ని మీ అందరు సహృదయంతో ఆదరిస్తారని భావిస్తున్నాను.

చిత్రభాను నామ సం. అనగా 2002 సం మొదలు సహృదయులైన ‘సహృదయ’ వారు నిరంతరమూ నాకు అందించిన ఆదరణ గౌరవము నేను మరవలేను. నేను వారికీ సదా ఋణ పడి ఉంటాను. నేను ఎప్పుడూ సహృదయ లోని ఒక భాగంగా భావిస్తాను.


శ్లో:  కళ్యాణ గుణావహం రిపుహరం దుఃస్వప్న దోషావహం |

గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్ ||

ఆయుర్వృద్ధిదమ్ ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం |

నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతామ్ ||

శ్రీమత్కామితదాయి కర్మషహరం దుర్దోష శాంతిప్రదం |

నానా యజ్ఞ విశేషమధ్యఫలదం భూదాన తుల్యం నృణామ్ ||

ఆరోగ్యాయురభీష్టదం శుచికరం సంతాన సౌఖ్యోదయం |

పుణ్యం కర్మ సుసాధనం శృతి హితం పంచాంగ మాకర్ణ్యతాం ||

అనగా శోభాయుక్తమైనటువంటిది, కోరికలు తీర్చునది, పాపాలను సంహరించునది, దుర్దోషములను పోగొట్టునది, అనేక యజ్ఞముల వలన పొందిన ఫలాలను ప్రసాదించునది. జనులకు భూదానాది సమానమైన ఫలాలను ప్రసాదించు నది. ఆయుష్షు మరియు ఆరోగ్యమును కలగ చేయునది, సంతాన సౌఖ్యమును మరియు పవిత్ర కర్మలకు యోగ్య ప్రదమగు శాస్త్ర సమ్మతమైన పంచాంగ పఠనమును వినవలెను.


యుగారంభ మైన దినాన్ని చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాది పండగ గా మనము జరుపుకుంటాము. ఇట్టి శుభ దినమున బ్రాహ్మి ముహూర్తమున లేచి కాలకృత్యాదులను తీర్చుకొని, మంగళ స్నానాలను ఆచరించి, నూతన లేదా శుభ్రమైన వస్త్రములను ధరించి; శ్రీమన్మహా గణపతిని, శ్రీ సరస్వతి మరియు లక్ష్మీ దేవిని, మన ఇష్ట మరియు కుల దైవమును ఆరాధించి, దైవజ్ఞులు మరియు గృహము నందు గల పెద్దల ఆశిస్సులు పొంది, పంచాంగాన్ని పూజించి నమస్కరించాలి. పిదప వేప పువ్వు, మామిడి ముక్కలు, కొత్త చింతపండు, బెల్లం మరియు ఆవు నెయ్యితో చేసిన ‘పంచ భద్ర’ అనే ఉగాది పచ్చడిని దైవానికి నివేదించి పిదప బంధు మిత్రులతో కలిసి సేవించాలి.


కాల ప్రమాణం (సంక్షిప్తంగా)

చాతుర్యుగాలు:

సత్య యుగ 17,28,000 సం

త్రేతా యుగ 12,96,000 

ద్వాపర యుగం  8,64,000

కలియుగం  4,32,000

మొత్తం 43,20,000 - ఒక చతుర్యుగం లేదా కల్పం

ఒక మన్వంతరం 71 చతుర్యుగాలు (30,67,20,000)

ఒక మన్వంతర సంధి 17,28,000 (ఒక సత్యయుగ ప్రమాణం)

బ్రహ్మ ౧ దిన 432,00,00,000 (14 మన్వంతరాలు మరియు 15 మన్వంతర సంధులు)

14 మన్వంతరాలు: 1. స్వాయంభువ, 2. స్వారోచిష, 3. ఉత్తమ, 4. తామస, 5. దైవత, 6. చాక్షుష, 7. వైవస్వత, 8. సూర్య సావర్ణి, 9. దక్ష సావర్ణి, 10. బ్రహ్మ సావర్ణి, 11. ధర్మ సావర్ణి, 12. రుద్ర సావర్ణి, 13. దేవ సావర్ణి మరియు 14. ఇన్ద్ర సావర్ణి. ప్రస్తుతము మనము వైవస్వత మన్వంతరం లో కలియుగ ప్రథమ పాదంలో గతాబ్దాః 5120 (అనగా గడచిపోయినవి).


ప్రభవ నుండి అక్షయ వరకు 60 సం. అందులో ఈ రోజు 33 వ సం అయిన శ్రీ వికారి నామ సం ప్రారంభం. వచ్చే సంవత్సరం శ్రీ శార్వరి.


‘వికార’ అనగా మార్పు, పరివర్తన, రూపాంతరం. ‘వికారి’ అనగా మార్పు/పరివర్తన/రూపాంతరమును ప్రసాదించునది అని అర్థము.


శ్రీ వికారి నామ సం ఫలం:

శ్లో: వికారిణో వికార్యబ్దే పైత్యరోగాదిభిర్నరాః |

మేఘోవరతి సంపూర్ణం ఫలం భవతి నాన్యధా ||

వికారి నామ సంవత్సరము నందు ప్రజలు పైత్య రోగాదుల వలన వికారవంతులగుదురు. మేఘములు పూర్ణముగా వర్షించును. ఫలము కూడా పూర్ణముగా ఉండును.

(విళంబి నామ సం నందు శత్రు మరియు రోగ భీతి అధికము, వర్షాభావ పరిస్థితి మరియు చోర భయము వలన నష్టము, ధనార్జన కొరకై విదేశాలకు వెళ్ళువారి సంఖ్య అధికమగును)


బార్హస్పత్యమానేన శ్రీ పరీధావి నామ సం. ఫలం:

శ్లో: శుభఫలదా పరీధావిన్యతులిత బహు సస్యవృష్టిస్స్యాత్ |

నిఖిల ధరామయరహితా మధ్యమదేశస్య నాశస్స్యాత్ ||

బార్హస్పత్య శ్రీ పరీధావి సంవత్సరము నందు దేశమంతయూ చక్కని వర్షములు కురియును మరియు బహు సస్య సంపదలతో శుభముగా అందముగా ఉండును. మధ్యమ దేశమున సస్స్య నాశనమును సూచించు చున్నది.

(బార్హస్పత్య మానాన్ని అనుసరించి శ్రీ విరోధికృత్ నామ సం. లో జనులందరూ పరస్పర విరోధులగుదురు. రాజులకు ప్రతికూలతలు అధికము, సస్య అర్ఘ మరియు వృష్టి మధ్యమము గా ఉండును.)


గురూదయ వశాత్ శ్రీ ఆషాఢాబ్ద ఫలమ్:

శ్లో: ఆషాఢాబ్దే ప్రాచుర్యేణ పీడ్యన్తే సర్వసస్స్యాని |

కీటాద్యైర ఫలం త్వపరం సస్స్యంచ వృద్ధిమాప్నోతి ||

ఆషాఢాబ్దమున సర్వ సస్స్యములు క్రిమి కీటకాదుల వలన పీడింప బడును. అపర సస్స్యము వృద్ధి నొందును. (అపర సస్స్యము అనగా ప్రధాన పంటలు కానివి, ఇతరములైనవి)

(వైశాఖాబ్దమున రాజులు ప్రజలు ధర్మాసక్తి కలిగి యుందురు. భూమి పూర్ణమగు ఫలమునిచ్చును. బ్రాహ్మణులు యాగములను ఆచరింతురు)


అథ రాజాది నవనాయకా ఫలమ్:


శనేః రాజ్యాధిపతిత్వ ఫలం:

వర్షారంభము శనివారము అగుట వలన శని సూర్యుడు.

చోరాగ్ని శస్త్రబాధాభిః పీడ్యన్తే మనుజాభృశం |

అల్ప సస్స్యన్చాల్పవృష్టిం కరోత్యబ్దాధిప శనిః ||

వర్షారంభము శని వారము అగుట వలన రాజు శని. ఆబ్దాధిపతి శని అగుట వలన ప్రజలకు చోర మరియు అగ్ని భయం, శస్త్ర బాధ అధికమగుట వలన ప్రజలు పీడింప బడతారు. అల్ప సస్స్యము మరియు అల్ప వృష్టి.

(సూర్యుడు రాజు అగుట వలన, రాజులు పరస్పర శత్రు భావంతో ఉంటారు. వర్షాలు అధికంగా కురవవు. ప్రజలకు ప్రభుత్వం వలన భయం (ఇది ఒక విచిత్రమైన పరిస్థితి). శస్త్ర భయం అధికం. అగ్ని బాధ అధికంగా ఉంటుంది. అనుకున్న విధంగానే గత సంవత్సరమంతా కూడాను రాజులు అనగా పాలకులు పరస్పర విరోధలై ఉన్నారు. వర్షాలు మధ్యమంగా కురిసాయి. కాశ్మీర్ లో ప్రజలు శస్త్ర బాధలను అనుభవించారు)


సూర్యస్య మన్త్రిత్వ ఫలం:

మేష సంక్రమణం రవి వారము అగుట వలన మన్త్రి శని:

రాజ్ఞా మన్యోన్యవైరత్వ మనావృష్టి ర్నిరంతరం |

అధర్మనిరతా మర్త్యాః భాస్కరస్య చ మంత్రితః ||

సూర్యుడు మన్త్రి పదవిలో ఉన్నపుడు పాలకుల మధ్య అన్యోన్య వైరం అధికంగా ఉంటుంది. తత్ప్రభావము వలన రాష్ట్రాల మధ్య దేశాల మధ్య వైరం మరియు యుద్ధ వాతావరణం అధికంగా ఉంటుంది. నిరంతర అనావృష్టి, వర్షాభావ పరిస్థితి వలన కరువు భయం అధికం. ప్రజలు అధర్మ నిరతులై ఉంటారు. ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు.

(మంత్రిణః శనే: ఫలమ్: వర్షములు మరియు పంటలు సామాన్యంగా ఉంటాయి. ప్రజలు పాప కార్యములందు అధిక ఆసక్తిని కనబరచు వారగుదురు. ప్రజలకు ఈతి బాధలు అధికంగా ఉంటాయి)


సూర్యస్య సేనాధిపతిత్వ ఫలం:

సింహ సంక్రమణం భాను వారమగుట వలన సేనాధిపతి సూర్యుడు:

అన్యోన్యయుద్ధం ధరణీశ్వరాణామల్పాంబుదా వారి ధరాస్స వాతాః |

రక్తాని ధాన్యాని ఫలంతి భూమౌ సేనాధిపత్యే దివసేశ్వరస్య ||

సేనాధిపతి సూర్యుడు అగుట వలన పాలకుల మధ్య కలహాలు అధికంగా ఉంటాయి. యుద్ధాలు సంభవిస్తాయి. మేఘాలు వాయు ప్రభావం వలన చెదరగొట్ట బడతాయి. వర్షం తక్కువగా కురుస్తుంది. రక్త వర్ణంలో (ఎరుపు) గల ధాన్యం పుష్కలంగా పండుతుంది.

(భ్రుగోర్ సేనాధిపతిత్వ ఫలమ్: సస్యానుకూల వర్షాలు, పంటలు సమృద్ధిగా పండును, సుభిక్షము, ధరలు అధికము, స్త్రీ పురుషులు కామకేళి నందు ఆసక్తిని చూపుదురు)


బుధస్య సస్స్యాధి పతిత్వ ఫలం:

కర్కాటక సంక్రమణం బుధవారము నాడు అగుట వలన సస్స్యాధిపతి బుధుడు.

మధ్యవృష్టి ర్మందసస్యం మేఘా వాతేన పీడితాః |

త్రసంతి మనుజానిత్యం బుధేసస్స్యాధిపే సతి ||

బుధుడు సస్స్యాధిపతి అయినపుడు మధ్యమ స్థాయిలో ఉండే వర్షాలు కురుస్తాయి. పంటలు నామ మాత్రంగానే పండుతాయి. మేఘాలు వాయువు యొక్క అధీనంలో ఉంటాయి. అనగా వేగంగా వీచే వాయువు వలన మేఘాలు చెల్లాచెదరై పోతాయి. వర్షాభావ పరిస్థితి నెలకునే అవకాశం ఉంది. మనుజులు ఎల్లవేళలా ఎదో ఒక భయంతో కాలం గడుపుతారు.

(సస్యాధిపతే: చంద్రస్య ఫలమ్: జల ధాన్యాలు, మెట్ట పంటలు, ఫల వృక్షాలు అధికంగా పండును)


చన్ద్రస్య ధాన్యాధిపతిత్వ ఫలం:

ధనుస్సంక్రమణం ఇందువారం అగుట వలన ధాన్యాధిపతి చన్ద్రుడు.

బహుక్షీరప్రదాగావ స్సర్వేవ్యాధి వివర్జతాః |

సుభిక్షంచ మహావర్షం చన్ద్రే ధాన్యాధిపే సతి ||

గోవులు ఏ విధమైన వ్యాధులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లుతాయి. పాలను సమృద్ధిగా ఇస్తాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. జల వనరులు పుష్కలంగా ఉంటాయి.

(అర్కః ధాన్యాధిపతిత్వ ఫలమ్: సామాన్య వర్షం, సామాన్యమైన పంటలు, భయం అధికం, కందులు మున్నగు ఎర్రని పంటలు విశేషంగా పండును)


శనేరర్ఘాధి పతిత్వ ఫలమ్:

మిథున సంక్రమణం శనివారం అగుట వలన అర్ఘాధిపతి శని:

తిలమాషకుళత్థాది కృష్ణధాన్యానియానిచ |

కృష్ణ భూమిస్తు ఫలంతిరర్ఘాధిపే శనౌ ||

తిల మాష ధాన్యము అనగా నువ్వులు, మినుములు మరియు ఉలవలు ఇత్యాది కృష్ణ ధాన్యము విరివిగా పండును. నల్లరేగడి భూములు సారవంతంగా ఉండి మంచి పంటలను ఇస్తాయి.

(శుక్రః అర్ఘాధిపతిత్వ (ధరలు) ఫలమ్: శుక్రుడు అర్ఘాధిపతి అయిన సర్వ సస్యములకు అనుకూలమైన వర్షాలు కురియును. తెల్లని పంటలు విస్తారముగా పండును. భూమి అంతటా సస్యశ్యామలముగా సుభిక్షముగా ఉండును)


శనేర్మేఘాధి పతిత్వ ఫలమ్:

సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశము శనివారం నాడు అగుట వలన మేఘాధిపతి శని.

మధ్య సస్య మనర్ఘం చ ఖండవృష్టిః ప్రజాయతే |

నీలధాన్య సమృద్ధిశ్చ మందే మేఘాధిపతే సతి ||

సస్స్యములు మధ్యమముగా పండుతాయి. వస్తువుల ధరలు లేనివి ఔతాయి అనగా ధరలు తగ్గుతాయి. ఖండ వృష్టి ఉంటుంది. అనగా అప్పుడప్పుడు, అక్కడక్కడా వర్షం కురుస్తుంది. నీలధాన్యం అనగా నల్లని ధాన్యం సమృద్ధిగా పండుతుంది.

(మేఘాధిపతే శుక్రః ఫలమ్: వర్షాధిక్యత, సుభిక్షము, ఎడతెగని సస్యాభివృద్ధి, ఆవులు సమృద్ధిగా పాలనిచ్చును)


శుక్రస్య రసాధి పతిత్వ ఫలమ్:

తులా సంక్రమణము శుక్ర వారము అగుట వలన రసాధిపతి శుక్రుడు.

క్షారాణి సర్వ వస్తూని కందమూల ఫలానిచ |

రసానామతి వృద్ధిస్యా చ్ఛుక్రోయది రసాధిపః ||

ఉప్పు, కారము ఇత్యాది క్షార సంబంధిత వస్తువులు, భూగర్భం లో పెరిగే దుంప జాతులు మరియు ఫల జాతులు సమృద్ధిగా లభిస్తాయి. నెయ్యి, నూనె, బెల్లం, పంచదార ఇత్యాది రస జాతి వస్తువులు అధికంగా ఉత్పత్తి అవుతాయి. మరియు ఇట్టి వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

(రసాధిపతే: బుధః ఫలమ్: బుధుడు రసాధిపతి అయినచో పిప్పళ్ళు శొంఠి, ఇంగువ, ఉల్లిపాయలు మున్నగు రస వస్తువులు, బెల్లం మున్నగునవి దుర్లభమగును)


బుధస్య నీరసాధిపతిత్వ ఫలం:

మకర సంక్రమణము సౌమ్య వారమగుట వలన నీరసాధిపతి బుధుడు.

గారుత్మతాదిరత్నాని ధాన్యాని వివిధానిచ |

సర్వాణి వృద్ధిమా యాన్తి బుధే నీరస నాయకే ||

గరుడ పచ్చ మణులు (పచ్చ మరకతం ఇత్యాది రత్నాలు), బంగారం అధికంగా లభిస్తాయి. వివిధ రకములైన ధాన్యాలు అన్ని కూడా చక్కగా పండి అన్ని విధాలా జనులకు సమృద్ధిని కలిగిస్తాయి.

(నీరసాధిపతే చంద్రః ఫలమ్: ముత్యములు, రత్నములు, సువర్ణములు కంచు వస్త్రాభరణములు అభివృద్ధి నొందును)


సావన వర్షాధిపతి ఫలమ్:

రెండు సూర్యోదయాలకు మధ్య గల దినమును సావన దినమని అంటారు. ఇట్టి రోజులు 360 అయినచో ఒక సావన సంవత్సరము. ఈ ప్రకారము సృష్ట్యాది నుండి లెక్కించగా శ్రీ విళంబి నామ సం నిజ జ్యేష్ఠ బహుళ చతుర్దశి, గురువారము 12.07.2018 తేది నాడు సావన వర్షారంభము:

సావన వర్షాధిపతేః గురోః ఫలమ్:

వర్షాధిపతౌ జీవే వర్షాధిక్యం సర్వసస్స్యానాం |

ధాన్యార్ఘవృష్టిరతులా సుభిక్షమర్ఘస్సుఖం ద్విజాతీనాం ||

సావన వర్షాధిపతి గురుడు అగుట వలన సర్వ సస్స్యములకు అనుకూలమైన వర్షములు, సుభిక్షముగా ఉండును. బ్రాహ్మణులకు సుభిక్షంగా ఉండును.

(సావన వర్షాధిపతి చంద్రుడు అయినచో సర్వ సస్యములకు అనుకూలమైన వర్షములు, ప్రభుత్వము న్యాయ మార్గమున ప్రజలను పాలించుదురు. మానవులు పరస్పర ప్రేమ మరియు అనురాగాలతో ఉంటారు)


పశుపాలకాది నిర్ణయం:

అస్మిన్నబ్దే బలరామః పశుపాలకః | గోష్ఠ ప్రాపకః – గోష్ట బహిష్కర్తా చ యమః|

ఈ సంవత్సరము నందు పశుపాలకుడు బలరాముడు, పశువులను దొడ్డి పెట్టువాడు మరియు దొడ్డి విడిపించు వాడు యముడు.

పశుపాలకస్య  బలరామస్య ఫలం:

సువృష్టి సర్వసస్స్యానాం సర్వ సస్స్య సమృద్ధయః |

మధ్య దేశే మహద్వర్షం రామేతు పశునాయకే ||

సర్వ సస్స్యములకు అనుకూలంగా ఉండే విధంగా వర్షాలు చక్కగా కురుస్తాయి. సర్వ సస్స్యములు సమృద్ధిగా పండుతాయి. మధ్య దేశము నందు వర్షం అధికంగా కురుస్తుంది.

(ధరలు అధికము, వర్షాలు స్వల్పము, పశువులు సామాన్యంగా పాలిస్తాయి. పశుపీడ అధికము)

గోష్ఠ ప్రాపకస్య – గోష్ట బహిష్కర్తుశ్చ శ్రీ యమస్య ఫలమ్

అనర్ఘశ్చాల్పవృష్టిశ్చ స్వల్ప క్షీరం గవాం తథా |

పశుపీడాభవన్నిత్యం యమేతు పశునాయకే ||

ధరలు అధికంగా ఉంటాయి. వర్షము స్వల్పంగా కురుస్తుంది. పశువులు సామాన్యంగా పాలనిస్తాయి. పశుపీడ అధికంగా ఉంటుంది.

(పశువులను దొడ్డి పెట్టువాడు మరియు విడిపించు వాడు శ్రీ కృష్ణుడు – పశువులు సుభిక్షముగా ఉంటాయి. పశువులు దినదినాభివృద్ధి చెందును. తృణ సమృద్ధి – క్షీర సమృద్ధి – ధరలు అందుబాటులో ఉంటాయి. పశువులు ఆనందంగా పాలిస్తాయి)


ఆఢకాది నిర్ణయః – ఫలమ్

అస్మిన్నబ్దే ‘ఏక’ ఆఢక పరిమితం వర్షం | 

ఈ సంవత్సరంలో ఒక కుంచము వర్షము. ఫలం – సువృష్టి

ఆఢకస్య ప్రమాణన్తు – 

షష్టి యోజన విస్తీర్ణం శతాయోజనమున్నతం |

ఆఢకస్య ప్రమాణన్తు దేవమానేన గణ్యతే ||

దేవతల యొక్క కుంచము 60 యోజనాల విస్తీర్ణం మరియు 100 యోజనాల ఎత్తును కలిగి ఉండును.

నవభాగాస్సముద్రేషు పర్వతేషు చ పంచచ |

ధరణ్యం సప్తభాగాస్స్యుః ఏవం వర్షతిచ త్రిధా ||

ఒక కుంచము వర్షము నందు – 9 భాగాలు సముద్రముల యందును, 5 భాగములు పర్వతముల యందును, 7 భాగాలు భూమి యందును వర్షించును.

సంవత్సరాది నుండి భాద్రపద శుద్ధ విదియ ఆదివారం 01.09.2019 వరకు ‘వార్ధాక్య వయో విశిష్ట బ్రాహ్మణ’ హస్తమందు కుంచము. ఫలం – సువృష్టి

ఆనాటి నుండి ఆశ్వయుజ శుద్ధ షష్టి శుక్రవారము 04.10.2019 వరకు ‘యౌవన వయో విశిష్ట బ్రాహ్మణ’ హస్తమందు కుంచము. ఫలం – అధిక వర్షము.

తిరిగి ఆనాటి నుండి మార్గశిర బహుళ త్రయోదశి మంగళవారం 24.12.2019 వరకు ‘వార్ధాక్య వయో విశిష్ట బ్రాహ్మణ’ హస్తమందు కుంచము. ఫలం – సువృష్టి

24.12.2019 నుండి సంవత్సరాంతం వరకు ‘బాల్య వయో విశిష్ట గోప’ హస్తమందు కుంచము. ఫలం – సుభిక్షము, ఆరోగ్యము మరియు సంపద.


మేఘాధి నిర్ణయం – ఫలం

‘పుష్కర’ నామకో మేఘః – పుష్కరే మంద తోయంస్యాత్ – స్వల్ప వర్షం

ఈశాన్యే మేఘోత్పత్తిః – మేరు పర్వత ఈశాన్య దిక్కులో మేఘములు ఉద్భవించును – సువృష్టి

చతుర్మేఘపక్షే ఆవర్తనామకో మేఘః – ఆవర్తే పశ్చిమా వృష్టిః – వెనుకటి వానలు అధికం (మామూలుకంటే కూడా భిన్నమైన దిశలో వర్షాలు కురుస్తాయి)

సువాహనామకః వాయుః – సువహో వృష్టికృత్సదా – వర్షాధిక్యత (సువాహ అనునది ఒక విధమైన వాయువు. ఇట్టి వాయువు ప్రభావము వలన తీవ్రమైన వాయువుతో కూడిన వర్షాలు)

చపలా నామ్నీ విద్యుత్ (మెరుపులు) – చపలాయాం వాయు పీడా – అధిక మరియు తీక్షణంగా వీచే గాలుల వలన ప్రజలు పీడింప బడతారు

సౌమ్యనామకం గర్జితం (ఉరుములు) – అతివృష్టి

ఘ్రుతనామక స్సముద్రః – సుభిక్షం

కుళిక నామక శేషః భూమిం వహతి – కుళికాఖ్యే భూమి వహేసర్వసస్స్య వినాశనం – ‘కుళికుడు’ అనే ఆది శేషువు భూమిని మోయునపుడు సర్వ సస్స్యములు వినాశనము చెందును.

మేష సంక్రమణ ఫలం:

చైత్ర శు నవమి శని వారము 14.04.2019, సా 16:23 మేష రాశి యందు ప్రవేశము

దివాచేన్మేష సంక్రాంతి రనర్ఘ కలహప్రదా |

రాత్రౌ సస్స్యాభివృద్ధి స్స్యాత్ క్షేమశ్రీ సుభిక్షకృత్ ||

పగలు మేష సంక్రాంతి వలన కలహములు అధికం, రాత్రి యందు సస్స్య వృద్ధి, క్షేమము, ఆరోగ్యము, సుభిక్షము కల్గును. ఈ సంవత్సరం పగటి పూట మేష సంక్రమణం అగుట వలన కలహములు అధికం. వార ఫలం వలన – దుర్భిక్షం


ఆర్ద్ర ప్రవేశ కాలము:

జ్యేష్ఠ బ పంచమి స్థిరవాసరే, 22.06.2019, రా 01-31

షష్టి – ధాన్య వృద్ధి, శనివారము – ఫలం మన్దమ్, శతభిష నక్షత్రము – సువృష్టి. ప్రీతి యో – సుభిక్షం, గరిజ క – సుభిక్షం, మేష లగ్నము – వర్ష లేమి, రాత్రి ఆర్ద్ర ప్రవేశము – పంటల అభివృద్ధి, భరణ్యాది చన్ద్ర మండల ఫలం – మహా క్షేమం


అథ ప్రత్యబ్ద యోగ పంచక ఫలం:


౧. జ్యేష్ఠ శు ప్రతిపద వార ఫలం – మంగళ వారము

దుర్భిక్ష యుద్ధామయభీతికృచ్చ లోకాస్సదాన్యోన్యనృపాశ్చకృద్ధాః |

దగ్ధంపుర గ్రామవనం నగాశ్చ జ్యేష్ఠాది యుక్తోయది భౌమవాసరః ||

దుర్భిక్షం, యుద్ధం, రోగ భయం, రాజులకు పరస్పర విరోధములను కలిగి ఉంటారు. 


౨. ఆషాఢ శు పంచమి యుక్త వర ఫలం – భానువారము

ఆషాఢ సిత పంచమ్యాం రవివారో యదాభవేత్ |

దుర్భిక్షం భయభీతాహ మనావృష్టిర్భవేద్ధృవమ్ ||

ఆషాఢ శుద్ధ పంచమి యుక్త భానువారమగుట వలన లోకంలో దుర్భిక్షం, భయం, భీతి, అనావృష్టి ఉంటుంది.


౩. స్వాతి నక్షత్ర యుక్త ఆషాఢ శు దశమి ఫలం:

ఆషాఢే శుక్ల పక్షేతు దశమీ యది సంయుతా |

స్వాతీ యుక్తే నచన్ద్రేణ మహావర్షం భవేద్ధృవమ్ ||

ఆషాఢ మాసంలో శుక్ల పక్షమి లోని దశమి తిథి స్వాతి నక్షత్రముతో కలిసి వచ్చి నందు వలన యుండుట వలన అతివృష్టి కలుగును.


౪. ఆషాఢ బహుళ ఏకాదశి యుక్త రోహిణి నక్షత్ర ఫలం:

ఆషాఢే కృష్ణపక్షేతు రోహిణ్యే కాదశియుత |

సర్వధాన్యాభివృద్ధిస్స్యా త్సువృష్టిశ్చ మహీతలే ||

ఆషాఢ బహుళ ఏకాదశి నాడు రోహిణి నక్షత్రము అగుట వలన సర్వ ధాన్యాభివృద్ధి, సువృష్టి కలుగును


౫. పౌష్య బహుళ అమావాస్య ప్రయుక్త వార ఫలం:

శుక్రవారమైనందున – ద్రవ్య వృద్ధి


వాస్తు కర్తరీ నిర్ణయము

05.05.2019 to 12.05.2019 - డొల్లు కర్తరి

13.05.2019 to 29.05.2019 - నిజ కర్తరి


వాస్తు కర్తరి యందు మట్టి, శిల, కర్ర పనులు నిషేధము. నూతన గృహములు నిర్మించరాదు. వృక్షములు నరుకుట, బండలు కొట్టుట చేయరాదు. నూతన గృహ ప్రవేశము చేసుకొనవచ్చును.


కుజ చార ఫలము

ఈ సంవత్సరమున కుజుడు – అశ్రు ముఖుడు

ఫలం – సుఖశాంతులు, వర్షములు, సస్స్యములు, రస వస్తువులు నాశనము


గురు చార ఫలము:

సంవత్సరాది నుండి చైత్ర బహుళ తదియ, సోమవారం, 22.04.2019 వ తేదీ వరకు ధనుస్సు రాశిలో గురు సంచారము. అటుపిమ్మట వక్ర గతిచే 22.04.2019 నుండి కార్తీక బహుళ అష్టమి, సోమవారము 04.11.2019 వరకు వృశ్చికమున, తదనంతరం 05.11.2019 నుండి ధనుస్సు రాశి యందు సంచారము..

బృహస్పతి వృశ్చిక రాశి యందు సంచరించుట వలన భూమి జల సమృద్ధిగా ఉంటుంది. సస్స్య సమృద్ధి ఉంటుంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు.


బృహస్పతి ధనుస్సు రాశి యందు సంచరించుట వలన వరి మున్నగు పంటలు సమృద్ధిగా పండును. మామిడి మున్నగు ఫలములతో భూమి నయనానందకరంగా ఉంటుంది.

ధనుస్సు రాశి యందు గురు సంచారము మిశ్రమ ఫలాలను ప్రసాదిస్తుంది. ధనుస్సు రాశి యందు బృహస్పతి కేతువు మరియు శని భ లతో కలిసి ఉండుట వలన ఏర్పడిన గురు చండాల యోగము. దేశ ఆర్థికాభివృద్ధి మందగించే అవకాశం ఉంది. ఆర్ధిక సంస్థల అభివృద్ధి కుంటు బట్టే అవకాశం ఉంది. ఆర్థిక మోసాలు పెరుగుతాయి. పెట్టుబడులందు లాభాలు అనుకున్నంతగా ఉండదు. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలకు ఆర్ధిక వనరుల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ ల అభివృద్ధి నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. బృహస్పతి పై శని రాహువు మరియు కేతువుల ప్రభావం వలన ధర్మం కుంటు బట్టే అవకాశం ఉంది. పాలకులు ధర్మాన్ని మరచి రాజ్యపాలన చేసే అవకాశం ఉంది. పాలకులు ధర్మ మార్గమును విస్మరించు వారు మరియు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్ధిక రంగ సంస్థలకు చిక్కులు ఇంకనూ అధికమగుట. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది.


శని సంచార ఫలము:

ఈ సంవత్సరము పుష్య బహుళ అమావాస్య శుక్రవారము 24.01.2020 వరకు ధనుస్సు రాశిలో శని సంచరించును. అటుపిమ్మట వత్సరాంతం వరకు కూడాను శని మకర రాశి యందు సంచరించును.


ధనుస్సు రాశి యందు శని సంచార ఫలం:

ఫలము: రాజులకు పరస్పర విరోధము, యుద్ధ భయము, ప్రజలకు వ్యాధి భయము, క్షుద్భాద, శస్త్ర బాధలు.


మకర మందు శని సంచార ఫలం:

శతృ వృద్ధి, అధిక ధరలు, మంచి వర్షములు, దశార్ణ దేశములకు మరియు అడవులకు నష్టము, పురోహితులకు, బ్రాహ్మణులకు వైద్యులకు, నృపులకు స్వల్ప నష్టము.

కావున శని రెండు క్షేత్రము లందు సంచారము మధ్యమ ఫలములను ప్రసాదించును. 24.01.2020 నుండి మొదలు కుంభ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం మరియు వృశ్చిక రాశి వారికి అంతం.


మకర సంక్రాంతి పురుష లక్షణం:

పుష్య బ పంచమి సౌమ్యవారము 15.01.2020 ఉ 07:51 లకు, పూర్వా ఫల్గుణి నక్షత్రే, శోభన నామ యోగే, తైతుల కరణే, మకర లగ్నే, భానోర్ మకర ప్రవేశో భవతి.

అస్య పురుషస్య నామ ధేయం – మందాకినీ – రాజులకు భయం

కుంకుమోదక స్నానం – శుభం

తిథి ఫలం (తత్కాల పంచమి) – జయం

కృష్ణ పక్ష ఫలం – సుభిక్షం, క్షేమం, ఆరోగ్యం

నక్షత్ర ఫలం – పూర్వ ఫల్గుణి – ఉత్తర దేశమున క్షామం

వార ఫలం (బుధవారం) – రాజులకు నాశనం

కాల ఫలం (ఉదయం) – రాజులకు హాని

లగ్న ఫలం – మకర లగ్నం – రాజులకు యుద్ధం

చిత్ర వస్త్ర ధారణ ఫలం – శుభకరం

గోరోచన (హరిదళం) గంధ లేపన ఫలం – శుభకరం

మల్లి పుష్ప ధారణ ఫలం – శుభప్రదం

వజ్రాభరణ భూషణ ఫలం – వృష్టి నాశనం

అయః (ఇనుము) పాత్ర భోజన ఫలం – శుభకరం

అపూప (తేనెగూడు, తేనే) పాన ఫలం – స్ఫోటక భయం

జంబూ ఫల (ఆపిల్) భక్షణ ఫలం – సర్వ జంతువులకు సుఖప్రదం

దంత ధారణ ఫలం – చతుష్పాత్తులకు నాశనం

నీల ఛత్ర ధారణ ఫలం – రోగ భయం

గార్దభ వాహన ఫలం – రోగ భయం అధికం

వైరాగ్య ముఖ ఫలం – సువృష్టి

సుక్తావస్థ అవస్థ ఫలం – ధాన్యారిష్టం

పశ్చిమ దిగ్యాన ఫలం – పశ్చిమ ప్రాంతాలకు అరిష్టం

ప్రథమ ముహూర్తం – మధ్యమ ఫలం


శ్రీ వికారి నామ సంవత్సరంలో మౌడ్య నిర్ణయము:


శుక్ర మౌడ్యమి:

09.07.2019, ఆషాఢ శుక్ల అష్టమి, భౌమ వాసరే, శుక్ర మౌఢ్యారంభః

18.09.2019, భాద్రపద బహుళ చతుర్థి, భౌమ వాసరే, శుక్ర మౌఢ్య నివృత్తి


గురు మౌడ్యమి:

15.12.2019, మార్గశిర బ తృతీయ, ఆదివారం నాడు గురు మౌఢ్యారంభః

11.01.2020, పుష్య బహుళ పాడ్యమి, శనివారం నాడు గురు శుక్ర మౌఢ్య నివృత్తి


పుష్కర నిర్ణయము:

అస్మిన్ వర్షే కార్తీక శుద్ధ నవమి మంగళ వారం, 05.11.2019 నాడు బృహస్పతి ధనస్సులో ప్రవేశం. 05.11.2019 మొదలు 16.11.2019 వరకు ‘పుష్కర వాహిని (తాప్తి)’ నదికి పుష్కరాలు. ఇట్టి పుణ్య దినములందు పుష్కర వాహిని నదీ స్నానాలు, పిండ ప్రధానము, దాన ధర్మాదులు నిర్వహించినచో పితృ దేవతలు తరించెదరు. 

  

గ్రహణ నిర్ణయము:


ఖండ గ్రాస చంద్ర గ్రహణము:

ఆషాఢ పౌర్ణమి 16.07.2019 రాత్రి, 17.07.2019 ఉదయాత్పూర్వం, మంగళవారము, ఉత్తరాషాఢ నక్షత్ర యుక్త  ధనుస్సు మరియు మకర రాశులందు ‘అర్ధాధిక గ్రాస కేతుగ్రస్థ కృష్ణ వర్ణ అపసవ్య గ్రహణం’


గ్రహణ స్పర్శ రా 01-34 (17 తెల్లవారు)

మధ్య రా 03-02 (17 తెల్లవారు)

మోక్షం  రా 04-30 (17 తెల్లవారు)

ఆద్యన్త పుణ్యకాలం గం 02.56

ఈశాన్యే స్పర్శ. వాయువ్య దిశగా మోక్షం

బింబ దర్శన కలం గం 01.42


నిత్యభోజన ప్రత్యాబ్దికా నిర్ణయము:

నిత్య భోజన మరియు ప్రత్యాబ్దికములను యథావిధిగా నిర్వహించు కావచ్చును.

అర్ధాధిక గ్రాస మగుట వలన ఉత్తరాషాఢ నక్షత్రము నందు ౩ మాసములు ముహూర్తాలు నిర్ణయము చేయక పోవుట వలన శుభము. మరియు ఇట్టి ముహూర్తములను గ్రహించుట శస్త్ర సమ్మతం కూడా కాదు. 


గ్రహణ గోచార ఫలం: 

See the Image

  

గ్రహణ శాంతి:

ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు; వృషభ, మిథున, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి గ్రహణ దానము.


గ్రహణ దానము:

రాగి పాత్రలో ఆవుపాలు పోసి వెండితో చేసిన సూర్య, చంద్ర మరియు సర్ప బింబాలను అందులో వేసి సంకల్ప యుక్తముగా దానం చేయునది.26.12.2019 కేతు గ్రస్త అర్ధాధిక గ్రాస సూర్య గ్రహణం:


మార్గశిర బహుళ అమావాస్య గురువారము మూల నక్షత్ర యుక్త – అర్ధాధిక గ్రాస, కేతు గ్రస్త, కృష్ణ వర్ణ, అపసవ్య గ్రహణం. 


హైదరాబాద్ ప్రాంతము వారికి గ్రహణ సమయం:

స్పర్శ ప. 08:12

మధ్య ప. 09:38

మోక్ష ప. 11:22

(తూర్పు ఆగ్నేయ మధ్యే ఆగ్నేయాసన్నేస్పర్శ నైఋతి దిశి మోక్షః)


నిత్యభోజన ప్రత్యాబ్దికా నిర్ణయము:

నిత్యభోజన ప్రత్యాబ్ధికములు యథావిధిగా తగు కాలమున నిర్వహించు కోవాలి. అనగా పుష్య శుద్ధ పాడ్యమి కి చెందిన అబ్ధికములు మొక్షానంతరము స్నాన వచనాదులు చేసి నిర్వహించు కోవాలి.

అర్ధాదికము అగుట వలన మూలా నక్షత్రములో రాబోవు 3 మాసములు శుభ ముహూర్తములు గ్రహించుట శస్త్ర సమ్మతము కాదు.


గ్రహణ గోచారము: 

See the Image

  

గ్రహణ శాంతి:

మూల నక్షత్ర జాతకులు, ధనుస్సు, మకరం, వృషభం మరియు కన్య రాశులందు జన్మించిన వారికి గ్రహణ శాంతి. ఇట్టి వారు వెండితో చేసిన చన్ద్ర బింబమును, బంగారుతో చేసిన సూర్య మరియు నాగ ప్రతిమలను (యథాశక్తి వెండి తో చేసినవి కూడా) ఆవు నెయ్యి (చన్ద్ర గ్రహణానికి ఆవు పాలు) తో నిండిన రాగి పాత్ర యందు ఉంచి, తిల, వస్త్ర దక్షిణలతో సహా క్రింది విధంగా సంకల్పించి బ్రాహ్మణుడికి ధనం చేయాలి:


గ్రహణ సంకల్పం:

‘మమ జన్మరాశి, జన్మ నక్షత్ర, అరిష్ట స్థాన స్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక, ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభ ఫలప్రాప్యార్థం బింబ దానం కరిష్యే’


ఉపాకర్మ నిర్ణయం:

ఈ సంవత్సరంలో 09.07.2019, ఆషాఢ శుక్ల అష్టమి నుండి 18.09.2019, భాద్రపద బహుళ చతుర్థి వరకు శుక్ర మౌడ్యమి. శ్రావణ పౌర్ణమి నాడు శుక్ర మౌడ్యమి వలన అట్టి దినము నూతన ఉపాకర్మకు యోగ్యమైనది కాదు. మరి ఉపాకర్మ ఎప్పుడు చేసుకోవాలి?

ఆషాఢ పౌర్ణమి, 16.07.2019 రాత్రి చన్ద్ర గ్రహణము

కావున నూతనంగా ఉపనయనం చేసుకున్న వారు ఉపాకర్మ ఎప్పుడు చేసుకోవాలి?

శాఖ భేదము ననుసరించి యజుర్వేదులకు, ఋగ్వేదులకు మరియు సామవేదులకు భిన్నమైన ప్రతిపత్తులతో కూడిన రోజులలో ఉపాకర్మ నిర్వహించు కోవలసి ఉంటుందని నిర్ణయించి యున్నారు. శ్రావణ భాద్రపదములు మౌడ్యమి తో కూడి యుండుట వలన స్వాధ్యాయులకు అభావము ఏర్పడు చున్నది. కావున ఉపాకర్మ ఆషాఢ మాసము నందే నిర్వహించ వలయునని పలు గ్రంథ కారుల అభిప్రాయము. కావున ఉపాకర్మ ఆషాఢము నందే నిర్వహించు కోవాలి. ఇట్టి ఉపాకర్మ నిబంధన నూతనంగా ఉపనయనం అయిన వటువులకు మాత్రమే వర్తిస్తుంది కాని ప్రతి వర్షము నిర్వహించుకొను వారికి మాత్రమూ కాదు. అట్టి వారు యథావిధిగా ఉపాకర్మను నిర్వహించుకొన వచ్చును. వీరు శ్రావణ మాసము నందే ఉపాకర్మ నిర్వహించు కోవాలి. క్రొత్తగా ఉపనయనం చేసుకున్న వారు మాత్రం క్రింద వివరించ బడిన తిథులందు ఉపాకర్మ నిర్వహించు కోవాలి.

ఋగ్వేదులకు – ఆషాఢ శుద్ధ పంచమి 07.07.2019

యజుర్వేదులు – ఆషాఢ పౌర్ణమి 16.07.2019

సామవేదులు – ఆషాఢ శుద్ధ అష్టమి, హస్త, 09.07.2019

ఇట్టి తిథులు ఆయా శాఖల వారికి యోగ్యమైనవి.

16.07.2019 నాడు రాత్రి చన్ద్ర గ్రహణం ఏర్పడుట వలన ఇట్టి తిథి ఉపాకర్మకు యోగ్యమైనదా? అనే సందేహం ప్రతి ఒక్కరిలో వస్తుంది. కాత్యాయన మరియు గార్గ్య వచనానుసారం, ధర్మసింధు ప్రమాణమును అనుసరించి అర్ధరాత్రి కి పూర్వమందు గ్రహణ మరియు సంక్రాంతులు ఏర్పడిన ఎడల అందు నూతన ఉపాకర్మ దూషితమని మరియు అర్ధరాత్రి పరమందు గ్రహణ సంక్రమణలు ఏర్పడిన చొ ఆ రోజు ఉపాకర్మ నిర్వహించు కోవచ్చునని ప్రమాణము కలదు. కావున యజుర్వేదులు 16.07.2019 నాడు ఉపాకర్మ నిర్వహించు కొనుట శస్త్ర సమ్మతమైనదే.


కందాయ ఫలాలు: 

See the Image

  

ఫలము:

ఆది శూన్యే మహా వ్యాధిర్మధ్యశూన్యే మనో వ్యధా (మహాద్భయం) |

అంత్య శూన్యే ఫలం స్వల్పం త్రిశూన్యే నిష్ఫలం భవేత్ ||

విషమేత్వర్థ లాభం స్యాత్ సమేతు సమతా భవేత్ |

శూన్యే శూన్య మవాప్నోతి కందాయ ఫలమ్మీరితం ||

బేసి సంఖ్యా ధన లాభము, సరి సంఖ్యా సమ లాభము. సున్నా శూన్య ఫలము. మొదటి కందాయము శూన్యమైన ఎడల వ్యాధి, రెండవ కందాయము సున్నా అయిన ఎడల భయము, మూడవ కందాయము సున్నా అయిన ఎడల హాని. ఒక సంవత్సరంలో 12 మాసాలు, ప్రతి కందాయము 4 మాసాల కాలాన్ని సూచిస్తుంది. మొదటి కందాయము మొదటి నాలుగు మాసాలు, రెండవ కందాయము మధ్య నాలుగు మాసాలు, చివరి కందాయము చివరి నాలుగు మాసాలు.


ఆదాయ వ్యయాలు:

See the Image


రాజ పూజ్య రాజావమానము: 

See the Image


  

శ్రీ వికారి నామ సంవత్సర ఫలం:


శ్రీ వికారి నామ చైత్ర శుద్ధ ప్రతిపద 05.04.2019 మ 14:21:12 కు ఆరంభం. కర్కాటక లగ్న కుంభ నవాంశము. లగ్నాధిపతి భాగ్య స్థానమున సూర్య భ తో కలిసి ఉండుట. షష్ఠ స్థానమున గురు శని కేతువులు, అష్టమ స్థానమున బుధ మరియు శుక్ర భ, లాభ స్థానమున కుజ మరియు వ్యయ స్థానమున రాహువు భ. బుధుడు షడ్బలము లందు అత్యంత బలహీనుడై ఉండుట.


‘వికారి’ అనగా నిరంతరం మారునది, మార్పు గలది, అస్థిరమైనది, అస్వాభావికమైనది, అసాధారణ మైనది అనే వివిధ అర్థాలు ఉన్నాయి. వర్ష లగ్న వశాత్ గల గ్రహ స్థితులు మరియు యోగములను చూసిన ఎడల ఇది సత్యమే అనిపిస్తున్నది. వికారి నామ సంవత్సరము కొన్ని అనుకోని మార్పులను, అస్వాభావిక అసాధారణ మార్పులను సూచించు చున్నది. రాజ్యాన్ని ఏలే పాలకులు ఎవరైన నేమి ఈ సంవత్సరం మాత్రం చాలా విధములైన భిన్నమైన, అసాధారణ అస్వాభావిక పాలనను మనము చూసే అవకాశం ఉంది. వ్యవస్థలో మార్పు సహజమే కాని అట్టి మార్పు అసాధారణ మరియు అస్వాభావిక మార్పు అయిన ఎడల ప్రజలలో అశాంతి పెరిగే అవకాశముంది.


ప్రధానంగా 6వ భావంలో గురు శని మరియు కేతువుల స్థితి మరియు వ్యయ స్థానమున రాహువు – అధర్మ మరియు ప్రజా వ్యతిరేక పాలనను సూచించు చున్నది. భ్రష్టాచారం పెరిగే అవకాశం ఉంది. పాలకులు మరియు ప్రజలు నీచమైన ఆలోచనలు కలిగి ఉండు వారగు సూచనలున్నాయి. ప్రజల మరియు ప్రభుత్వ ఆదాయం చక్కగా ఉన్నా కూడాను ఇట్టి ధనము అధిక శాతము దుర్వినియోగం అయ్యే అవకాశం అధికముగా సూచించు చున్నది. సంవత్సర ద్వితీయార్ధంలో అభివృద్ధి ఎక్కువగా మందగించు సూచనలున్నాయి. ప్రభుత్వ ఖజానా ఖాళీ అగుట మరియు క్రొత్త పెట్టుబడులకు ప్రపంచ బ్యాంకు పై ఆధారపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తీవ్రవాదము కాస్త తగ్గు సూచనలున్నాయి. శ్రీ వికారి యందు కొంత వర్షాభావ పరిస్థితి సూచించుట వలన వ్యవసాయదారులకు నిరాశాజనకంగా ఉండే అవకాశం ఉంది. పొరుగు దేశ మరియు రాష్ట్ర విభేదాలు అధికమగు సూచనలున్నాయి. ఆర్ధిక రంగ సంస్థలు, ఆర్ధిక నిపుణులు, కళాకారులు, స్వయం ఉపాధులందు ఉన్న వారి అభివృద్ధి మందగతిన సాగుతూ ఉంటుంది. దేశ మరియు రాష్ట్రము ఆర్థిక వ్యవహారములందు కొన్ని అనూహ్యమైన అనుకోని మార్పులను ఎదుర్కోను సూచనలున్నాయి. ఖనిజ రంగము చక్కగా అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రైవేటు రంగ సంస్థలందు ఉద్యోగమూ చేయు వారు జీత భత్యాలు తక్కువ పొందుట మరియు అసంతృప్తితో ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుట. ప్రభుత్వాలు మరియు ప్రజలు ఆశయ సాధనకు ఊహించిన దానికంటే ఎన్నో రేట్లు ఎక్కువగా శ్రమించ వలసి ఉంటుంది. ఆర్ధిక మోసాలు, ఆర్ధిక సంస్థలందు ఒడుదుడుకులు అధికంగా ఉంటాయి. ఇట్టి ప్రతికూల ఫలితాలు నవంబర్ 2019 నుండి అధికంగా ఉంటాయి.


మేషాది ద్వాదశ రాశుల వారికి గోచర ఫలాలు:

(ఇట్టి గోచార ఫలాలు అందరికి ఒకే విధంగా ఉండవు. ఇట్టి ఫలితాలను జాతక రీత్యా ఉన్న యోగాలు మరియు జన్మ కాల దశలు ప్రభావితం చేయు సూచనలున్నాయి. తత్ప్రభావము వలన ఇట్టి శుభాశుభ ఫలాలు మారు సూచనలున్నాయి)


శని భ ధనుస్సు రాశిలో జనవరి 2020 వరకు సంచరించుట మరియు అటుపిమ్మట వత్సరాంతం వరకు మకర రాశి యందు సంచరించుట. వత్సరాంతం వరకు రాహువు భ మిథున రాశిలోను సంచరించును. గురు భ నవంబర్ వరకు వృశ్చిక రాశి యందును మరియు అటుపిమ్మట వత్సరాంతం వరకు ధనుస్సు రాశి యందును సంచరించును.


మేషం:

వత్సరాంతం వరకు తృతీయ స్థానమున రాహువు శుభుడు. నవంబర్ వరకు అష్టమ స్థానమున గురు భ ఆశుభుడు. వత్సరాంతం వరకు శని కూడా ప్రతికూలుడు.

గురు గోచారము: వీరికి నవంబర్ వరకు మిశ్రమ లేదా ప్రతికూల ఫలాలు అధికంగా ఉంటాయి. అవకాశాలు చివరి క్షణమున చేజారిపోవుట. అనారోగ్యము. శరీరము నందలి గ్రంథులు మరియు హార్మోనులకు చెందిన చిక్కులు అధికం. వీరికి నవంబర్ వరకు గృహ సమస్యలు అధికం, రాజ దండన భయం, హాని, కోపము, అనూహ్య అవరోధాలు, చోరభయం. అటుపిమ్మట ఇట్టి చిక్కులు కాస్త తగ్గి శుభ ఫలాలు అధికమగుట. కార్య సిద్ధి, తలపెట్టిన పనులందు విజయము, పదోన్నతలు, స్థిరాస్తులందు లాభము, స్త్రీ సౌఖ్యము, గృహము నందు శుభ కార్యాలు అధికంగా ఉంటాయి.

శని గోచారము: వత్సరాంతం వరకు శని భ ప్రతికూలుడగుట వలన – దుఃఖము, ఆదాయము క్షీణించుట, తలచిన పనులు కుంటుబట్టే అవకాశం, లాభించే చోట నష్టము అధికం. మనోవ్యాకులత, పాప కర్మాచరణ, ఉద్యోగ భంగము, వ్యవహార నాశనము ఇత్యాది ప్రతికూల ఫలములు అధికముగా ఉండు సూచనలు. ఇట్టి ప్రతికూలతలు నవంబర్ 2019 వరకు అధికముగాను అటుపిమ్మట గురు మరియు రాహువుల అనుకూల సంచారము వలన కొంత ఉపశమనము లభించు సూచనలున్నాయి. ఈ సంవత్సరము మేష రాశి యందు జన్మించిన విద్యార్థులు ఎక్కువగా కష్టపడ వలసి ఉంటుంది.

రాహువు గోచారము: తృతీయ స్థానమున రాహువు శుభుడు. చక్కని కార్య విజయము ఉంటుంది. కాని చెవి ముక్కు మరియు గొంతుకు చెందిన చిక్కులు ఎదురగు సూచనలు.


వృషభము:

ఇట్టి రాశిలో జన్మించిన వారికి నవంబర్ వరకు గురు భ. శుభుడు. అటుపిమ్మట వత్సరాంతం వరకు కూడా అష్టమ స్థానమున ప్రతికూలుడు. శని భ వత్సరాంతం వరకు కూడా ప్రతికూలుడు. రాహువు కూడా వత్సరాంతం వరకు ప్రతికూలుడు. ఈ సంవత్సరం అంతా కూడాను మీకు మిశ్రమ నుండి ప్రతికూల ఫలములు అధికముగా ఉండే సూచనలున్నాయి.

గురు గోచారము: నవంబర్ వరకు గురు భ శుభుడగుట వలన కార్య సిద్ధి చక్కగా ఉంటుంది. కాని నవంబర్ నుండి గురు శని భ ఉభయులు ప్రతికూలులగుట వలన జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ మొదలు ప్రతికూల గోచారము వలన అవకాశాలు చివరి క్షణమున చేజారిపోవుట. అనారోగ్యము. శరీరము నందలి గ్రంథులు మరియు హార్మోనులకు చెందిన చిక్కులు అధికం. గృహ సమస్యలు అధికం, రాజ దండన భయం, హాని, కోపము, అనూహ్య అవరోధాలు, చోరభయం. 

శని గోచారము: ప్రతి కూల శని భ వలన అనుకోని ఆపదలు, అనారోగ్యము, జీర్ణకోశమునకు చెందిన చిక్కులు, స్వజనులకు చిక్కులు, ద్వేషాలు, నిష్ఠూరము, అవమానము, దుఃఖము, ఆదాయము క్షీణించుట, పెట్టుబడులు నిలచిపోవుట, పనులు మందగించుట. జనవరి నుండి భాగ్య స్థానమున ప్రతికూలుడగుట వలన పితృ పరమైన అనారోగ్యము. దురదృష్టము వెంటాడుట.

రాహువు గోచారము: ప్రతికూల రాహువు గోచరము వలన సన్నిహితుల ద్వారా మోసాలు, ఆర్థిక లావాదేవీలందు ఒడుదుడుకులు మరియు మోసాలు. నేత్ర సంబంధ చిక్కులు, చోర భయము అధికముగా ఉంటుంది. ఇట్టి రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరంలో పెట్టుబడుల పరంగా జాగ్రత్తగా ఉండాలి. సన్నిహితులతో జరుపు లావాదేవీలందు జాగ్రత్తగా ఉండాలి.


మిథునము:

మిథున రాశి వారికి వత్సరాంతం వరకు కూడా జన్మ రాశిలో రాహువు ప్రతికూలుడు. నవంబర్ వరకు గురు ప్రతికూలుడు, అటుపిమ్మట వత్సరాంతం వరకు శుభుడు. వత్సరాంతం వరకు కూడా శని ప్రతికూలుడు. వీరికి మిశ్రమ నుండి శుభ ఫలాలు అధికముగా ఉంటాయి.

గురు గోచారము: నవంబర్ వరకు గురు భ ప్రతికూలుడు అగుట వలన: ఉద్యోగ పరమైన ప్రతికూలతలు, అధిక ధన వ్యయము, మిత్ర భేదము ఇత్యాది ప్రతికూలతలు అధికం. అటుపిమ్మట వత్సరాంతం వరకు శుభుడగుట వలన చక్కని కార్యసిద్ధి, పదోన్నతులు, అధిక ధన లాభములు, శుభ కార్యములు, శుభ చింతన అధికం, సంతాన రీత్యా అనుకూలతలు అధికం, జామిత్ర అనుకూలత. శారీరిక సౌఖ్యం. సంపూర్ణ ఆనందం.

శని గోచరము: ప్రతికూల శని భ వలన ప్రయాణాలు అధికం, పనులు మందగతిన సాగుట, సమయానుసారముగా వెనకబడుట, భాగస్వాములతో స్వల్ప విభేదాలు. నవంబర్ నుండి అష్టమ శని ప్రతికూలుడగుట వలన స్వల్ప ప్రమాదాలు, అనారోగ్యము, జీర్ణ కోశానికి చెందిన చిక్కులు, అధిక ధన వ్యయము, ద్వేషాలు, నేరారోపణ, నిష్ఠూరము, అవమానాలు అధికము. ఇట్టి జాతకులు ప్రయాణాలు మరియు వాహనాలు తోలునపుడు జాగ్రత్తగా ఉండాలి.

రాహువు గోచారము: వత్సరాంతం వరకు కూడా జన్మ రాశిలో రాహువు ప్రతికూలుడు అగుట వలన కొంత అనిశ్చితి కొనసాగు సూచనలున్నాయి. మానసిక ఒత్తిడులు అధికంగా ఉంటాయి. అల్లర్జీలు మరియు చర్మ సంబంధిత చిక్కులు అధికంగా ఉండే సూచనలున్నాయి


కర్కాటకము:

కర్కాటక రాశి వారికి నవంబర్ వరకు గురు భ శుభుడు, అటుపిమ్మట వత్సరాంతం వరకు 6 వ స్థానమున ప్రతికూలుడు. జనవరి వరకు శని భ 6 వ స్థానమున శుభుడు, అటుపిమ్మట వత్సరాంతం వరకు సప్తమ స్థానమున ప్రతికూలుడు. వత్సరాంతం వరకు రాహువు ద్వాదశమున ప్రతికూలుడు. ఇట్టి రాశిలో జన్మించిన వారికి శుభ ఫలితాలు అధికముగాను ప్రతికూలతలు స్వల్పముగాను ఉండు సూచనలున్నాయి.

గురు గోచారము: నవంబర్ వరకు మీ కార్య సిద్ధి చక్కగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా అధిక అనుకూలత, ధర్మ కార్యాచరణ, శుభ కార్యములు, అధిక ధన లాభము, సంపూర్ణ సంతోషము ఉంటాయి. నవంబర్ నుండి ప్రతికూలుడగుట వలన స్వల్ప అనారోగ్యము, శరీరము నందలి గ్రంథులు, జీర్ణ కోశము, కాలేయము, శ్వాస కోశమునకు చెందిన చిక్కులు. ఉద్యోగ రీత్యా ప్రతికూలతలు, యజమానుల ద్వారా ఇబ్బందులు, రాజదండన భయం, సన్నిహితులతో మనస్పర్థలు అధికంగా ఉంటాయి. అధిక ధన వ్యయము.

శని గోచారము: జనవరి వరకు శని భ శుభుడు అగుట వలన ఆదాయము చక్కగా ఉంటుంది. ధన మరియు ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణ అవకాశాలు, బంధు జన సంతోషము, కార్య సాఫల్యము, శతృ పరాజయము ఇత్యాది శుభ ఫలితములు అధికముగా ఉంటాయి. జనవరి నుండి వత్సరాంతం వరకు శని ప్రతికూలుడగుట వలన పనులు మందగించుట, అధిక శారీరిక శ్రమ. పదోన్నతులు వెనకబడుట, మానసిక చింత అధికం, భాగస్వాముల ద్వారా ప్రతికూలతలు, నడుము మరియు కీళ్ళకు చెందిన చిక్కులు, జీర్ణ శక్తి మందగించుట ఇత్యాది ప్రతికూలతలు అధికముగా ఉండు సూచనలున్నాయి

రాహువు గోచారము: వత్సరాంతం వరకు రాహువు వ్యయ స్థానమున ప్రతికూలుడగుట వలన ఆర్ధిక మోసాలు. అధిక ధన వ్యయము. ఊహించని ఖర్చులు. పొదుపు కరిగి పోవుట. ఆర్ధిక మోసాలు. పెట్టుబడుల పరముగా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఒడుదుడుకులు మోసాలు.


సింహము:

సింహ రాశిలో జన్మించిన వారు శ్రీ వికారి నామ సం లో శుభ ఫలములు అధికముగా పొందు వారగు సూచనలున్నాయి. లాభ స్థానమున రాహువు వత్సరాంతం వరకు శుభుడు. చతుర్థ స్థానమున గురు భ నవంబర్ వరకు ప్రతికూలుడు, అటుపిమ్మట వత్సరాంతం వరకు పంచమ స్థానమున శుభుడు. శని పంచమ స్థానమున జనవరి వరకు ప్రతికూలుడు అటుపిమ్మట వత్సరాంతం వరకు శుభుడు.

గురు గోచారము: నవంబర్ వరకు చతుర్థ స్థానమున గురు ప్రతికూలుడగుట వలన, విద్యార్థులకు అనుకూలముగా ఉన్నా ఇతరత్రా ప్రతికూల ఫలములు లభించు సూచనలున్నాయి. ఆదాయానికి మించిన వ్యయం, స్థాన భ్రంశం, ధన నష్టం, మాతృ అనారోగ్యం. నవంబర్ మొదలు శుభుడగుట వలన మనోవాంఛ సిద్ధి, దైవానుగ్రహం, కార్య విజయం, పరీక్షలందు విజయం, కీర్తి ప్రతిష్టలు, శారీరిక సౌఖ్యం, చక్కని సంతాన సౌఖ్యం ఇత్యాది శుభ ఫలములు అధికముగా పొందు వారగుదురు.

శని గోచారము: పంచమ స్థానమున శని కేతువుల సంచారం జనవరి వరకు ప్రతికూలమగుట వలన స్వల్ప అనారోగ్యము, శ్వాస కోశము, జీర్ణకోశము నకు చెందిన చిక్కులు, అధిక ధన వ్యయము, పెట్టుబడులు నిలచిపోవుట, ఊహించని అనారోగ్యము, మానసిక చింత, భయం, అధిక శ్రమ, సంతాన ప్రతికూలత మరియు వారికి అనారోగ్యము ఇత్యాది ప్రతికూల ఫలములు. తిరిగి జనవరి నుండి వత్సరాంతం వరకు శుభుడగుట వలన కార్యానుకూలత, ధన ధాన్య సమృద్ధి, తలపెట్టిన పనులు విజయవంత మగుట, బంధు జన సంతోషము, సర్వత్రా సంతోషం. శతృ పరాభవం ఇత్యాది శుభ ఫలములు అధికముగా ఉంటాయి.

రాహువు గోచారము: వత్సరాంతం లాభ స్థానమున రాహువు శుభుడు. చక్కని కార్య విజయము. ఉద్యోగ మరియు వ్యాపారాభివృద్ధి. సర్వత్రా శుభప్రదమైన ఫలాలు.


కన్య:

కన్యా రాశి వారికి వత్సరాంతం వరకు కూడా ప్రతికూల ఫలములు అధికముగా ఉండు సూచనలున్నాయి. తృతీయ స్థానమున గురు నవంబర్ వరకు ప్రతికూలుడు, అటుపిమ్మట వత్సరాంతం వరకు చతుర్థ స్థానమున ప్రతికూలుడు. జనవరి వరకు అర్ధాష్టమ స్థానమున శని ప్రతికూలుడు, అటుపిమ్మట వత్సరాంతం వరకు పంచమ స్థానమున ప్రతికూలుడు. వత్సరాంతం వరకు రాజ్య స్థానమున రాహువు ప్రతికూలుడు. కన్యా రాశికి ఈ సంవత్సరం దాదాపుగా ప్రతికూల ఫలములే అధికముగా ఉండు సూచనలున్నాయి.

గురు గోచారము: పట్టుదల ధైర్యము తగ్గుట, కార్య నాశనము, ఉద్యోగ భంగము, స్థాన చలనము, బంధు విరోధము, శారీరిక శ్రమ అత్యధికం. నవంబర్ నుండి మొదలు బంధు మరణ వార్తా, మాతృ పరమైన చిక్కులు మరియు అనారోగ్యము, స్థాన చలనము, ఉద్యోగ భంగము.

శని గోచారము: అర్ధాష్టమ శని వలన వృధా సంచారము, విపరీతమైన శారీరిక శ్రమ, అనారోగ్యము, విచారము, బంధు మిత్ర పీడ, మాతృ అనారోగ్యము మరియు పీడ, వ్యవహార నాశనము. ఉద్యోగ రీత్యా పలు విధములైన చిక్కులు. పనులు సమయానుసారముగా వెనకబడుట. శ్రమతో కూడిన ఫలములు. అధిక శ్రమ మరియు స్వల్ప ఫలము. ఇట్టి ప్రతికూలతలు జనవరి వరకు అధికముగాను మరియు జనవరి నుండి పంచమ శని వలన – ఆర్ధిక వనరులు తగ్గుట, అనారోగ్యము, మానసిక చింత, సంతాన పరమైన ప్రతికూలతలు, శ్వాస కోశము మరియు గర్భాశయమునకు చెందిన చిక్కులు. మానసిక ఒత్తిడులు అధికం. మతిమరుపులకు అధికం.

రాహువు గోచారము: వత్సరాంతం వరకు రాహువు దశమ స్థానమున ప్రతికూలుడగుట వలన అనుకోని ఒడుదుడుకులు, అవకాశములు చివరి క్షణమున చేజారిపోవుట ఇత్యాది ప్రతికూలతలు అధికము.

కన్యా రాశి యందు జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రతికూలతలు అధికంగా ఉంటాయి. వివాహ ప్రయత్నములందు చిక్కులు అధికంగా ఉంటాయి.


తుల:

తులా రాశిలో జన్మించిన వారికి నవంబర్ వరకు ద్వితీయ స్థానమున గురు శుభుడు, అటుపిమ్మట వత్సరాంతం వరకు తృతీయ స్థానమున ప్రతికూలుడు. జనవరి వరకు తృతీయ స్థానమున శని భ శుభుడు మరియు అటుపిమ్మట వత్సరాంతం వరకు అర్ధాష్ఠమ స్థానమున ప్రతికూలుడు. వత్సరాంతం వరకు భాగ్య స్థానమున రాహువు ప్రతికూలుడు. తులా రాశి వారికి ఈ సంవత్సరంలో దాదాపుగా శుభ ఫలితాలు అధికముగాను వత్సరాంతంలో ప్రతికూలతలు గోచరమగు సూచనలున్నాయి.

గురు గోచారము: నవంబర్ వరకు గురు భ శుభుడగుట వలన చక్కని కార్య సిద్ధి, వాక్శుద్ది, ధన లాభము, గృహము నందు శుభ కార్యములు, మిత్రులు మరియు బంధువుల ద్వారా ప్రయోజనం, సర్వత్రా సంతోషం. నవంబర్ నుండి పట్టుదల మరియు ధైర్యం కాస్త తగ్గుట, భ్రాతృ విరోధము, అనారోగ్యము, థైరాయిడ్ సమస్యలు, వ్యవహార నాశనము, బంధు విరోధము ఇత్యాది ప్రతికూలతలు అధికముగా ఉండు సూచనలున్నాయి. తులా రాశిలో జన్మించిన వారికి నవంబర్ వరకు వివాహ ప్రయత్నములందు అనుకూలత అధికము.

శని గోచారము: జనవరి వరకు శని శుభుడగుట వలన చక్కని కార్యసిద్ధి, పదోన్నతులు, సర్వత్రా సంతోషం, కీర్తి మరియు ధన లాభం, శ్రమకు తగిన గుర్తింపు, పదోన్నతులు, ఉద్యోగ ప్రయత్నములు ఫలించుట. ప్రయాణములు లభించుట ఇత్యాది శుభ ఫలములు. మరియు జనవరి నుండి అర్ధాష్ఠమ స్థానమున ప్రతికూలుడగుట వలన కార్య భంగము, శ్రమతో కూడిన ఫలితము, అధిక శ్రమ మరియు స్వల్ప ఫలము, అనారోగ్యము, దేహ మరియు శారీరిక పీడ. శ్రమకు తగిన ఫలితము లభించక పోవుట, విద్యార్థులకు ఇట్టి చిక్కులు అధికం. మాతృ సంబంధమైన అనారోగ్యము, పదోన్నతులు నిలచిపోవుట ఇత్యాది ప్రతికూల ఫలములు అధికముగా ఉండు సూచనలున్నాయి.

రాహువు గోచారము: భాగ్య స్థానమున వత్సరాంతం వరకు రాహువు ప్రతికూలుడగుట వలన అదృష్టము కలసి రాకపోవుట, అవకాశములు చివరి క్షణంలో చేజారిపోవుట అలసత్వము, కీర్తి నష్టము, మీ వల్ల అన్యులకు చిక్కులు.


వృశ్చిక:

వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో శుభ ఫలములను అధికముగా పొందు సూచనలున్నాయి. అయితే ఇట్టి ఫలములు ద్వితీయార్థంలో అధికముగా ఉంటాయి. నవంబర్ వరకు జన్మ గురు ప్రతికూలుడు మరియు నవంబర్ నుండి ద్వితీయ స్థానమున శుభుడు. జనవరి లో వీరి ఏలినాటి శని అంతం కానుంది. కావున జనవరి నుండి శని శుభుడు. అష్టమ స్థానమున సంచరిస్తున్న రాహువు వత్సరాంతం వరకు కూడా ప్రతికూలుడు.

గురు గోచారము: నవంబర్ వరకు జన్మ రాశి స్థితి గురు భ ప్రతికూలుడగుట వలన స్థాన చలనము, నివాసంలో మార్పులు, వృధా సంచారం, మానసిక చింత అధికం, ధన మరియు వస్తు నాశనం, అనారోగ్యం, ఉద్యోగ చింత ఇత్యాది ప్రతికూలతలు అధికంగా ఉంటాయి. నవంబర్ నుండి వత్సరాంతం వరకు ద్వితీయ స్థానమున శుభుడగుట వలన కుటంబ సౌఖ్యము, కీర్తి వృద్ధి, చక్కని ఆర్థికాభివృద్ధి, ధన లాభములు, ప్రమోషన్ లు, ఉద్యోగ ప్రయత్నములు ఫలించుట. విద్యార్థులకు అనుకూలత. మేధస్సు పెంపొందుట, మిత్రుల వలన లాభము, సర్వత్రా సంతోషం ఇత్యాది శుభ ఫలములు అధికంగా ఉంటాయి.

శని గోచారం: ఏలినాటి శని వలన ఆర్థిక వనరులు తగ్గుట, అధిక ధన వ్యయము, ఋణ బాధలు అధికం. మిత్రుల ద్వారా చిక్కులు, బంధు మిత్ర విరోధము. కీర్తి నాశనము. దూషణలు, బంధు విరోధము, అనారోగ్యము, విద్యార్థులకు చిక్కులు ఇత్యాది ప్రతికూల ఫలములు అధికము. కాని జనవరి నుండి తృతీయ స్థానమున శుభుడగుట వలన సర్వత్రా శుభ ఫలితములు అధికం. ఇన్ని రోజులుగా ఆగిపోయిన పనులు వేగాన్ని పుంజుకొనుట, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట, ఆగిపోయిన ధనము తిరిగి పొందుట, కీర్తి ప్రతిష్టలు, పదోన్నతులు, విద్యార్థులకు అనుకూలము, ప్రయాణ మరియు వ్యవహార లాభము, చక్కని ఆరోగ్యము, సర్వత్రా ఆనందము ఇత్యాది శుభ ఫలితములు అధికముగా ఉండు సూచనలున్నాయి.

రాహు గోచారము: వత్సరాంతం వరకు అష్టమ స్థానమున ప్రతికూలుడగుట వలన అనుకోని అనారోగ్య సమస్యలు, ఎలర్జీ లకు చెందిన చిక్కులు, విషపు ఆహార చిక్కులు, జీర్ణకోశమునకు చెందిన చిక్కులు, ఊహించని ప్రమాదాలు లేదా అనారోగ్య సమస్యలు. ఆర్థిక మోసాలు ఇత్యాది ప్రతికూల ఫలములు.


ధనుస్సు:

ఇట్టి రాశి వారికి వత్సరాంతం వరకు కూడా గురు భ సంచారము ప్రతికూలము. జన్మ రాశిలో సంచరిస్తున్న శని భ. వలన ఏలినాటి శని, మరియు జనవరి నుండి ద్వితీయ స్థానమున శని వత్సరాంతం వరకు ప్రతికూలుడు. సప్తమ స్థానమున రాహువు మరియు రాశి స్థితి కేతువు వత్సరాంతం వరకు ప్రతికూలురు.

గురు గోచారము: నవంబర్ వరకు వ్యయ స్థానమున అటుపిమ్మట వత్సరాంతం వరకు జన్మ రాశి యందు ప్రతికూలుడగుట వలన వృధా సంచారము, దూర ప్రయాణాలు, ఉద్యోగ భంగ యోగాలు, వ్యర్థ ప్రయాణములు, స్థాన చలనము, నివాసంలో మార్పు, వ్యర్థ సంచారము, వస్తు నాశనము ఇత్యాది ప్రతికూలతలు అధికముగా ఉంటాయి. కాని రాశ్యాధిపతి అగుట వలన ఇట్టి ఇబ్బందులు తక్కువగానే ఉండు సూచనలున్నాయి.

శని గోచారము: ఏలినాటి శని వలన పనులందు మాంద్యత, శ్రమతో కూడిన ఫలములు, సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలములు, శారీరిక బాధలు, అనారోగ్యము, కీళ్ళకు మరియు చర్మ సంబంధిత చిక్కులు, తేజస్సు క్షీణించడం, భార్య లేదా భర్తలకు అనారోగ్యం, ప్రమాదాలు, మనశ్చింత అధికం. జనవరి నుండి ద్వితీయ స్థానమున ప్రతికూలుడగుట వలన అధిక ధన వ్యయం, గౌరవ నాశనం, ధన హాని, పరస్పర దూషణలు, అనారోగ్యము, కుటుంబ కలతలు, ఋణ బాధలు, నోరు మరియు దంత సమస్యలు, నేత్ర సంబంధిత చిక్కులు, ఉన్నత విద్య యందు చిక్కులు ఇత్యాది ప్రతికూలతలు అధికముగా ఉండు సూచనలున్నాయి.

రాహువు గోచరము: అనుకోని ఒడుదుడుకులు, అవకాశాలు చేజారిపోవుట, మానసిక చింత, అనిశ్చితి, భాగస్వాములతో చిక్కులు. ఉద్యోగ మరియు వ్యాపార పరముగా ఒడుదుడుకులు.


మకరము:

మకర రాశిలో జన్మించిన వారికి నవంబర్ వరకు ఏకాదశ స్థానమున గురు భ శుభుడు, అటుపిమ్మట వ్యయ స్థానమున వత్సరాంతం వరకు ప్రతికూలుడు. వీరికి ఏలినాటి శని వలన జనవరి వరకు వ్యయ శని ప్రతికూలుడు, అటుపిమ్మట వత్సరాంతం వరకు జన్మ శని ప్రతికూలుడు. ఇట్టి రాశిలో జన్మించిన వారికి 6 వ స్థానమున రాహువు వత్సరాంతం వరకు కూడా శుభుడు.

గురు గోచరము: నవంబర్ వరకు ఏకాదశ గురు శుభుడు అగుట వలన అన్ని విధాలుగా లాభకరం, చక్కని కార్యానుకూలత, తేజో వృద్ధి, జ్ఞాపక శక్తి పెంపొందుట, విద్యార్థులకు ఆశించిన ఫలితాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. శుభ కార్యాలు. వివాహ ప్రయత్నాలు ఫలించుట, విజయ ప్రాప్తి, పదోన్నతులు ఇత్యాది శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి. నవంబర్ మొదలు వ్యయ గురువు ప్రతికూలుడగుట వలన స్థాన చలనము, ఉద్యోగ వృత్తి మరియు పదవీ భంగము, వ్యర్థ ప్రయాణాలు, మానసిక చింత, గురు భేదము, జ్ఞాన హీనత, ధార్మిక కార్యములందు అధిక ధన వ్యయము ఇత్యాది ప్రతికూల ఫలములు అధికముగా ఉంటాయి.

శని సంచారం: ఏలినాటి శని వలన ఖర్చులు అధికం, వృధా సంచారం, అనవసరమైన ఖర్చులు, సన్నిహితులతో విభేదాలు. పెట్టుబడులు నిలిచి పోవుట. మానసిక చింత. శ్రమతో కూడిన ఫలాలు. సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలాలు. ఫలితం లేని ప్రయాణాలు. శారీరిక బాధలు, అనారోగ్యము, కీళ్ళకు మరియు చర్మ సంబంధిత చిక్కులు, తేజస్సు క్షీణించడం, భార్య లేదా భర్తలకు అనారోగ్యం, ప్రమాదాలు, మనశ్చింత అధికం. కాని శని భ రాశ్యాధిపతి అగుట వలన ఇట్టి చిక్కులు వీరికి స్వల్పముగానే ఉండు సూచనలున్నాయి.

రాహువు గోచారము: 6 వ స్థానమున వత్సరాంతం వరకు కూడా రాహువు శుభుడు అగుట వలన కార్య విజయము, శతృ నాశనము ఇత్యాదిగా గల శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి.


కుంభము:

కుంభ రాశి వారికి ప్రస్తుత దశమ గురు సంచారము ప్రతికూలము. కానీ నవంబర్ మొదలు ఏకాదశ గురువు శుభుడు. ఇట్టి రాశి వారికి ఏకాదశ శని జనవరి వరకు శుభుడు, అటుపిమ్మట వ్యయ స్థానమున ఏలినాటి శని ప్రారంభం. వీరికి పంచమ రాహువు ప్రతికూలుడు.

గురు గోచారం: దశమ స్థానమున నవంబర్ వరకు ప్రతికూలుడగుట వలన కార్య విఘ్నత అధికం, ఉద్యోగ వ్యాపార భంగం, ఉద్యోగ వ్యాపార మార్పు, మనశ్శాంతి లోపించుట, ధనార్జన చక్కగానే ఉంటుంది. ఉద్యోగ పరంగా బెంగ పెరుగుతుంది. క్రొత్త ఉద్యోగాలు మరియు వ్యాపారాలు చేపట్టునపుడు జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ మొదలు ఏకాదశ లాభ స్థానమున వత్సరాంతం వరకు శుభుడగుట వలన శుభ ఫలాలు అధికం. అన్నింటా లాభం, కార్య విజయం, ఉద్యోగ లాభం, వ్యాపారాభివృద్ధి, ధన మరియు కీర్తి లాభం, శుభ కార్యాలు, విద్యార్థులకు అధిక శుభ ఫలం. తేజో వృద్ధి, పదోన్నతులు ఇత్యాది శుభ ఫలాలు అధికం.

శని గోచారం: జనవరి వరకు శని భ ఏకాదశ లాభ స్థానమున శుభుడగుట వలన అత్యంత శుభ ఫలాలు ఉంటాయి. చక్కని కార్యానుకూలత, విజయ ప్రాప్తి, వృత్తి మరియు వ్యాపార లాభము, కీర్తి మరియు తేజో వృద్ధి, మనో వాంఛ నెరవేరుట, సర్వత్రా ఆనందం. జనవరి నుండి వ్యయ శని వలన ఏలినాటి శని ప్రారంభం. అధిక ధన వ్యయం, వృధా సంచారం, విచారము, వ్యయ ప్రయాసలు, అధిక శ్రమతో కూడిన ఫలాలు. స్థాన చలనం. కీళ్ళకు మరియు చర్మ సంబంధిత చిక్కులు (ప్రధాన కాళ్ళకు చెందిన) ఇత్యాది ప్రతికూల ఫలాలు ఉంటాయి. కాని జన్మ రాశ్యాధిపతి గా ఇట్టి రాశిని వారిని ఎక్కువగా బాధపెట్టడు. కావున ప్రతికూలతలు తక్కువగానే ఉండు సూచనలున్నాయి.

రాహువు గోచారము: పంచమ స్థానమున సంచరిస్తున్న రాహువు మానసిక చింత మరియు ఒత్తిడిని అధికముగా ప్రసాదించు సూచనలున్నాయి. వత్సరాంతం వరకు కూడా ఇట్టి చిక్కులు ఉంటాయి. అనిశ్చితి, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు. అనాలోచిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి.


మీనము:

మీన రాశి వారికి నవంబర్ వరకు భాగ్య స్థానమున గురు గోచారము శుభప్రదము. తదనంతరం వత్సరాంతం వరకు దశమ స్థానమున ప్రతికూలుడు. శని భ గోచారము జనవరి వరకు ప్రతికూలం అటుపిమ్మట వత్సరాంతం వరకు లాభ స్థానమున శుభుడు. చతుర్థ స్థానమున రాహువు గోచారం వత్సరాంతం వరకు ప్రతికూలం.

గురు గోచారం: నవంబర్ వరకు శుభుడు అగుట వలన చక్కని కార్య సిద్ధి, తలపెట్టిన పనులు నెరవేరుట, వృత్తి రీత్యా చక్కని అభివృద్ధి, సర్వత్రా ఆనందం. కాని నవంబర్ మొదలు రాజ్య స్థానమున ప్రతికూలుడు అగుట వలన పలు విధములైన ప్రతికూలతలు, కార్య విఘ్నము, అవాంతరాలు అధికం, వృధా సంచారం, వృత్తి రీత్యా ప్రతికూలతలు ఇత్యాది ప్రతికూల ఫలాలు అధికంగా ఉంటాయి.

శని గోచారం: జనవరి వరకు రాజ్య స్థానమున ప్రతికూలుడు అగుట వలన పనులందు అవరోధాలు అధికం, శ్రమతో కూడిన ఫలాలు, అధిక శ్రమ మరియు స్వల్ప ఫలం, వృధా సంచారం, పలు విధములైన అవరోధాలు, పనులు సమయానుసారముగా వెనకబడుట. పాప కార్యాచరణ, పనులు నిలచిపోవుట, పెట్టుబడులు నిలిచి పోవుట ఇత్యాది ప్రతికూలతలు అధికముగా ఉండు సూచనలున్నాయి. కాని జనవరి నుండి ఏకాదశ లాభ స్థానమున శుభుడు అగుట వలన తల పెట్టిన కార్యములందు విజయము, ఉద్యోగ మరియు వ్యాపారాభివృద్ధి, అధిక ధన లాభము, సర్వత్రా శుభ ప్రదమైన ఫలములు లభించు సూచనలున్నాయి.

రాహువు గోచరము: చతుర్థ స్థానమున వత్సరాంతం వరకు కూడా రాహువు ప్రతికూలుడగుట వలన తలపెట్టిన పనులందు ఒడుదుడుకులు అధికం. అవకాశాలు చివరి క్షణమున చేజారిపోవుట. నిర్ణయాత్మక శక్తి తగ్గుట. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి.


||శుభం భూయాత్|| 


 నమిలికొండ విశ్వేశ్వర శర్మ , సిద్ధాంతి