Sri Shiva Sahasra Nama

Sri Shiva Sahasra Nama (Meaning in Telugu)

 Sri Shiva Sahasra Nama Stotram - Sri Shiva Sahasra Nama - Meaning of the names of Shiva in Telugu. Written by Sri Ambalam Parthasarathi

శ్రీ వ్యసప్రోక్త శ్రీ మహాభారత అనుశాసన పర్వాన్తర్గత 

శ్రీ శివ సహస్ర నామ స్తోత్రం (అర్థం - వివరణ)

 

(త్వరలో ఇక్కడ కొంత వివరణ అప్లోడ్ చేయబడును. తప్పక చూస్తూ ఉండండి)

 ...అంబాళం పార్థసారథి 

image40

SRI SHIVA SAHASRA NAMA

Sri Shiva Sahasra Nama (Meaning in Telugu)

 

Sri Shiva Sahasra Nama Stotram - Sri Shiva Sahasra Namam - Meaning in Telugu for 1000 names of Lord Shiva. Written by Sri Ambalam Parthasarathi


శ్రీ వ్యసప్రోక్త శ్రీ మహాభారత అనుశాసన పర్వాన్తర్గత 

శ్రీ శివ సహస్ర నామ స్తోత్రం - అర్థం వివరణశ్లో|| 

స్థిరః స్థాణుః ప్రభుః భీమః ప్రవరో వరదో వరః   

సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః.  ।। 1 ।। 

                              --వ్యాసభారతం. అను.పర్వం. 17-31.


1. స్థిరః - (తిష్ఠతి ఇతి స్థిరః) స్థిరమైనవాడు, ఎప్పటికీ ఉండేవాడు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికి ఆరు వికారాలుంటాయి. అవి - అస్తి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే మరియు వినశ్యతే అంటే ఉండుట, పుట్టుట, పెరుగుట, తరుగుట, మార్పుచెందుట, మరణించుట. అయితే, ఇవన్నీ పరమాత్మకు ఉండవు. ఆయన అనంతుడు, అద్వితీయుడు, అగోచరుడు, అవాఙ్గ్మానస గోచరుడు, నిర్వికారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, సనాతనుడు, త్రికాలాతీతుడు, సర్వ వ్యాపకుడు, సచ్చిదానంద స్వరూపుడు. అందువలన పరమేశ్వరుడు స్థిరుడు. 'ఓం స్థిరాయ నమః'. 


2. స్థాణుః - (స్థ + అణుః) ('ష్ఠాగతినివృత్తౌ' అనే ధాతువు నుండి ఏర్పడింది), (ప్రళయేఽపి తిష్ఠతీతి స్థాణుః) అంటే, ప్రళయకాలంలో కూడా స్థిరముగా ఉంటాడు. పరమేశ్వరుడు లయకారకుడు. స్థాణువు అంటే ఎండిన మ్రోడు లాగా ఏకాంతంగా ఉంటాడు. ఇంట్లో స్తంభము లాగా అన్నింటికీ ఆశ్రయమైనవాడు, మూలస్తంభము. ప్రతి అణువునా వ్యాపించినవాడు. 'ఓం స్థాణవే నమః'.


3. ప్రభుః (ప్రకృష్టం భవనం సత్తా యస్య) ఉనికి కలవాడు, ప్రభువు. (ప్రభవతి సమర్థో భవతితి ప్రభుః) అనగా సమర్థుడైనవాడు, పాలించుటకు సమర్థుడు, సమస్త సృష్టి మీద అధికారము కలవాడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఏదీ జరుగదు. 'శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని' సామెత. 'ఓం ప్రభవే నమః'.


4. భీమః - (భిభేత్యస్మాత్ త్రైలోక్యం భీమః) అనగా ఇతడి వలన ముల్లోకాలలోని దుష్టులు భయపడుతారు. కాబట్టి ఇతడు భీముడు. దుష్ట రాక్షసులను సంహరించే సమయంలో అతి భయంకరుడు. 'మహాద్భయం వజ్రముద్యంతం' - ఎత్తబడిన వజ్రాయుధం వలె మిక్కిలి భయకరుడని శ్రుతి అంటుంది. శివుడిని అష్టమూర్తి అంటారు. అంటే ఎనిమిది మూర్తులు కలవాడు. అవి 'పృథివ్యప్తేజోవాయురాకాశాలు' అనే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, యజమాని అనునవి. వీటిలో ఆకాశమూర్తికి భీముడని పేరు. 'ఓం భీమాయ నమః'.


5. ప్రవరః - (ప్రకర్షేణ వరణీయః) అందరిచేత వరింపదగినవాడు, శ్రేష్ఠుడు. అందుకే, 'అష్టాదశ పురాణేషు దశభిర్గీయతే శివః' అనగా 18 పురాణాలలో 10 పురాణాలు శివుడి మాహాత్మ్యాన్ని చెబుతాయి. శివుడు ఆదియోగి, మహాయోగి. ఏ అవతారములోనైనా బ్రహ్మ భావము నుండి జారిపోని అచ్యుతుడు, విష్ణువు. ఎన్నడును బ్రహ్మ భావము నుండి చలింపనివాడు స్థాణువు, దేవతలందరిలో శ్రేష్డుడు అందుకే ఆయన మహాదేవుడయ్యాడు. 'ఓం ప్రవరాయ నమః'.


6. వరదః - (వరం దదాతి ఇతి వరదః) వరాలను ఇచ్చువాడు, వరదుడు. పరమేశ్వరుడు భక్తసులభుడు, భక్తవశంకరుడు. తామసులైన భక్తులకు కూడా వారు ఏది కోరితే అది ప్రసాదించే మహాత్ముడు శివుడు. బాణాసురుడు, తన కోట గుమ్మం దగ్గర కావలివాడిగా ఉండమంటే ఉన్నాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని ఇవ్వమంటే ఇచ్చేశాడు. గజాసురుడు తన ఉదరంలో ఉండిపొమ్మంటే ఉండిపోయాడు. కుబేరుడు దిక్పాలక పదవిని ఇమ్మంటే ఇచ్చి అతడిని ప్రాణమిత్రుడిలా ఆదరించాడు. దేవతలు ప్రార్థిస్తే హాలాహలాన్ని కూడా భక్షించాడు. అందుకే, పరమేశ్వరుడు వరదుడు. 'ఓం వరదాయ నమః'.


7. వరః - (వృణోతి ఆచ్ఛాదయతి సర్వం ఇతి వరః) సకల ప్రపంచాన్ని ఆవరించినవాడు, విశ్వమంతా కప్పి ఉన్నవాడు, శ్రేష్ఠుడు. తాను అమంగళ కార్యాలు, నిషిద్ధమైన కార్యాలు చేస్తున్నా సమస్త లోకాలకు పూజనీయుడు. మన దృష్టిలో ఆయన చేసే అమంగళ కార్యాలకు ఉదాహరణ - చితాభస్మము అమంగళం, దీనిని శరీరానికి పూసుకుంటాడు. కాటువేసి ప్రాణాన్ని తీసే సర్పాన్ని ధరించుట నిషిద్ధం, ఇదీ అమంగళమే. ఎందుకంటే, ఇతడి ఆభరణాలే సర్పాలు. ఎద్దును ఎక్కుట నిషిద్ధం. ఇతడి వాహనమే ఎద్దు. చితాభస్మము ధరించినందువలన లయకారుడయ్యాడు. సర్పాలను ధరించి గొప్ప యోగి అయ్యాడు. ధర్మానికి ప్రతీక ఎద్దు. ఇది వాహనమైనందువలన ధర్మానికి తాను అధిష్ఠాతనని తెలిపాడు. అందువలన, ఆయన వరుడు. 'ఓం వరాయ నమః'.


8. సర్వాత్మా - (సృతం అనేన ఇతి సర్వః, ఆప్నోతి సర్వం ఇతి ఆత్మా, ఆదత్తే ఇతి ఆత్మా, అత్తి ఇతి ఆత్మా, అతతి సంతతమితి ఆత్మా) అన్నింటినీ పొందునది, స్వీకరించునది, భుజించునది, అంతటా ఒకే రూపముగా ఉండునది, సర్వాత్ముడు. 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అంతటా వ్యాపించి ఉన్నది బ్రహ్మము. ఈ జగత్తు మిథ్య అని తెలుస్తుంది. ఉపాధి భేదముల చేత జీవులన్నీ వేరు వేరు కానీ వాటిలోని ఆత్మకు భేదం లేదు. ఈ ఆత్మ అంతటా వ్యాపించిన పరబ్రహ్మతత్త్వం. అందుకే, పరమేశ్వరుడు సర్వాత్మా. 'ఓం సర్వాత్మనే నమః'.


9. సర్వ విఖ్యాతః - (సర్వేషాం విఖ్యాతః) అన్ని దేశాలలో, అన్ని కాలాలలో ప్రాణులందరికీ ప్రత్యక్కుగా (అంతరంగం, ఆత్మ) ప్రసిద్ధుడు, సర్వప్రసిద్ధుడు. లింగరూపములోనున్న పరమశివుడు, అనేక పుణ్యక్షేత్రాలలో అనేక నామములతో పిలువబడుచున్నాడు. అలాగే, మహాభారతంలో, వాయు పురాణంలో, శివ పురాణంలో శివుడి సహస్ర నామ స్తోత్రం ఉంది. జ్యోతిర్లింగక్షేత్రాలు, స్వయంభూలింగ క్షేత్రాలు, పంచారామ క్షేత్రాలలో ఎంతో విఖ్యాతి చెందివున్నాడు. అందుకే, పరమశివుడు సర్వ విఖ్యాతుడు. 'ఓం సర్వ విఖ్యాతాయ నమః'.


10. సర్వః - (సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః) అంతటా ఉన్నవాడు, సకల స్వరూపుడు. 'ఏకమేవాద్వితీయం బ్రహ్మ' ఉన్నది బ్రహ్మము ఒకటే. మరొకటి లేదు. ప్రకృతి జడమైనది. పరమాత్మ కలయిక వలన చైతన్య సృష్టి కలిగింది. పరమాత్మ మాయాశక్తే ప్రకృతికి కారణం. అందువలన జడము, చేతనము ఈ రెండు పరమాత్మ నుండే పుట్టాయి. సృష్టికి మూలం ఈశ్వర మాయే. ఎప్పటికైనా, ఈ జగత్తు అంతరించిపోయేదే. అందుకే ఇది అసత్తు, ఆత్మ సత్తు, అన్నిచోట్లా ఉంది. సత్తు, అసత్తు పరమాత్మయే. సర్వమూ ఆయనే. అందుకే ఆయన సర్వుడు. 'ఓం సర్వస్మై నమః'.


11. సర్వకరః - (సర్వం కరోతీతి సర్వకరః) అన్ని, సమస్త కర్మలు చేసేవాడు, విశ్వకర్త. చేతనములైన జీవులు చేయు సమస్త కర్మలు శివుడు చేసేవే. అనగా, జీవుల చేత కర్మలు చేయించేది ఆయనే. మనలో చైతన్యం లేకపోతే, మనం ఏలాంటి కర్మలను చేయలేము. అయితే, అహంకారం వలన నేనే దేహము అనే భ్రాంతితో, ఈ పని నేను చేశానని గర్విస్తాం. మనం చేసే పనులు మనలోని శివుడే చేస్తాడు. అందుకే, 'శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని' అంటారు. సమస్త సృష్టిని చేసేవాడు కాబట్టి సర్వకరుడు. 'ఓం సర్వకరాయ నమః'.


12. భవః - (భవతి అస్మాత్ అనన్యాపేక్షాత్ విశ్వమితి భవః, భవతి అస్మిన్ ప్రలయ ఇతి వా భవః, భవతి భవతేవా సర్వమితి భవః) సకల జగత్తును సృష్టించేవాడు, లయం చేసేవాడు, అంతా తానేయైనవాడు. 'ఈశావాస్యమిదం సర్వం' అనగా ప్రపంచమంతా పరమేశ్వరుడిచే వ్యాపింపబడిందని, 'ఈశావాస్యోననిషత్తు' చెబుతుంది. 'పురుష ఏ వేదగం సర్వం' సర్వం పరమాత్మయనే తెలుసుకోవాలి. అష్టమూర్తుల పేర్లలో ఆరవ మూర్తి పేరు భవుడు. 'ఓం భవాయ నమః'.జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వభావనః   

హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూత హరః ప్రభుః  ।। 2 ।।


13. జటీ - (జట ధరతీతి జటీ) జట అనగా జడలు, వెంట్రుకల గుత్తి, కేశముల సమూహం కలవాడు జటీ. జటాజూటం కలవాడు. శివానందలహరిలో 'జటాభారోదారం చల దురహహారం మృగధరం' అని వర్ణిస్తారు ఆది శంకరులు. సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైనట్లు విన్న శివుడు తన జటను పీకి నేలపై కొట్టగా, వీరభద్రుడు జన్మించినట్లు లింగపురాణంలో ఉంది. అందువలన శివుడు జటీ. 'ఓం జటినే నమః'.


14. చర్మీ - ఏనుగు తోలు లేదా పెద్దపులి తోలు. దీనిని ధరించినవాడు చర్మీ, చర్మధారి. ఆయన కృత్తివాసుడు అనగా చర్మమును వస్త్రముగా ధరించినవాడు. గజాసురుడనే భక్తుడి కోరికపై అతడి చర్మాన్ని వస్త్రంగా ధరించాడు. అందుకే అతడు చర్మీ. 'ఓం చర్మిణే నమః'.


15. శిఖండీ - శిఖండము కలవాడు. శిఖండి అనగా కోడి అనే అర్థం కూడా ఉంది. లోకంలో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక సందర్భంలో శివుడు కోడి రూపాన్ని ధరించాల్సి వచ్చింది. పూర్వము గయుడు పురుహూతికా దేవిని ఆరాధించి హవిర్భాగాన్ని పొందాడు. ఇంద్రుడి కోరికపై త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలను ధరించి తాము ఒక యజ్ఞాన్ని చేయతలపెట్టామని యజ్ఞభూమిగా గయాసురుడి శరీరాన్ని ఇమ్మని కోరగా, గయుడు అందుకు అంగీకరించాడు. యజ్ఞం పూర్తయ్యేవరకు శరీరాన్ని కదల్చకూడదని నియమం పెట్టారు. అతడిని వంచించడానికి శివుడు కోడి రూపం ధరించి కూసాడు. ఆ కూత విని తెల్లవారింది, యజ్ఞం పూర్తయిందని అనుకుని గయాసురుడు కదిలాడు. గయుడు, తన శరీరం పడిన చోట ఏర్పడిన క్షేత్రాలకు, క్షేత్ర పాలకులుగా ఉండమని త్రిమూర్తులను కోరాడు. శరీరం మూడు చోట్ల పడింది. శిరస్సు గయలో పడింది. నాభి భాగం జాజిపురంలో పడింది. పాదం పురుహూతికా పురంలో పడిందని ప్రతీతి. ఆ పురుహూతికా పురమే నేడు పిఠాపురంగా ప్రసిద్ధి చెందిందంటారు. పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అలా, కోడిగా మారినందువలన శిఖండియని ప్రసిద్ధి చెందాడు. 'ఓం శిఖండినే నమః'.


16. సర్వాంగః (సర్వం జగత్ అంగభూతం యస్య సః) సర్వ జగత్తు అంగముగా గలవాడు, విరాట్పురుషుడు, సర్వాంగుడు. ఇదేగాక, అంగములనగా యోగాంగాలైన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనునవి. ఇవన్నియు గలిగిన ఆదియోగియైన శివుడు సర్వాంగః అనే పేరుతో పిలవబడతాడు. వేదాంగములగు శిక్ష, వ్యాకరణ, చందస్సు, నిరుక్త, జ్యోతిష, కల్పము అనే సప్తాంగముల స్వరూపము కలవాడు శివుడు కాబట్టి, సర్వాంగః. 'ఓం సర్వాంగాయ నమః.


17. సర్వభావనః (సర్వం భావయతి) ప్రపంచాన్ని సృష్టించేవాడు. అనగా సర్వజీవ కోటులను సృష్టించి పోషించేవాడని అర్థం. జీవజాతుల సృష్టికి ఈశ్వరుడే కారణం కానీ వేరు కాదు. ఏకకణజీవుల కణ విభజన వలన శరీరం పెరుగుతున్నది. దీనినే 'మిటాసిన్' అంటారు. స్త్రీ పురుషులలో యుక్త వయస్సు వచ్చిన తర్వాత బీజకణాలు ఏర్పడుతున్నాయి. రెండు బీజ కణాలు కలిసి పిండము ఏర్పడుతున్నది. దీనినే 'మెచ్యురేషన్' అంటారు. ఈ ప్రక్రియలో జీవ జంతువుల ఇష్టం గానీ, ప్రయత్నం గానీ లేవు విజ్ఞానశాస్త్రం వీటిని నిర్వచించినదే కానీ, ఇలా జరుగుటకు కారణాన్ని చెప్పలేదు. అసలు జీవ చైతన్యాన్ని విజ్ఞానశాస్త్రం నిర్వచించలేదు. 'ఎడ్రినలిన్' ఉత్పత్తి కోపం వలన ఎక్కువవుతుంది ఆవేశాలు భౌతికాలు కావు. అయితే, వాటి వలన భౌతిక చర్యలు జరుగుటకు కారణం ఏమిటి? విద్యుత్ శక్తి ప్రసారానికి లోహపుతీగ కావాలి. అలాగే చైతన్య శక్తి వ్యక్తం కావడానికి భౌతికమైన శరీరం అవసరం. ఈ చైతన్య శక్తినే పరమేశ్వర శక్తి, సర్వభావన శక్తి అంటారు. 'ఓం సర్వ భావనాయ నమః'.


18. హరః - (హరతి ప్రళయే సర్వమితి హరః) ప్రళయకాలంలో అన్నింటినీ, సమస్త సృష్టిని హరించేవాడు, అనగా లయకారుడు, హరుడు. 'ఓం హరాయ నమః'.  


19. హరిణాక్షః - హరిణము అనగా లేడి. హరిణాక్షి అంటే లేడి కన్నుల వంటి అందమైన కన్నులు కలది. అయితే, శివుడిని హరిణాక్షుడని అనకూడదు. హరిణ శబ్దానికి తెల్లనిదనే అర్థం కూడా ఉంది. కాబట్టి, తెల్లని నేత్రములు కలవాడని, శాంత స్వరూపుడని అనాలి. అలా హరిణాక్షుడయ్యాడు పరమేశ్వరుడు. 'ఓం హరిణాక్షాయ నమః.


20. సర్వభూతహరః - (సర్వాణి భూతాని హరతి) ప్రళయ కాలమందు సకల ప్రాణులను హరించేవాడు. లేదా, ప్రళయకాలంలో పంచభూతాలైన పృథివ్యప్తేజోవాయురాకాశములను ఉపసంహరించేవాడు. ఈ పంచ భూతాలు కూడా శివుడి అష్టమూర్తులలోనివే. 'ఓం సర్వభూత హరాయః నమః'.


21. ప్రభుః (ప్రభవతి సమర్థో భవతీతి ప్రభుః) సమర్థుడగువాడు ప్రభువు. శివుడు సమస్త సృష్టికి ప్రభువు. కాబట్టే, ఆయన విశ్వనాథుడు. 'ఓం ప్రభవే నమః'.శ్లో|| ప్రవృత్తి శ్చ నివృత్తి శ్చ నియతః శాశ్వతో ధ్రువః

         శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోఽర్దనః  ।।।। 

ప్రవృత్తి, నివృత్తి, ఇంద్రియాలను నిగ్రహించేవాడు, శాశ్వతుడు, ధృవుడు, శ్మశానంలో నివసించేవాడు, ఐశ్వర్యము కలవాడు, ఆకాశమందు సంచరించేవాడు, ఇంద్రియాలలో సంచరించేవాడు, పాపులను పీడించేవాడు.


22. ప్రవృత్తిః - ధర్మము: ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మమని రెండు విధాలు. వైదిక ధర్మాచరణం ప్రవృత్తి. ఇవి నిత్య నైమిత్తిక కామ్య కర్మలు. స్నానం, సంధ్య, అనుష్ఠానం మొదలగునవి నిత్య కర్మలు. ఆ యా సందర్భాలలో చేసే పితృకర్మలు నైమిత్తిక కర్మలు. కోరికలతో చేయు వ్రతాలు మొదలగునవి కామ్యకర్మలు. ఈ కర్మలు అకర్మ, కర్మ, వికర్మ అని మూడు విధములని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ వైదిక కర్మలు స్వర్గాది పుణ్యలోకాలను ఇస్తాయి. 'ఓం ప్రవృత్తయే నమః'.


23. నివృత్తిః - వైరాగ్యంతో జ్ఞానాన్ని పొంది, భగవధ్ధ్యానం చేస్తూ మోక్ష కాంక్షియై నిష్కామ కర్మలను ఆచరించడం నివృత్తి. ఈ ప్రవృత్తి, నివృత్తి రెండును పరమేశ్వరుడి నామాలే. 'ఓం నివృత్తయే నమః'.


24. నియతః - (నియమ్యతే అనయేతి నియతిః) దీనిచేత నియమింపబడును. నియతి అనగా విధి. నియతః అనగా నియమించువాడని అర్థం. జీవుల కర్మబంధములను అనుసరించి ఆ యా పాపపుణ్య ఫలాలను అనుభవింపజేయువాడు. 'పూర్వజన్మ కృతం కర్మ తద్దైవమితి కథ్యతే' అని అంటారు. అంటే, పూర్వజన్మలో చేయబడిన కర్మనే దైవమంటారు. ఆ కర్మఫలాలను వివరించేవారిని దైవజ్ఞులంటారు. మన పూర్వజన్మ కర్మలను అనుసరించే గ్రహచారము ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్ర సూత్రం. దీనిని అనుసరించే దైవజ్ఞులు జాతక ఫలాలను చెబుతుంటారు. అటువంటి ఫలాలను అనుభవింపజేయువాడు పరమశివుడు. కర్మ జడము కాబట్టి, దీనికి ఫలితాలను ఇచ్చే శక్తి లేదు. ఫలాలను ఇచ్చేవాడు కేవలం ఈశ్వరుడే. 'ఓం నియతాయ నమః'. 


25. శాశ్వతః (శశ్వద్భవః శాశ్వతః) శాశ్వతుడు, నిత్యుడు. శశ్వత్ అంటే ఎల్లప్పుడు అని అర్థం. ఈ అర్థం వల్లనే శాశ్వతం అనే పదం ఏర్పడింది. శాశ్వతః అంటే ఎల్లప్పుడూ ఉండేవాడని, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేవాడిని అర్థం. 'ఓం శాశ్వతాయ నమః'. 


26. ధ్రువః - స్థిరంగా ఉండేవాడు. చలనము లేకుండా స్థిరంగా ఉండడం చేతనే ధృవ నక్షత్రానికి ఆ పేరు వచ్చింది. మిగిలిన నక్షత్ర మండలం ధృవనక్షత్రం చుట్టూ కుమ్మరిసారెలాగ తిరుగుతుంది. నామ రూపాత్మకమగు సమస్త విశ్వం నశించినా నిత్యుడై ఉంటాడు ఈశ్వరుడు. అందుకే, ఆయన ధ్రువుడు. 'ఓం ధ్రువాయ నమః'.  


27. శ్మశానవాసీ - (శ్మానః శేరతే అస్మిన్ ఇతి శ్మశానః) శ్మానః అంటే శవాలు, మృతజీవులు. వీటిని దహించే స్థలం శ్మశానం. శవాలను ఎక్కువగా దహించే స్థలం వారణాశి, కాశీ క్షేత్రం. అక్కడ నివసించేవాడే శివుడు, శ్మశానవాసీ. 'ఓం శ్మశాన వాసినే నమః'.


28. భగవాన్ - (భగాని విద్యంతే అస్మిన్నితి భగవాన్). (శ్లో|| ఐశ్వర్యస్య సమగ్రస్య జ్ఞానస్య యశః శ్రియః వైరాగ్యస్య చ ధర్మస్య షణ్ణాం భగతీంగనా) ఐశ్వర్యం, జ్ఞానం, యశస్సు, శ్రీ, వైరాగ్యం, ధర్మం అనే ఆరు గుణాలకు భగమని పేరు. ఇవన్నీ కలవాడు భగవాన్. 'ఓం భగవతే నమః'.


29. ఖచరః (దహరేఽస్మిన్నంతరాకాశః తస్మిన్యదంత స్తదనేష్టవ్యం, శంభురాకాశమధ్యః) హృదయాకాశంలో సంచరించేవాడు. ఆకాశంలో సంచరించువాడు సూర్యనారాయణుడని కూడా అర్థం. సూర్యుడు శివుడి అష్టమూర్తులలోనివాడే. శివుడి యొక్క ఈశానుడను పేరుగల మూర్తి సూర్యుడే. ఖచరుడంటే ఆకాశంలో సంచరించేవాడు, వాయువు కూడా అవుతాడు. అష్టమూర్తులలో వాయువు కూడా ఉన్నాడు. ఈ వాయు మూర్తిని ఔగ్రి అంటారు. 'ఓం ఖచరాయ నమః'.


30. గోచరః (గోషు చరతి, గోభిః) ఇక్కడ గోవులంటే ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలలో సంచరించేవాడు. అలాగే, పంచభూతాలలో ఆకాశము శబ్దగుణకము. వాయువుకు శబ్ద స్పర్శలు గుణకాలు. ఈ రెండింటికి ఆకారం లేదు. ఇవి మన కళ్లకు కనపడవు. మనకు ఆకాశం నీలంగా కనబడుతుంది. ఇది కాంతిలోని నీలవర్ణము తప్ప, అసలైన ఆకాశం కాదు. అగ్నికి శబ్ద స్పర్శ రూపములు ఉన్నాయి. అందువలన పంచభూతాలలో మొదట మనకు గోచరించేది అగ్ని. శివుడి అష్టమూర్తులలో అగ్ని కూడా ఒకటి. దీన్నే రౌద్రి అంటారు. 'ఓం గోచరాయ నమః'.


31. అర్దనః (అర్దయతి జనమిత్యర్దనః) అర్దనః అంటే పీడించేవాడు. పాపులను కాలుడి రూపంతో పీడించేవాడు. 'ఓం అర్దనాయ నమః'శ్లో|| 

అభివాద్యో మహాకర్మా తపస్వీ భూతభావనః ।

ఉన్మత్తవేషప్రచ్ఛన్నః సర్వలోక ప్రజాపతిః ।। 4 ।।

నమస్కరింపదగినవాడు, మహాకర్మలు చేసేవాడు, తపస్వి, ప్రాణులను పోషించేవాడు, ఉన్మత్త వేషంతో రహస్యంగా ఉండేవాడు, సర్వలోక ప్రజాపతి.


32. అభివాద్యః - అభివాదకుడు అనగా నమస్కరించువాడు. అభివాద్యుడు అనగా నమస్కరింపబడువాడు. బ్రహ్మాది దేవతలు, యక్ష, కిన్నర, కింపురుష, సిద్ధ, సాధ్య, గంధర్వ, వసు, రుద్ర, ఆదిత్య, రాక్షస, మానవులందరూ శివుడికి నమస్కారం చేస్తారు. అందుకే, శివుడు అభివాద్యుడు. 'ఓం అభివాద్యాయ నమః'


33. మహాకర్మా - (మహత్ కర్మ అస్య) గొప్పదైన పని చేయువాడు, సృష్టిని సృజించేవాడని అర్థం. సృష్టి సమస్తం పరమేశ్వరుడి కర్మ. సృష్టిని విరాట్పురుష రూపమంటారు. 'ఈశావాస్యమిదం సర్వం' ఈ సృష్టి అంతా ఈశ్వరుడితో వ్యాపింపబడి ఉందనేది ఉపనిషద్వాక్యం. ఈశ్వరుడి వివర్త రూపమే సృష్టి. ఈ సృష్టి ఆయన చేత చేయబడినది. 'ఓం మహా కర్మణే నమః'.


34. తపస్వీ - పరమశివుడు ఆదియోగి, మహాయోగి, తపస్వి. సతీదేవి వియోగానంతరం విరక్తుడై హిమాలయాలలో తపస్సు ఆచరించినందున తపస్వి అయ్యాడు. 'ఓం తపస్వినే నమః'.


35. భూతభావనః - (భూతాని భావయతి ఇతి) పంచభూతాలను సృష్టించినవాడు, ప్రాణులను పోషించేవాడు. అన్ని ప్రాణులలో అంతరాత్మ రూపంలో ఉంటాడు. అందుకే, పరమేశ్వరుడు భూతభావనుడయ్యాడు. 'ఓం భూత భావనాయ నమః'.


36. ఉన్మత్తవేషప్రచ్ఛన్నః - ఉన్మాదము అనగా పిచ్చి. ఉన్మాదము కలవాడు ఉన్మత్తుడు. ఉన్మత్త వేషంతో అనగా పిచ్చివాడివలె నటిస్తూ రహస్యంగా తిరుగుతూ తన మాహాత్మ్యాన్ని ప్రచ్ఛన్నము చేసుకొనువాడు అనగా కప్పుకొనువాడు. తాను దేవదేవుడైనా, ఐశ్వర్య యుక్తుడైనా, దిగంబరుడై జడలు ధరించి, బూడిద పూసుకుని, పాములను ఆభరణములుగా ధరించి, ఎద్దునెక్కి తిరుగుతూ బిచ్చమెత్తుకుని జీవించు శివుడు, చాలా మంది దృష్టిలో ఉన్మత్త వేష ప్రచ్ఛన్నుడే. 'ఓం ఉన్మత్త వేష ప్రచ్ఛన్నాయై నమః'.


37. సర్వలోక ప్రజాపతిః - (ప్రజానాం పతిః ప్రజాపతిః). అనగా ప్రజలకు పతి, ప్రభువు. (సర్వాసాం లోకప్రజానాం పతిః) లోకాలు అంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళములనే సప్త అధో లోకాలు, భూలోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలనే సప్త ఊర్ధ్వ లోకాల ప్రజలకు ప్రభువు. ప్రజలంటే చేతనులు. అన్ని చోట్లా ఉన్న ప్రాణులకు, సమస్త లోకములందలి ప్రజలకు స్వామి పరమేశ్వరుడు. 'ఓం సర్వలోక ప్రజాపతయే నమః'.శ్లో|| 

మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః ।

మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహాహనుః ।। 5 ।।


38. మహారూపః - (మహత్ రూపం అస్య) పెద్ద రూపం, అందమైన రూపం గలవాడు. (రూపాధికా శిఖరి భూపాల వంశ మణిదీపాయితా భగవతీ) అని శంకరాచార్యులు పార్వతీదేవిని వర్ణించారు. రూపాధిక అయిన అమ్మవారు తపస్సు చేసి పరమశివుడిని వివాహం చేసుకుంది. మధురానగరి రాజు ఏకైక కుమార్తెగా, పార్వతీదేవి అవతారమైన మీనాక్షి శత్రురాజులందరినీ జయించి, ఆవేశంతో కైలాసానికి వెళ్లగా ఆమె ఎదుట అందమైన రూపములో శివుడు సుందరేశ్వరుడిగా నిలబడ్డాడు. ఆలస్యం చేయకుండా ఆమె ఆ స్వామిని పరిణయమాడింది. నివాసం వెండికొండ, వాహనం మహోన్నతమైన తెల్లని వృషభం, తెల్లని శరీరం గల శివుడు. వికృతమైన అలంకారాలున్నా అంటే తోలు ధరించి, జడలు ధరించి, బూడిద పూసుకున్నా, పరమేశ్వరుడి అందానికి మచ్చలేదు. ఆయన విరాట్ పురుషుడు. సృష్టిలోని అందాలన్నీ ఆయనవే. 'ఓం మహారూపాయ నమః'.


39. మహాకాయః - (మహాన్ కాయః అస్య) స్థూలరూపము, విరాట్ రూపము, పెద్ద శరీరం కలవాడు. పరమశివుడు గొప్ప స్వభావం కలవాడు. భక్తులు ఏది కోరినా ఇవ్వగల ఉదారుడు. మార్కండేయుడు, దధీచి, బాణాసురుడు, రావణాసురుడు, ఉపమన్యువు, పరశురాముడు, అగస్త్యుడు, శుక్రాచార్యుడు, కుబేరుడు మొదలైన భక్తులు దీనికి నిదర్శనాలు. సమస్త లోకాలు ఆయన శరీరమే. అందుకే, ఆయన మహాకాయుడు. 'ఓం మహాకాయాయ నమః'.


40. వృషరూపః - వృషము అనగా ధర్మము. వృషభము అనగా ఎద్దు. వృషభము ధర్మ స్వరూపం. ధర్మమే రూపముగా కలవాడు, ధర్మ స్వరూపుడు. శివుడు వృషభ వాహనుడు, అంటే, ధర్మాన్ని అధిష్టించినవాడు. అంతేకాదు, ఆయన వృషభధ్వజుడు. ఆయన ధ్వజచిహ్నము కూడా వృషభమే.

అందువలన శివుడు ధర్మస్వరూపుడు. 'ఓం వృష రూపాయ నమః'


41. మహాయశాః - (మహచ్ఛ తద్యశశ్చ) మహాయశస్వి, గొప్ప పేరు గలవాడు లేదా పేరే కీర్తిగా కలవాడు. పరమేశ్వరుడి కీర్తి, ఐశ్వర్యం చేత వచ్చినది కాదు, ఔదార్యము చేత వచ్చినది. ఆదిదేవుడు, మహాదేవుడు, దేవ దేవుడు, భక్త సులభుడు, భక్త వశంకరుడు ఇవి ఆయన బిరుదులు. అందుకే, శివుడు మహాయశుడు. 'ఓం మహాయశాయ నమః'


42. మహాత్మా- మహాత్ముడు, గొప్ప మనస్సు, స్వభావం గలవాడు. క్షీరసాగర మథనంలో హాలాహలము పుట్టినప్పుడు లోకాన్ని రక్షించడం కోసం, దానిని పానము చేసిన మహాత్ముడు పరమశివుడు. 'ఓం మహాత్మనే నమః'.


43. సర్వభూతాత్మా - (సర్వాణి భూతాని ఆత్మా యస్యసః) ఇక్కడ ఆత్మ అనగా మనస్సు. మనస్సంటే సంకల్పం. సంకల్ప మాత్రం చేత ప్రాణులను సృష్టించేవాడు అని అర్థం. 'ఓం సర్వ భూతాత్మనే నమః'.


44. విశ్వరూపః (విశ్వ రూపం అస్య, విశ్వస్మిన్ రూప్యతే) ప్రపంచమే ఆకారంగా గలవాడు, విశ్వరూపుడు. (బ్రహ్మై వేదం విశ్వమిదం వరిష్ఠం) ఈ విశ్వం పరబ్రహ్మమే అని శ్రుతి ప్రమాణం. సమస్త జడచేతనములు పరమేశ్వరుడి రూపాలే. 'ఏకమేవాద్వితీయం బ్రహ్మ' ఉన్నది బ్రహ్మమొక్కటే! రెండవది లేదు. పరమేశ్వరుడి మాయా శక్తి వలన భేదభావం కలుగుతుంది. 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అన్నిటి యందు బ్రాహ్మమే ఉంది. ఈ వాక్యాలన్నీ పరమేశ్వరుడు విశ్వరూపుడని తెలుపుతున్నాయి. 'ఓం విశ్వరూపాయ నమః.


45. మహాహనుః - పెద్ద, గోప్ప దవడలు కలవాడు. అవి ఉన్నతంగా ఉండటమనేది మహాపురుష సాముద్రిక లక్షణం. ప్రపంచాన్నే మ్రింగే సామర్థ్యం గల హనువులు కలవాడని అర్థం. రుద్రాంశతో జన్మించిన ఆంజనేయస్వామికి కూడా ఈ లక్షణాలున్నాయి. అందుకే, ఆయనకు హనుమంతుడని పేరు. వాల్మీకి మహర్షి శ్రీరాముడి సాముద్రిక లక్షణాలు తెలుపుతూ, (విపులాంశో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః) అని అంటాడు. అలా, శ్రీరామచంద్రుడు కూడా మహాహనువే. 'ఓం మహా హనవే నమః'.శ్లో|| 

లోకపాలోంఽతర్హితాత్మా ప్రసాదో నీలలోహితః ।

పవిత్రం చ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః ।। 6 ।।


46. లోకపాలః - సమస్త లోకాలను పాలించువాడు. అష్ట దిక్పాలకులను లోకపాలకులని అంటారు. వారు 1. ఇంద్రుడు, 2. అగ్ని, 3. యముడు, 4. నిరృతి, 5. వరుణుడు, 6. వాయువు, 7. కుబేరుడు, 8. ఈశానుడు. వరుసగా వీరి పట్టణాల పేర్లు 1. అమరావతి, 2. తేజోవతి, 3. సంయమని, 4. కృష్ణాంగన, 5. శ్రద్ధావతి, 6.గంధవతి, 7. అలక, 8. యశోవతి. పైన చెప్పిన దిక్పాలకులకు లోకపాలక పదవులను ప్రసాదించిన ప్రభువు పరమశివుడే. 'ఓం లోకపాలాయ నమః'.


47. అంతర్హితాత్మా - మరుగున పడినటువంటి ఆత్మనే పరమేశ్వరుడు. అనగా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, సప్త ధాతువులు (రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జా, శుక్రములు) మనస్సు, బుద్ధి ఇవన్నీ ఏదోవిధంగా వ్యక్తమౌతాయి. అయితే, ఆత్మ మాత్రం మరుగున పడి ఉంటుంది. దానిని గ్రహించడం అంత సులభం కాదు. అటువంటి ఆత్మరూపి పరమేశ్వరుడు. 'ఓం అంతర్హితాత్మనే నమః'.


48. ప్రసాదః - ప్రసన్నమైన స్వభావం కలవాడు, శాంతుడు, భక్త సులభుడు, కోపం వచ్చినా, ప్రార్థించిన వెంటనే ప్రసన్నుడౌతాడు. ఆనంద స్వరూపుడు. 'ఓం ప్రసాదాయ నమః'.


49. నీలలోహితః - (జుహ్వతో బ్రహ్మణో లలాట స్వేదజం తేజోగ్నౌ నిపత్య నీలం సల్లోహితమభూత్ తతోయం జాత ఇతి నీలలోహితః). బ్రహ్మదేవుడు హోమం చేస్తున్నప్పుడు లలాట స్వేదము వలన కలిగిన తేజము అగ్నిలో పడి నీలవర్ణమై తరువాత రక్తవర్ణంగా మారిపోయింది. దానిలో పుట్టాడు కాబట్టి, నీలలోహితుడు. (నీల కంఠే, లోహితః కేశేప్యసూయేతివా) కంఠమునందు నీలవర్ణము, కేశములందు రక్తవర్ణము కలవాడు కాబట్టి, నీలలోహితః. 'ఓం నీలలోహితాయ నమః'.


50. పవిత్రం - (పూయతేఽనేనేతి పవిత్రః) భక్తులను పవిత్రులుగా చేయువాడు. పంచాక్షరీ మంత్ర జపం వలన పాపాలు తొలగి పవిత్రులౌతారు. అందుకనే, శివనామమే పవిత్రమైనది. శివుడు ఇంకా పవిత్రుడు. 'ఓం పవిత్రాయ నమః'.


51. మహాన్ - అంటే పూజ్యుడు, సర్వోత్కృష్టుడు, గొప్పవాడు. నాగ, నభశ్చర, కిన్నర, కింపురుష, సిద్ద, సాధ్య, విద్యాధర, యక్ష, రాక్షస, గంధర్వ, మానవులచేత పూజింపబడే మహాన్ పురుషుడు. 'ఓం మహతే నమః'.


52. నియమః - నియమాలతో పొందదగినవాడు. శౌచ, తపస్స్వాధ్యాయము మొదలైనవి నియమాలు. ఇవిగాక, వ్రత నియమాలు, అష్టాంగయోగము నందలి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులయందు రెండవదియైన నియమంలోనివే శౌచాదులు. ఇవి కలవాడు కాబట్టి పరమశివుడు నియమః. 'ఓం నియమాయ నమః.


53. నియమాశ్రితః - నియమముల చేత ఆశ్రయించబడినవాడు. నియమాలకు ఆశ్రితుడు. అనగా, నియమాలను ఆశ్రయించినవాడు. ఆయన ఆదియోగి. కాబట్టి, నియమవంతుడు. 'ఓం నియమాశ్రితాయ నమః'శ్లో|| 

సర్వకర్మా స్వయంభూతః ఆదిరాదికరో నిధిః ।

సహస్రాక్షో విశాలాక్షః సోమో నక్షత్రసాధకః. ।। 7 ।।

సర్వకర్మ, స్వయంభూతుడు, మొదటివాడు, హిరణ్యగర్భుడిని సృష్టించినవాడు, నిధి స్వరూపుడు, సహస్ర నయనుడు, విశాలనేత్రుడు, సోమలతా స్వరూపుడు, నక్షత్ర స్థితిని పొందడానికి సాధనం.


54. సర్వకర్మా - సమస్త జీవులలో ఉన్న అంతర్యామి శివుడే. జీవులందరూ చేసే కర్మలన్నీ శివుడు చేసేవిగా భావించాలి. అంతేకాదు, గాలి వీచినా, అగ్ని మండినా, నదులు ప్రవహించినా, వర్షం కురిసినా అంటే ప్రకృతిలో ఏది జరిగినా అది శివుడి వల్లనే జరుగుతుంది. ప్రతి కర్మ అతడి దివ్య శక్తివల్ల మాత్రమే జరుగుతుంది. అందుకే, అతడు సర్వకర్మా. 'ఓం సర్వ కర్మణే నమః'.


55. స్వయంభూతః - నిత్యసిద్ధుడు, స్వయంభూతుడు. తనంతట తానుగా ఉద్భవించినవాడు. (మూలీ భూతం పదోక్తంచ సత్యజ్ఞానం అనంతకం). శివరూపం సనాతనమైనది, సకల రూపాలకు మూలము. ఇది సత్యము, జ్ఞానం, అనంతమగు బ్రహ్మమని శివపురాణంలో శివుడు, బ్రహ్మ విష్ణువులతో చెప్పాడు. 'ఓం స్వయంభూతాయ నమః'.


56. ఆదిః - లోకములకంటే, అన్నిటికంటే, అందరికంటే మొదటివాడు. త్రిలోకపూజ్యుడు. 'ఓం ఆదయే నమః'.


57. ఆదికరః - మొట్టమొదట సృష్టిని చేశాడు. మొదటివాడిగా పేర్కొనబడిన హిరణ్యగర్భుడిని సృష్టించినవాడు. 'ఓం ఆదికరయే నమః'.


58. నిధిః - స్వామి నిధి స్వరూపుడు. పద్మశంఖాది రూప అస్టైశ్వర్యాలు (పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్ఛపము, ముకుందము, కుందము, నీలము, వరము వీటిని నవనిధులను అంటారు. కుబేరుడిని ఉత్తరదిక్కుకు అధిపతిని చేసిన పరమేశ్వరుడు, పైన చెప్పిన నవనిధులను ప్రసాదించాడు. 'ఓం నిధయే నమః'.


59. సహస్రాక్షః (సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరో ముఖం), సహస్ర నయనుడు. అనేక నేత్రములు కలవాడు, ప్రాణులు చేయు కర్మలకు సూర్యచంద్రులు, పంచభూతాలు, అష్టదిక్కులు, భూమి, ఆత్మ, సాక్షులు. ప్రధానంగా సూర్యుడికి సర్వసాక్షి అని పేరు. సూర్యచంద్రులు, పంచభూతాలు, ఆత్మ, శివుడి అష్టమూర్తులు. ఈ అష్టదిక్కులు శివుడి అధీనములు. దిక్పాలకులను శివుడు నియమించాడు. శివుడు చూడని, చూడలేని కర్మను ఏ ప్రాణికూడా చేయలేదు. 'ఓం సహస్రాక్షాయ నమః'


60. విశాలాక్షః - భగవంతుడు త్రినేత్రుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అతడి నేత్రాలు. ఈ మూడు తేజః స్వరూపాలు. వీటి తేజస్సు మిక్కిలి వ్యాప్తమైనది, అందువలన విశాలాక్షుడు. 'ఓం విశాలాక్షాయ నమః'.


61. సోమః - సోముడు కూడా శివుడు. ఉమతో ఉన్నప్పుడు సోముడు. ఉమ అనగా పార్వతి. పార్వతి శివుడి గుఱించి తపస్సు చేయుటకు వెళుతుండగా ఆమె తల్లియైన మేనక, ఉ మ= అమ్మాయి వద్దు అని అంది. అందువలన ఆమెకు ఉమ అని పేరు కలిగింది. 'ఓం సోమాయ నమః'


62. నక్షత్రసాధకః (సుకృతాం వా ఏతాని జ్యోతీంషి యన్నక్షత్రాణి) అంటుంది శృతి. ఆకాశంలో ప్రకాశించు నక్షత్రాలు, పుణ్యాత్ముల శరీరాలు. అలాగే, యజ్ఞయాగాదులు ఆచరించిన వారికి సోమలోకంలో స్థానం లభిస్తుందని చెబుతారు. అటువంటి దివ్యమైన శరీరాలను సాధింపజేయువాడు నక్షత్రసాధకుడు. 'ఓం నక్షత్ర సాధకాయ నమః'శ్లో||

చంద్రః సూర్యః శనిః కేతుః గ్రహోగ్రహపతిర్వరః । అత్రిరత్ర్యానమస్కర్తా మృగబాణార్పణోఽనఘః ।। 8 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-37.


63. చంద్రః - బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహాముని మూడువేల దివ్య సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన తేజస్సు ధారలై దశదిశలా ప్రవహించి గర్భం ధరించాయి. ఆ తేజస్సులన్నీ ఒకటిగా కూడి చంద్రుడు ఉద్భవించాడు. కాశీ క్షేత్రంలో చంద్రుడు చంద్రేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. అమృతోదకమనే కుండాన్ని నిర్మించాడు. గొప్ప తపస్సు చేశాడు. శివుడు అనుగ్రహించి చంద్రుడిని ఓషధులకు, జలాలకు, నక్షత్రాలకు, బ్రాహ్మణులకు అధిపతిని చేసి, చంద్రరేఖను శిరోరత్నంగా ధరించాడు. 'ఓం చంద్రాయనమః'.


64. సూర్యః - అదితికశ్యపులకు ద్వాదశాదిత్యులు జన్మించారు. వారు ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. వీరిలో వివశ్వంతుడే సూర్యుడు. 'ఓం సూర్యాయ నమః'.


65. శనిః - శనిమహానుభావుడికి శనైశ్చరుడు, మందుడని పేర్లున్నాయి. ఇతడు సూర్యుడికి, ఛాయకు జన్మించాడు. శని పంగువు అంటే కుంటివాడు. శని భార్య గంధర్వుడైన చిత్రురథుడి కూతురని ఒకచోట, అలాగే, లక్ష్మీదేవి సోదరి జ్యేష్ఠాదేవే భార్యయని మరొకచోట ఉంది. అయితే, ఆమె, శ్రీహరి ధ్యానంలో ఉన్న శని వద్దకు కోరికతో వచ్చింది. అతడు ఆమెను చూడలేదు. దాంతో, నీ చూపు పడినది ఏదైనా నశించునని శపించింది. అప్పుడు, బ్రహ్మ వైవర్తపురాణం ప్రకారం నలుగు పిండితో బొమ్మను చేసి ప్రాణం పోసిన తన బిడ్డను, మిగతా దేవుళ్లందరితో పాటు, చూడమని పార్వతీదేవి శనిని బలవంతం చేసింది. తన దృష్టి పిల్లవాడి మీద పడకూడదని, తన దృష్టి పడితే అనవసరంగా కష్టాలు కలుగుతాయని, ఎంతగా చెప్పినా ఆమె వినకుండా చూడమని పట్టుబట్టింది. దాంతో, శని చూడక తప్పలేదు. ఆ తరువాత కొంతకాలానికి, గణపతి తల తెగిపడి, నాశనమైన విషయం అందరికీ తెలిసినదే. అప్పుడు, పుష్పభద్రా నదీతీరంలో ఉత్తర దిక్కునకు తలపెట్టి నిద్రిస్తున్న ఏనుగు తలను అతికించి గణపతిని బ్రతికించాడు శ్రీ మహావిష్ణువు. (అందుకే, ఉత్తర దిక్కుకు తల పెట్టుకొని దక్షిణ దిక్కుకు కాళ్లు పెట్టుకుని ఎవరూ పడుకోకూడదని పెద్దలంటారు. ప్రస్తుత వైజ్ఞానిక శాస్త్రం కూడా అలా పడుకోగూడదని చెబుతుంది). అప్పుడు, శనిని అంగవిహీనుడవు కమ్మని పార్వతీదేవి శపించింది. అందుకే, కుంటివాడయ్యాడు. 'ఓం శనయే నమః'.


66. కేతుః - విప్రచిత్తికి, సింహికకు పుట్టినవాడు కేతువు. నవగ్రహాలలో చివరివాడు. ఇతడు ఛాయాగ్రహము. 'ఓం కేతవే నమః'.


67. గ్రహః - (గృహ్ణాతి ఇతి గ్రహః) గ్రహించునది గ్రహం. సూర్యచంద్రులను గ్రహించువాడు రాహువు అని అర్థం (ఇతడు కూడా విప్రచిత్తికి సింహికకు పుట్టిన సంతానమే. ఛాయా గ్రహము. నవగ్రహాలలో ఎనిమిదవవాడు. 'ఓం గ్రహాయ నమః'.


68. గ్రహపతిః - (గ్రహాణాం పతిః), గ్రహపాలకుడు, గ్రహములకు సర్వసైన్యాధ్యక్షుడు, మంగలుడు, కుజుడు. 'ఓం గ్రహపతయే నమః'.


69. వరః - వరించతగినవాడు, అనగా పూజ్యుడు, బృహస్పతి, గురువు. ఇతడే శుక్రుడు కూడా. (బృహస్పతి ర్హి శుక్రో భూత్వా) అని మైత్రాయిణీ శ్రుతిలో ఉంది. ఇందులో శుక్రుడు, బృహస్పతి అవతారంగా చెప్పబడినది. 'ఓం వరాయ నమః'.


70. అత్ర్యానమస్కర్తా - అత్రి పత్ని యైన అనసూయను నమస్కరించేవాడని అర్థం. అయితే, ఆద్యంత లయకర్తా (ఆదిః అంతే, లయకర్తా) అనే పాఠాంతరము కూడా ఉంది. దీనికే, సరియైన అర్థం కనిపిస్తుంది. సృష్టికి పూర్వము ఉన్నాడు, కల్పాంతంలో సృష్టిని లయము చేయువాడు పరమశివుడు. 'ఓం ఆద్యంత లయకర్త్రే నమః'.


71. మృగబాణార్పణః - మృగరూపమును ధరించిన యజ్ఞంపై బాణాన్ని విడిచాడు. పరమేశ్వరుడు పంచముఖుడు, దశభుజుడు. ఆయన చేతులలో త్రిశూలం, డమరుకం, పరశువు, పినాకమనే ధనుస్సు, అగ్ని, లేడి, శంఖము, పునుక ఉన్నాయి. ఆయన యజ్ఞంపై కోపంతో బాణం వేయగా, యజ్ఞం లేడి రూపం ధరించి పరుగెత్తింది. తరువాత శివుడి శరణు కోరింది యజ్ఞం. అప్పుడు క్షమించి, ఆ లేడిని చేతిలో ధరించాడు. 'నీకున్ మాంసము వాంఛయేని కరవా నీచేత లేడుండగా' అని అంటాడు ధూర్జటి మహాకవి. అందువలన, శివుడు మృగబాణార్పణుడు. 'ఓం మృగ బాణార్పణాయ నమః'


72. అనఘః - అఘము అంటే పాపము. అనఘుడు అంటే పాపరహితుడు. )శివేతి నామ దావాగ్నేః మహాపాతక పర్వతాః, భస్మే భవంత్యనాయాసాత్ సత్యం సత్యం నసంశయః). శివుడు అనే నామం మహా పాపాలు అనే పర్వతాలను అనాయాసంగా భస్మం చేసే దావాగ్నియట. ఇది ముమ్మాటికీ సత్యం. శివ నామమే పాపాలను దహిస్తుంటే, ఇక శివుడికి పాపం అంటుతుందా? అంటదు గాక అంటదు. 'ఓం అనఘాయ నమః'శ్లో।।

మహాతపా ఘోరతపా అదీనో దీనసాధకః ।

సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః. ।। 9 ।।

మహాతపస్వి, ఘోరతపస్వి, దైన్యరహితుడు, దీనులకు సాధకుడు, సంవత్సర ప్రవర్తకుడు, మంత్ర స్వరూపుడు ప్రమాణ స్వరూపుడు, పరమ తపోరూపుడు.


73. మహాతపః - (మహత్ తపః యస్యసః మహాతపాః) గొప్ప తపస్వి. మహత్ అంటే ప్రపంచాన్నే సృష్టించే సామర్థ్యం. మనస్సును, ఇంద్రియాలను ఏకాగ్రము చేయడమే తపస్సు. వినయం కలిగివుండడం ఉత్తమ తపస్సు. భగవద్గీతలో శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు, అని మూడు రకాలుగా చెప్పారు. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించుట, పవిత్రత, సరళత్వం, బ్రహ్మచర్యం, అహింస, ఇవి శారీరకమైన తపస్సు. సత్యము, ప్రియము, ఇతరులకు ఉద్వేగము కలిగించని మాటలు, పరమేశ్వర నామ జపము, వేదశాస్త్ర పురాణపఠనం వాచికతపస్సు. మనోనిగ్రహం, భగవత్ చింతనలో ఆసక్తి, ప్రసన్నత, భావములో పవిత్రత, శాంత భావము ఇవి మానసిక తపస్సు. నిష్కామకర్మ కూడా తపస్సే. అష్టాంగయోగము నందలి ధ్యాన సమాధులు తపస్సే. శివుడు ఆదియోగి. అందువలన, మహాతపస్సు గలవాడు. 'ఓం మహాతపసే నమః'.


74. ఘోరతపాః - ఘోరమైన తపస్సు కలవాడు. పరమశివుడు ఘోరమైన తపస్సు ఎందుకు చేశాడో ఒక చిన్న నేపథ్యం చెప్పాలి. సతీవియోగం అనంతరం విరక్తిచేత పరమశివుడు హిమాలయాలలో ఘోరమైన తపస్సుచేశాడు. దితి, దేవతలను జయించే కుమారుని ప్రసాదించమని, కశ్యపుడిని కోరింది. కశ్యపుడి ఉపదేశంతో ఆమె తపస్సు చేసి వజ్రసారమైన దేహంగల వజ్రాంగుడనే పుత్రుడిని ప్రసవించింది. 

అతడు దేవతలందరినీ జయించి ఇంద్రుడిని, తన తల్లి దితి వద్దకు ఈడ్చుకొని వచ్చాడు. అప్పుడు బ్రహ్మ, కశ్యపుడు, మానం కలవాడికి అవమానం జరిగితే, అది వధతో సమానమని, ఇంద్రుడికి ఆ అవమానం ఎలాగూ జరిగింది కాబట్టి, ఇంద్రుడిని విడిచిపెట్టమని చెప్పారు. వారి మాటతో వజ్రాంగుడు ఇంద్రుడిని వదిలిపెట్టాడు. సంతోషించిన బ్రహ్మదేవుడు వరాంగి అనే కన్యకను సృష్టించి వజ్రాంగుడికి భార్యగా చేశాడు. ఆ తర్వాత వజ్రాంగుడు తపస్సు చేసి, తనకు అసురభావం లేకుండా, ధర్మమునందు ఆసక్తి కలిగునట్లు బ్రహ్మను వరం కోరుకున్నాడు. 

వరాంగి కూడా తపస్సు చేయడానికి పూనుకుంది. అలా, తపస్సు చేస్తున్నప్పుడు భయపడిన ఇంద్రుడు, ఆమె తపోవిఘ్నం కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. పిదప, ఆమె వజ్రాంగుడితో ఇంద్రుడిని జయించే కుమారుడు కావాలని కోరింది. వజ్రాంగుడు మళ్లీ బ్రహ్మ గుఱించి, తపస్సు చేసి ఆ వరాన్ని పొందాడు. వారికి తారకాసురుడు జన్మించాడు. తారకుడు తపస్సు చేసి కేవలం ఏడు సంవత్సరాల పిల్లవాడి చేత మాత్రమే తనకు మరణం కలుగునట్లు, బ్రహ్మ ద్వారా వరాన్ని పొందాడు. ఆ తరువాత తారకాసురుడు ఇంద్రాదులను జయించాడు. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల సమాగమానికి దేవతలు ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు మన్మథుడి దహనం కూడా జరిగిపోయింది. అంతవరకు పరమశివుడు ఘోరమైన తపస్సును చేసాడు. 'ఓం ఘోర తపసే నమః'.


75. అదీనః - (దీయత ఇతి దీనః) దుఃఖముతో కృశించువాడు. అదీనః అంటే దీనుడు కానివాడు. దైన్యరహితుడు. నటరాజు అయిన శివుడు సదానందుడు. దరిత్రంతో దీనత్వం కలుగుతుంది. ఈశ్వరుడు పరమైశ్వర్యయుక్తుడు. అందువలన ఆయనకు దీనత్వము లేనే లేదు. 'ఓం అదీనాయ నమః'


76. దీనసాధకః - దీనుల చేత పూజింపబడువాడు. కోరికతో భగవంతుడిని ఉపాసించువాడు సాధకుడు అనగా భక్తుడు. పరమశివుడు దీనులైన సాధకులు అనగా భక్తులు కలవాడు. అందుకే దీనసాధకుడయ్యాడు. 'ఓం దీన సాధకాయ నమః.'


77. సంవత్సరకరః - అంటే సంవత్సర కర్త. అనగా కాలాన్ని ఏర్పరచువాడు. సూర్యుడి వలన కాలరూపాలు కలుగుతున్నాయి. సూర్యుడు శివుడి అష్టమూర్తులలోనివాడే. శ్రీ లింగ పురాణంలోని సూర్యాత్మక శివస్తుతిలో 'స్మరామి దేవం రవిమండలస్థం సదాశివం శంకరమాదిదేవం' అని ఉంటుంది. అంటే, రవిమండలమందున్న సదాశివుడు, శంకరుడు, ఆదిదేవుడిని స్మరిస్తున్నానని భావం. సూర్యుడు సాక్షాత్తు శివుడే. కేవలం సూర్యుడిని శివుడిగా భావించి పూజించే విధానం కూడా ఉంది. పగలు, రాత్రి కలసిన దినము సూర్యుడి వలన ఏర్పడడం వల్ల వారము, పక్షము, నెల, సంవత్సరం కూడా సూర్యుడి వల్లనే ఏర్పడుతున్నాయి. పక్షములు చంద్రుడి వలన ఏర్పడినా, అందుకు కారణం మాత్రం సూర్యుడే. అందుకే, శివుడు సంవత్సరకరుడయ్యాడు. 'ఓం సంవత్సర కరాయ నమః.'


78. మంత్రః - (మననాత్ త్రాయతే ఇతి మంత్రః) మననము చేయడం వలన మనల్ని కాపాడుతుంది. అది ప్రణవ రూపము ఓంకారమే. మంత్రమనగా రహస్యము. అజ్ఞానులకు తెలియబడనివాడు. పరమేశ్వరుడు 'ఓం నమశ్శివాయ' అను పంచాక్షరీ మంత్ర స్వరూపుడు. 'ఓం మంత్రాయ నమః'


79. ప్రమాణం - (ప్రమీయతే అనేనేతి ప్రమాణం) ప్రమాణమంటే ప్రత్యక్షాది జ్ఞానాలకు కారణమైన ఆత్మ. వేదశాస్త్రాది రూపము, పరమేశ్వరుడు ప్రమాణ స్వరూపుడు. 'ఓం ప్రమాణాయ నమః'.


80. పరమం - (అయం తు పరమో ధర్మః యద్యోగేనాత్మదర్శనం) అని యాజ్ఞవల్క్యుడు చెప్పిన ధర్మము. పరమమనగా ఆద్యము. మొట్టమొదటిది, ఉత్కృష్టమైనది, ప్రధానమైనది. అలా శివుడే ఆద్యుడు, ఉత్కృష్టుడు, ప్రధానుడు. సృష్టిలో ప్రధానమైన తత్త్వము ఆత్మ. ఇది శివుడి అష్టమూర్తులలో ఒకటి. 'ఓం పరమాయ నమః'.


81. తపః - తపస్సు, చాంద్రాయణాది వ్రతాది పుణ్య కర్మలు, ఇవి పరమశివుడి స్వరూపాలు. దీనికి ధర్మము అనే అర్థం కూడా ఉంది. కాబట్టి, శివుడు ధర్మ స్వరూపుడు. 'ఓం తపసే నమః'.యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః

సువర్ణరేతాః సర్వజ్ఞః సుబీజో బీజవాహనః ।। 10 ।।


82. యోగీ - యోగాభ్యాసము చేసేవాడు యోగి. మంత్ర యోగము, హఠయోగము, రాజయోగము, అష్టాంగ యోగము అనే వాటిలో అష్టాంగ యోగాన్ని పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో వివరించాడు. సాధారణంగా దీనిని అవలంబించే వాళ్లే లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనేవి ఎనిమిది యోగాంగాలు. ఈ యోగాన్ని అభ్యసించిన వాడిని యోగి అంటారు. శివుడు ఆదియోగి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 'సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే'. అని చెప్పాడు. శివుడు కూడా ఏ విధమైన పక్షపాతం లేనివాడు. ఆయన దేవతలను, రాక్షసులను కూడా సమానంగా చూస్తాడు. అందువలన, ఆయన కూడా యోగి, యోగనిష్ఠుడు. 'ఓం యోగినే నమః'


83. యోజ్యః - యోజ్యుడు అంటే యోజింపతగినవాడు, ఆలోచింపదగినవాడని అర్థం. శివతత్త్వం తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. శివుడు మోక్షప్రదాత. 'ఓం యోజ్యాయ నమః'.


84. మహాబీజః - సకల చరాచర ప్రపంచానికి కారణమైనవాడు. శివుడు అష్టమూర్తి. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఆత్మ, అనే ఎనిమిది మూర్తులు కలవాడు. సమస్త సృష్టికి కారణమైనవి ఇవే. అనగా సమస్తము పరమేశ్వరుడే. ప్రపంచమంతా పాంచభౌతికమైనదే. ప్రాణులన్నింటిలో ఆత్మ ఉన్నది. కారణమునకు కూడా కారణం, మహాకారణ రూపుడు శివుడు. 'ఓం మహా బీజాయ నమః'.


85. మహారేతాః - (మహత్ రేతా యస్యసః) అవ్యక్తానికి కూడా స్ఫూర్తిసత్తాప్రదమైన రేతః అంటే ప్రతిబింబము కలవాడు. మహావీర్యుడు. మహాబలుడు. ఇంకా చెప్పాలంటే రేతస్సు, తేజస్సు, వీర్యము, శుక్రము, ఇవన్నీ సమానార్థకాలు. మహారేతా అంటే గొప్ప రేతస్సు కలవాడు. శివుడు తన తేజస్సుని భరించమని అగ్నిని ఆదేశించాడు. అగ్ని దానిని భరించలేక గంగలో విడిచాడు. గంగ కూడా దానిని భరించలేక ఒడ్డున ఉన్న రెల్లు పొదలతో కూడిన వనంలోకి చిమ్మింది. అప్పుడు, కుమారస్వామి జన్మించాడు. శరవణం అంటే రెల్లు అడవి. అందువలన, కుమారస్వామికి శరవణభవుడు అనే పేరు కలిగింది. షట్ కృత్తికలు పాలిచ్చి అయన్ని పెంచారు. అందువలన షాణ్మాతురుడు, కార్తికేయుడు అయ్యాడు. ఈ కథ వలన శివతేజస్సు దుస్సహమైనదని తెలుస్తుంది. అందుకే అతడు మహారేతా. 'ఓం మహారేతసే నమః'.


86. మహాబలః - బలము అనగా సైన్యం. శివుడికి భూత, ప్రేత, పిశాచ, ప్రమథగణాలు అనే గొప్ప సైన్యం ఉంది. అందువలన, ఆయన మహాబలుడు అనగా గొప్ప సైన్యం కలవాడని అర్థం. మహాబలము అనగా వాయువు అని కూడా అర్థం ఉంది. అష్టమూర్తి అయిన శివుడు వాయు స్వరూపుడై ఉన్నాడు. బలము అనగా శారీరక శక్తి. త్రిపురాసుర సంహార సమయంలో మేరుపర్వతాన్ని ధనుస్సుగా ధరించుట చేత ఆయన మహాబలుడయ్యాడు. 'ఓం మహాబలాయ నమః'.


87. సువర్ణరేతా - శివుడి వీర్యము పాదరసం. శివ వీర్యము ప్రవహించిన చోట బంగారము ఉత్పన్నమైంది. పాదరసమునందు బంగారం ఉంది. అందువలన, పాదరసంలో బంగారం కూడా కరిగిపోతుంది. పాదరసంతో బంగారాన్ని తయారుచేసే సిద్ధ విద్య ఉంది. దీన్ని మన యోగివేమన నేర్చుకున్నాడనే నమ్మకం లోకంలో ఉంది. శివుడు అగ్ని రూపంతో సువర్ణతేజస్కుడు.‌ అనగా బంగారం రేతస్సుగా కలవాడు. 'ఓం సువర్ణ రేతసే నమః'.


88. సర్వజ్ఞః - (సర్వశ్చాసౌజ్ఞశ్చ) అంతా తానే. జ్ఞానము తానే. మయా వృత్తితో సమస్తము తెలిసినవాడని చెప్పుకోవచ్చు. సర్వజ్ఞుడు అనే బిరుదు ఈశ్వరుడికి మాత్రమే ఉంది. 'ఓం సర్వజ్ఞాయ నమః'.


89. సుబీజః - (సుష్టు బీజభూతః సుబీజః) సుష్టు అనగా అవికారి. అవికారబీజమంటే, సర్వకారణమని తాత్పర్యం. బీజాక్షరాలు అన్నింటిలో 'ఓం' కారం గొప్పది. సమస్త మంత్రాలకు 'ఓం' కారం ముందుండాలి. లేకపోతే, ఆ మంత్రాలు ఫలితాలను ఇవ్వవు. పరబ్రహ్మోపాసకులకు ఇది ప్రధాన బీజమంత్రం. శివుడి బీజాక్షరం. ఓంకారేశ్వరుడు అనే పేరుతో శివుడు వెలసి ఉన్నాడు కూడా. 'ఓం సుబీజాయ నమః'


90. బీజవాహనః - బీజమనగా కారణం. 'హేతుర్నా కారణం బీజమ్' అంటుంది అమరకోశం. అలా, సమస్త కారణాలకు కారణమైనవాడు కాబట్టి, శివుడు బీజ వాహనుడు. 'ఓం బీజ వాహనాయ నమః'.శ్లో||

దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః ।

విశ్వరూపః స్వయంశ్రేష్ఠో బలవీరో బలో గుణః ।। 11 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-43.

పదిబాహువులవాడు, రెప్పపాటు లేనివాడు, నీలకంఠుడు, ఉమాపతి, విశ్వరూపుడు, స్వయంశ్రేష్ఠుడు, బలవీరుడు, దుర్బల గణ తత్త్వ స్వరూపుడు.


91. దశబాహుః - పది బాహువులు కలవాడు. శివుడు పంచముఖుడు, దశబాహుడు అనగా ఐదు ముఖములు మరియు పది బాహువులు (చేతులు) కలవాడని అర్థం. సద్యోజాతము, వామదేవము, తత్పురుషము, ఘోరము, ఈశానము, ఇవి శివుడి పంచ ముఖాలు. శివుడి పది చేతులలో శూలము, వజ్రము, ఖడ్గము, పరశువు, డమరుకం, అగ్ని, లేడి, శంఖము, అంకుశం, కపాలము ఉంటాయి. 'ఓం దశబాహవే నమః'.


92. అనిమిషః - నిమిషము అనగా రెప్పపాటు. అది లేనివారు అనిమిషులు. అనగా దేవతలు. కాళ్లు భూమి పైన ఆనవు. రెప్పలు కొట్టరు. ఇవి దేవతల ప్రత్యేకతలు. చింతామణి నాటకంలో కాళ్లకూరి నారాయణరావు గారు అద్భుతమైన పద్యాన్ని, నాయకుడైన బిళ్వమంగళుడి ద్వారా చెప్పించారు.

ఉ. రెప్పలు వాల్చకుండిన ధరిత్రిని పాదము లంటకుండినన్

తప్పకరంభయో, మృతాచియొ. మేనకయోయటంచనీ

కప్పురగంధిపట్ల భ్రమ కల్గకపోవునె? యాలకింపలే

దిప్పురమందు యిట్టి జలజేక్షణ యున్నదటంచునెప్పుడున్.

పైగా, సూర్యచంద్రాగ్నులు ఆయన నేత్రాలు. వారు లేకున్న ప్రపంచానికి మనుగడే లేదు. అందువలన శివుడు అనిమిషుడు. ఒకనాడు పార్వతీదేవి నవ్వులాటకు శివుడి నేత్రాలు మూసింది. వెంటనే లోకాలన్ని అల్లాడిపోయాయి. అప్పుడు, అంధకుడనే రాక్షసుడు శివుడి చెమట వల్ల జన్మించాడట. 'ఓం అనిమిషాయ నమః'.


93. నీలకంఠః - నీలకంఠుడు అంటే నల్లని కంఠము కలవాడని అర్థం. మూడు లోకాలను భస్మము చేయగల హాలాహలాన్ని కంఠము నందు ధరించుటవలన నీలకంఠుడయ్యాడు. ఇది ఆయన లోకరక్షణ దీక్షను తెలియజేస్తుంది. దుర్వాసుని శాపం వలన దేవేంద్రుడి సకలైశ్వర్యములు సముద్రం పాలైంది. శ్రీ మహావిష్ణువు ప్రేరణ వలన, దేవదానవులు కలసి సముద్రాన్ని మధించారు. మొదట హాలాహలం పుట్టి, లోకములను దహిస్తుండగా దేవతలు భయభ్రాంతులై శివుడిని ప్రార్థించి శరణువేడారు. అప్పుడు, శివుడు హాలాహలాన్ని కంఠంలో నిలుపుకున్నాడు. అందువలన, ఆయన కంఠం నల్లగా మారిపోయింది. 'ఓం నీలకంఠాయ నమః'.


94. ఉమాపతిః - పార్వతీపతి. పార్వతీదేవి శివుడి గుఱించి తపస్సు చేయుటకు వెళుచుండగా, పార్వతీదేవి తల్లి, మేనాదేవి ఉ = అమ్మాయీ, మా = వద్దు అని చెప్పిందట (ఇదివరకు ఒకసారి చెప్పాను. మంచి విషయం మళ్లీ మళ్లీ చెప్పడంలో పునరుక్తి దోషం ఉండదని పెద్దలు చెబుతారు). అందువలన, పార్వతీదేవికి ఉమా అనే పేరు స్థిరపడింది. ఉమాదేవికి పతి కావున శివుడు ఉమాపతి అయ్యాడు. 'ఓం ఉమాపతయే నమః'.


95. విశ్వరూపః - (విశ్వాని రూపాణి యస్మాజ్జాయంతే) సకల జగదుత్పత్తి స్థానము, తమః ప్రధానమైన ప్రకృతి ఉపాధిగాగల బ్రహ్మమే జగత్తు. మాయ వలన బ్రహ్మము, జడచేతన స్థావర నక్షత్ర గ్రహ గోళములతో కూడిన సమస్త విశ్వంలా కనిపిస్తుంది. నామరూపాలు వేరుగా ఉన్నా కనిపించేదంతా బ్రహ్మమే. ఈవిధంగా విశ్వరూపంలో కనిపించే బ్రహ్మాన్ని విరాట్ స్వరూపం అంటారు. అందువలన, శివుడు విశ్వరూపుడు. 'ఓం విశ్వరూపాయ నమః'.


96. స్వయంశ్రేష్ఠః - స్వయం అంటే సహజముగానే, తనంతకుతానే వచ్చిన శ్రేష్ఠత్వము, ఉత్తమత్వము. సహజమైన ఉత్తమత్వము కలవాడు. తన కంటే గొప్పవాడు మరొకడు లేడు. ఆయన నిత్యుడు, సత్యుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిర్వికారుడు, నిరామయుడు, నిర్విచారుడు, అపరిచ్ఛిన్నుడు. ఆదిదేవుడైన ఆయన సమస్త దేవతలకు ఆరాధ్యుడు, పక్షపాత రహితుడు, భక్త సులభుడు, సమస్త లోకాలకు ఆరాధ్యుడు. 'ఓం స్వయం శ్రేష్ఠాయ నమః'.


97. బలవీరః - (బలేన వీరః) బలము, పరాక్రమము కలవాడు. సామర్థ్యంతో కర్మలు చేయువాడు. త్రిపురాసుర సంహారంలో మేరు పర్వతాన్ని ధనుస్సుగా, ఆదిశేషుడిని అల్లెత్రాడుగా చేసుకొని, శ్రీమహావిష్ణువు బాణముగా, అగ్నిని ములికిగా (బాణము ముందు కొన) చేసుకుని, త్రిపురాలను భస్మం చేసిన బలపరాక్రమ సంపన్నుడు శివుడు. దక్షయజ్ఞం ధ్వంసం చేయడానికి కేవలం తన జట నుండి పుట్టిన వీరభద్రుడి చేత సమస్త దేవతలను శిక్షించినవాడు శివుడు. అందుకే, ఆయన బలవీరుడు. 'ఓం బలవీరాయ నమః'.


98. బలః - మార్కండేయుడిని రక్షించడానికి మృత్యువునే నిగ్రహించిన బలవంతుడు. 'ఓం బలాయ నమః'.


99. గణః - ప్రమథ గణములు సైన్యంగా కలవాడు. గణము అనగా సైన్యం. 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 గురు సైనికులుగల సేనా విభాగానికి గణము అని పేరు. లేదా సైన్యం అని చెప్పవచ్చు. 'ఓం గణాయ నమః'శ్లో|| 

గణకర్తా గణపతిః దిగ్వాసాః కామఏవ చ ।

మంత్ర విత్పరమోమంత్రః సర్వభావకరోహరః. ।। 12 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-42.


100. గణకర్తా - గణములకు అధిపతి. సమస్త భైరవ, పిశాచ, భేతాళ, పూతన, మొదలగు పంచవింశతి (25) ప్రమథ గణాలకు అధిపతి, కర్త. గణాలకు నియంత. 'ఓం గణకర్త్రే నమః'.


'ప్రథమ శతకం సమాప్తమ్'


101. గణపతిః - పై ప్రమథ గణాలకు పతి లేదా విఘ్నేశ్వర రూపంలో నున్న గణపతి. 'ఓం గణపతయే నమః'.


102. దిగ్వాసాః - (దిశాం ఆవాసః దిగ్వాసాః). వాసస్సు అంటే వస్త్రము. దిగ్వాసాః అంటే దిక్కులే వస్త్రములుగా కలవాడని అర్థం, దిగంబరుడు. 'ఈశావాస్యమిదం సర్వం యత్కించజగత్యాం జగత్' అంటుంది ఉపనిషత్. ఈశేనావాస్యం అనగా ఈశ్వరుడిచేత ఆచ్ఛాదనీయము. పరమశివుడి విరాట్ స్వరూపమే విశ్వం. విశ్వం దిక్కులకు మద్య ఉంటుంది. అందువలన ఆయన దిగంబరుడు. అంతేగాని, ఆయన బట్టలు విప్పుకొని తిరుగుతాడని అర్థం కాదు. పురాణాలలో దారుకావనంలో శివుడు దిగంబరంగా తిరిగి మునిపత్నులను మోహింప చేశాడనే కథ ఒకటి ఉంది. అందుకే శివభక్తులైన అఘోరాలు, నాగసాధువులు, దిగంబరంగా ఉంటారు. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక భావన. మన వేమనగారు ఒక పద్యంలో ఇలా అంటాడు. 

ఆ.వె. తల్లి గర్భమునను దా బుట్టినప్పుడు, 

బట్టలేదు తుదిని బట్టలేదు 

నడుమ బట్టగట్ట నగుబాటు కాదొకో! 

విశ్వదాభిరామ వినుర వేమ. 

అని దిగంబర తత్వాన్ని సమర్ధించాడు ఆయన. పుట్టినప్పుడు బట్ట లేదు. చనిపోయిన తరువాత శవాన్ని దిగంబరంగా చేసి కాలుస్తారు. ఈమధ్యలో వస్త్రధారణ దేనికి? అన్నది వేమన ప్రశ్న. అయితే, దీన్ని లోకము ఆమోదించదు అన్నది అందరికీ తెలిసిన సత్యం. 'ఓం దిగ్వాససే నమః


103. కామః - కామస్వరూపుడు. కాముడు అంటే మన్మథుడు. అందరి చేత కోరదగినవాడు. పరమేశ్వరుడు కూడా అందరి చేత కోరదగినవాడే. సౌందర్యాధికుడైన పరమశివుడిని మునిపత్నులు కూడా కామించారని పురాణాలలో ఉంది. అందుకే, ఆయన కామేశ్వరుడు, కాముడు. 'ఓం కామాయ నమః'.


104. మంత్రవిత్ - మంత్రముల చేత తెలియబడువాడు, మంత్రములు తెలిసినవాడు. మంత్రవేత్త. అస్త్రవిద్యకు గురువు పరమేశ్వరుడు. అస్త్రవిద్య మంత్ర పూర్వకమైనది. విశ్వామిత్రుడు, పరశురాముడు, పరమేశ్వరుడి నుండి అస్త్రవిద్య నేర్చుకున్నారు. పరమేశ్వరుడు ప్రవచించిన తంత్ర విద్యలు 64 ఉన్నాయి. అవి కూడా మంత్రాలతో కూడినవే. ఈ విధంగా అనేక మంత్రములు తెలిసినవాడు పరమేశ్వరుడు. 'ఓం మంత్రివిదే నమః.'


105. పరమః - పరముడు అంటే పరమాత్మ. ఆద్యుడు, ప్రధానుడు, ఉత్కృష్టుడు, పంచభూతములు, పంచ కర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తాహంకారములు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, పంచకోశాలు, పంచతన్మాత్రలు, మొదలైన అన్ని తత్వాల కంటే ఉత్కృష్టమైన, ప్రధానమైన ఆత్మతత్వము తానే అయినవాడు. 'ఓం పరమాయ నమః'.


106.మంత్రః - పరమ మంత్ర స్వరూపుడు. 'మంత్రో దేవాది సాధనః' మంత్రము దేవతల అనుగ్రహమును పొందుటకు జపింపబడుతుంది. అటువంటి మంత్ర స్వరూపుడు శివుడు. 'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రమునకు, శివుడికి భేదం లేదు. ఆ మంత్ర స్వరూపుడు కూడా శివుడే. అలాగే, ఓంకారము అనగా ప్రణవము కూడా శివ స్వరూపమే. ప్రణవోపాసన కూడా శివుడి ఉపాసనే. 'ఓం మంత్రాయ నమః'.


107. సర్వభావకరః - (సర్వస్యభావం కరోతి) అన్నింటినీ సృష్టించువాడు. జగత్కారణభూతుడు. సమస్త జీవులలో ఆలోచనలను కలిగించువాడు. శివుడి అష్ట మూర్తులు లోనిదే ఆత్మ. ఆత్మ కళను పొందిన మనస్సు ఆలోచిస్తుంది. అందువలన జీవులకు కలుగు అన్ని ఆలోచనలు శివుడు కలిగించునవే. 'శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనే సామెతలో ఈ అభిప్రాయమే దాగి ఉంది. 'ఓం సర్వ భావ కరాయ నమః'.


108. హరః - (సర్వకర్తృత్వ సంహారత్వములు) ప్రళయము నాలుగు విధాలు 1. ప్రాకృతికము (బ్రహ్మదేవుడి అవసానమందు ఏర్పడే నాశనం). 2. నైమిత్తికము (దైనందినము) బ్రహ్మకు దినావసానంగా జరిగే త్రైలోక్య నాశనం. 3. నిత్యము (సుషుప్తిలో జరిగే సర్వనాశము). ఈ మూడు సబీజాలు అనగా ఉత్పత్తి కలవి. 4. ఆత్యంతికము (తత్త్వజ్ఞానంతో కారణంతో కూడిన కార్యనాశము). మళ్లీ ఉత్పత్తి ఉండదు. దీనినే మోక్షమని కూడా అంటారు. సృష్టిని హరించువాడు కాబట్టి, హరుడు. హరుడు లయకారకుడు. 'ఓం హరాయ నమః'.శ్లో||

కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవాన్ ।

అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహాన్ ।। 13 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-43.

కమండలము ధరించినవాడు, ధనుస్సుగలవాడు, బాణాన్ని చేతబట్టినవాడు, కపాలధారి, వజ్రాయుధధారి, శతఘ్నికలవాడు, ఖడ్గధారి, పట్టిశధారి, శూలధారి, మహాత్ముడు.


109. కమండలుధరః - కమండులము అనగా తపస్వులు, సన్యాసులు నిరంతరం తమ వద్ద ఉంచుకొను జలపాత్ర. ఇది గుండ్రంగా ఉంటుంది. అందువలన, దీనిని కుండిక అని కూడా అంటారు. శివుడు కమండలధరుడు అంటే సన్యాసాశ్రమంలో ఉన్నవాడని అర్థం. మరి భార్యాబిడ్డలు ఉన్నవాడు సన్యాసి ఎలా అవుతాడు? సన్యాసానికి బాహ్య చిహ్నములైన కాషాయ వస్త్ర, దండ, కమండలము ప్రధానం కావు. బ్రహ్మభావన ప్రధానం. బ్రహ్మ భావనలోనే నిరంతరం ఉండేవాడు శివుడు. దీనికి భార్యాబిడ్డలు ప్రతిబంధకం కాదు. ఇది కేవలం భావాద్వైతం మాత్రమే. 'ఓం కమండలు ధరాయ నమః'.


110. ధన్వీ - ధనుస్సును ధరించినవాడు. శివుడు ధనుర్వేదానికి ఆది గురువు. సమస్త అస్త్రాలు అతనిని ఆశ్రయించి ఉంటాయి. భూమండలంలో సమస్త క్షత్రియ సంహారం చేసిన పరశురాముడు పరమేశ్వరుడి శిష్యుడు. పరశురాముడు విష్ణువు యొక్క ఆవేశావతారం. ఋచీకుడు అంటే పరశురాముడి తాత అతడికి అపజయం ఉండదనే వరం ఇచ్చాడు. అందుకే, పరశురాముడు శ్రీరాముడి చేతిలో మరియు భీష్ముడి చేతిలో కూడా ఓటమి పాలవలేదు. 'ఓం ధన్వినే నమః'.


111. బాణహస్తః - చేతిలో బాణాన్ని ధరించినవాడు. ధనుర్బాణాలు ఒక దానిని విడిచి ఒకటి ఉండవు. పైగా, అలా విడివిడిగా ఉంటే ఉపయోగపడవు కూడా. శివుడికి గల పది చేతులలో పది పరికరములు ఉంటాయి. ఆయన ఎడమచేతిలో ధనస్సు, కుడిచేతిలో బాణాన్ని ధరిస్తాడు. 'ఓం బాణ హస్తాయ నమః'

.

112. కపాలవాన్ - కపాలము చేతియందు కలవాడని అర్థం. బ్రహ్మదేవుడి ఐదవ తలను ఖండించి, ఆ శిరస్సును చేతిలో ధరించి బిక్షమెత్తుకున్నాడు శివుడు. ఇది, ఆయన చేసిన బ్రహ్మహత్య పాపానికి ప్రాయశ్చిత్త కర్మ. అందువలన, శివుడికి ‘కపాలి’ అనే పేరు వచ్చింది. ధర్మాత్ములు, వీరులు యుద్ధరంగంలో మరణిస్తే వారి కపాలములను శివుడు మెడలో హారంగా ధరిస్తాడు. ప్రతి బ్రహ్మకల్పానికి బ్రహ్మదేవుడు మరణిస్తాడు. అలా మరణించిన బ్రహ్మదేవుడి కపాలాలను శివుడు మెడలో హారంగా ధరిస్తాడు. అంటే, బ్రహ్మదేవుడికి కూడా నిత్యత్వం లేదు. ఆయనకు కూడా మరణం ఉంది. శివుడు ఒక్కడే నిత్యుడు, శాశ్వతుడు. 'ఓం కపాలవతే నమః'.


113. అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిసీ చాయుధీన్ - అశనీ అనగా వజ్రాయుధం. శతఘ్ని అనగా వందమందిని ఒకేసారి చంపే ఆయుధం. ఖడ్గము అంటే 30 అంగుళాల కంటే పొడవున్న కత్తి. పట్టిసం అనగా రెండు అంచుల యందు పదునుగల కత్తి. ఆయుధము అంటే పొడిచే త్రిశూలం. ఇవన్నీ శివుడి ఆయుధాలు. శివుడు తన భక్తులకు వరంగా ఇచ్చే యుద్ధ సాధనాలను కూడా వీటి నుండే సృష్టించి ఇవ్వగలడు. పరశురాముడికి తన పరశువు నుండి మరియొక పరశువును సృష్టించి ఇచ్చాడు. రావణాసురుడికి తన కత్తి నుండి చంద్రహాసం అనే పేరుగల కత్తిని సృష్టించి ఇచ్చాడు. రావణాసురుడు దీనితోనే జటాయువు పక్షి రెక్కలను ఖండించాడు. రావణుడి బావ మధు అనే రాక్షసుడు గొప్ప శివ భక్తుడు. శివుడు అతడికి తన త్రిశూలం నుండి మరొక త్రిశూలాన్ని సృష్టించి ఇచ్చాడు. అతడి నుండి అతని కుమారుడైన లవణాసురుడికి ఆ త్రిశూలం సంక్రమించింది. మహావీరుడైన మాంధాత రావణుడితో కూడా యుద్ధం చేశాడు, దేవేంద్రుడిని కూడా పరాక్రమంలో మించినవాడు. అలాంటి మాంధాతపై లవణాసురుడు త్రిశూలాన్ని ప్రయోగించి చంపాడు. త్రిశూలం లవణాసురుడి చేతిలో లేని సమయం చూసి శ్రీరామచంద్రుడి తమ్ముడైన శతృఘ్నుడు అతడిని సంహరించాడు. 'ఓం అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిసీ చాయుధినే నమః'


114. మహాన్ - గొప్పవాడు, పూజ్యుడు. అన్ని తత్త్వాల కంటే గొప్పదైన ఆత్మ తత్త్వము తానే అయినవాడు. దేవతలందరి కంటే గొప్పవాడు. నిత్యుడు, పరమాత్మ. 'ఓం మహతే నమః'.

.

 

...అంబాళం పార్థసారథి

image41

SRI SHIVA SAHASRA NAMA

Sri Shiva Sahasra Nama Stotram (Meaning in Telugu)

Part - 2


 

శ్లో||

స్రువహస్తః సురూపశ్చ తేజః తేజస్కరో నిధిః ।

ఉష్ణీషీచ సువక్త్రశ్చ ఉదగ్రోవినత స్తదా ।। 14 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-44.


115. స్రువహస్తః - స్రువము అంటే యజ్ఞంలో ఆజ్యాన్ని పోసే కొయ్యతో చేసిన యజ్ఞపాత్ర లేదా నేతి గరిటె. శివుడి చేతిలో నేతిగరిటె అదే స్రువము ఉన్నదంటే, శివుడికి యజ్ఞం చేసే అధికారం ఉందని తెలుస్తుంది. పూర్వం శ్వేతుడనే రాజు శివుడి గూర్చి గొప్ప తపస్సు చేశాడు. దాంతో అతడికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. తాను వేయి సంవత్సరాలు నిరంతరం నేతిధారలతో యజ్ఞం చేయడానికి సంకల్పించానని, భూలోకంలో బ్రాహ్మణులు అలాంటి యజ్ఞానికి, అంతకాలం ఆధ్వర్యం వహించలేమని తనకు తెలియజేశారని శివుడికి చెప్పి, యజ్ఞాన్ని జరిపించమని శివుడినే వేడుకున్నాడు. దానికి, శివుడు తన అవతారమైన దుర్వాసమహర్షి ఆ యజ్ఞ కార్యాన్ని నెరవేరుస్తాడని వరమిచ్చాడు. ఈ కథ వలన శివుడు సమస్త వేదముల పరిజ్ఞానం కలిగినవాడిని, అలాగే యజ్ఞాలను నిర్వహించగలడని మనకు తెలుస్తుంది. 'ఓం స్రువ హస్తాయ నమః'.


116. సురూపః - శోభనమైన రూపం గలవాడు, అందగాడని అర్థం. ఈశ్వరుడు చాలా సౌందర్యవంతుడు. పార్వతి దేవి తల్లి మేనాదేవి శివుడి వికృతమైన అలంకారాలను చూసి, పార్వతిని ఆయనకిచ్చి వివాహం చేయనని పట్టుపట్టిందట. శ్రీమహావిష్ణువు ఆమెకు శివుడి మహాత్మ్యాన్ని విపులంగా వివరించాడట. చివరికి, కోటి సూర్యుల కాంతితో, నానావిధ ఆభరణాలతో సర్వాంగ సుందరుడైన స్వామిని చూసి, సిగ్గుపడి స్తుతించిందట. 

పార్వతిదేవి మలయధ్వజ పాండ్యుడికి యజ్ఞకుండము నుండి కుమార్తెగా జన్మించింది. పుట్టుకతోడనే ఆమెకు మూడు స్థనములు ఉండగా, ఆమెకున్న మూడవ రొమ్ము, ఆమెకు కాబోయే భర్త చూసిన వెంటనే మాయమవుతుందని ఆకాశవాణి వినిపించిందట. మలయధ్వజ పాండ్యుడు, కాంచనమాల దంపతులు ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టి పెంచారు. ఆమె యుద్ధ విద్యలలో నిష్ణాతురాలై, ఇతర రాజ్యాలను జయించి కైలాసానికి చేరుకుంది. అక్కడ శివుడిని చూడగానే ఆమె మూడవ స్థనం అదృశ్యమైంది. అప్పుడు, శివుడు మధురై వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడట. అప్పటి శివుడు పేరు సుందరేశ్వరుడు. అందువలన, శివుడు సుందరుడని తెలుస్తుంది. పార్వతీదేవే మన మధుర మీనాక్షి. 'ఓం సురూపాయ నమః'.


117. తేజః - తేజస్సు కలవాడు. తేజస్సు అంటే ప్రతాపం, కాంతి. పరమేశ్వరుడు ప్రతాపవంతుడు. కాంతిమంతుడు. సమస్త జ్యోతిస్సులలోని కాంతి శివుడిదే. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు మొదలైన అన్నింటిలోని కాంతి శివుడిదే. పరంజ్యోతి స్వరూపుడైన ఆయన తేజస్సుని, ఇంత అని నిర్వచించలేము. అందువలన, ఆయన కోటిసూర్య సమానమైన తేజస్సుగలవాడు. 'ఓం తేజసే నమః'.


118. తేజస్కరః - భక్తులకు తేజస్సునిచ్చువాడు తేజస్కరుడు. అనగా, కాంతిని ఇచ్చేవాడు. సూర్య భగవానుడు కాంతిని ఇచ్చేవాడు. ఆయన శివ స్వరూపుడు. లింగపురాణంలో గాయత్రీ మంత్రము శివ, సూర్యులకు సంబంధించినదిగా చెప్పబడినది. గాయత్రి మంత్రలోని భర్గ శబ్దము శివుడికి చెందినది. సవిత్రు శబ్దము సూర్యుడికి సంబంధించినది. సూర్య మండలంలో శివుడిని అర్చించే విధానాన్ని కూడా లింగపురాణంలో తెలుపబడింది. 'ఓం తేజస్కరాయ నమః'.శ్లో||

స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః ।

ఉష్ణీషీచ సువక్త్రశ్చ ఉదగ్రో వినత స్తదా ।। 15 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-44.


119. నిధిః - నిధి అనగా ఐశ్వర్యస్థానం. ఈశ్వరుడు ఐశ్వర్యవంతుడు. కుబేరుడిని నవనిధులకు అధిపతిగా చేసినది శివుడే. 'ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్' అన్నారు. అందుకే, ఐశ్వర్యం కోరుకునేవాళ్లు ఈశ్వరుడిని ఆరాధించాలి. భక్తులకు కొంగు బంగారం ఈశ్వరుడు. పరమైశ్వర్యవంతుడైన శివుడు నిధివంటివాడు. 'ఓం నిధయే నమః'.


120. ఉష్ణీషీ - తలపాగా ధరించినవాడు. కిరీటము అనే అర్థం కూడా ఉంది. శివుడిని చంద్రార్థ ముకుటుడు అని కూడా వర్ణిస్తారు. దీని వలన, శివుడు కిరీటము కలవాడని తెలుస్తుంది, 'ఓం ఉష్ణిషిణే నమః'.


121. సువక్త్రః - వక్త్రము అనగా ముఖం. శోభనమైన, సౌందర్యవంతమైన ముఖం కలవాడు. శివుడు నిరంతరమైన ధ్యానంతో ప్రశాంతంగా ఉంటాడు. శాంతుడు కాబట్టి సువక్త్రుడయ్యాడు. 'ఓం సువక్త్రాయ నమః'.


122. ఉదగ్రః - ఉదగ్రుడు అంటే మిక్కిలి ఎత్తైనవాడు. ఆకారంలోనే కాక ఉన్నతుడని, ప్రభావశాలియని, సద్గుణములతో కూడినవాడని చెప్పవచ్చు. కరుణ, ఔదార్యం, అనుగ్రహం, దుష్టులయెడ ఆగ్రహం, పిపీలికాది బ్రహ్మ పర్యంతం అన్ని ప్రాణుల యెడల సమదృష్టి కలవాడు శివుడు. అందరినీ ఆశ్రయించేది శివుడే. 'ఓం ఉదగ్రాయ నమః'


123. వినతః - వినయము కలవాడు, వినయశీలి. శివుడు దేవదేవుడైనా గర్వికాదు. భక్తులు కోరితే తన స్థాయిని కూడా లెక్కచేయకుండా భక్తుల కోరికలు తీరుస్తాడు. బాణాసురుడు శివుడిని తన కోటగుమ్మం దగ్గర కాపలా కాయమన్నాడు. తన ప్రమథ గణాలతో సహ కాపలాదారుడిగా మారిపోయాడు శివుడు. 'ఓం వినతాయ నమః'.శ్లో||

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవచ ।

సృగాల రూపః సిద్ధార్థో ముండః సర్వ శుభంకరః ।। 16 ।।


124. దీర్ఘః - పొడగరి, పొడవైనవాడు. మహాశివుడు వ్యోమకేశుడు. వ్యోమము అనగా ఆకాశం. అన్నిటికంటే ఉన్నతమైనది ఆకాశం. మహాభారతంలో నిద్రపోతున్న పాండవులను చంపాలని అర్ధరాత్రి సమయంలో పాండవ శిబిరం వద్దకు వస్తాడు అశ్వత్థామ. శివుడు అతడిని మహా భూతాకారంలో నిలువరిస్తాడు. ఇక్కడ శివుడి ఆకారాన్ని అద్భుతంగా ఎంతో ఉన్నతంగా వర్ణిస్తాడు వ్యాసమహర్షి. శివుడి ఆకారాన్ని దీర్ఘమైన శరీరము కలవాడని వర్ణిస్తాడు. 'ఓం దీర్ఘాయ నమః'.


125. హరికేశః - (హరయఏవ కేశా ఇవ కేశం యస్యసః ) త్రిమూర్తుల రూపము కలవాడు. హరి అంటే విష్ణువు. క అంటే బ్రహ్మ. వారిరువురికి ఈశుడు అనగా ప్రభువు కాబట్టి, శివుడు హరికేశుడు. అలాగే, హరి అనగా ఇంద్రియాలు. కేశములు అనగా కిరణములు. ఇంద్రియముల చేత తెలియదగిన కిరణములు గలవాడు, అనగా సూర్యాత్మకుడు. హరికేశః అనగా కపిల వర్ణం గల కేశములు గలవాడని మరొక అర్థం. 'ఓం హరికేశాయ నమః'.


126. సుతీర్థః - తీర్థమనగా ఋషుల చేత సేవింపబడిన జలాశయం. ఈ తీర్థాలు స్నానము చేసిన వారి పాపాలను పటాపంచలు చేస్తాయి. శివుడు తీర్థస్వరూపుడు. తీర్థమనగా గురువని కూడా అర్థం ఉంది. గురువును తీర్థపాదులని, తీర్థంకరులని సంబోధిస్తారు. శివుడు ఋషులకు గురువు. ఆయన దక్షిణామూర్తి అవతారమున, మునులకు అద్వైత జ్ఞానాన్ని బోధించాడు. అందుకనే, పరమేశ్వరుడు సుతీర్థుడు. 'ఓం సుతీర్థాయ నమః'.


127. కృష్ణః - (కృషిర్భూవచకశ్శబ్దః ణశ్చనిర్వృతివాచకః, తయోరైక్యం పరంబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే) ఆనందాన్ని కలుగజేసేవాడు, ఆనంద స్వరూపుడు. అలాగే, 'సర్వం కరోతీతి కృష్ణః' అన్నింటినీ చేయువాడు, అన్నింటికీ కారణమైనవాడు కృష్ణుడు. 'ఓం కృష్ణాయ నమః'. 


128. సృగాలరూపః - సృగాలము అనగా నక్క. పూర్వము ఒక రాక్షసుడు నక్క రూపంలో వచ్చి అందర్నీ బాధిస్తుండగా, శివుడు వెళ్లి వాడిని సంహరించాడట. కాశీ క్షేత్ర సమీపంలో వెలసిన ఈ శివుడిని జంబుకేశ్వరుడు అని అంటారు (జంబుకము అన్నా నక్కే). నక్క వంటి రూపము కలవాడు అని చెబితే సగుణ రూపాన్ని ఆరాధించే వారు అంతగా ఇష్టపడరు. 

దీనికి, ఒక చారిత్రక నేపథ్యం ఉంది. శ్రీవైష్ణవ (విశిష్టాద్వైతం) మత స్థాపకుడు శ్రీ రామానుజులవారి గురువు యాదవప్రకాశులు. ఆయన ఛాందోగ్యోపనిషత్తులోని ‘తస్య యదా కప్యాసం పుండరీకాక్షిణీ’ అనే వాక్యానికి, - 'పరమాత్మ కళ్లు ఎర్రగా మర్కటం పృష్ఠభాగం (కోతి పిర్రలు) లాగా ఉంటాయని వివరించారట. ఈ వివరణ పరమాత్మను కించపరిచేదిగాను, తక్కువ చేసేది గాను ఉందని, శిష్యుడైన భగవద్రామానుజులకు మనఃక్లేశాన్ని కలిగించగా, కన్నీరు కారుస్తూ ఉండిపోయాడట. గురువుగారు కారణం అడగగా, 'క్షమించండి గురువుగారు, మీ వ్యాఖ్యానం సరిగాలేదు, అసంబద్ధంగా ఉందని' చెప్పాడట. దానికి కోపగించిన గురువు, నీవెలా వ్యాఖ్యానిస్తావో చెప్పమని గద్దించగా, రామానుజులు మూడు విధాలుగా అనుగ్రహించారట.

1. కం పిబతి ఇతి కపి= ఆదిత్యః తేన్ అస్త్యతే క్షిప్యతే వికాసతే ఇతి కప్యాసం. సూర్యుడిచే వికసింపబడేది కమలం. కపి అంటే నీటిని త్రాగేది. సూర్యుడు నీటిని పీల్చడం వలన, సూర్యుడిని కపి యని అనవచ్చు. కప్యాసం అనగా, సూర్యుడిచే వికసింపబడిన కమలం అన్న అర్థం వస్తుందని చెప్పారట.

2. కం పిబతి ఇతి కపి= నాళం, తస్మిన్ అస్తే ఇతి కప్యాసం. బలమైన తూడులుగలది కమలం. కపి అంటే నీటిని త్రాగేది ఎదో అది కపి. కమలంతూడు లేదా కాడ కూడా నీటిని త్రాగుతుంది. అందువలన అది కపి. కప్యాసం పుండరీకం అంటే నీటిలో ఉండి తూడుచే భరించబడుతున్నదానిని (కమల పుష్పం) చెప్పవచ్చు.

3. కం జలం ఆచ ఉపవేసనే ఇతి జలేపి ఆస్తే ఇతి కప్యాసం. నీటిలోని ఒక అందమైన కమలం. కం అంటే జలము. నీటిలో నిలబడేది కప్యాసం. ఇక్కడ కప్యాసం పుండరీకం అంటే నీటిలో ఉన్న ఒక అందమైన కమలం అని అర్థం. అంటే, శ్రీమన్నారాయణుడి కళ్లు సూర్య కిరణాలచేత వికసించిన ఎర్రటి కమల పుష్పాలవలె ఉన్నాయని చెప్పి, గురువుగారి మెప్పు పొందాడట. 

అందువలన, ఇక్కడ కూడా శివుడు నక్క రూపము కలవాడు అని చెప్పుట అనుచితం. 'సృ గా ల' అని అక్షరాలను విడదీసి చెబితే. 'సృ' అనగా సృష్టి యని, 'గా' యనగా సృష్టి యొక్క గమనమని, 'ల' అనగా లయమని అర్థం చెప్పి మొత్తం సృగాల పదానికి సృష్టి స్థితి లయములే తన రూపం అయిన వాడు అని చెప్పడం చాలా సహజంగా, సమంజసంగా అనిపిస్తుంది. 'ఓం సృగాల రూపాయ నమః'.


129. సిద్ధార్థః - (సిద్ధా ఏవ అర్థాః నతుసాధ్యాః) మహాదేవుడికి అన్ని అర్థములు సిద్ధించియే ఉన్నవి. అంటే, క్రొత్తగా అర్థించవలసినవి అనేవి ఏవీలేవు. అలాగే, మరొక వ్యాఖ్యానం - సిద్ధమైన ప్రయోజనము కలవాడు. యజ్ఞ ద్రవ్యమైన తెల్ల ఆవాలకు సిద్ధార్థములని పేరు. పవిత్రములైన యజ్ఞ ద్రవ్యములు అగుటచేత అవి కూడా శివ స్వరూపములే. శివుడికి సంకల్పం చేతనే సర్వార్థములు సిద్ధించును. అందువలన ఆయన సిద్ధార్థుడు. 'ఓం సిద్ధార్థాయ నమః'.


130. ముండః - ముండనం అనగా క్షవరము చేసిన బోడి గుండు. ముండః అనగా బోడితలవాడని అర్థం. పరమేశ్వరుడు చతుర్యుగ ఆవర్త చక్రంలోని, 25వ కలియుగంలో, ముండీశ్వరుడు అనే పేరు గల యోగాచార్యుడిగా అవతరించాడని పురాణాలలో ఉంది. ఆ సమయంలో ఆయన చేతియందు యోగ దండాన్ని ధరించి, తలమీద వెంట్రుకలు లేకుండా ఉన్నాడట. ఆయనకు భగల, కుండకర్ల, కుంభాండ, ప్రవాహకులనబడే నలుగురు పుత్రులు ఉండేవారట. 'ఓం ముండాయ నమః'.


131. సర్వ శుభంకరః - తన భక్తులకు సమస్త శుభములను కలిగించువాడు. 'శివం కళ్యాణం తద్యోగాద్వాశవః' శుభములతో కూడియుండువాడు శివుడు. అట్లే, 'శివ ప్రదత్వా ద్వాశివః' అనగా శుభములను ఇచ్చువాడు శివుడు. ('శివం భద్రం కల్యాణం మంగళం శుభమ్' ఇత్యమరః) కాబట్టి, శివుడు సర్వ శుభంకరుడు. 'ఓం శుభంకరాయ నమః'.శ్లో||

అజశ్చబహురూపశ్చ గంధధారీ కపర్ద్యపి

ఊర్ధ్వరేతా ఉర్ధ్వలింగః ఊర్ద్వసాయి నభస్థ్సలః. ।। 17 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-46.

అజుడు, బహురూపుడు, గంధధారి, కపర్దం కలవాడు, ఊర్ధ్వరేతసుడు, ఊర్ధ్వ లింగడు, ఉత్తానశయుడు, శక్తినిలయుడు.


132. అజః - పుట్టుకలేనివాడు. ఆదిమధ్యాంతరహితుడైన శివుడికి పుట్టుక లేదు. 'జ' అంటే పుట్టినదని అర్థం. శివుడు పుట్టుకలేనివాడు కాబట్టి, అజుడు. శివుడికి స్థాణువనే పేరుంది. (ప్రళయేఽపి తిష్ఠతీతి స్థాణుః) ప్రళయకాలంలో కూడా ఉంటాడు కాబట్టి, స్థాణువు. పుట్టుకలేనివాడికి మరణం కూడా ఉండదు. 'జాతస్య హి ధృవో మృత్యుః' అంటుంది భగవద్గీత. అంటే, పుట్టినవాడు మరణించక తప్పదని అర్థం. అయితే, పుట్టుకే లేనివాడికి మరణం ఎలా వస్తుంది? ఎప్పటికీ ఉంటాడు. శాశ్వతుడు, స్థిరుడు. 'ఓం అజాయ నమః'.


133. బహురూపః - అనేక రూపాలు కలవాడు. శివుడికి అనేక అవతారాలున్నాయి. నంది, అగ్ని, దుర్వాసుడు, పిప్పలాదుడు, యతినాథుడు, హంస, అవధూతేశ్వరుడు, భిక్షువర్యుడు, సురేశ్వరుడు, సద్యోజాత, వాసుదేవ, తత్పురుష, అఘోర, ఈశానములనే పంచ బ్రహ్మలు, ఇవన్నీ పరమశివుడి అవతారాలు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత లింగములు, ఇవి కాక పెక్కు నామములతో వెలసిన శివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అవి... 

హిరణ్య గర్భేశ్వరుడు, స్వర్లీనేశ్వరుడు, వ్యాఘ్రేశ్వరుడు, కందుకేశ్వరుడు, శైలేశ్వరుడు, సంగమేశ్వరుడు, శుక్రేశ్వరుడు, జంబుకేశ్వరుడు, కేదారేశ్వరుడు, పాశుపతేశ్వరుడు, శంఖుకర్ణేశ్వరుడు, గోకర్ణేశ్వరుడు, ద్రుమచండేశ్వరుడు, భద్రేశ్వరుడు, స్థానేశ్వరుడు, కాళేశ్వరుడు, అజేశ్వరుడు బైరవేశ్వరుడు మొదలైన అనేక పేర్లతో దేవాలయాలున్నాయి. (సర్వేషామేవ భూతానాం అంతర్యామి శివః స్మృతః) అనడం వలన సమస్త ప్రాణులందును ఉన్న అంతర్యామి శివుడే! అందువలన ప్రాణులన్నీ శివుడి రూపాలే! ఇన్ని కారణముల వలన శివుడు బహురూపుడని చెప్పవచ్చును. 'ఓం బహురూపాయ నమః'.


133. గంధధారీ-పృథివ్యప్తేజోవాయురాకాశములు పంచభూతాలు. వీటికి వరుసగా గంధ, రస, రూప, స్పర్శ, శబ్దాలు తన్మాత్రలున్నాయి. అంటే, పృథివి అనగా భూమి గంధ గుణము కలిగినది. నీటికి రసగుణము (రుచి), అగ్నికి రూప గుణము, వాయువుకు స్పర్శ గుణము, ఆకాశానికి శబ్ద గుణము. పరమేశ్వరుడు అష్టమూర్తి (పంచభూతాలు, సూర్యచంద్రులు మరియు అగ్ని). అందులో మొదటిది భూమి. కనుక పరమేశ్వరుడు గంధధారీ. 'ఓం గంధధారిణే నమః'.


135. కపర్దీ - జటాజూటం కలవాడు. (కం పిబతి ఇతి కపః, ఋతం ఐశ్వర్యం దదాతి) కం అంటే నీరు, ఋతం అంటే ఐశ్వర్యం. జలమును త్రాగునది, ఐశ్వర్యం ఇచ్చునది కపర్దము. (కపర్దః అస్య అస్తీతి కపర్దీ) ఆకాశం నుండి మొదటగా నీటిని త్రాగినది శివుడి జటాజూటమే. భగీరథుడి ప్రార్థనతో గంగాదేవి జటాజూటం నుండి బయటపడి సగరపుత్రులకు స్వర్గరూప ఐశ్వర్యం ఇచ్చినది ఆ జటాజూటమే. అందుకని, పరమేశ్వరుడి జటాజూటం పేరు కపర్ది. సాధారణంగా దేవతలందరూ కిరీట కేయూరాది ఆభరణాలు ధరించి ఉంటారని భక్తుల విశ్వాసం. అయితే, మన శివుడి అలంకారాలు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. కిరీటం అనగా జటాజూటము ఆయనకు శిరస్సు మీద ఉన్న అలంకారం. కపర్దము కలవాడు కాబట్టి కపర్ది. 'ఓం కపర్దినే నమః'.


136. ఊర్ధ్వరేతాః - బ్రహ్మచర్యం కలవాడు. ఊర్ధ్వ రేతస్కుడు. యోగాభ్యాసరతులు, కొందరు మహర్షులు ఊర్ధ్వ రేతసులుగా ఉంటారు. అస్ఖలిత బ్రహ్మచారులు అంటే వారికి రేతస్సు అధోముఖంగా స్రవించదు. కణ్వుడు, అత్రి మొదలైనవారు ఊర్ధ్వరేతసులు. ఆంజనేయుడు కూడా ఊర్ధ్వ రేతసుడే. కాబట్టి, హనుమంతుడు కూడా శివుడి అవతారమే! 

అత్రి మహాముని తపస్సు చేస్తుండగా ఆయన రేతస్సు ఊర్ధ్వముఖంగా ప్రవహించి శిరస్సు నుండి బయటికి వచ్చి కళ్ళలో పడి గొప్ప కాంతిగా మారి, దిక్కులన్నింటికీ వ్యాపించింది. దిక్కులు ఆ తేజస్సును సమీకరింపగా చంద్రుడు జన్మించాడు. వీరిలాగే శివుడు మహాయోగి మహాతపస్వి. కాబట్టి ఊర్ధ్వరేతసుడు. బ్రహ్మ విష్ణువుల వరం వలన అత్రికి, అనసూయ గర్భమందు దత్తాత్రేయుడు, దుర్వాసుడు జన్మించారు. వీరిద్దరూ విష్ణు రుద్రుల అవతారాలు. చంద్రుడు బ్రహ్మదేవుడి అంశతో ఏర్పడిన అవతారం. 'ఓం ఊర్ధ్వరేతసే నమః'


137. ఊర్ధ్వలింగః - (లింగం చిహ్న శేఫసో) అనగా లింగము అనే పదానికి గుర్తు, మగసిరి అన్న అర్థాలున్నాయి. శివుడికి శివలింగం గుర్తు. బ్రహ్మచర్యానికి కారణం ఊర్ధ్వలింగము. అథోలింగము రేతస్సేచనం చేస్తుంది. ఊర్ధలింగము చేయదు కాబట్టి, స్వామి ఊర్ధ్వలింగడు. 'ఓం ఊర్ధ్వలింగాయ నమః'.


138. ఊర్ధ్వశాయీ - ఊర్ధ్వశాయి అనగా మీద శయనించువాడు అని అర్థం. మన శరీరము నందు షట్చక్రాలు (6 చక్రాలు) ఉన్నాయని యోగశాస్త్రం చెబుతున్నది. అవి మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరము, అనాహతము, విశుద్ధం, ఆజ్ఞాచక్రం. వీటికి వరుసగా వినాయకుడు, ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు, జీవుడు, బ్రహ్మ అధిష్టాన దేవతలు. వీటి అన్నింటి కంటే పైన ఉన్నది సహస్రారము. దీనికి అధిదేవత సదాశివుడు. అందుకే ఆయన ఊర్ధ్వశాయి, ఉత్థానశాయి. 'ఓం ఊర్ధ్వశాయినే నమః'.


139. నభస్థలః - నభమనగా ఆకాశం. (మేఘైర్నభాతీతి నభః) అంటే, మేఘములు ఆవవరించుట వలన ప్రకాశింపనిది కాబట్టి, అది నభము అనగా ఆకాశం. ఆకాశము బ్రహ్మ యొక్క శరీరము. కాబట్టి, అది శివుని యొక్క రూపమే. తైత్తిరీయోపనిషత్, బ్రహ్మానందవల్లిలో ... ('ఏతస్మాదాత్మనః ఆకాశస్సంభూతః, ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యోన్నం, అన్నాత్పురుషః, సవా ఏష పురుషోన్నరసమయః’) పరబ్రహ్మతత్త్వం నుండి ఆకాశము ఉద్భవించింది. ఆకాశము నుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నము (ఆహారము), అన్నము నుండి ప్రాణి పుడుతున్నాయి. పైన చెప్పిన పంచభూతాలు పరమశివుడి అష్టమూర్తుల లోనివే. ఆకాశమే ఆవాసముగా కలవాడు. శక్తి నిలయుడు. 'ఓం నభస్థలాయ నమః'.శ్లో||

త్రిజటీ చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః ।

అహశ్చరో నక్తంచరః తిగ్మమన్యుః సువర్చసః ।। 18 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-47.


140. త్రిజటీ - (జటతి సంఘీ భవతీతి జటా) అనగా గుంపుగా ఉన్న కేశములు కలవాడు. యతులు జటలను ధరిస్తారు. శివుడు ప్రధానమైన మూడు జటలు ధరిస్తాడు. కాబట్టి, త్రిజటీ. 'ఓం త్రిజటినే నమః'.


141. చీరవాసాః - చీర అనగా వస్త్రము అని అర్థం. శివుడు నారవస్త్రములు ధరస్తాడు. వాసస్సు అనగా ధరించే వస్త్రం. పరమేశ్వరుడు నారచీరను ధరిస్తాడు కాబట్టి, చీరవాసుడయ్యాడు. 'ఓం చీరవాససే నమః'


142. రుద్రః - (ప్రాణా వావ రుద్రా ఏతేహీదం సర్వం రోదయంతి) అని ఉపనిషత్ వాక్యం. దుష్టులనందరినీ రోదింపజేయునవి రుద్రములు. (రుజం ద్రావయంతీతి వా రుద్రః") అనగా దుఃఖమును పోగొట్టువారు. ఇది ఏకాదశ రుద్రులకు కూడా నిర్వచనం. ఏకాదశ రుద్రులు: 1. అజుడు, 2. ఏకపాదుడు, 3. అహిర్బుధ్న్యుడు. 4. త్వష్ట 5. రుద్రుడు 6. హరుడు, 7. శంభుడు 8. త్ర్యంబకుడు 9. అపరాజితుడు 10. ఈశానుడు 11. త్రిభువనుడు. ఈశ్వరుడు ఒకసారి నవ్వగానే వీళ్లు పుట్టారని లింగపురాణం చెబుతుంది. బ్రహ్మ తన హృదయంలో శివుడిని స్థిరపరచుకుని, ఓంకారం చేత, పుష్పముల చేత పూజింపగా ఆయన లలాటం నుండి రుద్రుడు పుట్టాడట. అతడు సాక్షాత్తు శివుడే. ఆయనకు బ్రహ్మదేవుడు ఏడు పేర్లు పెట్టాడు. అవి..... 

1. భవుడు 2. శర్వుడు 3 ఈశానుడు 4 పశుపతి 5. భీముడు 6. ఉగ్రుడు 7. మహాదేవుడు. వీరి భార్యలు వరుసగా సువర్చల, ఉష, సువేశి, శివ, స్వాహా, దిక్కులు, రోహిణి. వీరందరూ ఉండే స్థానములు సూర్యుడు, జలము, భూమి, వాయువు, అగ్ని, ఆకాశం, చంద్రుడు. వీరి పుత్రులు శని, భూమి, కుజుడు, శుక్రుడు, స్కందుడు, సంతానుడు మరియు బుధుడు. 'ఓం రుద్రాయ నమః'.


143. సేనాపతిః - 'ఆత్మావై పుత్రనామాసి' అంటుంది వేదం. అంటే, తండ్రియొక్క ఆత్మయే కొడుకుగా భూమిమీద తిరుగుతుందని అర్థం. తనకు, తన పుత్రుడికి భేదం లేదు. సేనాపతి అంటే, కుమారస్వామి. ఇతడు శివుడి పుత్రుడే. సాక్షాత్తూ శివస్వరూపుడే. 'ఓం సేనాపతయే నమః'


144. విభుః - విభుడు అంటే ప్రభువు. చీమ నుండి బ్రహ్మ పర్యంతం సమస్త సృష్టికి ప్రభువు పరమేశ్వరుడే. ఆయన అనుమతి లేకుండా ఎవరూ స్వతంత్రంగా ప్రవర్తించలేరు. అన్నిటి యందు ఉన్న శక్తి పరమేశ్వరుడే. ఒకసారి దేవతలు రాక్షసులను యుద్ధంలో జయించి, మా అంతా పరాక్రమవంతులు లేరని గర్వంతో ఊగిపోయారట. పరమేశ్వరుడు వారి ముందు ఒక యక్షుడి రూపంలో ప్రత్యక్షమై, ఒక గడ్డిపరకను అక్కడ ఉంచి అగ్నిదేవుడిని కాల్చమన్నాడట. అగ్నికి దాన్ని కాల్చడం సాధ్యం కాలేదు. ఆ తర్వాత వాయువు కూడా దాన్ని కదల్చలేకపోయాడు. దాంతో దేవతల అహంకారం పూర్తిగా నశించింది. ఈ కథ వలన, అన్ని శక్తులు శివుడివే యని తెలుస్తుంది. అందుకే పరమేశ్వరుడు విభుడు. 'ఓం విభవే నమః'.


145. అహశ్చరః - పగలు చరించువాడు (అహః అంటే పగలు, చరః అంటే చరించువాడు), సూర్యుడు. సూర్యభగవానుడు శివస్వరూపుడు. శివుడి అష్టమూర్తులలో ఒకడు. 'ఓం అహశ్చరాయ నమః'.


146. నక్తంచరః - రాత్రి చరించువాడు నక్తము అనగా రాత్రి, చరః అనగా చరించువాడు, చంద్రుడు. చంద్రుడు కూడా అష్టమూర్తులలో ఒకడు. శివ స్వరూపమే. 'ఓం నక్తంచరాయ నమః'.


147. తిగ్మమన్యుః - తీక్షణమైన కోపము కలవాడు (తిగ్మము 'తిగ్మం తీక్ష్ణం ఖరం తద్వత్' తేజయతీతి తిగ్మం అంటే తీక్ష్ణమైన (వేడి), 'మన్యువు (మన్యు శోకా తు శుక్) 'మన్యతే అనేనేతి మన్యుః' అంటే కోపము). అందుకే, పరమేశ్వరుడిని ఉగ్రుడని కూడా అంటారు. 'ఓం తిగ్మమన్యవే నమః'.


148. సువర్చసః - తపస్సు చేత మిక్కిలి తేజస్సు కలవాడు. సూర్య చంద్ర నక్షత్రాదులలోని ప్రకాశము పరమశివుడిదే. శివుడు పరంజ్యోతి స్వరూపుడు, గొప్ప సౌందర్యవంతుడు. ఈ రెండు కారణాల చేత, పరమేశ్వరుడు సువర్చసుడు. 'ఓం సవర్చసే నమః'.శ్లో||

గజహా దైత్యహా కాలో లోకధాతా గుణాకరః ।

సింహశార్దూలరూపశ్చ ఆర్ద్ర చర్మాంబరావృతః ।। 19 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-48.


149. గజహా - (గజం హతవాన్ గజహా) (శ్లో|| వారాణస్యాం పురాయాతో గజరూపీ మహాసురః, జఘ్నేతం కుంజరం భీమం అధృష్యమపి శంకరః) అని స్కాందపురాణంలో ఉంది. పూర్వం వారణాసి (కాశీ) లో గజరూపుడైన రాక్షసుడిని (గజాసురుడిని) చంపాడు. గజాసురుడు, మహిషాసురుడి పుత్రుడు. తన తండ్రి దేవి చేత చంపబడ్డాడని తెలుసుకున్నాడు. బ్రహ్మదేవుడిని గుఱించి ఘోరమైన తపస్సు చేసి కామవశులైన స్త్రీ పురులచేత చావు లేకుండా వరం కోరుకున్నాడు. 

దేవతలను, మునులను ఇష్టమొచ్చినట్టు హింసించి కాశీ క్షేత్రానికి వచ్చి, అక్కడున్న వారిని కూడా పీడించడం మొదలుపెట్టాడు గజాసురుడు. దాంతో ఆగ్రహించిన పరమశివుడు అతడిని సంహరించాడు. శివుడు అతడికి ప్రసన్నుడై అతడి చర్మాన్ని వస్త్రంగా ధరించాడు. గజాసురుడి శరీరం కాశీలో లింగరూపాన్ని పొందింది. ఆ శివలింగం పేరు కృత్తివాసేశ్వరుడు. 'ఓం గజఘ్నే నమః'.


150. దైత్యహా - దైత్యులను (రాక్షసులను) సంహరించినవాడు. పరమేశ్వరుడు త్రిపురాసురులను, గజాసురుడిని, దుందుభినిర్హ్రారుడిని, విదలుడిని, ఉత్పలుడిని, శంఖచూడుడిని ఇలా అనేకమంది రాక్షసులను సంహరించాడు. 'ఓం దైత్యఘ్నే నమః'.


151. కాలః - మృత్యువు, సంవత్సరాలు, కాలస్వరూపుడు. కాలము ఆది మధ్యాంతరహితము, నిరాకారము, నిర్గుణము, నిరంజనము, సూర్యచంద్రుల వలన కాలము ముందుకు సాగుతున్నది. సూర్యుడి వలన పగలు, రాత్రి, నెల, ఆయనము, సంవత్సరం ఏర్పడుతుంది. చంద్రుడి వలన, తిథి, వారము, పక్షము, నెలలు ఏర్పడుతున్నాయి. ఈ సూర్యచంద్రులిరువురూ శివుడి మూర్తులే. 'ఓం కాలాయ నమః'.


152. లోకధాతా - మొత్తం లోకాలు పద్నాలుగు. ఊర్ధ్వ లోకాలు ఏడు, అథోలోకాలు ఏడు. భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము ఇవి ఊర్ధ్వలోకాలు. అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళము ఇవి అధోలోకాలు. ఈ లోకాలకు ఈశ్వరుడే సృష్టికర్త. 'ఓం లోకధాత్రే నమః'.


153. గుణాకరః - దీనదయాలుత్వ జ్ఞానైశ్వర్యాది గుణములకు ఆకరుడు, గుణనిలయుడు. అనుగ్రహము, ఔదార్యము, అభయ ప్రదానము, కరుణ, వరదానము, దుష్టశిక్షణ, లోకరక్షణ, సమదృష్టి, జ్ఞానము మొదలగు ఉత్తమ గుణాలన్నీ పరమశివుడిలో ఉన్నాయి. 'ఓం గుణాకరాయ నమః'.


154. సింహశార్దూలరూపః - సింహము, శార్దూలము (పెద్దపులి) సింహశార్దూల రూపము కలవాడు. కాశీ క్షేత్రంలో దేవతలకు కూడా అసాధ్యుడైన రాక్షసుడిని శివుడు శార్దూల రూపము ధరించి సంహరించాడు. ఆ శివుడిని వ్యాఘ్రేశ్వరుడని అంటారు. వ్యాఘ్రమంటే పెద్దపులి. 'ఓం సింహశార్దూలరూపాయ నమః'.


155. ఆర్ద్రచర్మాంబరావృతః - ఆర్ద్రచర్మమంటే అప్పుడే ఒలిచిన పచ్చి చర్మము. దానిని వస్త్రం లాగా చుట్టుకున్నాడు. గజాసురుడిని సంహరించి అతడి చర్మాన్ని ధరిస్తానని అతడికి వరమిచ్చాడు. అందుకే, ఆలస్యం చేయకుండా రక్తం ఓడుతున్న, తడి కూడా ఆరని చర్మాన్ని ధరించాడు, గజచర్మాంబరుడయ్యాడు (ఈ విషయాన్ని తన హరవిలాసంలో శ్రీనాథమహాకవి - 'పచ్చియేనిక తోలు పచ్చడంబు' అని ప్రయోగించాడు). ఈ ఉదాహరణ పరమశివుడి కరుణకు తార్కాణం. 'ఓం ఆర్ద్రచర్మాంబరావృతాయ నమః'.శ్లో||

కాలయోగీ మహానాదః సర్వకామః చతుష్పథః ।

నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః ।। 20 ।।

--వ్యాసభారతం, అను.పర్వం. 17-49


156. కాలయోగీ - కాలాన్ని జయింపగల యోగి. ప్రతి సంవత్సరం మన ఉగాది పండుగనాడు విడుదల చేసే పంచాంగం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడుకున్నది. మన చాంద్రమాసంలోని ఒక రోజును తిథి అంటాము. చంద్రుడి వృద్ధిక్షయాలను బట్టి శుక్ల పక్ష తిథులు 15, కృష్ణ పక్ష తిథులు 15. మొత్తం 30 తిథులు. ఈ తిథులు పాడ్యమి నుండి పూర్ణిమ/అమావాస్య వరకు దాదాపుగా అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ వ్రాయడం లేదు. 

మనకున్న వారాలకు కూడా గ్రహాల పేర్లనే వ్యవహరిస్తున్నాము. రోజుకు 24 గంటలు. అందువలన, రోజును 24 భాగాలుగా విభజించుకున్నాము. ప్రతి భాగాన్ని పరాశరమహర్షి 'హోరా' అన్నారు (దీనినే ఆంగ్లేయులు అవర్/హవర్ గా తీసుకున్నారు). సూర్యోదయాన ప్రారంభమయ్యే 'హోర' తో ఆ వారం ప్రారంభమవుతుంది. ఈరోజు గురుహోర (గురువారం) ఉంటే, రోజంతా 24 హోరలు తిరిగి, రేపటిటి రోజున సూర్యోదయం శుక్ర హోరతో (శుక్రవారం) ప్రారంభమవుతుంది. ఇలాగే, శని, ఆది, సోమ, మంగళ, బుధవారాలు వస్తాయి.


రాహు, కేతువులు ఛాయా గ్రహాలు కాబట్టి, వాటి పేర్లతో వారాలు లేవు. భచక్రాన్ని (12 రాశులు/360°) 27 భాగాలుగా చేశారు. ప్రతి భాగాన్ని ఆ భాగంలో కనిపించే నక్షత్రం పేరుతో పిలిచారు. 27 నక్షత్రాలు, 12 రాశులు అందరికీ తెలిసే ఉంటాయి కావున, ఇక్కడ పొందుపరచడం లేదు. అలాగే, 27 నక్షత్రాలకు 27 యోగాలున్నాయి. అవి విష్కభం, ప్రీతి, అయుష్మాన్ మొదలగునవి (అన్ని పంచాంగంలో ఉంటాయి చూడగలరు). ఇలా, ఈ కాల యోగముల స్వరూపమైనవాడు శివుడు కాబట్టి ఆయన 'కాలయోగీ'. 'ఓం కాలయోగినే నమః'.


157. మహానాదః - 'న' కారము ప్రాణవాయువు. 'ద' కారము అగ్ని. అగ్ని వలన ప్రేరేపింపబడిన ప్రాణవాయువు వలన పుట్టిన శబ్దమే నాదం. దీన్ని పరావాక్కు అంటారు. ఇది నాభియందు పుడుతుంది. దీని స్వరూపమే ఓంకారం. అందుకే ఓంకారాన్ని ప్రణవనాదం అంటారు. 'ఓం నమశ్శివాయ' అనేది స్థూల ప్రణవం. ఓంకారం సూక్ష్మ ప్రణవం. స్థూల ప్రణవాన్ని సగుణోపాసకులు జపిస్తారు. సూక్ష్మ ప్రణవాన్ని బ్రహ్మోపాసకులు జపిస్తారు. ఓంకారమే శివుడు. శివుడే ఓంకారం. ఈ ఓంకారమే మహానాదం. అనాహత నాదం కూడా శివ స్వరూపమే. అనాహత ధ్వని స్వరూపుడు, మహానాదస్వరూపుడు. 'ఓం మహానాదాయ నమః'.


158. సర్వకామః - (అస్మిన్ సర్వేకామా సమాహితాః) అని శ్రుతి వాక్యం. ఇక్కడ కామములు అనగా విషయములు, కోరికలు. అన్ని విషయములు అతడి లోనే ఉన్నాయి కాబట్టి, పరమేశ్వరుడు అందరిచేత కోరబడువాడు, సర్వకామనిలయుడు. శివుడు శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. ఆయన వరదుడు, కరుణాళుడు, ఆపదోద్ధారకుడు అవడం వలన అందరూ అతడిని ప్రీతితో ఆరాధిస్తాడు. 'ఓం సర్వ కామాయ నమః'


159. చతుష్పథః - చతుష్పథము అనగా నాలుగు మార్గాల కూడలి. శివుడిని ఉపాసించుటకు నాలుగు మార్గాలు అనుసరిస్తారు. అవి, కర్మ, భక్తి, యోగము, జ్ఞానము అనునవి. ఈ నాలుగు పద్ధతుల ద్వారా శివుడి అనుగ్రహమును పొందవచ్చు. పై నాలుగింటిలో ఏ పద్ధతి అవలంభించినను శివుడు సాధ్యుడే. 'ఓం చతుష్పథాయ నమః'.


160. నిశాచరః - నిశ అనగా రాత్రియందు, చరః అనగా చరించువాడు. రాత్రి వేళల యందు స్మశానంలో చరించువాడని అర్థం. 'ఓం నిశాచరాయ నమః'.


161. ప్రేతచారీ - మరణించిన తర్వాత కర్మకాండలు పూర్తయ్యేవరకు జీవుడు ప్రేత రూపంలో భూమిపై ఉంటాడు. అటువంటి ప్రేతలతో చరించువాడు శివుడు. అందుకనే, ప్రేతచారీ. 'ఓం ప్రేతచారిణే నమః’.


162. భూతచారీ - భూతములనగా కోరికలు తీరక, మరణించిన తరువాత కూడా భూమిపై సూక్ష్మ శరీరముతో కూడిన ఆత్మలు. వాటితో చరించువాడు శివుడు. భూత ప్రేత పిశాచములు శివుడి అనుచర గణములు. 'ఓం భూతచారిణే నమః'.


(భూత అనే పదాన్ని పలు విధాలుగా విశదీకరించారు. భూత అనగా సర్వ ప్రాణులు అని కూడా అర్థం కలదు. సర్వ ప్రాణులందు సంచరించు వాడు అని. యే భూతానామధిపతయో..... (యే భూతానాం అధిపతయో) అనే రుద్ర ప్రశ్నలోని వాక్యానికి పంచ మహా భూతాలు లేదా సమస్త భూత గణాలు అని భట్టభాస్కరుడి వ్యాఖ్యానం కూడా కలదు. అనగా పంచ మహా భూతలకు అధిపతి అని మరియు సమస్త భూత గణాలకు అధిపతి అని భావము. దీని ఆధారంగా భూతచారి అనగా సమస్త భూత గణాలలో సంచరించు వాడు అని అర్థము కూడా వచ్చు చున్నది. ఒకే పదం ఇన్ని విధాలైన అర్థాలను ఇచ్చే మన సంస్కృత భాష మహోన్నతమైనది. ఇట్టి భావాలను సమయ మరియు సందర్భానికి ఉచితంగా వాడుకోవడమే మనం చేసే పని...నమిలికొండ విశ్వేశ్వర శర్మ)


163. మహేశ్వరః - ఇంద్రుడు తూర్పు దిక్కునకు ఈశ్వరుడు, వరుణుడు పడమటి దిక్కునకు ఈశ్వరుడు, కుబేరుడు ఉత్తర దిక్కునకు, యముడు దక్షిణ దిక్కునకు, ఈశానుడు ఈశాన్య దిక్కుకు, అగ్ని ఆగ్నేయ దిక్కుకు, నిరృతి నైరుతి దిక్కుకు, వాయువు వాయువ్య దిక్కుకు అధిపతులు. వీరిని దిక్పాలకులు అంటారు. వీరందరికీ ఈ పదవులను అనుగ్రహించినవాడు శివుడు. వీరందరూ ఈశ్వర స్వరూపులే. అయితే, వీరందరికంటే గొప్పవాడైన శివుడు మహేశ్వరుడు. 'ఓం మహేశ్వరాయ నమః'.


  

శ్లో||

బహుభూతో బహుధరః స్వర్భాను రమితో గతిః ।

నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాలసః ।। 21 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-50.


బహురూపాలు గలవాడు, ప్రపంచాన్ని ధరించినవాడు, రాహు స్వరూపుడు, అనంతుడు, గతి, నృత్య ప్రియుడు, నిత్యం నర్తించువాడు, నర్తకుడు, అందరియందు ప్రేమ గలవాడు.


164. బహుభూతః - (సచ్చత్యచ్చాభవత్, సత్యంచాకృతం, చసత్యమభవత్) ఇతి శ్రుతి. అన్నీ తానే అయినవాడు, బహురూపాలు కలవాడు, అనేకమైన ప్రాణుల రూపంలో ఉండేవాడు. భూతములనగా సకల చరాచర ప్రాణులు/జీవులు. అందువల్లనే భూతదయ అనే పదం పుట్టింది. 'ఓం బహు భూతాయ నమః'.


165. బహుధరః – మహా ప్రపంచాన్నే ధరించినవాడు. అనేకములను ధరించినవాడు. శివుడి శక్తిలేని ప్రాణులు శవాలు. సూర్య చంద్రాది గ్రహములు, నక్షత్రములు, శివుడి శక్తి ఉన్నంత వరకే అవి ఉంటాయి. శివుడి శక్తి దూరమైననాడు వాటి ఉనికే ఉండదు. అందుకే, 'శివుడుంటే శివం, శివుడు లేకుంటే శవం' అని అంటారు. భూమి, జలము, అగ్ని, వాయువు, శివుడి శక్తితో కూడినవే. వీటిన్నింటిని శివుడే ధరిస్తాడు. అందుకే, ఆయన బహుధరః'. 'ఓం బహుధరాయ నమః'.


166. స్వర్భానుః - రాహువు. (స్వః స్వర్గే భాతీతి స్వర్భానుః) అంటే స్వర్గము నందు ప్రకాశించువాడు స్వర్భానువు. ఇతడు హిరణ్యకశిపుడి చెల్లెలు సింహిక పుత్రుడు, సైంహికేయః అని కూడా అంటారు. శివుడికి, అన్ని గ్రహాలకు అవినాభావ సంబంధమున్నట్లు ఇదివరకు తెలుసుకున్నాము. ఈ రాహువు కూడా శివస్వరూపమే. 'ఓం స్వర్భానవే నమః'.


167. అమితః - అనంతుడు, పరిమితులు లేనివాడు, అనగా కాలాతీతుడు, గుణాతీతుడు, జన్మ జరా మరణములకు అతీతుడు. ఏ విషయంలో నైనా ఆయనకు పరిమితులు లేవు. 'ఓం అమితాయ నమః'.


168. గతిః - గతి అనగా గమనము, దిక్కు అని అంటారు. దిక్కు అనగా శరణ్యము. అందరికీ తానే దిక్కయినవాడు. అనగా నీవే దిక్కని నమ్మిన భక్తులకు రక్షకుడు. 'ఓం గతయే నమః'.


169. నృత్యప్రియః - (నృతీ గాత్ర విక్షేపే) నృత్యమనగా తాళానుగుణమైన గాత్ర విక్షేపము, నర్తించుట. ఇది తాండవము, లాస్యము, (తాండవం నటనం నాట్యం లాస్యం నృత్యం చ నృత్తనే... ఇత్యమరః) అని రెండు విధాలు. తాండవము ఉద్దతమైనది, లాస్యము కోమలమైనది. పరమశివుడి నృత్యము తాండవము. పార్వతీదేవి నృత్యము లాస్యము. శివుడు తాండవ నృత్యమందు ప్రీతి కలవాడు. 


'తాడ్యతే భూమిః అనేనేతి తాండవమ్' పాద విక్షేపముల చేత భూమిని కొట్టే నృత్యం తాండవం. 'తండునా ప్రణీతం తాండవం' తండువనే ఋషి చేత చెప్పబడినది కాబట్టి తాండవమని కూడా అంటారు. శివుడు నాట్యప్రియుడు. నాట్యముతో శివుడిని ఆరాధించుట ఉత్తమం. అందుకనే, నాట్యకారులు నటరాజమూర్తిని ఆరాధిస్తారు. 'ఓం నృత్య ప్రియాయ నమః'.


170. నిత్యనర్తః - సంతతము నర్తనం చేయువాడు, నిత్యం నర్తించువాడు. పరమశివుడు సంధ్యాకాలంలో తాండవ నృత్యం చేస్తుంటాడు. 'యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే' అని శివానందలహరిలో అంటారు ఆదిశంకరులు. అనగా, 'ఏ శివుడి యందు ప్రకాశిస్తున్న తాండవ నృత్యం ఒప్పుచున్నదో ఆ నీలకంఠుడిని భజిస్తున్నాను' అని. 'ఓం నిత్య నర్తాయ నమః'.


171. నర్తకః - పరమేశ్వరుడు నిత్య నర్తకుడు. తనంతట తానుగా నృత్యం చేస్తుంటాడు. ప్రళయకాలంలో తాండవ నృత్యం చేస్తాడు. పరమాణువులలోని ఎలక్ట్రానుల కదలికలను శివుడి తాండవ నృత్యానికి ప్రతీకగా భావించవచ్చని చెబుతారు. 'ఓం నర్తకాయ నమః'.


172. సర్వలాలసః - 'వాంఛాయా మౌత్సుక్యే లాలసా' అధికమైన కోరికను లాలస అంటారు. తన భక్తులందరి యందు ప్రేమ, ఆసక్తి కలవాడు, శంకరుడు భక్తవశంకరుడు, విశ్వబంధువు. 'ఓం సర్వలాలసాయ నమః'.శ్లో||

ఘోరో మహాతపాః పాశో నిత్యోఽనీహో నిరాలయః ।

సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః. ।। 22 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-51.


173. ఘోరః - ఘోరుడు అంటే భయంకరుడు. తనకు ఆగ్రహము కలిగినప్పుడు దేవతలకు భయాన్ని కలుగజేస్తాడు. స్వతహాగా పరమశివుడు పరమశాంతుడు. తన పట్ల అపరాధాలు చేసినా క్షమిస్తాడు. కానీ, తన భక్తుల ఎడల అనుచితములైన కార్యాలు చేసిన వారిపై ఆగ్రహిస్తాడు. దక్షుడు శివరహితమైన యజ్ఞం చేస్తున్నా ఆయన ఆగ్రహించలేదు. అయితే, సతీదేవి చేసిన దేహత్యాగం విని ఆయన ఆగ్రహోదగ్రుడయ్యాడు. మార్కండేయుడి ప్రాణాలను తీయడానికి తలపెట్టిన యముడిపై ఆగ్రహించాడు. అందువలన, ఆయన భయంకర రూపం కూడా ఆయనకు గుణమై శోభించింది. (శివుడికి రెండు శరీరాలు. ఆకలిదప్పుల రూపము ఘోరము, సంతోషాది రూపము అఘోరము అని అంటారు). 'ఓం ఘోరాయ నమః'.


174. మహాతపాః - మహాతపస్వి. గొప్ప తపస్సు చేసే మహాత్ముడు పరమేశ్వరుడు. దేవతలు తపస్సు చేసినట్లు గానీ, అందులో కోరికల కోసం తపస్సు చేసినట్లు గానీ ఎక్కడా లేదు. రాక్షసులు వరాలు పొందుటకై తపస్సు చేసినట్లు అనేకమైన దృష్టాంతాలున్నాయి. శివుడు తాను వరాలు ఇచ్చే వాడైనా, నిరంతరం తపస్సులో ఉంటాడు. ఆయన కామ విజయుడు అంటే కామాన్ని జయించినవాడు. ఒక్క కామాన్నే కాదు, కోరికలన్నింటిని జయించిన గొప్ప జ్ఞాని. ఆయన చేసే తపస్సు ఆత్మధ్యానం. అదే ఆయన్ని అందరు దేవతల కంటే గొప్పవాడిని చేసింది. అనగా అందరికంటే ప్రత్యేక స్వభావం కలవాడిగా చేసింది. 'ఓం మహాతపసే నమః'.


175. పాశః - పాశము అనగా త్రాడు. ఈ త్రాడు వలన బంధించవచ్చు. దేవతలు, రాక్షసులు, మానవులు, అన్ని ప్రాణులు విషయములచే బంధింపబడతారు. పరమశివుడికి దయ కలిగితే, వారు ఆ పాప బంధముల నుండి విముక్తులవుతారు. అందువల్ల విషయములన్నీ పాశములే. వాటి స్వరూపం కూడా పరమేశ్వరుడిదే. 'ఓం పాశాయ నమః'.


176. నిత్యః - నిత్యుడు అనగా శాశ్వతుడు. జరిగిపోయిన కాలమునందు, జరుగుతున్న కాలమునందు, జరుగబోవు కాలమునందు కూడా ఉండేవాడు. సృష్టి స్థితి లయములు చేస్తుంటాడు. 'మామూలుగా మహాప్రళయం జరిగినప్పుడు చరాచరాత్మక ప్రపంచమంతా నశిస్తుంది. అప్పుడు, దేవతలు ఆ నాశనానికి భయపడి అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. మునులు భయంతో గజగజ వణుకుతారు. అయితే, నీవు ఒక్కడివే పరమానంద పరిపూర్ణుడవై విహరిస్తుంటావని' పరమశివుడిని స్తుతిస్తాడు శివానందలహరిలో ఆదిశంకరులు. అందువలన, అతడు నిత్యుడు. 'ఓం నిత్యాయ నమః'.


177. అనీహః - ఈహ అనగా కోరిక. న+ఈహ = అనీహ. అనీహుడు అంటే కోరికలు లేనివాడు. పరమశివుడు పూర్ణకాముడు. ఆయనకు తీరని కోరికలంటూ ఉండవు. పరుల కోరికలను తీర్చే పరమేశ్వరుడికి, ఏ ఇతరములైన కోరికలు ఉండవు. అందుకే ఆయన అనీహః. 'ఓం అనీహాయ నమః'.


178. నిరాలయః - ఆలయము అనగా ఇల్లు. శివుడు నిరాలయుడు అనగా నివాస గృహము లేనివాడు. ఆయన కైలాసవాసి. అంటే, కైలాస పర్వతంపై ఉండేవాడు. స్మశానవాసి, స్మశానంలో కూడా ఉండేవాడు. కాశీ పట్టణానికి మహాస్మశానమని పేరు. పరమశివుడు పాటించేవన్నీ సన్యాస ధర్మాలు. సన్యాసికి ఎలాంటి గృహము ఉండదు. భిక్షాటనమే జీవన విధానం. అతడు జటాజూటధారి, సమదర్శి. ఇన్ని ధర్మాలు కలవాడికి గృహముండదు. 'ఓం నిరాలరాయ నమః'.

179. సహస్రహస్తః - సహస్రమంటే వేయి మాత్రమే కాదు. అనేకమనే అర్థం కూడా ఉంది. అందువలన, పరమశివుడు అనేకమైన చేతులు కలవాడు. అనేకమైన కార్యాలు చేసేవాడని అర్థం. ప్రపంచంలో ఎవరు ఏ పని చేసినా, అది పరమేశ్వరుడు చేసినట్లే భావించాలి. 'ఓం సహస్ర హస్తాయ నమః'.


180. విజయః - జయశీలుడు, జయుడు. పరాజయం ఎరుగనివాడు. ఆయన మహాజ్ఞాని కాబట్టి, జయాపజయాలన్న ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆయన భక్త పరాధీనుడు. పరాజయాన్ని భక్తుల చేతిలో కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. 'ఓం విజయాయ నమః'.


181. వ్యవసాయః - వ్యవసాయము అంటే ప్రయత్నం. ప్రయత్నము కలవాడు, నిశ్చలుడు, ప్రయత్నం తానేయైనవాడు. ప్రయత్నశీలురకు మాత్రమే దైవము తోడ్పాటు అందిస్తుంది. కార్యము సఫలం కావాలంటే ప్రయత్నము, దైవబలం చాలా అవసరం. దైవం యొక్క తోడ్పాటు వల్లనే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. అహంకారం కలవారు మేమే కార్యసాధకులమని విఱ్ఱవీగుతుంటారు. కానీ, ఇది ఎంత మాత్రం సత్యం కాదు. 

ఏమాత్రం చదువు సంధ్యలు లేని థామస్ ఆల్వా ఎడిసన్ దైవ కృప, తీవ్రమైన ప్రయత్నం వల్లనే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త కాగలిగాడు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ ని కాకతాళీయంగా కనిపెట్టడంలో దైవం తోడ్పాటు ఉంది. లెవోయిజీర్ జీర్ణరస గ్రంథులను గూర్చి తెలుసుకోవడంలో దైవం తోడ్పాటు ఉంది. ఇవన్నీ మనం గుర్తుంచుకోదగ్గ విషయాలు. మనం చేసే ప్రయత్నాలు అనగా మంచిని చేకూర్చే కార్యాలన్నీ దైవ ప్రేరణ చేత కలిగినవే. అయితే, చెడ్డ ప్రయత్నాలకి దైవం కారణం కాదా అంటే! కాదనే చెప్పాలి. దైవము మనిషికి వివేకాన్ని ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకోలేక పోవడం మనిషి దౌర్భాగ్యం. 'ఓం వ్యవసాయాయ నమః'.


182. అతంద్రితః - తంద్ర అంటే తమోమయమైన వృత్తి. తమోగుణ ప్రధానమైనవి అలసత్వం, కునికిపాట్లు, నిద్ర ఇవే ప్రవృత్తిని నిరోధిస్తాయి. తంద్ర అనగా ప్రధానంగా కునికిపాటు. అలా, ఏలాంటి కునికిపాట్లు లేనివాడు శివుడు. అందువలన, ఆయన నిత్య వ్యవసాయి. 'ఓం అతంద్రితాయ నమః'.శ్లో||

అధర్షణో ధర్షణాత్మా యజ్ఞహా కామనాశకః ।

దక్షయజ్ఞాపహారీచ సుసహో మధ్యమ స్తథా ।। 23 ।।

--వ్యాసభారతం. అను. పర్వం. 17-52.


183. అధర్షణః - ధర్షణము అంటే తిరస్కారం. అధర్షణుడు అంటే ఎవ్వరిచేత తిరస్కరింపబడనివాడు. జ్ఞానం చేత కానీ, పరాక్రమం చేత గానీ ఎవ్వరూ ఆయనకు సమానులు కారు. (కొన్ని చోట్ల 'అఘమర్షణః' అనే పాఠాంతరము కూడా ఉంది. అఘమర్షణము అంటే సర్వపాపములను పోగొట్టు మంత్రం). 'ఓం అధర్షణాయ నమః.'


184. ధర్షణాత్మా - ధర్షణాత్మా అంటే సరియైన అర్థం లేదు. ఇక్కడ కూడా ఘర్షణాత్మా అనే పాఠం సరియైనదని పండితులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీనికి సహనము కలవాడని అర్థం. 'ఓం ఘర్షణాత్మనే నమః'.


185. యజ్ఞహా - 71వ నామమైన 'మృగబాణార్పణః' అనే నామము యొక్క భావమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. రుద్రుడు యజ్ఞంపై కోపంతో తన పినాకమనే ధనుస్సు నుండి బాణాన్ని సంధించాడు. యజ్ఞమే భయపడి లేడి రూపము ధరించి పరిగెత్తుకుపోయింది. శివుడు బాణాన్ని విడిచాడు. దాంతో, యజ్ఞం శరణు కోరగా పరమశివుడు శాంతించి, దానిని తన చేతిలోకి తీసుకున్నాడు. అందువలన, శివుడు యజ్ఞహుడయ్యాడు. దక్ష యజ్ఞాన్ని నాశనం చేయించాడు. బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞాన్ని ఆపాడు. 'ఓం యజ్ఞఘ్నే నమః'.


186. కామనాశకః - కాముడంటే మన్మథుడు. మన్మథుడు సృష్టి కార్యం నిర్వహణ కొరకు సమస్త ప్రాణుల మనసులను మధించగల శక్తిని బ్రహ్మదేవుడి ద్వారా పొందాడు. తారకాసురుడిని శివశక్తి వలన సంభవించిన కుమారుడు మాత్రమే సంహరించవలసి ఉంది. శివుడు ఊర్ధ్వరేతస్కుడు. అందువలన, దేవతలు శివుడిని కామాసక్తుడిని చేయమని, మన్మథుడిని కోరుకున్నారు. పార్వతి శివుడి సమీపంలో ఉన్న సమయంలో మన్మథుడు శివుడిపై పుష్పబాణములను ప్రయోగించాడు. దాంతో శివుడు కోపించి, తన మూడవ కంటి మంటలతో మన్మథుడిని దహింపజేశాడు. అలా మన్మథుడు భస్మమయ్యాడు. 'ఓం కామనాశకాయ నమః'.


187. దక్షయజ్ఞాపహారీ - దక్షుడు బ్రహ్మదేవుడి మానస పుత్రుడు. అతడు జగదంబనే కుమార్తెగా తనకు పుట్టాలని తపస్సు చేశాడు. సతీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది. దక్షుడు ఆమెను రుద్రుడికిచ్చి వివాహం చేశాడు. ఒకనాడు దక్ష ప్రజాపతికి సభలోని అందరూ తనకు నమస్కారం చేయగా, అల్లుడైన శివుడు తనకు నమస్కరించలేదని ఆగ్రహించి శివ రహితమైన యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞభూమికి సతీదేవి వెళ్లి, తండ్రి చేసిన శివనిందను విని, బాధపడి యోగాగ్నిలో దగ్ధమైంది. అప్పుడు శివుడు వీరభద్రుడిని పంపి, దక్ష ప్రజాపతి చేసిన యాగాన్ని ధ్వంసం చేయించాడు. 'ఓం దక్షయజ్ఞాపహారిణే నమః'.


188. సుసహః - సౌమ్యుడు. పరమశివుడు మిక్కిలి సహనము కలవాడు. దక్షుడు చేసిన తిరస్కారాన్ని, నిందను భరించాడు. అంతేకాదు! దక్షుడు చేసిన శివ రహితమైన యజ్ఞాన్ని కూడా సహించాడు. చిట్టచివరకు సతీదేవి తనుత్యాగము చేసినందువల్ల మాత్రమే ఆగ్రహించాడు. ఈ విషయం పరమశివుడి సౌమ్యత్వాన్ని, ఓర్పును తేటతెల్లంచేస్తుంది. 'ఓం సుసహాయ నమః'.


189. మధ్యమః - కొంచెం మధ్యేమార్గంగా ఉండేవాడు. అనగా, ఎవరి యందు పక్షపాతము లేనివాడు. దేవ దానవులలో ఏ ఒక్కరియందు, పక్షపాతము చూపించలేదు. విష్ణువు దానవ వైరి. బ్రహ్మ, దానవుల తపస్సుకు మెచ్చి వారికి వరములను ఇచ్చాడు కానీ, దేవతలపై మాత్రం ఆయనకు పక్షపాతము ఉండేది. శివుడు సమదర్శి, మధ్యముడు. అందుకే, 'ఓం మధ్యమాయ నమః'


  

శ్లో||

తేజోఽపహారీ బలహా ముదితోఽర్థో జితోఽవరః

గంభీరఘోషో గంభీరో గంభీర బలవాహనః ।। 24 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-53.


190. తేజోఽపహారీ - పరమశివుడు పరంజ్యోతి స్వరూపుడు. సూర్యుడు ఉదయించగానే, అగ్ని తేజస్సు కూడా తగ్గిపోతుండడం మనం చూస్తున్నాం. అంటే, అధిక తేజస్సు అల్ప తేజస్సును హరిస్తుంది. అలా, పరమేశ్వరుడి తేజస్సు ముందు అన్ని తేజస్సులూ హరించుకుపోతాయి. అందువల్లనే, ఆయన తేజోఽపహారీ. 'ఓం తేజోఽపహారిణేనమః'


191. బలహా - బలవంతుల మని గర్వించే వాళ్ళ బలాన్ని హరించువాడు. రాక్షసులను జయించిన దేవతల ముందు శివుడు యక్షుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడు అగ్నిని పంపించి యక్షుడిని గుఱించి తెలుసుకొని రమ్మన్నాడు. అగ్ని యక్షుడి వద్దకు వెళ్లి తాను ప్రపంచమును అంతటినీ భస్మం చేయగల శక్తివంతుడినని అన్నాడు. అప్పుడు అగ్ని ఎదుట ఒక గడ్డిపోచను ఉంచి దానిని కాల్చమన్నాడు యక్షుడు. అగ్ని తన శక్తినంతటినీ వినియోగించినా, దానిని కాల్చలేక పోయాడు. ఆ తర్వాత ఇంద్రుడు వాయువును పంపాడు. వాయువు కూడా తన శక్తితో ఆ గడ్డిని కదల్చలేకపోయాడు. ఈ విధంగా గర్వించిన దేవతల బలాన్ని హరించి, వారికి గర్వభంగము కావించాడు పరమేశ్వరుడు. 'ఓం బలఘ్నే నమః'.


192. ముదితః - నిత్యం ఆనందం అనుభవించేవాడు, ఆనందరూపుడు. శివుడు జ్ఞాని. చిత్ అంటే జ్ఞానం. అందుకే శివుడు చిదానందుడు, సదానందుడు. 'ఓం ముదితాయ నమః'.


193. అర్థః - అర్థము అనగా ధనం. (అర్థ్యత ఇత్యర్థః, అర్థ ఉపయాజ్ఞాయాం = ప్రార్థింపబడునది అర్థం) శివుడు అష్టైశ్వర్య యుక్తుడు. 'ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్', అంటే, ఐశ్వర్యం కోరువారు ఈశ్వరుడిని ప్రార్థించాలి. తన భక్తుడైన కుబేరుడికి నవనిధులను ప్రసాదించాడు. అంతేకాదు, పరమేశ్వరుడిని పూజించేవాళ్లకు అన్ని ప్రయోజనాలు సిద్దిస్తాయి. 'ఓం అర్థాయ నమః'.


194. అజితః - (జితో న భవతీత్యజితః = గెలువబడనివాడు) యుద్ధంలో జయింపబడనివాడు. ఒకసారి బలిచక్రవర్తి కుమారుడైన బాణాసురుడు, శివుడి వర ప్రభావంతో వేయి చేతులను మరియు అమితమైన పరాక్రమాన్ని పొందాడు. అతడు బల గర్వంతో ముల్లోకాలలో నాతో యుద్ధం చేయగల వాడు ఎవడూ లేడు. ఇప్పుడు నా బాహువుల తీట నన్ను బాధిస్తుంది. కాబట్టి నీవే నాతో యుద్ధం చేయమని శివుడిని కోరాడు. శివుడు అతడి అహంకారానికి తగిన శాస్తి చేయాలని ఒక జెండాను ఇచ్చి దీనిని నీ కోట బురుజుపై ఉంచు. ఇది విరిగిపడిన నాడు నీ బాహు గర్వాన్ని అణిచేవాడితో నీకు యుద్ధం కలుగుతుందని చెప్పాడు. 

తన కుమార్తె ఉషా కుమారి ప్రియుడైన అనిరుద్ధుడిని, (శ్రీ కృష్ణుడి మనవడు) బంధించాడు. తన మనవడిని విడిపించడం కోసం శ్రీకృష్ణుడు బాణాసురుడి మీదికి దండెత్తి వచ్చాడు. బాణాసురుడు శివుడిని తన కోట గుమ్మం వద్ద కావలిగా ఉంచాడు. అప్పుడు శ్రీకృష్ణుడికి శివుడికి యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుడు ప్రయోగించిన జృంభకాస్త్రంతో శివుడికి నిద్ర కలిగింది. అయితే, తానిచ్చిన వరం ఫలించడానికి శివుడు అలా నిద్ర లీలను ప్రదర్శించాడు. అందువలన శివుడు అజితుడు. ఈ నామానికి కొందరు 'జితః' అని కూడా వ్యాఖ్యానించారు. 'ఓం అజితాయ నమః'.


195. అవరః - ఇతడి కంటే ఇంకొకరు వరింపదగినవాడు లేరు అంటే అందరి కంటే శ్రేష్ఠుడని అర్థం. వరుడు అంటే శ్రేష్ఠుడు, అవరుడు అంటే శ్రేష్ఠుడికి వ్యతిరేకమైన అర్థం రావాలి. అయితే, ఇక్కడ తద్విరుద్ధమైన అర్థం రాదు. ఉదాహరణకు మూల్యము అంటే వెల. అమూల్యము అంటే వెల లేనిదని కాదు, వెల కట్టలేనిదని అర్థం. అలాగే, అవరుడు అంటే అందరి కంటే శ్రేష్డుడని అర్థం. 'ఓం అవరాయ నమః'.


196. గంభీరఘోషః - ఘోష అంటే ఉరుము. అంటే మేఘధ్వని. మేఘధ్వనిలా గంభీరమైన కంఠధ్వని కలవాడు, దుందుభి స్వరము కలవాడు. 'ఓం గంభీర ఘోషాయ నమః'.


197. గంభీరః - గంభీరుడు, వేదరూపుడు. మిక్కిలి లోతైన ఆశయం కలవాడు. అంటే, ఆయన స్వభావం ఎవరికీ అంతుబట్టదని అర్థం. 'ఓం గంభీరాయ నమః'.


198. గంభీరబలవాహనః - ఇతరులకు అంతు తెలియరాని గంభీరము. శిలాదుడను ఋషి శివుడి గుఱించి గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం కాగా, అయోనిజుడు, మృత్యువు లేని వాడగు పుత్రుడిని ప్రసాదించమని అడిగాడు. దానికి, శివుడు నంది అను పేరుతో నేనే నీకు పుత్రుడను అవుతానని వరము ఇచ్చాడు. తర్వాత శివుడు నందిని నాయకుడిగా అభిషేకించాడు. నంది మహా బలవంతుడు. కానీ ఆయన తన బలము ఎప్పుడు ప్రదర్శించలేదు. అటువంటి నంది, అనగా వృషభము వాహనముగా కలవాడు పరమేశ్వరుడు. బలము అనగా సైన్యము, శరీరము, సామర్థ్యము, వృషభము కలవాడు, ఈ వృషభమే ధర్మము. అంతు తెలియని బలము గల వృషభమే వాహనముగా కలవాడు, వృషభ వాహనుడు. 'ఓం గంభీరబలవాహనాయ నమః'.శ్లో||

న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్ష కర్ణ స్థితిః విభుః

సుతీక్షణ దశవశ్చైవ మహాకాయో మహాననః ।। 25 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-54.

అశ్వత్థరూపుడు, దక్షిణామూర్తి స్వరూపుడు, వటపత్రశాయి, వివిధ రూపాలలో పుట్టువాడు, తీక్ష్ణదంతాలు కలవాడు, మహాకాయుడు, పెద్ద ముఖము కలవాడు.


199. న్యగ్రోధ రూపః - (న్యక్ రోహతి) అంటే క్రిందుగా మొలచునది. (ఊర్ధ్వమూలో హ్యవక్ శాఖ ఏషోఽశ్వత్థః సనాతనః) అని శ్రుతి ప్రమాణం. న్యగ్రోధ మంటే మర్రిచెట్టు. ఈ చెట్టు అనేకమైన ఊడలతో అడ్డంగా వ్యాపిస్తుంది. పరమశివుడు జటా భారంతో ఉంటాడు. మర్రిచెట్టు అనేక ప్రాణులకు ఆశ్రయం కల్పిస్తుంది. శివుడు కూడా అందరికీ శరణ్యుడు. అందువలన శివుడిని మర్రిచెట్టుతో పోల్చుతారు. 'ఓం న్యగ్రోధరూపాయ నమః'.


200. న్యగ్రోధః - వటరూపుడు అంటే వటవృక్ష సమీపంలో కూర్చున్న దక్షిణామూర్తి రూపుడని అర్థం. అలాగే, అశ్వత్థ వృక్షమంటే రావిచెట్టు. శ్రీమహావిష్ణువుకు ప్రతీక. అశోక వృక్షానికి ప్రతీక అంబికా దేవి. కరవీరం సూర్యుడికి ప్రతీక. ఇందిర వృక్షం గణేశుడికి ప్రతీక. బిల్వవృక్షం పరమశివుడికి ప్రతీక. మారేడు, రావి, మర్రి, అశోకము, మేడి అనేవి పంచ వటములు. కాబట్టి, మర్రిచెట్టును కూడా శివుడికి ప్రతీకగా భావిస్తారు. అందువలన, శివుడిని న్యగ్రోధుడని కూడా అంటారు. శివుడి అవతారమైన దక్షిణామూర్తి మర్రిచెట్టు క్రిందనే ఉంటాడు. 'ఓం న్యగ్రోధాయ నమః'.


'ద్వితీయ శతకము సమాప్తము'


201. వృక్షకర్ణస్థితిః - వృక్షము అనగా చెట్టు. కర్ణము అంటే చెవి. చెట్టుకు చెవులు ఆకులే కదా! దానియందు, స్థితిః అంటే ఉండువాడు. కల్పాంతంలో మహావిష్ణువు మర్రి ఆకుపై తేలుతూ బాలుడి రూపంలో మహాసముద్రంలో ఆకుపై తేలుతూ ఉంటాడని, ఆ బాలుడిని వటపత్రశాయి అంటారని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని భాగవతంలో ఇంకా వివరంగా చెప్పారు. దీనినే, అన్నమయ్య తన కీర్తనలో 'తెప్పగ మర్రాకు మీద తేలాడువాడు' అని అంటాడు. అలాగే, తన 'కృష్ణ కర్ణామృతంలో'.......

శ్లో|| కరార విందేన పదారవిందం, ముఖారవిందే వినివేశయంతం

వటస్య పత్రస్య పుటే శయానం, బాలం ముకుందం మనసా స్మరామి.

అని బాల కృష్ణుడిని స్తుతిస్తారు లీలాశుకుల వారు. అందుకని, వృక్షకర్ణస్థితిః అంటే మర్రియాకు ఉండే విష్ణు స్వరూపుడు. 'శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే' శివుడే విష్ణువు. విష్ణువే శివుడు కదా! 'ఓం వృక్ష కర్ణ స్థితయే నమః'.


202. విభుః - (వివిధరూపేణ భవతీతి విభుః) హరిహర దుర్గగణేశ అర్క అగ్నివాయ్వాది రూపములతో భక్తులను అనుగ్రహించేవాడు. అంటే వివిధ రూపాలలో అవతరించినవాడు. విభుడనగా ముల్లోకాలకు ప్రభువు. 'ఓం విభవే నమః'.


203. సుతీక్ష్ణదశనః - (తేజయతీతి తీక్షణం సుతీక్షణం) అంటే మిక్కిలి పదునైన, దశనః అంటే దంతాలు కలవాడు, కాలభైరవ స్వరూపుడు. (సుతీక్ష్ణాదశనా యస్య సః) తీక్ష్ణదంతాలు కలవాడు. 'ఓం సుతీక్ష దశనాయ నమః'.


204. మహాకాయః - పెద్ద కాయము (శరీరం) కలవాడు. నంది శివుడి అవతారం. శిలాదుడనే ఋషికి వరమిచ్చి, తానే ఆయనకు కుమారుడిగా (నంది) జన్మించాడు. అందువలన, శివుడు మహాకాయుడు. 'ఓం మహాకాయాయ నమః'.


205. మహాననః - శివుడి యొక్క మరియొక రూపము కాలభైరవుడు. అతడు కరాళదంష్ట్రాభీషణుడు. అట్టహాసం చేత బ్రహ్మాండములనే పగులగొట్టేంత భయంకరుడు. ఆననము అనగా ముఖము, నోరు అని అర్థం. పెద్ద ముఖము (నోరు) కలవాడు. సుతీక్ష్ణ దశనములకు అనుగుణములైన శరీరాన్ని, ముఖాన్ని (నోటిని) వర్ణించారు. 'ఓం మహాననాయ నమః'.శ్లో||

విష్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగాపీడవాహనః ।

తీక్ష్ణతాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవిత్ ।। 26 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-55.


206. విష్వక్సేనః - విష్వక్సేనుడు అనే పదానికి మహావిష్ణువు, మహావిష్ణువు యొక్క సైన్యాధిపతి, ప్రేంకనము (ఒక చెట్టు) అనే అర్థాలున్నాయి. మహా విష్ణువు సైన్యాధిపతి భార్య పేరు సూత్రవతీదేవి. 'విష్వక్ సమంతతః వ్యాప్తా సేనా యస్యసః విశ్వక్సేనః' అనే వ్యుత్పత్తి చేత, అంతట వ్యాపించిన సేన గలవాడు విష్ణువు, అని గురుబాల ప్రబోధికలో ఉంది. ప్రేంకనము అన్నది ఒక చెట్టు. దీనికి విష్వక్సేనము అనే పేరుంది. 'విష్వక్ సినోతి భధ్నాతీతి విష్యక్సేనా' అంతటా వ్యాపించి ఉన్నది అని వ్యుత్పత్తి. ఈ వ్యుత్పత్తితో విష్ణువు అనే అర్థంలో కూడా చక్కగా అన్వయించుకోవచ్చు. (విశ్వం వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణుః) అనగా విశ్వమంతటా వ్యాపించినవాడని అర్థం. శివుడు కూడా సర్వవ్యాపకుడు. అందువల్ల, విష్వక్సేనుడు అనగా సర్వ వ్యాపకుడైన శివుడే. 'ఓం విష్వక్సేనాయ నమః'.


207. హరిః - (హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృతః) హరిః అనగా విష్ణువు. భక్తుల ఆపదను, దుష్ట చిత్తుల పాపాలను తొలగించును, హరించును, సర్వసంహర్త అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. గంజేంద్రమోక్షంలో గజేంద్రుడి ఆపదను హరించాడుగా. మనం చిన్నప్పుడు కృష్ణ శతకంలో..

కంద పద్యం: 

హరి యను రెండక్షరములు 

హరియించును పాతకముల నంబుజనాభా 

హరి నీ నామ మహత్మ్యము 

హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!

అని చదువుకున్నాము. హరిహరులకు భేదము లేదు. శివ నామ స్మరణము కూడా సర్వ పాపములను హరిస్తుంది. 'ఓం హరయే నమః'.


208. యజ్ఞః - సృష్టి బీజరూపుడు, యజ్ఞరూపుడు. స్వాయంభువ మన్వంతరము నందు మహావిష్ణువు రుచి ప్రజాపతికి ఆహూతి యందు యజ్ఞుడను పేరుతో కుమారుడిగా జన్మించాడు. ఇది ఆయన ఇరవై ఒక్క అవతారములలో ఏడవది. అంతేకాదు విష్ణువు యజ్ఞ స్వరూపుడు. 'యజ్ఞో వై విష్ణుః' అను వాక్యం ఈ విషయాన్ని తెలుపుతున్నది. ఈ యజ్ఞః అనే పేరు సహస్ర నామాలలో మళ్లీ మళ్లీ వస్తుంటుంది. అసలు యజ్ఞం అంటే ఏమిటో? యజ్ఞం గుఱించి వేదం ఏమి చెబుతుందో కొంత వివరిస్తాను. 


ఈ యజ్ఞం యజుర్వేదమే. (యజుర్యజనాత్) యజ్ఞయాగాది కర్మకాండను నెరవేర్చడం వల్లనే దీనికి యజుర్వేదమనే పేరు వచ్చింది. యజుర్వేదం, మొదటి అధ్యాయం రెండవ మంత్రం యజ్ఞ మాహత్వాన్ని చెబుతుంది. "వసోః పవిత్రమసి ద్యౌరసి పృథివ్యసి మాతరిస్వనో ఘర్మోఽసి విశ్వధాఽసి పరమేణ ధామ్మా దృహస్వ మాహార్మాతే యజ్ఞపతిర్వ్యార్షీత్" 'ఓ మానవులారా! ఈ యజ్ఞం చాలా పవిత్రమైనది. ఆకాశం వలె అతి విశాలమైనది. దీనిలో వేయబడిన ఆహుతులు సూర్యరశ్మిలో చేరి ప్రాణులకు ఉపకారం చేస్తాయి. వాయువులో చేరి కాలుష్యాన్ని నివారిస్తాయి. ఇలా అన్నింటినీ శుద్ధి చేస్తాయి. ఇటువంటి యజ్ఞాన్ని విడవకండి. మీరు యజ్ఞపతులు కావాలి. ఇది మీకు శతవిధాలా ఉపకారం చేస్తుందని' చెబుతుంది ఈ మంత్రం. 


'అగ్నే విహి ఔషట్' అగ్ని దీన్ని భక్షించి దేవతల దగ్గరకు వెళ్ళుగాక! అని ఈ మంత్రం అర్ధము. ఈ వషట్కారము ఉచ్చారితమవుతూ ఉన్నప్పుడే అధ్వర్యుడు (యజ్ఞ కర్త) ఆహుతి ద్రవ్యాన్ని అగ్నిలో వేస్తాడు. యజమాని ఆహుత్యనంతరము 'ఇదం అగ్నయే న మమ' ఇక ఇది అగ్నిదే నాదికాదు అనే త్యాగ భావాన్ని తెలియజేస్తాడు.

(యజ్ఞో వై శ్రేష్ఠతమం కర్మ) 'కర్మలన్నింటిలో శ్రేష్ఠమైనది యజ్ఞం అని కూడా యజుర్వేదంలోనే చెప్పారు. మానవుడిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే కర్మలలో యజ్ఞం అత్యుత్తమమైనదని' అర్థం. ఆవునెయ్యి, మూలికలు, సుగంధద్రవ్యాలు మొదలైన పదార్ధాలను మంత్ర పూరితంగా అగ్నిలో ఆహుతులుగా వేస్తే, అగ్ని ద్వారా అంతరిక్షంలో ఉన్న వాయువుతో, సూర్య కారణాలతో కలిసి, తిరిగి అదే మార్గంలో ప్రయాణించి మేఘాల ద్వారా వర్షిస్తాయి. దీనితో జలవాయువులు, భూమి మాలిన్యరహితాలవుతాయి. ఈ స్వచ్చమైన జలం బలవర్ధకాలైన ఫలాలను, పంటలను అందిస్తాయి. దీనివల్ల భూమిపై ఉన్న ప్రాణులన్నింటికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. అప్పుడు ప్రకృతి ద్వారా పక్షపాతం లేని పరోపకారం జరుగుతుంది. అందుకే, యజ్ఞాన్ని శ్రేష్ఠతమకర్మగా చెప్పారు. మరిన్ని యజ్ఞానికి సంబంధించిన విశేషాలను మున్ముందు వివరిస్తాను. శివవిష్ణువులకు భేదం లేదు, 'యజ్ఞో వై విష్ణుః' అన్నారు కాబట్టి, యజ్ఞ స్వరూపుడైన విష్ణువే శివుడు కూడా. 'ఓం యజ్ఞాయ నమః'.


209. సంయుగా పీడ వాహనః - సంయుగమంటే యుద్ధం. (సంయుగే ఆపీడ ఇవ ఆపీడో వాహనం యస్యసః) యుద్ధంలో ధ్వజమే వాహనమైనవాడు. శంకరుడి ధ్వజము, వాహనము రెండూ వృషభమే. త్రిపురాసుర సంహార సమయంలో, కుడి చక్రము ఆకులుగా ద్వాదశాదిత్యులు, ఎడమ చక్రము ఆకులుగా చంద్రుడి పదహారుకళలు, కుడి ఎడమ చక్రాలుగా సూర్య చంద్రులు, రథము అంతర్భాగంగా మందర పర్వతం, స్తంభములుగా ఉదయాస్తాచల పర్వతములు, అధిష్ఠాన పీఠంగా మేరు పర్వతం అమర్చబడ్డాయి. నాలుగు వేదాలు అశ్వాలయ్యాయి. శివుడు ఆ రథమును అధిరోహించగానే రథాశ్వములు క్రుంగి కింద పడ్డాయి. మహావిష్ణువు వృషభ రూపమును ధరించి వాలిన రథాన్ని స్థిరపరిచాడు. అందువలన, శివుడు సంయోగాపీడ వాహనుడు. 'ఓం సంయోగాపీడ వాహనాయ నమః'.


210. తీక్ష్ణతాపః - తీక్ష్ణతాపము కలవాడు అగ్ని. అటువంటి అగ్ని రూపుడు శంకరుడు. అంతేకాక, సూర్యుడు అష్ట మూర్తులలో ఒకరు. ఆయన తీక్షణమైన కిరణములు కలవాడు. ఆ కిరణాలు మిక్కిలి తాపాన్ని కలిగిస్తాయి. తాపము అనగా వేడి. అందువలన, శివుడు మిక్కిలి తీక్షణమైన వేడిమి కలవాడని అర్థం. 'ఓం తీక్ష్ణతాపాయ నమః'.


211. హర్యశ్వః - (హరయః అశ్వా యస్యసః) హరయః అనగా పచ్చని వర్ణము. పచ్చని వర్ణముతో అతి వేగంగా పరుగెత్తే అశ్వాలు కలవాడు సూర్యుడు. అనగా సూర్య స్వరూపుడైన శివుడు. 'ఓం హర్యశ్వాయ నమః'.


212. సహాయః - (ద్వాసుపర్ణా సయుజౌ సఖాయౌ) జీవుడికి సఖుడు. దేవతలకు, దానవులకు, మానవులకు సహాయం చేసేవాడు. హాలాహల భక్షణం చేసి, దేవదానవులనే కాక, సమస్త లోకాలను రక్షించాడు. రాక్షసుడైన బాణాసురుడికి యుద్ధ సమయంలో సహాయం చేశాడు. తారకాసుర సంహారాన్ని కుమారస్వామి చేత జరిపించి, లోకాలకు ఉపకారం చేశాడు. అలా ఉపకారం చేసి లోకాలను రక్షించాడు. 'ఓం సహాయాయ నమః'


213. కర్మకాలవిత్ - సమస్త జీవుల కర్మల కాలము చక్కగా తెలిసినవాడు. కాలకర్మవేత్త. జీవుడు చేసిన కర్మలకు సూర్యుడే సాక్షి. అందుకే, సూర్యుడికి కర్మసాక్షి అని పేరు (కర్మసాక్షీ జగచ్చక్షుః అంశుమాలీ త్రయీతనుః, ప్రద్యోతనో దినమణిః ఖద్యోతో లోకబాంధవః). సూర్యుడే కాక పంచభూతాలు, యముడు, చంద్రుడు, సాక్షులు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినవాడు. 'ఓం కర్మకాలవిదే నమః'.


 ...అంబాళం పార్థసారథి 

SRI SHIVA SAHASRA NAMA

Sri Shiva Sahasra Nama Stotram (Meaning in Telugu)

Part 3


  

శ్లో||

విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రోః వడవాముఖ

హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః ।। 27 ।।

--వ్యాసభారతం. అను. పర్వం. 17-56.

విష్ణువు ప్రసన్నం చేసికొన్నవాడు, విష్ణురూపుడు, సముద్రరూపుడు, బడబాగ్ని స్వరూపుడు, వాయు స్వరూపుడు, ప్రశాంతమైన ఆత్మ కలవాడు, అగ్ని స్వరూపుడు.


215. యజ్ఞః - (యజతే యజ్ఞః) దేవతలను పూజించు కర్మయజ్ఞం. (యజ్ఞో వై విష్ణుః) యజ్ఞమంటే విష్ణువు. అందుకే పరమశివుడు విష్ణు స్వరూపుడు. యజ్ఞములు గృహస్థులు ఆచరింపవలసినవి. యజ్ఞములు ఇరవై ఒక్కటి. సప్తపాక యజ్ఞములు, సప్త హవిర్యజ్ఞములు, సప్త సోమ యజ్ఞములు. ఇవి కాక గృహస్థులు తప్పనిసరిగా ప్రతిరోజూ చేయవలసినవి పంచ యజ్ఞాలు 1. బ్రహ్మ యజ్ఞం: అనగా వేదాధ్యయనము లేదా వేదాధ్యాపనము చేయుట. 2. దేవ యజ్ఞం: దేవతా ప్రీతి కొఱకు అగ్నియందు హోమము చేయుట. 3. పితృ యజ్ఞం: పితృదేవతలకు తర్పణం. 4. మనుష్య యజ్ఞం: అతిథి అభ్యాగతులను ఆదరించుట. 5. భూత యజ్ఞం: ప్రాణులకు ఆహారాన్ని ఇవ్వడం. ఇవన్నీ శివుడి రూపాలే. 'ఓం యజ్ఞాయ నమః'.


216. సముద్రః - (సమంతాన్ముదం రాతీతి వా సముద్రః = అంతటా సంతోషం కలుగజేసేది), (ముద్రయా సహితః సముద్రః = ఈశ్వరాజ్ఞతో కూడుకొని యుండునది). సముద్రమంటే అపారమైన జలరాశి. పరమశివుడి అష్టమూర్తులలో జలము ఒకటి. అందువలన, సముద్రము కూడా శివస్వరూపమే. సముద్రరూపుడు. 'ఓం సముద్రాయ నమః'.


217. బడబాముఖః/వడవాముఖః - బడబాగ్ని అంటే సముద్ర జలాన్ని శోషింప జేయగల అగ్ని. ఆ స్వరూపము పరమేశ్వరుడే. బడబాగ్ని స్వరూపుడు. పరమేశ్వరుడి మూడవ కంటి నుండి వెలువడిన మంట మన్మథుడిని దహించి అన్ని వైపులకు వ్యాపించింది. దాని వలన ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. దేవతలు, ఋషులు బ్రహ్మదేవుని శరణు వేడుకున్నారు. బ్రహ్మ, శివుడిని ప్రార్థించి ఆయన కృప చేత ప్రాప్తించిన శక్తితో ఆ అగ్నిని ఆడు గుఱ్ఱంగా మార్చివేశాడు. అప్పుడు, దాని ముఖము నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. బ్రహ్మదేవుడు దానిని సముద్ర తీరానికి తీసుకొనిపోయి, దానిని భరింపుమని సముద్రుని శాసించాడు. బడబా అంటే ఆడు గుఱ్ఱం. అందువలన, దానికి బడబాగ్ని అనే పేరు ఏర్పడింది. అది పరమశివుని తేజస్సు కాబట్టి, శివస్వరూపమే. 'ఓం బడబాముఖాయ నమః'


218. హుతాశనసహాయః - హుతము అనగా హోమద్రవ్యము. హోమద్రవ్యము అశనము అంటే ఆహారముగా కలవాడు అగ్ని. అగ్నికి సహకరించువాడు వాయువు. శివుడి అష్టమూర్తులలో ఒకరు వాయువు. అందువలన, ఆయన హుతాశన సహాయుడు. 'ఓం హుతాశన సహాయాయ నమః'.


219. ప్రశాంతాత్మా - అలలు లేని సాగర స్వరూపుడు. నిత్య ధ్యాన స్థితుడైన శివుడు పరమ శాంతుడు. అందుకే, ఆయన ప్రశాంతమైన ఆత్మ కలవాడు. 'ఓం ప్రశాంతాత్మనే నమః'.


220. హుతాశనః - హవిస్సు ఆహారముగా గలవాడు అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడిని హుతభుక్ (హుతం భుంక్తే హుతభుక్ = హుతమును భుజించువాడు) (వీతిహోత్రః = వీతిః అశనం హోత్రః హవిః యస్యసః వీతిహోత్రః) అని కూడా అంటారు. శాండిల్య గోత్రంలో విశ్వానరుడనే శివ భక్తుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు శుచిష్మతి. విశ్వానరుడు, శివుడితో సమానమైన కుమారుడు కావాలని గొప్ప తపస్సు చేశాడు. శివుడే ఆయనకు కుమారుడిగా జన్మించాడు. అతడి పేరు గృహపతి. గృహపతి కాశీక్షేత్రంలో శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు అతడిని ఆగ్నేయ దిక్కునకు అధిపతిని చేశాడు. గృహపతి విశ్వానరుడి పుత్రుడు కాబట్టి వైశ్వానరుడని పిలువబడ్డాడు. వైశ్వానరుడనగా అగ్ని (అగ్నిః వైశ్వానరో వహ్నిః వీతిహోత్రో ధనంజయః). ఈ కారణంగా అగ్ని శివస్వరూపుడు. శివుడి అష్ట మూర్తులలో అగ్ని కూడా ఒకరు. 'ఓం హుతాశనాయ నమః'.శ్లో||

ఉగ్రతేజా మహాతేజా జన్యో విజయకాలవిత్

జ్యోతిషామయనం సిద్దిః సర్వవిగ్రహ ఏవ చ ।। 28 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-57.


221. ఉగ్రతేజా - అగ్నిహోత్రుడే సహించరాని స్పర్శ కలవాడు, ఉగ్రతేజుడు. తేజస్సు అనగా కాంతి, ప్రతాపము లేక పరాక్రమము, రేతస్సు అనే అర్థాలున్నాయి. పరమశివుడు భయంకరమైన పరాక్రమాలు కలవాడు. ఆయన రేతస్సు కూడా ఉగ్రమైనదే. ఆ రేతస్సును అగ్నిదేవుడు భరించలేక గంగలో విడిచిపెట్టాడు. గంగాదేవి కూడా భరించలేక రెల్లువనంలో విడిచిపెట్టింది. 'ఓం ఉగ్రతేజసే నమః'.


222. మహాతేజాః - అంతటా ప్రకాశించేవాడు, మహాతేజుడు. గొప్ప తేజస్సుతో కూడిన పరంజ్యోతి స్వరూపుడు. 'ఓం మహాతేజసే నమః'.


223. జన్యః - (జననీయః జనయతీతి చ జన్యః) అనగా పుట్టింపదగినవాడు, పుట్టించువాడు, సకలచరాచర ప్రపంచాన్ని పుట్టించువాడు. (జన్యే సాధుః) జన్యమనగా యుద్ధం. యుద్ధమందు నేర్పరి. యుద్ధ స్వరూపం తానే అయినవాడు. 'ఓం జన్యాయ నమః'.


224. విజయకాలవిత్ - విజయ సమయం తెలిసినవాడు. జయాపజయాలు దైవాధీనాలు. దైవము కాలస్వరూపం. కాలం అనుకూలిస్తేనే విజయం చేకూరుతుంది. దానిని క్షుణ్ణంగా ఎరిగినాడు పరమేశ్వరుడు. 'ఓం విజయకాలవిదే నమః'.


225. జ్యోతిషామయనం - (దోతిత ఇతి జ్యోతిః) ప్రకాశిస్తుంది కాబట్టి జ్యోతి. జ్యోతిస్సులనగా స్వయం ప్రకాశములైన నక్షత్రాలు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. నక్షత్రాల దారిని, సూర్యుడి దక్షిణోత్తర దిశల పోకలను ఆయనమంటారు. అవే, ఉత్తరాయణ దక్షిణాయనాలు. ఈ ఉత్తర దక్షిణాయనాలు సూర్యుడికి సంబంధించినవి. ఇక, జ్యోతిషాం అనగా గ్రహ నక్షత్రముల గమనాన్ని వర్ణించు శాస్త్రం. జ్యోతిషామయనము, అతడే కాలవిత్, కాలము కూడా అతడే. కాలస్వరూపుడు. 'ఓం జ్యోతిషామయనాయ నమః'.


226. సిద్ధిః లేక సిద్దః - జయస్వరూపుడు. పంచాంగంలోని ఇరవై ఏడు యోగాలలో పదహారవ యోగం సిద్ది యోగము. పరమేశ్వరుడు ఆ యోగ స్వరూపుడు. ఏదైనా పని నెరవేరుటను సిద్ది అంటారు. కార్యసిద్ధికి పురుషకారము, దైవము, కాలము ప్రేరకాలు. కాబట్టి, కార్యసిద్ధి స్వరూపమైనవాడు పరమశివుడు. 'ఓం సిద్ధయే నమః'.


227. సర్వవిగ్రహః - విగ్రహము అంటే శరీరము, యుద్ధము అనే అర్థాలున్నాయి. సమస్త ప్రాణుల శరీరాలు సర్వ విగ్రహాలు, అంటే కాలాదికములన్నీ శరీరంగా కలవాడు. వాటియందు ఆత్మరూపంలో వెలుగొందువాడు కాబట్టి, సర్వ విగ్రహుడు. 'ఓం సర్వ విగ్రహాయ నమః'.శ్లో||

శిఖీ ముండీ జటీ జ్వాలీ మూర్తిజో ముర్ధగో బలీ ।

వేణవీ పణవీ తాలీ ఖలీ కాల కటంకటః ।। 29 ।।

--వ్యాసభారతం. అను.పర్వం. 17-58.


228. శిఖీ - (శిఖా జ్వాలా అస్య సంతీతి శిఖావాన్) అనగా శిఖలు, జ్వాలలు కలవాడు అగ్ని. అలాగే, (శిరసి ఖేలతీతి శిఖా) అనగా నెమలి తలపై ఉండే చూడము, సిగ అనే అర్థం కూడా ఉంది. చూడము కలది శిఖీ అనగా నెమలి. 'శివుడు అగ్ని స్వరూపుడు, పార్వతి సోముడు. స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా అగ్నిసోముల ప్రకృతి' అని లింగపురాణంలో చెప్పబడింది. కాబట్టి, శివుడు శిఖి. మరొక కథ కూడా ఉంది. ప్రథమ ద్వాపరంలో శివుడు శ్వేతమునిగా అవతరించాడని, భగల పర్వతంపైన నివసించేవాడని, అప్పుడు ఆ ముని శిఖను ధరించాడని, అందువలన కూడా, శివుడు శిఖి అయ్యాడని అంటారు. 'ఓం శిఖినే నమః'.


229. ముండీ – శిఖ లేనివాడు ముండీ అంటే సన్న్యాసి. చతుర్యుగావర్తనంలో ఇరవై ఐదవ ద్వాపరంలో వశిష్ఠుడి పుత్రుడైన శక్తి, వ్యాసుడు. ఆ కలియుగములో శివుడు తన చేతియందు దండాన్ని ధరించి, వెంట్రుకలు లేని బోడితలతో ముండీశ్వరుడిగా అవతరించాడట. అందువలన, అతడు ముండీ అయ్యాడట. 'ఓం ముండినే నమః'


230. జటీ - జటీ అనగా జటలు గలవాడు. శివుడు ఎప్పుడూ జటలను ధరించి వుంటాడు. శివానందలహరిలో 'జటాభారో దారం చలదురగ హారం మృగధరం' అని పరమేశ్వరుడిని వర్ణించారు ఆది శంకరులు. జటాభారోదారం అంటే జటల భారంతో గంభీరమైనవాడని అర్థం. 'ఓం జటినే నమః'


231. జ్వాలీ - (జ్వలతీతి జ్వాలః) జ్వలించునది కావున జ్వాల, అనగా మంట. జ్వాలలు గలవాడు జ్వాలి, అనగా అగ్ని. ఈ అగ్నికి ఏడు జ్వాలలున్నాయి. అవి 1. కాళీ, 2. కరాళీ, 3. మనోజవ, 4. సులోహిత, 5. సుధామ్రవర్ణ, 6. విస్ఫులింగ, 7. విశ్వరూప అనునవి. అగ్ని శివస్వరూపుడే. 'ఓం జ్వాలినే నమః'.


232. మూర్తిజః - (మూర్తౌ జాయతే ఇతి మూర్తిజః) మూర్తి అనగా శరీరం, ప్రతిమ అనే అర్థాలున్నాయి. 'జ' అంటే పుట్టినదని అర్థం. శరీరం నుండి పుట్టినది. జ్ఞానము, శక్తి కలిస్తేనే చైతన్యమంటారు. జ్ఞానము శివుడు, శక్తి పార్వతి. వీరిరువురికి తేడా లేదు. ఈ చైతన్యము శరీరము నుండి వ్యక్తమవుతుంది. కాబట్టి, పరమశివుడు మూర్తిజుడు. 'ఓం మూర్తిజాయ నమః'.


233. మూర్ధగః - (మూర్ధని గచ్ఛతి) మూర్థము అనగా తల. ఈ మూర్థంలో సహస్రార చక్రముంటుంది. ఈ సహస్రార చక్రంలో తిరుగువాడు శివుడు. అందువలన, ఆయన మూర్థగుడు. 'ఓం మూర్థగాయ నమః'.


234. బలీ - బలి అనగా బలము గలవాడు, బలవంతుడు. ఆయన మేరుధన్వి. అనగా మేరుపర్వతాన్నే ధనుస్సుగా ధరించిన బలవంతుడు. సమస్త జీవులలోని బలము పరమశివుడే కదా! పోతనామాత్యుడు రచించిన భాగవతం ప్రహ్లదచరిత్రలో, హిరణ్యకశిపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుడిని పిలిచి, 'నే నందరికంటె బలవంతుడనై అందరినీ జయించాను. నీవెవ్వడి బలమున నిట్లుంటివని' ప్రశ్నించాడు. దానికి ప్రహ్లాదుడు.... 

క|| బలయుతులకు దుర్బలులకు

బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్‌

బలమెవ్వడు ప్రాణులకును

బలమెవ్వండట్టి విభుడు బల మసురేంద్రా!

అని సమాధానమిస్తాడు. అలా, అందరికీ ఆ పరమేశ్వరుడే బలము. 'ఓం బలినే నమః'.


235. వేణవీ - వేణువును అనగా పిల్లనగ్రోవిని ధరించినవాడు, వేణుధారి. శివుడు దారుకా వనంలో మునులను పరీక్షించుటకు దిగంబరుడైన పిచ్చివాడి వేషంలో వచ్చి, వేణువును ధరించాడట. 'ఓం వేణవినే నమః'.


236. పణవీ - పణవము అనగా హుడుక్కమనే ఒక వాద్య విశేషము. ఈ పణవిని ధరించినవాడు పణవీ. 'ఓం పణవినే నమః'.


237. తాలీ - తాలీ అనగా నేల ఉసిరిక (ఇది సర్వ రోగ నివారిణి). శివ అన్నా కూడా ఉసిరి లేక నేల ఉసిరే (ఆరోగ్య రూపమైన శుభాన్ని కలిగిస్తుంది). తాలీశివ అన్నా నేల ఉసిరే (శబ్దరత్నాకరము) శివ నామాన్ని ధరించిన తాలీ. 'ఓం తాలినే నమః'.

 

238. ఖలీ - ఖలమంటే ధాన్యస్థానం, పంటపొలంలో ఏర్పరిచే కళ్లము. అలా కళ్లమునందు ఉండేవాడు ఖలి, ధాన్యస్థానం కలవాడు. 'ఓం ఖలినే నమః'.


239. కాలకటంకటః - (కాలస్యకటంకటతి) యముడికి ఆవరణమైన ఈశ్వరమాయను కూడా ఆవరించునది. కటంకటము అనగా అగ్ని. కాలకటంకటుడు అనగా కాలాగ్ని స్వరూపమైనవాడు, ప్రళయకాలాగ్ని స్వరూపుడు. 'ఓం కాలకటంకటాయ నమః'

  ...అంబాళం పార్థసారథి  

image42