Sri Sharvari Results

Sri Sharvari Panchanga Results - శ్రీ శార్వరి పంచాంగ ఫలాలు

శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః

శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

శుభ గ్రహ


శ్రీ శార్వరి నామ సంవత్సర పంచాంగ పఠనం

గణపతి ప్రార్థన

నవగ్రహా ప్రార్థన

మాతృ, పితృ మరియు గురు వందన

సభాయై నమః


పంచాంగ శ్రవణానికి విచ్చేసిన పూజ్యులు, పెద్దలు జ్ఞానులు, మరియు సమస్త సభకు నా నమస్సుమాంజలులు. ఈ పంచాంగ పఠనము లోక కళ్యానార్థము నిర్దేషించ బడినది. అంతే గాని వ్యక్తిగతముగా గాని, ఏదేని ఒక వర్గమును గాని ఉద్దేశించి చేసింది కాదు. శాస్త్రాన్ని నిష్కర్షగా విడమరచి చెప్పుటకు నేను చేసిన ఈ ప్రయత్నాన్ని మీ అందరు సహృదయంతో ఆదరిస్తారని భావిస్తున్నాను.

చిత్రభాను నామ సం. అనగా 2002 సం మొదలు సహృదయులైన ‘సహృదయ’వారు నిరంతరం నాకు అందించిన ఆదరణ గౌరవము నేను మరవలేను. నేను వారికీ సదా ఋణ పడి ఉంటాను. నేను ఎప్పుడూ సహృదయ లోని ఒక భాగంగా భావిస్తాను. ‘సహృదయ’ తో నా సాంగత్యం అప్పుడే 19 సం. అయ్యింది. కాలం ఎలా గడిచిపోయిందో తెలియడం లేదు.


శ్లో:  కళ్యాణ గుణావహం రిపుహరం దుఃస్వప్న దోషావహం ।

గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్ ।।

ఆయుర్వృద్ధిదమ్ ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం ।

నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతామ్ ।।

శ్రీమత్కామితదాయి కర్మషహరం దుర్దోష శాంతిప్రదం ।

నానా యజ్ఞ విశేషమధ్యఫలదం భూదాన తుల్యం నృణామ్ ।।

ఆరోగ్యాయురభీష్టదం శుచికరం సంతాన సౌఖ్యోదయం ।

పుణ్యం కర్మ సుసాధనం శృతి హితం పంచాంగ మాకర్ణ్యతాం ||


అనగా శోభాయుక్తమైనటువంటిది, కోరికలు తీర్చునది, పాపాలను సంహరించునది, దుర్దోషములను పోగొట్టునది, అనేక యజ్ఞముల వలన పొందిన ఫలాలను ప్రసాదించునది. జనులకు భూదానాది సమానమైన ఫలాలను ప్రసాదించు నది. ఆయుష్షు మరియు ఆరోగ్యమును కలగ చేయునది, సంతాన సౌఖ్యమును మరియు పవిత్ర కర్మలకు యోగ్య ప్రదమగు శాస్త్ర సమ్మతమైన పంచాంగ పఠనమును వినవలెను.

యుగారంభ మైన దినాన్ని చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాది పండగ గా మనము జరుపుకుంటాము. ఇట్టి శుభ దినమున బ్రాహ్మి ముహూర్తమున లేచి కాలకృత్యాదులను తీర్చుకొని, మంగళ స్నానాలను ఆచరించి, నూతన లేదా శుభ్రమైన వస్త్రములను ధరించి; శ్రీమన్మహా గణపతిని, శ్రీ సరస్వతి మరియు లక్ష్మీ దేవిని, మన ఇష్ట మరియు కుల దైవమును ఆరాధించి, దైవజ్ఞులు మరియు గృహము నందు గల పెద్దల ఆశిస్సులు పొంది, పంచాంగాన్ని పూజించి నమస్కరించాలి. పిదప వేప పువ్వు, మామిడి ముక్కలు, కొత్త చింతపండు, బెల్లం మరియు ఆవు నెయ్యితో చేసిన ‘పంచ భద్ర’ అనే ఉగాది పచ్చడిని దైవానికి నివేదించి పిదప బంధు మిత్రులతో కలిసి సేవించాలి.

కాల ప్రమాణం (సంక్షిప్తంగా)


చాతుర్యుగాలు:

సత్య యుగ          17,28,000 సం

త్రేతా యుగ          12,96,000 

ద్వాపర యుగం   8,64,000

కలియుగం            4,32,000


మొత్తం 43,20,000 - ఒక చతుర్యుగం లేదా కల్పం

ఒక మన్వంతరం  71 చతుర్యుగాలు (30,67,20,000)

ఒక మన్వంతర సంధి 17,28,000 (ఒక సత్యయుగ ప్రమాణం)

బ్రహ్మ ౧ దిన 432,00,00,000 (14 మన్వంతరాలు మరియు 15 మన్వంతర సంధులు)


14 మన్వంతరాలు: 1. స్వాయంభువ, 2. స్వారోచిష, 3. ఉత్తమ, 4. తామస, 5. దైవత, 6. చాక్షుష, 7. వైవస్వత, 8. సూర్య సావర్ణి, 9. దక్ష సావర్ణి, 10. బ్రహ్మ సావర్ణి, 11. ధర్మ సావర్ణి, 12. రుద్ర సావర్ణి, 13. దేవ సావర్ణి మరియు 14. ఇన్ద్ర సావర్ణి. ప్రస్తుతము మనము వైవస్వత మన్వంతరం లో కలియుగ ప్రథమ పాదంలో గతాబ్దాః 5120 (అనగా గడచిపోయినవి).


ప్రభవ నుండి అక్షయ వరకు 60 సం. అందులో ఈ రోజు 34 వ సం అయిన శ్రీ శార్వరి నామ సం ప్రారంభం. వచ్చే సంవత్సరం శ్రీ ప్లవ నామ సం.


‘శార్వరి’ అనగా చీకటి, విచారము మరియు దుఃఖము తో కూడినది. క్రూరమైనది, హింసా ప్రవృత్తి గలది, నాశనం చేసే ప్రవృత్తి గలది అని అర్థము.

(శ్రీ వికారి నామ సంవత్సరంలో అనూహ్యమైన అసాధారణమైన ఫలితాలు ఉంటాయని గత సంవత్సరంలో చెప్పబడినది)


శ్రీ శార్వరి నామ సం ఫలం:

శ్లో: శార్వరీవత్సరే సర్వ సస్యవృద్ధి ర్భవేద్భువిః

రాజానోవిలయంయాన్తి పరస్పరజయేచ్ఛయా ।।

శ్రీ శార్వరి నామ సంవత్సరంలో అన్ని విధములైన సస్యములు చక్కగా వృద్ధి చెందును. రాజులు జయేచ్ఛ చే నశించుదురు.

(వికారి నామ సంవత్సరము నందు ప్రజలు పైత్య రోగాదుల వలన వికారవంతులగుదురు. మేఘములు పూర్ణముగా వర్షించును. ఫలము కూడా పూర్ణముగా ఉండును)


బార్హస్పత్యమానేన శ్రీ ప్రమాదీచ నామ సం. ఫలం:

శ్లో: నృపసంక్షోభ మత్యుగ్రం ప్రజాపీడాత్వనర్ఘ దా

తథాచదుఃఖమాప్నోతి ప్రమాదీచతు వత్సరే ।।

ప్రమాదీచ నామ బార్హస్పత్య సంవత్సరంలో గొప్ప రాజక్షోభము, ప్రజాపీడ, తక్కువ వెలలును కలుగును. సమష్టిని దుఃఖం అధికం.

(బార్హస్పత్య శ్రీ పరీధావి సంవత్సరము నందు దేశమంతయూ చక్కని వర్షములు కురియును మరియు బహు సస్య సంపదలతో శుభముగా అందముగా ఉండును. మధ్యమ దేశమున సస్స్య నాశనమును సూచించు చున్నది.)


గురూదయ వశాత్ శ్రీ శ్రావణాబ్ద ఫలమ్:

శ్లో: శ్రావణాబ్దేధరాభాతి త్రిదశస్పర్థి మానవైః

మనసాభీష్టవృష్ట్యర్ఘ సస్య పుష్ప ఫలాదిభిః ।।

శ్రావణాబ్దమున మానవులు దేవతావిరోధము కలిగియుందురు. ఇష్టమగు రీతిలో వృష్టియు, వెలలు, సస్యము, పుష్పములు మరియు ఫలములు లభించును.

(ఆషాఢాబ్దమున సర్వ సస్స్యములు క్రిమి కీటకాదుల వలన పీడింప బడును. అపర సస్స్యము వృద్ధి నొందును.) (అపర సస్స్యము అనగా ప్రధాన పంటలు కానివి, ఇతరములైనవి)


అథ రాజాది నవనాయకా ఫలమ్:


బుధస్య రాజ్యాధిపతిత్వ ఫలం:

వర్షారంభము బుధవారము అగుట వలన రాజు బుధుడు.

సదాగతిస్సాధ్య సకృత్ప్రజానాం నరా స్త్రీయోవా రతి కర్మ హీనాః

దారాధరాశ్చ వ్యవిముక్తదారాః మధ్యాని సస్యాని భవంతి భూమౌ ।।

బుధుడు రాజు అగుట వలన ఊహించని ఉపద్రవాలు వస్తాయి. స్త్రీ పురుషుల మధ్య విరోధము ఏర్పడి సంగమం ఉండదు లేదా రతికి దూరంగా ఉంటారు (ఆలుమగల మధ్య విభేదాలు అధికమౌతాయి. సంతానోత్పత్తికి చెందిన చిక్కులు అధికంగా ఉంటాయి). మేఘాలు కొద్దిపాటి జల్లులతో సరిపెడతాయి. పంట మధ్యమ స్థాయిలో ఉంటుంది. రాజులు లేదా పాలకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకొను అవకాశముంది.

(వర్షారంభము శని వారము అగుట వలన రాజు శని. ఆబ్దాధిపతి శని అగుట వలన ప్రజలకు చోర మరియు అగ్ని భయం, శస్త్ర బాధ అధికమగుట వలన ప్రజలు పీడింప బడతారు. అల్ప సస్స్యము మరియు అల్ప వృష్టి. అనుకున్న విధంగానే ప్రపంచమంతా కూడా అగ్ని బాధ అధికమైంది. అమెజాన్ లాంటి అడవులు కూడా అగ్నికి ఆహుతైనాయి)


చన్ద్రస్య మన్త్రిత్వ ఫలం:

మేష సంక్రమణం సోమ వారము అగుట వలన మన్త్రి చన్ద్రుడు:

సువృష్టి సర్వ సస్స్యాని ఫలితానిభవన్తిచ

క్షేమారోగ్యం సుభిక్షంస్యా చ్ఛశాంకేసచివే సతి ।।

చన్ద్రుడు మంత్రి పదవిలో ఉన్నపుడు ‘సువృష్టి’ వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. ‘సర్వ సస్స్యాని ఫలితానిభవన్తిచ’ సర్వ సస్యములు చక్కగా ఫలిస్తాయి. అనగా పంటలు చక్కగా పండుతాయి. ‘క్షేమారోగ్యం’ ప్రజలు క్షేమం గాను మరియు ఆరోగ్యంగాను ఉంటారు. ‘సుభిక్షం’ దేశం సుభిక్షంగా ఉంటుంది.

(సూర్యుడు మన్త్రి పదవిలో ఉన్నపుడు పాలకుల మధ్య అన్యోన్య వైరం అధికంగా ఉంటుంది. తత్ప్రభావము వలన రాష్ట్రాల మధ్య దేశాల మధ్య వైరం మరియు యుద్ధ వాతావరణం అధికంగా ఉంటుంది. నిరంతర అనావృష్టి, వర్షాభావ పరిస్థితి వలన కరువు భయం అధికం. ప్రజలు అధర్మ నిరతులై ఉంటారు. ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు)


చన్ద్రస్య సేనాధిపతిత్వ ఫలం:

సింహ సంక్రమణం ఇందు వారమగుట వలన సేనాధిపతి చన్ద్రుడు:

అతివర్షం అతీవివార్ఘం అరోగాస్సుఖినో జనాః

బహుక్షీర ప్రదాగాన శ్చన్ద్రే సేనాధిపే సతి ।।

చన్ద్రుడు సేనాధిపతి గా ఉన్నపుడు – ‘’అతివర్షం’ వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ‘అతీవివార్ఘం’ వస్తువుల ధరలు అధికంగా ఉంటాయి లేదా ధరలు బాగా పెరుగుతాయి. ‘అరోగా’ ప్రజలు ఏవిధమైన రోగాలు లేకుండా ‘సుఖినో’ సుఖంగా ఉంటారు. ‘బహుక్షీర ప్రదాగాన’ గోవులు ఆరోగ్యంగా ఉండి క్షీరాన్ని పుష్కలంగా ప్రసాదిస్తాయి. చన్ద్రుడు సేనాధిపతి అగుట వలన రాజుల మధ్య మరియు దేశాల మధ్య పరస్పర యుద్ధ వాతావరణం లేదా ఘర్షణలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

(సేనాధిపతి సూర్యుడు అగుట వలన పాలకుల మధ్య కలహాలు అధికంగా ఉంటాయి. యుద్ధాలు సంభవిస్తాయి. మేఘాలు వాయు ప్రభావం వలన చెదరగొట్ట బడతాయి. వర్షం తక్కువగా కురుస్తుంది. రక్త వర్ణంలో (ఎరుపు) గల ధాన్యం పుష్కలంగా పండుతుంది)


గురోః సస్స్యాధి పతిత్వ ఫలం:

కర్కాటక సంక్రమణం గురువారము నాడు అగుట వలన సస్స్యాధిపతి బృహస్పతి.

యవగోధూమచణకాః ఫలితాశ్చ భవన్తి హి

పీతధాత్రీచ ఫలితా జీవో సస్స్యాధిపే సతి ।।

గురుడు సస్స్యాధిపతి అయినపుడు – ‘యవగోధూమచణకాః’ యవలు (అనగా బార్లీ), గోధుమలు మరియు చణక ధాన్యం (శనగలు, అవిసెలు మరియు బఠాణి ఇత్యాది) చక్కగా ఫలిస్తాయి. ‘పీతధాత్రీచ ఫలితా’ పచ్చని నెలలు బాగా సారవంతములై పుష్కలంగా పండుతాయి.

(బుధుడు సస్స్యాధిపతి అయినపుడు మధ్యమ స్థాయిలో ఉండే వర్షాలు కురుస్తాయి. పంటలు నామ మాత్రంగానే పండుతాయి. మేఘాలు వాయువు యొక్క అధీనంలో ఉంటాయి. అనగా వేగంగా వీచే వాయువు వలన మేఘాలు చెల్లాచెదరై పోతాయి. వర్షాభావ పరిస్థితి నెలకునే అవకాశం ఉంది. మనుజులు ఎల్లవేళలా ఎదో ఒక భయంతో కాలం గడుపుతారు)


బుధస్య ధాన్యాధిపతిత్వ ఫలం:

ధనుస్సంక్రమణం బుధవారం అగుట వలన ధాన్యాధిపతి బుధుడు.

మధ్యవృష్టిర్మందసస్యం మేఘావాతేన పీడితాః

త్రసస్సర్వ నృపాణాం చ సౌమ్యేధాన్యాధిపే సతి ।।

బుధుడు ధాన్యాధిపతి అయిన నాడు - ‘మధ్యవృష్టిర్మందసస్యం’ వర్షాలు మాధ్యమంగా కురుస్తాయి, పంటలు కూడా మధ్యమంగా ఉంటాయి లేదా స్వల్పంగా ఉంటాయి. ‘మేఘావాతేన పీడితాః’ మేఘాలు వాయు పీడనం ద్వారా చెదరగొట్ట బడతాయి, ‘త్రసస్సర్వ నృపాణాం’ పాలకులందరూ కూడాను శతృ భీతితో కాలం గడుపుతారు.

(గోవులు ఏ విధమైన వ్యాధులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లుతాయి. పాలను సమృద్ధిగా ఇస్తాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. జల వనరులు పుష్కలంగా ఉంటాయి)


ఇన్దోరర్ఘాధి పతిత్వ ఫలమ్:

మిథున సంక్రమణం ఇందువారం అగుట వలన అర్ఘాధిపతి చన్ద్రుడు:

సువృష్టి స్సర్వసస్యానా మభివృద్ధిశ్చ జాయతే

మహతీ చార్ఘవృద్ధిస్స్యా ఇన్దోరర్ఘాధిపే సతి ।।

చన్ద్రుడు అర్ఘాధిపతి అయిన నాడు – ‘సువృష్టి’ వర్షాలు చక్కగా కురుస్తాయి. ‘స్సర్వసస్యానా మభివృద్ధిశ్చ జాయతే’ సర్వ సస్స్యములు అనగా పంటలు చక్కగా వృద్ధి చెందుతాయి. పంటలు చక్కగా పండుతాయి. పుష్కలమైన వానలు కురుస్తాయి. ‘మహతీ చార్ఘవృద్ధిస్స్యా’ ప్రజలు అన్ని విధాలైన అభివృద్ధిని సాధిస్తారు మరియు వస్తువులకు ధరలు చక్కగా ఉంటాయి.

(తిల మాష ధాన్యము అనగా నువ్వులు, మినుములు మరియు ఉలవలు ఇత్యాది కృష్ణ ధాన్యము విరివిగా పండును. నల్లరేగడి భూములు సారవంతంగా ఉండి మంచి పంటలను ఇస్తాయి)


ఇన్దోర్మేఘాధి పతిత్వ ఫలమ్:

సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశము సోమవారం నాడు అగుట వలన మేఘాధిపతి చన్ద్రుడు.

సువృష్టిస్సర్వదేశానాం ఫలితా ధాన్య జాతయః

బహుక్షీర ప్రదాగావః ఇన్దోర్మేఘాధిపే సతి ।।

చన్ద్రుడు మేఘాధిపతి అగుట వలన – ‘సువృష్టిస్సర్వదేశానాం’ అన్ని ప్రాంతాలలో వర్షాలు చక్కగా కురుస్తాయి. ‘ఫలితా ధాన్య జాతయః’ అన్ని రకాలైన ధాన్యాలు చక్కగా పండుతాయి. ‘బహుక్షీర ప్రదాగావః’ ఆవులు చక్కగా పాలిస్తాయి. పాలు సమృద్ధిగా లభిస్తాయి.

(సస్స్యములు మధ్యమముగా పండుతాయి. వస్తువుల ధరలు లేనివి ఔతాయి అనగా ధరలు తగ్గుతాయి. ఖండ వృష్టి ఉంటుంది. అనగా అప్పుడప్పుడు, అక్కడక్కడా వర్షం కురుస్తుంది. నీలధాన్యం అనగా నల్లని ధాన్యం సమృద్ధిగా పండుతుంది)


శనేః రసాధి పతిత్వ ఫలమ్:

తులా సంక్రమణము శని వారము అగుట వలన రసాధిపతి శని.

ఘృత తైల గుడ క్షౌద్రాః యేచాన్యో రసజాతయః

శూన్యార్ఘం యాన్తి తే సర్వే మందౌ యది రసాధిపే ।।

ఘృత తైల గుడ క్షౌద్రాః యేచాన్యో రసజాతయః’ నెయ్యి నూనె బెల్లం మరియు తేనే ఇత్యాది రసజాతి వస్తువులు, ‘శూన్యార్ఘం యాన్తి తే సర్వే’ సర్వము ధరలను కోల్పోతాయి. అతి తక్కువ ధరలకు లభిస్తాయి. అనగా ఈ సంవత్సరంలో నూనెల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు పెట్రోలియం ఉత్పత్తులు (పెట్రోల్ డీజిల్ ఇత్యాదివి) కూడా తక్కువ ధరలకు లభిస్తాయి.

(ఉప్పు, కారము ఇత్యాది క్షార సంబంధిత వస్తువులు, భూగర్భం లో పెరిగే దుంప జాతులు మరియు ఫల జాతులు సమృద్ధిగా లభిస్తాయి. నెయ్యి, నూనె, బెల్లం, పంచదార ఇత్యాది రస జాతి వస్తువులు అధికంగా ఉత్పత్తి అవుతాయి. మరియు ఇట్టి వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి)


గురోర్నీరసాధిపతిత్వ ఫలం:

మకర సంక్రమణము గురు వారమగుట వలన నీరసాధిపతి గురుడు.

పూగీఫలస్యఖిలరత్న సువర్ణ ధాన్య కార్పాస చర్మకుసుమాని చ చందనం చ ।

వృద్ధిం యయుర్ద్విజగణా స్సుఖినో భవన్తి భూయోచ నీరసపతౌ సురరాజ పూజ్యే ।।

గురు భగవానుడు నీరసాధిపతి అగుట వలన – ‘పూగీఫలస్యఖిలరత్న’పోక చెక్కలు మరియు నవరత్నములు, ‘సువర్ణ ధాన్య’ బంగారము మరియు అన్ని విధములైన ధాన్యాలు, ‘కార్పాస చర్మకుసుమాని చ’ పట్టు చర్మముతో చేయబడిన వస్త్రములు, ‘చందనం’ చందనము, ‘వృద్ధిం’ చక్కగా వృద్ధి చెందును. అనగా విరివిగా లభించును. ‘యయుర్ద్విజగణా స్సుఖినో భవన్తి’ ద్విజులేల్లరూ కూడా సుఖముగా నుందురు.

(గరుడ పచ్చ మణులు (పచ్చ మరకతం ఇత్యాది రత్నాలు), బంగారం అధికంగా లభిస్తాయి. వివిధ రకములైన ధాన్యాలు అన్ని కూడా చక్కగా పండి అన్ని విధాలా జనులకు సమృద్ధిని కలిగిస్తాయి)


సావన వర్షాధిపతి ఫలమ్:

రెండు సూర్యోదయాలకు మధ్య గల దినమును సావన దినమని అంటారు. ఇట్టి రోజులు 360 అయినచో ఒక సావన సంవత్సరము. ఈ ప్రకారము సృష్ట్యాది నుండి లెక్కించగా శ్రీ వికారి నామ సం ఆషాఢ శుక్ల పంచమి, ఆదివారం, 07.07.2019 తేది నాడు సావన వర్షారంభము:

సావన వర్షాధిపతేః రవేః ఫలమ్:

వర్షాధిపతౌ ఖానావాతాంక నృపాగ్ని శస్త్రభీతిస్స్యాత్ ।

వృష్టిస్వల్ప తరావై మద్యాని భవన్తి సస్స్యజాతాని ।।

సావన వర్షాధిపతి సూర్యుడు అగుట వలన రాజులచేత భయం అధికంగా ఉంటుంది. అగ్ని, శస్త్ర మరియు పలు విధములైన వ్యాధుల వలన భయం అధికంగా ఉంటుంది. స్వల్ప వర్షము మరియు మధ్యమ పంట కలిగే అవకాశముంది.

(సర్వ సస్స్యములకు అనుకూలమైన వర్షములు, సుభిక్షముగా ఉండును. బ్రాహ్మణులకు సుభిక్షంగా ఉండును)


పశుపాలకాది నిర్ణయం:

అస్మిన్నబ్దే బలరామః పశుపాలకః । గోష్ఠ ప్రాపకో యమః – గోష్ట బహిష్కర్తా చ యమః ।

ఈ సంవత్సరము నందు పశుపాలకుడు బలరాముడు, పశువులను దొడ్డి పెట్టువాడు మరియు దొడ్డి విడిపించు వాడు యముడు.


పశుపాలకస్య  బలరామస్య ఫలం:

సువృష్టి సర్వసస్స్యానాం సర్వ సస్స్య సమృద్ధయః ।

మధ్య దేశే మహద్వర్షం రామేతు పశునాయకే ।।

సర్వ సస్స్యములకు అనుకూలంగా ఉండే విధంగా వర్షాలు చక్కగా కురుస్తాయి. సర్వ సస్స్యములు సమృద్ధిగా పండుతాయి. మధ్య దేశము నందు వర్షం అధికంగా కురుస్తుంది.


గోష్ఠ ప్రాపకస్య – గోష్ట బహిష్కర్తుశ్చ శ్రీ యమస్య ఫలమ్

అనర్ఘశ్చాల్పవృష్టిశ్చ స్వల్ప క్షీరం గవాం తథా ।

పశుపీడాభవన్నిత్యం యమేతు పశునాయకే ।।

ధరలు అధికంగా ఉంటాయి. వర్షము స్వల్పంగా కురుస్తుంది. పశువులు సామాన్యంగా పాలనిస్తాయి. పశుపీడ అధికంగా ఉంటుంది.


ఆఢకాది నిర్ణయః – ఫలమ్

అస్మిన్నబ్దే ‘త్ర్యాఢక’ - పరిమితం వర్షం ।

ఈ సంవత్సరంలో మూడు కుంచములు వర్షము. ఫలం – పరిమిత వర్షం

ఆఢకస్య ప్రమాణన్తు – 

షష్టి యోజన విస్తీర్ణం శతాయోజనమున్నతం ।

ఆఢకస్య ప్రమాణన్తు దేవమానేన గణ్యతే ।।

దేవతల యొక్క కుంచము 60 యోజనాల విస్తీర్ణం మరియు 100 యోజనాల ఎత్తును కలిగి ఉండును.

సప్తభాగాస్సముద్రేషు పర్వతేషు తథాదశ ।

చతుర్భాగా ధరణ్యంస్యుర్ ఏవం వర్షతి చత్రిధా ।।

ఒక కుంచము వర్షము నందు –  7 భాగాలు సముద్రముల యందును, 10 భాగములు పర్వతముల యందును, 4 భాగాలు భూమి యందును వర్షించును.

వత్సరాది నుండి పుష్య శు నవమి 22.01.2021 వరకు బాలుడైన గోప హస్తమందు నాటి నుండి వత్సరాంతం వరకు యువకుడైన గోప హస్తమున కుంచముండును.

ఆఢక రీత్యా ఈ సంవత్సరంలో వర్షాలు మధ్యమంగా కురుస్తాయి.


మేఘాధి నిర్ణయం – ఫలం

‘సంవర్త’ నామకో మేఘః – సంవర్తే వాయుపీడనం  వాయుపీడనం అధికంగా ఉంటుంది – వాయుపీడనం వలన మేఘాలు చెదరగొట్ట బడతాయి.

మేరు పర్వతస్య ఉత్తరదిశి మేఘోత్పత్తిః  – మేరు పర్వత ఉత్తర దిక్కులో మేఘోత్పత్తి ఉంటుంది – సువృష్టి

చతుర్మేఘ పక్షే సంవర్త నామకో మేఘః – సంవర్తేచోత్తరా వృష్టిః – వెనుకటి వానలు అధికం (మామూలుకంటే కూడా భిన్నమైన దిశలో వర్షాలు కురుస్తాయి)

వాయు నామకో వాయుః – వాయో వృష్టి వినాశస్స్యాత్ – వాయువు ద్వారా మేఘాలు చెదిరిపోయి వర్షం నశిస్తుంది.

సౌదామిని నామ్నీ విద్యుత్ (మెరుపులు) – సౌదామిన్యాం సువృష్టిదా – సౌదామిని విద్యుత్ వలన సువృష్టి ఉంటుంది.

స్ఖలిత నామకం గర్జితం (ఉరుములు) – స్ఖలితే వృష్టిరుత్తమా - సువృష్టి

క్షీర నామక స్సముద్రః – క్షీరే చాల్పతరాభవేత్ – అల్ప వృష్టికరము

అనన్త నామకశ్శేశో భూమిం వహతి – అనంత వస్తు సంపూర్ణం – భూమి స్థిరంగా అన్ని రకములైన పాడిపంటల తో సువృష్టి కరంగా ఉంటుంది.


మేష సంక్రమణ ఫలం:

చైత్ర బ షష్టి (తత్కాల సప్తమి) ఇందు వాసరే 13.04.2020, సూర్యోదయాది ఘటికాః ౪౧:౨౪, రా గం 22:35 ని. లకు, వృశ్చిక లగ్నే, మూల నక్షత్ర చతుర్థ చరణే, పరిఘ నామ యోగః, విష్టి కరణే, భానోర్మేశ రాశి ప్రవేశః.

దివాచేన్మేష సంక్రాంతి రనర్ఘ కలహప్రదా

రాత్రౌ సస్స్యాభివృద్ధి స్స్యాత్ క్షేమశ్రీ సుభిక్షకృత్ ।।

పగలు మేష సంక్రాంతి వలన కలహములు అధికం, రాత్రి యందు సస్స్య వృద్ధి, క్షేమము, ఆరోగ్యము, సుభిక్షము కల్గును. ఈ సంవత్సరం రాత్రి పూట మేష సంక్రమణం అగుట వలన - సస్స్య వృద్ధి, క్షేమము, ఆరోగ్యము, సుభిక్షము కల్గును.


ఆర్ద్ర ప్రవేశ కాల ఫలమ్:

దివార్ద్రా సస్య నాశాయ రాత్రౌ సస్స్యాభివృద్ధయే ।

అస్తమా నేర్థ రాత్రౌ చే న్మహదర్ఘం సువృష్టికృత్ ।।

ఉదయాది ద్వికాలము లందు ఆర్ద్ర కార్తె ప్రవేశించిన ఎడల సస్స్య నాశనము కలుగును, రాత్రి యందు అయిన ఎడల సస్స్యాభివృద్ధి ఉంటుంది. సాయంత్రము మరియు రాత్రి సమయమున ప్రవేశించిన ఎడల సువృష్టి మరియు ధాన్యానికి ధరలు అధికంగా ఉంటాయి.

అస్మిన్ వర్షే ఆషాఢ శుక్ల ప్రతిపద, ఇందువాసరే, హూణ శకే 22.06.2020, కర్కాటక లగ్నే, సూర్యోదయాది ఘటికాః ౦౫:౦౮, సమయే గం 07:43 ని. భానోరార్ద్ర ప్రవేశః

శుద్ధ ప్రతిపద – శుభం, సోమవారము – సుభిక్షం, ఆర్ద్ర నక్షత్రము – అనావృష్టి మరియు వెలలు తగ్గుట, వృద్ధి యో – అభివృద్ధి, బవ క – సౌఖ్యం, కర్కాటక లగ్నము – సస్స్య వృద్ధి, రాత్రి ఆర్ద్ర ప్రవేశము – సస్స్య నాశనము, భరణ్యాది చన్ద్ర మండల ఫలం – అతివృష్టి


అథ ప్రత్యబ్ద యోగ పంచక ఫలం:


౧. జ్యేష్ఠ శు ప్రతిపద వార ఫలం – శని వారము

జలశోషం ప్రజానాశం ఛత్రభంగో మహీపతేః ।

మధ్య సస్స్యమనర్ఘం జ్యేష్ఠాదౌః నివాసరే ।।

భూగర్భ జలాలు తగ్గుతాయి, భూమిపై నీళ్ళు కూడా తగ్గుతాయి (అనగా వర్షాభావ పరిస్థితి వలన భూగర్భ జలాలు, కుంటలు మరియు చెరువులు ఎండి పోవుట). ప్రజానష్టం సంభవిస్తుంది. ‘ఛత్రభంగో మహీపతేః’ అనగా రాజులు తమ రాజ్యాధికారాన్ని కోల్పోవుట. పంటలు మధ్యమంగా ఉంటాయి. ధరలు సామాన్యంగా ఉంటాయి.

(దుర్భిక్షం, యుద్ధం, రోగ భయం, రాజులకు పరస్పర విరోధములను కలిగి ఉంటారు)


౨. ఆషాఢ శు పంచమి యుక్త వర ఫలం – భానువారము

ఆషాఢ సిత పంచమ్యాం భృగువారో యదాభవేత్ ।

సుభిక్షం క్షేమామారోగ్యం సువృషిశ్చ భవేద్ధ్రువమ్ ।।

ఆషాఢ శుద్ధ పంచమి యుక్త భృగు వారమగుట వలన లోకం సుభిక్షం గాను, ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమం గాను ఉంటారు. చక్కగా వర్షాలు కురుస్తాయి.


౩. స్వాతి నక్షత్ర యుక్త ఆషాఢ శు దశమి ఫలం:

ఆషాఢే శుక్ల పక్షేతు దశమీ యది సంయుతా ।

స్వాతీ యుక్తే నచన్ద్రేణ మహావర్షం భవేద్ధృవమ్ ।।

ఆషాఢ మాసంలో శుక్ల పక్షమి లోని దశమి తిథి స్వాతి నక్షత్రముతో కలిసి వచ్చి నందు వలన యుండుట వలన అతివృష్టి కలుగును.


౪. ఆషాఢ బహుళ ద్వాదశి యుక్త రోహిణి నక్షత్ర ఫలం:

ద్వాదశీ రోహిణీ యుక్తాస సర్వసస్స్య వినాశనమ్ ।।

ఆషాఢ బహుళ ద్వాదశి నాడు రోహిణి నక్షత్రము అగుట వలన సర్వ సస్స్య వినాశనము.


౫. పౌష్య బహుళ అమావాస్య ప్రయుక్త వార ఫలం:

గురువారమైనందున – సౌఖ్యం


వాస్తు కర్తరీ నిర్ణయము

04.05.2020 to 10.05.2020 - డొల్లు కర్తరి 

11.05.2020 to 29.05.2020 - నిజ కర్తరి

వాస్తు కర్తరి యందు మట్టి, శిల, కర్ర పనులు నిషేధము. నూతన గృహములు నిర్మించరాదు. వృక్షములు నరుకుట, బండలు కొట్టుట చేయరాదు. నూతన గృహ ప్రవేశము చేసుకొనవచ్చును.


కుజ చార ఫలము

హస్త నక్షత్రములో 22.10.2019 న తూర్పున ఉదయించి 16 నక్షత్రమైన అశ్విని నక్షత్రములో భాద్రపద బ సప్తమి బుధవారమున వక్రించుటచే రక్తముఖుడనే పేరుతో పిలువబడును.

ఫలం – దేశం సుభిక్షంగా ఉన్నా కూడాను ప్రజలు పలు వ్యాధుల వలన, శతృ బాధలచే ఇబ్బందులు పడుదురు.


గురు చార ఫలము:

ఈ సంవత్సరంలో బృహస్పతి ధనుస్సు మకర కుంభ రాశులందు సంచరించును. ఇట్టి ప్రభావము వలన ప్రజలకు ఈతి బాధలు మరియు విద్రోహ చర్యలు అధికంగా ఉంటాయి. దేశ మరియు ప్రపంచ ఆర్థికాభివృద్ధి కుంటు బడుతుంది. ఆర్థిక మందగమనము కొనసాగుతుంది.

సంవత్సరాది నుండి 29.03.2020 వరకు – ధనుస్సు

30.03.2020 నుండి 29.06.2020 వరకు – మకరం

30.06.2020 నుండి 20.11.2020 వరకు – ధనుస్సు

21.11.2020 నుండి 05.04.2021 వరకు – మకరం

05.04.2021 నుండి వత్సరాంతం వరకు – కుంభం


గురోః ధనుర్ రాశి సంచార ఫలమ్:

వీతరోగభయా స్సర్వే చావస్థే దేవపూజితే ।

హృదయానందినీధాత్రీ ఫలశాలీ సువృష్టిభిః ।।

బృహస్పతి ధనుస్సు రాశి యందు సంచరించుట వలన వర్షాలు చక్కగా కురుస్తాయి. పంటలు చక్కగా పండుతాయి. ప్రజలు దేవతా పూజలు నిర్వహించు వారు మరియు రోగ భయము లేని వారగుదురు.

ధనుస్సు రాశి యందు గురు సంచారము మిశ్రమ ఫలాలను ప్రసాదిస్తుంది. ధనుస్సు రాశి యందు బృహస్పతి కేతువు తో కలిసి ఉండుట మరియు రాహువుకు సమసప్తక మగుట వలన దేశ ఆర్థికాభివృద్ధి మందగించే అవకాశం ఉంది. ఆర్ధిక సంస్థల అభివృద్ధి కుంటు బట్టే అవకాశం ఉంది. ఆర్థిక మోసాలు పెరుగుతాయి. పెట్టుబడులందు లాభాలు అనుకున్నంతగా ఉండదు. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలకు ఆర్ధిక వనరుల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ ల అభివృద్ధి నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్ధిక రంగ సంస్థలకు చిక్కులు అధికమగుట. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. దేశ మరియు ప్రపంచ ఆర్ధిక పరిస్థితులందు అనూహ్యమైన మార్పులు వస్తాయి. ఇట్టి మార్పులు అసాధారణము కూడా కావచ్చును. గురు భ నుండి ద్వితీయ స్థానమున శని భ వలన ఆర్థికాభివృద్ధి సంపూర్ణంగా కుంటుబట్టు అవకాశం ఉంది. ఆర్ధిక మందగమనం కొనసాగుతుంది.


గురోః మకర రాశి ఫలమ్:

అశత్రవో జనా ధాత్రీ పూర్ణసస్యా సువృష్టిభిః ।

వీతరోగభయాస్సర్వే మకరస్థే సురార్చితే ।।

గురు భగవానుడు మకర రాశిలో సంచరించుట వలన సమస్త జనులు శతృ రహితులై ఉంటారు. చక్కని వర్షాలు కురుస్తాయి మరియు పంటలు చక్కగా పండుతాయి. ఎల్లరూ రోగభీతి లేనివారగుదురు.

ఇట్టి ఫలము గురు భగవానుడు ఒక్కడే మకర రాశిలో సంచరించిన ఎడల ఊహించే అవకాశం ఉంది. కాని మకర రాశి యందు గురు భ శని భ తో కలిసి సంచరించుట వలన ఆయన ఇచ్చే శుభ ఫలితాలు చాలా మట్టుకు తగ్గే అవకాశం ఉంది. దేశ మరియు ప్రపంచ ఆర్ధిక పురోగతి కుంటుబడుతుంది. అన్ని విధములైన వ్యాపార సంస్థల (ప్రైవేటు మరియు ప్రభుత్వ) అభివృద్ధి క్షీణిస్తుంది. నిరుద్యోగ సమస్య అధికమౌతుంది. ప్రజలకు రోగ భయం అధికమౌతుంది. బంగారం మరియు వెండి ధరలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాలందు పెట్టుబడులు నిలచిపోవుట. ఊహించినంతగా లాభాలు లేకపోవుట ఇత్యాది ప్రతికూల ఫలాలు. ఈ సంవత్సరంలో స్పెక్యులేటివ్ వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.


శని సంచార ఫలము:

ఈ సంవత్సరము ఆబ్దాది నుండి మొదలు వత్సరాంతం వరకు అనగా 12.04.2021 వరకు శని మకర రాశి యందు సంచరించును.

మకర మందు శని సంచార ఫలం:

వక్రస్థితే భానుసుతేచ భీతిః స్యాదర వృద్ధిర్మహతీచ వృష్టిః ।

దశార్ణ దేశ్యా యవనాశ్చ నష్టా పురోహితా విప్ర భిషజ్నృపాలాః ।।

మకర రాశి యందు భానుసుతుడైన శని సంచారము భయమును ప్రసాదించును. ధరలు అధికంగా ఉంటాయి. వర్షాలు అధికంగా కురుస్తాయి. దశార్ణ (మధ్య భారత దేశములో ఒక భాగము, ప్రస్తుత మధ్య ప్రదేశ్ లో ఒక భాగము) మరియు యవన (గ్రీకు) దేశ ప్రజలకు పీడా అధికంగా ఉంటుంది. నష్టము అధికంగా సంభవిస్తుంది. మరియు పురోహితులు, వైద్యులు మరియు నృపాలులకు అనగా రాజులకు కొంతవరకు నష్టం చేకూరుతుంది.

అధిక శాతం మిశ్రమ ఫలాలు అందు సూచనలు. ఆర్థికాభివృద్ధి మాత్రం మందగించు సూచనలున్నాయి. అధిక శ్రమతో కూడిన ఫలాలు. ప్రధానంగా మధ్య తరగతి వారికి చిక్కులు అధికంగా ఉంటాయి. స్తబ్దత అధికంగా ఉంటుంది.


మకర సంక్రాంతి పురుష లక్షణం:

ఏతద్వత్సరే పుష్య శు పాడ్యమి (తత్కాల విదియ) తిథౌ తేది: 14.01.2021 గురువాసరే శ్రవణా నక్షత్రే, వజ్ర నామ యోగే,బాలవ కరణే, వృషభ లగ్నే సూర్యోదయాది ఘటికాః ౧౭-౫౭ విఘటికాః ప గం 02-01 ని భానోర్మకర రాశి ప్రవేశో భవతి.


త్రిశిరం ద్విముఖం చైవ చతుర్వక్త్రం త్రినేత్రకం ।

లంబకర్ణం రక్తదంతం లంబ భ్రూ దీర్ఘనాసికమ్ ।

అష్టబాహుం ద్విపాదంచ వికృతం కృష్ణ వర్ణకం ।

శతయోజన మౌన్నత్యం విస్తీర్ణం ద్వాదశస్మృతమ్ ।

ఏవం రూపం సవిజ్ఞేయం సంక్రాన్తేః పురుష లక్షణమ్ ।।

మూడు శిరస్సులు, రెండు ముఖాలు, నాలుగు నాలుకలు, మూడు కళ్ళు, పెద్దగా మరియు పొడవుగా ఉండు చెవులు, ఎరుపు రంగు దంతాలు గల వాడు, పెద్దవైన కనుబొమలు గల వాడు, పొడవైన ముక్కు గల వాడు, ఎనిమిది బాహువులు కలిగి యున్న వాడు, రెండు పాదాలు గల వాడు, వికృతమైన నలుపు వర్ణంలో గల వాడు, వంద యోజనాల ఎత్తు మరియు విస్తీర్ణం కలిగి యుండి ద్వాదశ నామాలతో పిలువబడు బడే సంక్రాంతి పురుషుడు చూడడానికి అత్యంత వికృతంగా ఉంటాడు.


ఆయన నామధేయం: ‘మంద’ – ఫలం - విప్రులకు నాశనం

నిమ్బోదక (వేప వేసిన జలం) స్నానం – మహా రోగం

తిథి (విదియ) ఫలం: సుభిక్షం

శుక్ల పక్షం: దుర్భిక్షం, క్షేమం

నక్షత్ర (శ్రవణ): క్షేమము, యోగము

వార (గురువారము): సువృష్టి, ఆరోగ్యము

కాల (అపరాహ్ణ): శూద్ర నాశనం

లగ్న (వృషభం): సుఖ దుఃఖములు సమానము

రక్త్ర వస్త్ర ధారణా: రోగదాయకం

చందన గంధ లేపనం: విప్ర నాశనం

జాజి పుష్ప ధారణం: సుశోభనం

మౌక్తిక భూషణ: శుభదాయకం

రజిత పాత్ర భోజనం: సుభిక్షం

పాయన పానం: పశునాశనం

కదళీ ఫల (అరటి పండు) భక్షణం: ఫల నాశనం

భిండి (బెండకాయ) ఫలం: వ్యాధి భయం

రక్త ఛత్ర ధారణ: మహా యుద్ధ దాయకం

వ్యాఘ్ర వాహన: అరణ్య మృగ నాశనం

క్రోధ ముఖం: ప్రజా నాశకరము

తిష్టాసన: మధ్యర్ఘం (ధరలు మధ్యమంగా ఉంటాయి)

దక్షిణ దిగ్యాన: దక్షిణ ప్రాంతాలకు క్షామం

దశమ ముహూర్త: శుభప్రదం


శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మౌడ్య నిర్ణయము:


శుక్ర మౌఢ్యమి:

29.05.2020, శ్రీ శార్వరి నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ సప్తమి 05:06 మొదలు 09.06.2020 జ్యేష్ఠ బహుళ చతుర్థి 17:34 వరకు.

14.02.2021, మాఘ శుద్ధ తృతీయ 01:39 మొదలు 04.05.2021, శ్రీ ప్లవ నామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి 06:10 వరకు 


గురు మౌఢ్యమి:

15.01.2021, శ్రీ శార్వరి నామ సంవత్సర పౌష్య శుక్ల విదియ 05:10 మొదలు 17.02.2021, మాఘ శుద్ధ షష్టి 11:10 వరకు


పుష్కర నిర్ణయము:

అస్మిన్ వర్షే కార్తీక శుద్ధ షష్టి శుక్రవారం, 20.11.2020 నాడు ఉ 11-08 ని బృహస్పతి మకర రాశి యందు ప్రవేశం. 20.11.2020 మొదలు 01.12.2020 వరకు ‘తుంగభద్రా’నదికి పుష్కరాలు. ఇట్టి పుణ్య దినములందు తుంగభద్రా నదీ స్నానాలు, పిండ ప్రధానము, దాన ధర్మాదులు నిర్వహించినచో పితృ దేవతలు తరించెదరు.


గ్రహణ నిర్ణయము:


చూడామణి నామక రాహుగ్రస్త ఖండగ్రాస సూర్య గ్రహణము:

అస్మిన్ వర్షే జ్యేష్ఠ బ అమావాస్య భాను వాసరే 21.06.2020 మృగశిర నక్షత్రే, సింహ లగ్నే, మిథున రాశ్యాం సూర్యోదయాది ఘటికా ౧౧-౩౭ వి, సమయే ఉదయం 10-18 ని. చూడామణి నామక రాహుగ్రస్త ఖండగ్రాస సూర్య గ్రహణం:

గ్రహణ స్పర్శ ఉ 10-18

మధ్య ప 12-00

మోక్షం   ప 13-48

ఆద్యన్త పుణ్యకాలం గం 03-30 ని


గ్రహణ శాంతి:

ఈ గ్రహణము మృగశిర నక్షత్ర జాతకులకు, వృషభ, మిథున మరియు వృశ్చిక రాశి వారికి ప్రతికూలము. వీరు గ్రహణ శాంతి చేసుకోవాలి.


గ్రహణ దానము:

రాగి పాత్రలో ఆవుపాలు పోసి వెండితో చేసిన సూర్య, చంద్ర మరియు సర్ప బింబాలను అందులో వేసి సంకల్ప యుక్తముగా దానం చేయునది.


గ్రహణ సంకల్పం:

‘మమ జన్మరాశి, జన్మ నక్షత్ర,అరిష్ట స్థాన స్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక,ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభ ఫలప్రాప్యార్థం బింబ దానం కరిష్యే’

గ్రస్యమానే భవేత్స్నానం, గ్రస్తే హోమార్కచంద్ర కే ।


మండలేముచ్యమానేతు దానం ముక్తౌతు మజ్జనమ్ ।।

గ్రహణము పట్టు సమయమున స్నానము, గ్రహము పూర్ణముగా పట్టిన పిదప జప హోమాదులును, విడుపున దానమును, గ్రహణ మొక్షానంతరము తిరిగి స్నానమును, చన్ద్ర సూర్య గ్రహణము లందు ఆచరించ వలయును.


సర్వం గంగా సమం తోయం సర్వే వ్యాస సమా ద్విజా ।

సర్వం భూమి సమం దానం, తద్దానం మేరు సన్నిభం ।।

గ్రహణ సమయమున వాపి, కూప తటాకము లందలి జలమంతయు గంగా జలముతో సమానమగును. బ్రాహ్మణులందరూ వ్యాస ముని సమానితులగుదురు. ఏ చిన్న దానమైన భూదాన సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. అట్టి కాలమున జానులు చేసుకునే ఏ చిన్న దానమైనను మేరు పర్వతమంత ఉన్నతమైన ఫలమును ప్రసాదించును – అని పెద్దలు చెప్పుకొని యున్నారు. కావున గ్రహణ సమయమున మనుజులు యథావిధిగా స్నాన జప హోమ దానాదులను ఆచరించుట అత్యంత పుణ్య ప్రదము మరియు ఆరోగ్య కరము, శుభ ప్రదము అగును.


గ్రహణ ఫల విశ్లేషణ:

నిజానికి ఈ సంవత్సరంలో మనకు ఒకే గ్రహణం కనిపిస్తుంది. అదే పైన తెలుపబడిన చూడామణి నామక రాహుగ్రస్త ఖండగ్రాస సూర్య గ్రహణం. కాని ఈ గ్రహణానికి 15 రోజుల ముందు అనగా 05.06.2020, జ్యేష్ఠ పౌర్ణమి నాడు పెనమ్బ్రల్ అనగా ఛాయాబింబ చన్ద్ర గ్రహణం సంభావించ నున్నది. ఈ ఛాయాబింబ చన్ద్ర గ్రహణమును గ్రహణముగా పరిగణించము. ఎందుకంటే ఇది సామాన్యుడి కంటికి కనబడునది కాదు. భూమి ఛాయా యొక్క బాహ్య వలయం నుండి చన్ద్రుడు సంచరిస్తాడు. దీన్ని నిజానికి మన హిందూ ధర్మ శాస్త్రాలు మరియు జ్యోతిష గ్రంథాలు గ్రహణం గా పరిగణించవు. అదే విధంగా పైన తెలుపబడిన సూర్య గ్రహణం తరువాత 15 రోజులకు అనగా 04/05.07.2020, ఆషాఢ పౌర్ణమి నాడు కూడా ఛాయాబింబ చన్ద్ర గ్రహణం సంభవిస్తున్నది. ఇట్టి గ్రహణ యోగాలు దేశారిష్ట యోగాలను సూచించు చున్నది.


యద్యేకస్మిన్ మాసే గ్రహణం రవిసోమాయోస్తదా క్షితిపాః ।

స్వబలక్షోభైః సజ్ఞక్ష్యమాయాన్త్యత్తిశస్రకోపశ్చ ।। (బృహత్సంహిత ౫-౨౬)

ఒకవేళ సూర్య మరియు చన్ద్ర గ్రహణములు ఒకే నెలలో గాని లేదా నెల రోజులలో గాని సంభవించిన ఎడల పాలకులకు నష్టము వాటిల్లుతుంది. ఇట్టి గ్రహణములు వారి నాశనమునకు కారణము కాగలవు. వారి సైన్యం తిరుగుబాటు చేయుట వలన వారు నశించి పోవుదురు. భయంకరమైన రక్తపాతము సంభవిస్తుంది.

(ఇట్టి యోగము పాలకులకు ప్రతికూల ఫలాలను సూచించు చున్నది. ప్రధానంగా మిలిటరీ పెత్తనం గల దేశాలలో చిక్కులు అధికంగా ఉంటాయి. ఇట్టి దేశాలలో మిలిటరీ తిరుగుబాటు జరుగు అవకాశం ఉన్నది)


చంద్రార్కయోరేకమాసే గ్రహణం న ప్రశస్త్యతే ।

పరస్పరం వాదం కుర్యుః స్వబలక్షుభితా నృపాః ।। (కశ్యప సంహిత)

అనగా సూర్య మరియు చన్ద్ర గ్రహణాలు ఒకే మాసములో సంభవించడం ప్రశస్త్యము కాదు. వారి స్వంత సైన్యం తిరుగుబాటు వలన మరియు పరస్పరం సంహరించుకొనుట వలన నశించి పోవుదురు.

(పాలకులకు మరియు వారి సైన్యానికి మధ్య విభేదాలు పెరుగు అవకాశాలు ఉన్నాయి. పాలకులు పరస్పరం కలహించుకుంటూ ఉంటారు. పరస్పర దూషణలు తారాస్థాయిలో ఉంటాయి)


కారూకశూద్రమ్లేచ్ఛాన్ ఖతృతీయాంశే సమన్త్రిజనాన్ । (బృహత్సంహిత ౫-౨౯)

దివ తృతీయాంశ భాగమున గ్రహణము సంభవించిన ఎడల చేతివృత్తులు చేసుకోను వారికి, కళాకారులకు, మ్లేచ్ఛులకు మరియు మంత్రులకు కీడు, బాధ మరియు దుఃఖము సంభవిస్తుంది.

(చేతివృత్తులు చేసుకోను వారు, కళాకారులకు ఈ సంవత్సరంలో ప్రతికూల ఫలాలను సూచించు చున్నది. వారికీ చిక్కులు అధికంగా ఉంటాయి. అనుకున్నంతగా ఆదరణ లభించదు. నిరాదరణకు గురియగు అవకాశము ఉంది)


మధ్యాహ్నే నరపతిమధ్యదేశహా శోభనశ్చ ధాన్యార్ఘః ।

తృణభుగమాత్యాన్తః పురవైశ్యఘ్నః పజ్ఞ్చమే ఖాంశే ।। (బృహత్సంహిత ౫-౩౦)

ఒకవేళ గ్రహణము మధ్య దినము లేదా చతుర్థ ఖాంశ భాగమున సంభవించిన ఎడల మధ్య దేశపు రాజులు నశించుదురు, వారికి కీడు సంభవించును. మొక్కజొన్న పంటకు ధరలు తక్కువగా ఉంటాయి. గ్రహణము పంచమ ఖాంశ భాగమున సంభవించిన ఎడల చతుష్పాదులు (పశువులు), మంత్రులు, అంతఃపురం లో గల స్త్రీలు మరియు వైశ్యులకు నష్టము వాటిల్లును.

(మధ్య దేశంలో ఇప్పటికే రాజకీయ స్థితిగతులు విపరీతంగా ఉన్నాయి. మధ్య దేశంలో గల రాష్ట్రాలయందు ఇట్టి చిక్కులు ఇంకనూ అధికమగు సూచనలున్నాయి. తత్సంబంధిత పాలకులకు చిక్కులు తప్పవు. మంత్రి పదవులందున్న వారికి ఈ సంవత్సరం అగ్నిపరీక్ష వలే ఉంటుంది. ఒకవైపు రాజు మరొక వైపు ప్రజల మెప్పు పొందుటకు వారు అహర్నిశలు శ్రమించ వలసి ఉంటుంది. వ్యాపారులకు ప్రతికూల ఫలాలు అధికంగా ఉంటాయి)


మిథునే ప్రవరాజ్ఞ్గనా నృపా నృపమాత్రా బలినః కలావిదః ।

యమునాతటజాః సబాహ్లికా మత్స్యాః సుహ్నజనైః సమన్వితాః ।। (బృహత్సంహిత ౫-౩౭)

మిథున రాశిలో గ్రహణము సంభవించిన ఎడల ఉన్నత స్థానములందు గల స్త్రీలు, ఉత్తమజాతి స్త్రీలు, రాజులు మరియు వారికి సమానమైన వారు, కళ లందు నిష్ణాతులైన వారు, యమునా నది తీర ప్రాంతము లందు నివసించు వారు, బాల్ఖ, విరాట మరియు సుహ్మ ప్రాంతవాసులు – వీరందరూ కూడా కష్టాలను ఎదుర్కొందురు.


గ్రాసనామితి యదా త్ర్యంశః పాదో వా గృహ్యతేఽథవాఽప్యర్ద్దమ్ ।

స్ఫీతనృపవిత్తహానిః పీడా చ స్ఫీతదేశానామ్ ।। (బృహత్సంహిత ౫-౪౬)

ఒకవేళ, బింబము యొక్క తృతీయ లేదా చతుర్థ భాగము లేదా అర్ధ భాగము గ్రహణ ఛాయా తో కనిపించకుండా పోయిన ఎడల, ఇట్టి గ్రహణమును ‘గ్రాసన’గ్రహణం అని అంటారు. ఇట్టి గ్రహణ ప్రభావము వలన చక్కగా వృద్ధి చెందుతున్న రాజులు మరియు రాజ్యాలకు కీడు వాటిల్లుతుంది. ధన సంపత్తి నశించి పోతుంది. వృద్ధి చెందుతున్న దేశాలు, వృద్ధి చెందాలనే అభిలాష గల దేశాలయందు క్షామము, కరువు కాటకాలు సంభవిస్తాయి.


కందాయ ఫలాలు:


అశ్విని 1 2 3

భరణి 4 0 0

కృత్తిక 7 1 2

రోహిణి 2 2 4

మృగశిర 5 0 1

ఆర్ద్ర 0 1 3

పునర్వసు 3 2 0

పుష్యమి 6 0 2

ఆశ్రేష 1 1 4

మఖ 4 2 1

పుబ్బ 7 0 3

ఉత్తరాఫల్గుణి 2 1 0

హస్త 5 2 2

చిత్త 0 0 4

స్వాతి 3 1 1

విశాఖ 6 2 3

అనూరాధ 1 0 0

జ్యేష్ఠ 4 1 2

మూల 7 2 4

పూర్వాషాఢ 2 0 1

ఉత్తరాషాఢ 5 1 3

శ్రవణం 0 2 0

ధనిష్ఠ 3 0 2

శతభిష 6 1 4

పూర్వాభాద్ర 1 2 1

ఉత్తరాభాద్ర 4 0 3

రేవతి 7 1 0


ఫలము:

ఆది శూన్యే మహా వ్యాధిర్మధ్యశూన్యే మనో వ్యధా (మహాద్భయం) ।

అంత్య శూన్యే ఫలం స్వల్పం త్రిశూన్యే నిష్ఫలం భవేత్ ।।

విషమేత్వర్థ లాభం స్యాత్ సమేతు సమతా భవేత్ ।

శూన్యే శూన్య మవాప్నోతి కందాయ ఫలమ్మీరితం ।।

బేసి సంఖ్యా ధన లాభము, సరి సంఖ్యా సమ లాభము. సున్నా శూన్య ఫలము. మొదటి కందాయము శూన్యమైన ఎడల వ్యాధి, రెండవ కందాయము సున్నా అయిన ఎడల భయము, మూడవ కందాయము సున్నా అయిన ఎడల హాని. ఒక సంవత్సరంలో 12 మాసాలు, ప్రతి కందాయము 4 మాసాల కాలాన్ని సూచిస్తుంది. మొదటి కందాయము మొదటి నాలుగు మాసాలు, రెండవ కందాయము మధ్య నాలుగు మాసాలు, చివరి కందాయము చివరి నాలుగు మాసాలు.


ఆదాయ వ్యయాలు:


 రాశి ఆదాయము వ్యయము

మేషము 5 5

వృషభము 14 11

మిథునము 2 11

కర్కాటకము 11 8

సింహము 14 2

కన్య 2 11

తుల 14 11

వృశ్చికము 5 5

ధనుస్సు 8 11

మకరము 11 5

కుంభము 11 5

మీనము 8 11రాజ పూజ్య రాజావమానము:


రాశి రాజ పూజ్యము రాజావమానము

మేషము 3 1

వృషభము 6 1

మిథునము 2 4

కర్కాటకము 5 4

సింహము 1 7

కన్య 4 7

తుల 7 7

వృశ్చికము 3 3

ధనుస్సు 6 3

మకరము 2 6

కుంభము 5 6

మీనము 1 2


  

శ్రీ శార్వరి నామ సంవత్సర ఫలం:


శ్రీ శార్వరి నామ సంవత్సర వర్ష లగ్నము కర్కాటకము అగుట, లగ్నాధిపతి చన్ద్ర భ భాగ్య స్థానమున ధన స్థానాధిపతి సూర్య భ కలిసి ఉండుట. సప్తమ స్థానమున గురు మరియు శని భ. షష్ఠ స్థానమున కుజ మరియు కేతువులు, అష్టమ స్థానమున బుధ భ స్థితి. రాజ్య స్థానమున శుక్ర భ మరియు వ్యయ స్థానమున రాహువు భ స్థితి.


వర్ష లగ్నాధిపతి శుభ స్థానమున ఉండుట. పుణ్య సహము సింహ రాశిలో ఉండుట. శ్రీ శార్వరి నామ సంవత్సరం మిశ్రమ ఫలాలను ప్రసాదించు సూచనలున్నాయి. ప్రస్తుతము ప్రపంచమంతా ఎదుర్కొంటున్న కరోన వైరస్ ప్రపంచ దేశాల ఆర్ధిక స్థితిగతులను సమూలంగా నాశనం చేసింది అని చెప్పడంలో సందేహమే లేదు. లగ్న వశాత్ సప్తమ స్థానమున శని భ వలన ప్రపంచ దేశాల అభివృద్ధి మందగతితో సాగు సూచనలున్నాయి. ఆర్ధిక మాంద్యం మాత్రమే కాదు, తిరోగమనం కూడా ఉంటుంది. లగ్న వశాత్ వ్యయ స్థానమున రాహువు వలన ప్రణాళిక రహితమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని విధంగా ఇట్టి వాటికి దేశాలు అధికంగా వెచ్చించ వలసి ఉంటుంది. లగ్న వశాత్ సప్తమ స్థానమున శని భ వలన ఉత్పాదకత కూడా తగ్గుతుంది. మార్చ్ 30 మొదలు గురు భ మకర రాశి యందు త్వరణ మరియు వక్ర గతులందు సంచరించుట వలన మార్చ్ 30 మొదలు రాబోవు 3 నెలలు చాలా క్లిష్టమైన సమయాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రణాళికా రహితమైన ఖర్చులు అధికమగుట వలన ప్రణాళిక వ్యయం తగ్గే అవకాశం ఉంది. తద్వారా అభివృద్ధి పనులన్నీ కూడా నిలిచి పోవు అవకాశం ఉంది. ప్రధానంగా భారత దేశానికి ఇట్టి చిక్కులు అధికంగా ఉండే అవకాశం ఉంది. సప్తమ స్థానమున శని భ వలన విదేశీ వాణిజ్యం కూడా తగ్గుతుంది. సప్తమ స్థానమున గురు నీచగతుడై ఉండుట వలన వారి ఆర్ధిక ఇబ్బందులు మనను చుట్టుకునే అవకాశం కూడా ఉంది. ఆయుష్కారకుడైన శని శక్తి వంతుడై ఉండుట, అష్టమ స్థానము శక్తి వంతముగా ఉండుట వలన, గురు శని భ కలయిక వలన అకాల మరణాలు భారీగా ఉండే అవకాశం లేదు. భారీ మరణాలు సంభవించే అవకాశం లేదు. కాని జగల్లగ్నము వృశ్చికము మరియు అష్టమ స్థానమున రాహువు వలన అనుకోని ప్రమాదాలు, ఊహించని రోగాలు మాత్రం వెంటాడు సూచనలున్నాయి. షష్ఠ స్థానమున కుజ కేతువుల వలన అంటువ్యాధులకు చెందిన పీడ మరికొంత కాలం కొనసాగు సూచనలున్నాయి. మార్చ్ 25 కుజ భగవానుడు మకరంలో ప్రవేశించిన మొదలు ఏప్రిల్ 14 వరకు కూడా ఇట్టి రోగ భీతి అధికంగా ఉంటుంది. మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ప్రజారోగ్యాన్ని కాపాడే శని భ కుజ భ తో కలసి ఉండుట, గురు నీచ గతుడై ఉండుట వలన ఇట్టి ప్రతికూలతలు అధికంగా ఉంటాయి. మేష సంక్రమణం మొదలు సూర్య భగవానుడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడు అవకాశం ఉంది. ఏప్రిల్ 14 నుండి కరోన రోగ భీతి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వాలు అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ సంవత్సరంలో నేరాలు మరియు మోసాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రాజ్యాధిపతులు ధర్మ నిరతితో పాలించు అవకాశం ఉంది. ప్రజలు పలు విధములైన కష్టాలను ఎదుర్కోను సూచనలున్నాయి. అధిక శ్రమతో కూడిన ఫలాన్ని పొందే అవకాశం ఉంది. బృహస్పతి బలహీనుడై ఉండుట వలన ఆర్ధిక సంస్థల అభివృద్ధి మందగించి ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో బలహీనతలు కొనసాగు సూచనలున్నాయి. ప్రజలు మరియు పరిశ్రమలు చాలా శ్రమతో కూడిన ఫలాన్ని అనుభవించు వారగు సూచనలున్నాయి.


జగల్లగ్న ధన స్థానమున చన్ద్ర కేతువుల వలన దేశ ఆర్థికాభివృద్ధి ఒడుదుడుకులతో కూడుకొని ఉంటుంది. అభివృద్ధి పరమైన అనిశ్చితి అధికంగా ఉంటుంది. స్టాక్ మరియు షేర్ మార్కెట్ లందు ఒడుదుడుకులు కోన సాగు సూచనలున్నాయి. ప్రజలు భారీ స్పెక్యులేషన్ కు దూరంగా ఉండాలి. ప్రధానంగా, ఇదే ప్రధాన వృత్తిగా గల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాలతోనూ మరియు పొరుగు దేశాలతోనూ దౌత్య సంబంధాలు చక్కగా ఉంటాయి. శ్రమ జీవనమును నమ్మిన వారికి తిరుగు లేదు. పాలకులయందు సేవా భావము పెంపొందు అవకాశాలు ఉన్నాయి. మిలిటరీ ఏలుతున్న రాజ్యాలలో ఇబ్బందులు అధికంగా ఉంటాయి. పాలకులకు మరియు రక్షణ శాఖలకు మధ్య విభేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రహణ ప్రభావాల వలన ప్రపంచంలో గాని లేదా దేశంలో గాని  ఒక ప్రధాన నాయకుడికి కీడును సూచించు చున్నది. వ్యవసాయాలు మరియు పంటలు అనుకూలంగా ఉంటాయి. నవ నాయకులందు చన్ద్ర భ అధిక ప్రాధాన్యతను సంతరించుకొనుట వలన వ్యవసాయము అనుకూలంగానే ఉంటుంది. పాడి పరిశ్రమ కూడా అనుకూలంగానే ఉంటుంది. షష్ఠ స్థానమున కుజ మరియు కేతువుల వలన ఎన్నిక లందు అవకతవకలు అధికంగానే ఉంటాయి. కళలు మరియు కళా రంగాలకు చక్కని ప్రోత్సాహము లభిస్తుంది. కాని శుక్ర లగ్నాత్తు రాజ్య స్థానమున శని భ వలన ఇట్టి రంగములో అభివృద్ధి కూడా మందగతిన సాగుతూ ఉంటుంది. గ్రామీణ వ్యవసాయ రంగాలకు తగిన విధంగా చేయూత లభిస్తుంది. విద్య రంగములో ఒడుదుడుకులు అధికంగా ఉంటాయి. సాంకేతిక విద్య ప్రాధాన్యత క్రమంగా తగ్గు సూచనలున్నాయి. ఆర్ధిక మరియు మానవ వనరుల విభాగాలు చక్కగా వృద్ధి చెందు సూచనలున్నాయి. నదులు మరియు కాలువ లందు నీటి నిలువలు క్రమంగా తగ్గు సూచనలున్నాయి. వైద్య మరియు రసాయన విభాగాలు చక్కగా వృద్ధి చెందుతాయి. సాంఘీక సంక్షేమము చక్కగా వృద్ధి చెందుతుంది. దేశంలో క్లబ్ లు మరియు పబ్బుల సంఖ్య పెరుగుతుంది. పాశ్చాత్య సంస్కృతి వృద్ధి చెందే అవకాశం ఉంది. పండ్లు మరియు పూలు చక్కగా లభిస్తాయి. సైనిక మరియు రక్షణ సంస్థల వృద్ధి చక్కగా ఉంటుంది. గోవులను పూజించే వారి సంఖ్య పెరుగుతుంది. గోశాలలు వృద్ధి చెందుతాయి. పరిశోధనా రంగము చక్కగా వృద్ధి చెందుతుంది.


ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్ధిక మందగమనము జూన్ చివరి వరకు కూడా కొనసాగు సూచనలున్నాయి. అటుపిమ్మట నవంబర్ వరకు ఆర్థికాభివృద్ధి చక్కగానే ఉంటుంది. అటుపిమ్మట నవంబర్ మొదలు తిరిగి మందగతి కొనసాగు సూచనలున్నాయి. రియల్ ఎస్టేట్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలు మందగతిన అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇట్టి రంగము లందు భారీ పెట్టుబడులు చేయువారు జాగ్రత్తగా ఉండాలి. ఫాషన్ మరియు ఫాషన్ డిజైన్ కు చెందిన రంగాలు చక్కగా వృద్ధి చెందుతాయి. మల్టీ మీడియా అనిమేషన్ కు చెందిన రంగాలు చక్కగా వృద్ధి చెందుతాయి. ఫార్మా, సిమెంట్ రంగాలు చక్కగా అభివృద్ధి చెందుతాయి. నిరుద్యోగ సమస్య తగ్గే అవకాశం లేదు. ఉద్యోగ అవకాశాలు తగ్గు సూచనలున్నాయి. నిరుద్యోగులు అధిక శ్రమతో కూడిన ఫలమును పొందు సూచనలున్నాయి. వేశ్యా గృహాలు వృద్ధి చెందుతాయి. చీకటి వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి. నల్లధనం వృద్ధి చెందుతుంది. బ్లాకు మార్కెట్ చేసేవారు పెరిగి పోతారు. గోప్యంగా లేదా రహస్యంగా నేరాలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. స్త్రీలపై అత్యాచారాలు తగ్గుముఖం పడతాయి. న్యాయ వ్యవస్థలో విలువలు తగ్గే అవకాశం ఉంది. కుజ రాహువుల సమసప్తకం వలన దేశ మరియు రాజ్య పీడా అధికంగా ఉంటుంది. ఉద్యోగాలకు మరియు ధనార్జనకు విదేశాలకు వెళ్లేవారి సంఖ్యా యథాతథంగా ఉంటుంది. 

Sri Sharvari Results

Grahachara Results of 12 Rasis - మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలాలు

  

మేషాది ద్వాదశ రాశుల వారికి గోచర ఫలాలు:


(ఇట్టి గోచార ఫలాలు అందరికి ఒకే విధంగా ఉండవు. ఇట్టి ఫలితాలను జాతక రీత్యా ఉన్న యోగాలు మరియు జన్మ కాల దశలు ప్రభావితం చేయు సూచనలున్నాయి. తత్ప్రభావము వలన ఇట్టి శుభాశుభ ఫలాలు మారు సూచనలున్నాయి. జాతక పరమైన యోగాల ప్రభావము వలన అత్యంత శుభప్రదమైన గోచార సమయంలో ప్రతికూల ఫలాలను పొందవచ్చు లేదా అత్యంత ప్రతికూల గోచారము నందు శుభ ఫలాలను కూడా పొందవచ్చు. మనం ఆచరించిన కర్మలను అనుసరించి వాటికి సరిపడా యోగాలు గల సమయంలో మనం జన్మిస్తాము. తదనుగుణంగా ఫలితాన్ని అనుభవిస్తాము)


గురు భ 30.03.2020 వరకు ధనుస్సు నందును అటుపిమ్మట త్వరణ మరియు వక్ర గతులతో 30.06.2020 వరకు మకర మందును, అటుపిమ్మట 20.11.2020 వరకు ధనుస్సు నందును, 20.11.2020 నుండి వత్సరాంతం వరకు మకరమందును సంచరించును. శని భ మకర రాశిలో వత్సరాంతం వరకు సంచరించుట. రాహువు భ 23.09.2020 వరకు మిథున రాశిలోను అటుపిమ్మట వత్సరాంతం వరకు వృషభము నందును సంచరించును.


మేషం:

ఇట్టి రాశి వారికి మిశ్రమ లేదా ప్రతికూల ఫలాలు అధికంగా ఉంటాయి.


గురు గోచారము: 

గురు భ మార్చ్ చివరి వరకు, తిరిగి జూలై నుండి నవంబర్ వరకు శుభుడు. తత్ప్రభావము వలన కార్యసిద్ధి చక్కగా ఉంటుంది. కాస్త శ్రమపడవలసి వచ్చినా కూడాను ఫలితం లభిస్తుంది. గృహము నందు శుభ కార్యాలు. వివాహ ప్రయత్నాలు కొంత శ్రమతో సఫలీక్రుతమగుట. కాని ప్రతికూల శని గోచారము ఇందుకు అవరోధము కాగలదు. కావున ఇట్టి శుభ గోచారము నందు శ్రమతో కూడిన ఫలితాలు లభిస్తాయి. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో గురు భ మకర రాశి యందు శని భ తో కలిసి ప్రతికూలుడగుట వలన ప్రతికూల ఫలాలు అధికంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు, శరీరము నందలి హార్మోనులకు చెందిన చిక్కులు, ప్రధానంగా మధుమేహము గల వారికి ఇట్టి చిక్కులు అధికం. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలాలు. కార్య విఘ్నత, వృధా సంచారము. ఉద్యోగ భంగ యోగాలు. స్థాన చలనము. ధన పరంగా మాత్రం శుభ ఫలితాలు.


శని గోచారము: 

వత్సరాంతం వరకు శని భ ప్రతికూలుడగుట వలన – దుఃఖము, ఆదాయము క్షీణించుట, తలచిన పనులు కుంటుబట్టే అవకాశం, లాభించే చోట నష్టము అధికం. మనోవ్యాకులత, పాప కర్మాచరణ, ఉద్యోగ భంగము, వ్యవహార నాశనము ఇత్యాది ప్రతికూల ఫలములు అధికముగా ఉండు సూచనలు. శ్రమతో కూడిన ఫలాలు. సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలము. స్తబ్డద. సోమరితనము ఆవహించుట. ఉన్నత విద్య పట్ల శ్రద్ధ తగ్గుట. పదోన్నతులు నిలిచి పోవుట. ఇట్టి చిక్కులు ప్రతికూలత గురు మరియు రాహువు గోచరము లందు అధికముగా ఉండు సూచనలున్నాయి.


రాహువు గోచారము: 

23.09.2020 వరకు రాహువు శుభుడు, అటుపిమ్మట ద్వితీయ స్థానమున వత్సరాంతం వరకు ప్రతికూలుడు. పైన సూచించిన సెప్టెంబర్ డేట్ వరకు శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి. కాని సెప్టెంబర్ నుండి వత్సరాంతం వరకు ధన స్థానమున ప్రతికూలుడగుట వలన ఆర్ధిక మోసాలు అధికంగా ఉంటాయి. మిత్రులు మరియు సన్నిహితుల ద్వారా మోసాలు అధికము. స్పెక్యులేటివ్ పెట్టుబడులందు ప్రతికూలతలు అధికంగా ఉంటాయి. ఒడుదుడుకులతో సాగు ఆర్థికాభివృద్ధి. అధిక ధన వ్యయము. వృధా ఖర్చులు అధికమగుట. వ్యసనముల వైపు మనస్సు లాగుట.


వృషభము:

మీకు మిశ్రమ నుండి ప్రతికూల ఫలములు అధికముగా ఉండే సూచనలున్నాయి.


గురు గోచారము: 

గురు భ మార్చ్ చివరి వరకు, తిరిగి జూలై నుండి నవంబర్ వరకు ప్రతికూలుడు. తత్ప్రభావము వలన ప్రతికూల ఫలాలు అధికంగా ఉంటాయి. గృహ సమస్యలు అధికంగా ఉంటాయి. అనారోగ్యము, ప్రధానంగా జీర్ణకోశ మరియు శ్వాస కోశ ఇబ్బందులు, మధుమేహము తో బాధపడుతున్న వారికి ఇట్టి చిక్కులు అధికము. ఊహించని అవరోధాలు. చొర భయము. వృత్తి రీత్యా సమస్యలు అధికమగుట. వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట. నవంబర్ నుండి వత్సరాంతం వరకు గురు భ శుభుడు అగుట వలన కార్యసిద్ధి చక్కగా ఉంటుంది. కాని కొంత శ్రమతో కూడుకొని ఉంటుంది. శ్రమతో కూడిన ఫలాలు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనము. స్థిరాస్తులందు లాభాలు, కుల వృత్తులందు చక్కని అభివృద్ధి. వివాహ ప్రయత్నాలు ఫలించుట. కాని కాస్త శ్రమతో కూడుకొని ఫలితాలు లభిస్తాయి.


శని గోచారము: 

శని భ వత్సరాంతం వరకు కూడా భాగ్య స్థానమున ప్రతికూలుడు. పితృ సంబంధమైన అనారోగ్యము వీరిని కలచివేయు సూచనలు. అవకాశాలు చేజారిపోవుట. ఆదాయము క్షీణించుట. పనులు కుంటుబట్టుట. పితృ విభేదము. తలపెట్టిన పనులందు అదృష్టము కలసి రాకపోవుట.


రాహువు గోచారము: 

రాహువు భగవానుడు సెప్టెంబర్ వరకు ధన స్థానమున మరియు అటుపిమ్మట జన్మరాశి యందు వత్సరాంతం వరకు కూడా ప్రతికూలుడు. ప్రతికూల రాహువు గోచరము వలన సన్నిహితుల ద్వారా మోసాలు, ఆర్థిక లావాదేవీలందు ఒడుదుడుకులు మరియు మోసాలు. నేత్ర సంబంధ చిక్కులు, చోర భయము అధికముగా ఉంటుంది. ఇట్టి రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరంలో పెట్టుబడుల పరంగా జాగ్రత్తగా ఉండాలి. సన్నిహితులతో జరుపు లావాదేవీలందు జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ మొదలు మానసిక చింత అధికమౌతుంది. ఒత్తిడులు అధికమౌతాయి. అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవు సూచనలు. అనుకోని ఒడుదుడుకులు మరియు మార్పులు.


మిథునము:

ప్రతికూల గోచార ప్రభావము వలన వీరికి మిశ్రమ నుండి ప్రతికూల ఫలాలు అధికముగా ఉంటాయి.


గురు గోచారము: 

మార్చ్ 30, 2020 వరకు తిరిగి జూలై నుండి నవంబర్ 2020 వరకు గురు భ శుభుడు. తత్ప్రభావము వలన మీకు కార్యానుకూలత చక్కగా ఉన్నను ప్రతికూల రాహువు మరియు శని భ వలన ఇట్టి శుభ గోచారము యొక్క సంపూర్ణ ఫలాలు మీకు అందు సూచనలు లేవు. శ్రమతో కూడిన పనులు అవుతూ ఉంటాయి. కార్య విజయానికి చెందిన మానసిక చింత మరియు ఒత్తిడి అధికంగా ఉంటుంది. సత్కార్యములను ఆచరించుట, పుణ్య క్షేత్రముల దర్శనము. ఒత్తిడితో కూడిన ఆనందం. ఏప్రిల్ నుండి జూన్ 2020 వరకు అష్టమ స్థానమున ప్రతికూలుడగుట వలన అనారోగ్యము, ప్రధానంగా జీర్ణకోశ,కాలేయము మరియు శ్వాస కోశ సంబంధిత చిక్కులు, మధుమేహము మరియు హార్మోన్స్ కు చెందిన చిక్కులు అధికంగా ఉంటాయి. స్వల్ప ప్రమాదాలు. వాహనములు తోలునపుడు జాగ్రత్తగా ఉండాలి. గృహ సమస్యలు అధికమగుట. ఊహించని అవరోధాలు. స్వల్ప ప్రమాదాలు ఎదురగు సూచనలు.


శని గోచరము: 

ప్రతికూల గోచారము వలన ఈ వత్సరాంతం వరకు కూడా మీకు ప్రతికూల ఫలాలను సూచించు చున్నది.

ప్రతికూల శని భ వలన ప్రయాణాలు అధికం, పనులు మందగతిన సాగుట, సమయానుసారముగా వెనకబడుట,భాగస్వాములతో స్వల్ప విభేదాలు. అష్టమ శని ప్రతికూలుడగుట వలన స్వల్ప ప్రమాదాలు, అనారోగ్యము, జీర్ణ కోశానికి చెందిన చిక్కులు, అధిక ధన వ్యయము, ద్వేషాలు,నేరారోపణ, నిష్ఠూరము, అవమానాలు అధికము. ఇట్టి జాతకులు ప్రయాణాలు మరియు వాహనాలు తోలునపుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికం. ధనము విరివిగా ఖర్చగుట. పొదుపు తగ్గుట.


రాహువు గోచారము: 

సెప్టెంబర్ వరకు జన్మ రాశిలో రాహువు భ ప్రతికూలుడు. కొంత అనిశ్చితి కొనసాగు సూచనలున్నాయి. మానసిక ఒత్తిడులు అధికంగా ఉంటాయి. అల్లర్జీలు మరియు చర్మ సంబంధిత చిక్కులు అధికంగా ఉండే సూచనలున్నాయి. చర్మంపై మచ్చలు ఏర్పడే అవకాశం. అక్టోబర్ మొదలు వ్యయ స్థానమున ప్రతికూలుడగుట వలన వత్సరాంతం వరకు కూడా ప్రతికూల ఫలాలు అధికం. వృధా సంచారం, అధిక మరియు వృధా ఖర్చులు, ధన నష్టము, వృత్తి రీత్యా అనుకోని ఒడుదుడుకులు ఎదురగు సూచనలు. వివాదాలు, ప్రధానంగా ఆర్ధిక లావాదేవీలందు వివాదాలు అధికంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. స్థాన చలన యోగాలు.


కర్కాటకము:

ఇట్టి రాశిలో జన్మించిన వారికి శుభ మరియు మిశ్రమ ఫలితాలు ఉండు సూచనలున్నాయి.


గురు గోచారము: 

మార్చ్ చివరి వరకు తిరిగి జూలై నుండి నవంబర్  వరకు గురువు ప్రతికూలుడగుట వలన స్వల్ప అనారోగ్యము, శరీరము నందలి గ్రంథులు, జీర్ణ కోశము, కాలేయము, శ్వాస కోశమునకు చెందిన చిక్కులు. ఉద్యోగ రీత్యా ప్రతికూలతలు, యజమానుల ద్వారా ఇబ్బందులు, రాజదండన భయం, సన్నిహితులతో మనస్పర్థలు అధికంగా ఉంటాయి. అధిక ధన వ్యయము. సప్తమ శని మరియు వ్యయ రాహువుల వలన ఇట్టి ప్రతికూలతలు ప్రథమార్థంలో అధికంగా ఉంటాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు తిరిగి నవంబర్ మొదలు వత్సరాంతం వరకు సప్తమ స్థానమున గురు భ శుభుడు అగుట వలన శుభ ఫలములు అధికముగా ఉంటాయి. శ్రమతో కూడిన ఫలాలు అందుతాయి. కష్టపడితే ఫలితం తప్పక లభిస్తుంది. పదోన్నతులకు అనుకూలమైన సమయము. కార్యసిద్ధి, దైవ చింతన, శారీరిక సౌఖ్యం,ఆరోగ్యం, అన్ని విధాలుగా ఆహ్లాదకరమైన గృహ వాతావరణం. దానధర్మాలు ఆచరించుట ఇత్యాది శుభ ఫలాలు ఉంటాయి. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సఫలమగుట. వ్యాపారులకు స్వల్ప మందగతి ఉన్నను అభివృద్ధి మాత్రం చక్కగా ఉంటుంది.


శని గోచారము: 

వత్సరాంతం వరకు సప్తమ స్థానమున శని ప్రతికూలుడగుట వలన పనులు మందగించుట, అధిక శారీరిక శ్రమ. పదోన్నతులు వెనకబడుట, మానసిక చింత అధికం, భాగస్వాముల ద్వారా ప్రతికూలతలు, నడుము మరియు కీళ్ళకు చెందిన చిక్కులు, జీర్ణ శక్తి మందగించుట ఇత్యాది ప్రతికూలతలు అధికముగా ఉండు సూచనలున్నాయి. కాని మార్చ్ చివరి నుండి జూన్ వరకు తిరిగి నవంబర్ నుండి వత్సరాంతం వరకు గురు శుభుడు అగుట వలన ఈ మధ్య కాలంలో శని ప్రతికూల ప్రభావాలు తక్కువగు సూచనలున్నాయి. ఇట్టి సమయంలో స్వల్ప మిశ్రమ ఫలాలు లభిస్తాయి.


రాహువు గోచారము: 

సెప్టెంబర్ వరకు రాహువు వ్యయ స్థానమున ప్రతికూలుడగుట వలన ఆర్ధిక మోసాలు. అధిక ధన వ్యయము. ఊహించని ఖర్చులు. పొదుపు కరిగి పోవుట. ఆర్ధిక మోసాలు. పెట్టుబడుల పరముగా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఒడుదుడుకులు మోసాలు. సెప్టెంబర్ నుండి మొదలు ఏకాదశ స్థానములందు రాహువు శుభుడు అగుట వలన కార్యసిద్ధి పెంపొందు సూచనలున్నాయి. ధన లాభము, వస్త్ర లాభము, ధైర్యము, సర్వ విధములుగా సుఖ సంతోషాలు ఉంటాయి. విద్యార్థులకు మాత్రం పోటీ పరీక్షలందు అనుకున్నంతగా ఫలితం లభించదు. వారి మనస్సు చంచలమగు సూచనలున్నాయి. అనాలోచిత తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి.


సింహము:

వీరికి శుభ మరియు మిశ్రమ ఫలాలు ఉండు


గురు గోచారము: 

మార్చ్ చివరి వరకు, తిరిగి జూలై నుండి నవంబర్ వరకు గురు భ శుభుడు. ఇట్టి గోచార సమయంలో శుభ ఫలాలు అధికంగా ఉంటాయి. మనోవాంఛ సిద్ధి, దైవానుగ్రహం, కార్య విజయం, పరీక్షలందు విజయం, కీర్తి ప్రతిష్టలు, శారీరిక సౌఖ్యం, చక్కని సంతాన సౌఖ్యం ఇత్యాది శుభ ఫలములు అధికముగా పొందు వారగుదురు. ఏప్రిల్ నుండి జూన్ చివరి వరకు షష్ఠ స్థానమున గురు ప్రతికూలుడు అగుట వలన స్వల్ప మిశ్రమ ఫలాలు లభిస్తాయి. ఇట్టి సమయంలో మీకు స్వల్ప అనారోగ్యము, శ్వాసకోశ సంబంధిత చిక్కులు. సంతానముతో స్వల్ప విభేదాలు, ఉద్యోగ మార్పిడి, రాజదండన భయం, చొర భయం,సన్నిహితులతో మనస్పర్థలు అధికంగా ఉంటాయి. కాని శని రాహువులు శుభులు అగుట వలన ఇట్టి ప్రతికూలతలు స్వల్పముగానే ఉండు సూచనలున్నాయి.


శని గోచారము: 

వత్సరాంతం వరకు షష్ఠ స్థానమున శని భ శుభుడగుట వలన కార్యానుకూలత, ధన ధాన్య సమృద్ధి, తలపెట్టిన పనులు విజయవంత మగుట, బంధు జన సంతోషము, సర్వత్రా సంతోషం. శతృ పరాభవం, ఇష్ట కామ్య సిద్ధి. చక్కని ఉద్యోగాభివృద్ధి, పదోన్నతులు, చక్కని కీర్తి ప్రతిష్ఠలు, సర్వత్రా ఆహ్లాదకరంగా ఉండు ఫలాలు, ఇత్యాది శుభ ఫలములు అధికముగా ఉంటాయి.


రాహువు గోచారము: 

సెప్టెంబర్ వరకు ఏకాదశ లాభ స్థానము లందు రాహువు శుభుడు అగుట వలన చక్కని కార్య విజయము. ఉద్యోగ మరియు వ్యాపారాభివృద్ధి. సర్వత్రా శుభప్రదమైన ఫలాలు. కాని మానసిక ఒత్తిడులు కూడా అధికంగానే ఉంటాయి. యోగాభ్యాసము వలన ఇట్టి చిక్కులను అరికట్ట వచ్చును. ఇట్టి యోగ ప్రభావము విద్యార్థులపై అధికముగా ఉండు అవకాశము ఉన్నది. ఈ రాశి వారు ఇట్టి సమయంలో అనాలోచిత మరియు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. సెప్టెంబర్ చివరి నుండి వత్సరాంతం వరకు రాజ్య స్థానమున రాహువు వలన అనుకోని మార్పులు ఎదురగు సూచనలున్నాయి. అవకాశాలు చేజారిపోవు సూచనలు. మీరు ఊహించిన దానికి విరుద్ధమైన ఫలితములు లభించు సూచనలున్నాయి.


కన్య:

కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో స్వల్ప మిశ్రమ లేదా ప్రతికూల ఫలాలు లభించు సూచనలున్నాయి.


గురు గోచారము: 

మార్చ్ చివరి వరకు మరియు జూలై నుండి నవంబర్ వరకు అర్దాష్టమమున గురు భ ప్రతికూలుడు. తత్ప్రభావము వలన మాతృ సంబంధమైన అనారోగ్యమునకు చెందిన చింత అధికమగుట, అనారోగ్యము, స్థాన చలనము,ఉద్యోగ భంగము. అధిక ధన వ్యయము. విద్యార్థులకు మాత్రం మిశ్రమ ఫలాలు లభిస్తాయి. చేపట్టిన పనులందు అవరోధాలు అధికంగా ఉంటాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు, నవంబర్ నుండి వత్సరాంతం వరకు పంచమ స్థానమున గురు శుభుడు. కాని శని భ తో కలిసి ఉండుట మరియు నీచ క్షేత్రమున ఉండుట వలన సంపూర్ణ శుభ ఫలాలు లభించవు. స్వల్ప మిశ్రమ ఫలాలు లభిస్తూ ఉంటాయి. శ్రమతో కూడిన కార్యానుకూలత. దైవానుగ్రహ ప్రాప్తి. వివాహ ప్రయత్నములు శ్రమతో కూడి అనుకూలించుట. కీర్తి లాభము, శారీరిక సౌఖ్యము. సంతాన పరముగా మిశ్రమ ఫలాలు.


శని గోచారము: 

వత్సరాంతం వరకు మకరమున పంచమ శని ప్రతికూలుడు. ఇట్టి గోచారము వలన – ఆర్ధిక వనరులు తగ్గుట, అనారోగ్యము, మానసిక చింత,సంతాన పరమైన ప్రతికూలతలు, శ్వాస కోశము మరియు గర్భాశయమునకు చెందిన చిక్కులు. మానసిక ఒత్తిడులు అధికం. మతిమరుపులకు అధికం, తత్ప్రభావము వలన విద్యార్థులకు పోటీ పరీక్ష పరముగా అనుకున్నంతగా ఫలితములు లభించక పోవుట. ఇట్టి ప్రతికూల గోచరమును పైన తెలిపిన గురు భ శుభ గోచారము కొంతవరకు ప్రభావితము చేయు సూచనలున్నాయి. తత్ప్రభావము వలన ఇట్టి చిక్కులు పైన తెలిపిన అనుకూల గురు గోచారము కొంత తక్కువగా ఉంటాయి.


రాహువు గోచారము: 

వత్సరాంతం వరకు రాహువు దశమ మరియు భాగ్య స్థానము లందు గోచారము ప్రతికూల ఫలాలను ఇస్తుంది. వృధా సంచారము అధికము, అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవుట. భోజనము పట్ల శ్రద్ధ క్రమముగా తగ్గుట. పనిచేయు చోట ఇబ్బందులు అధికం. వ్యవహారము మందగిస్తూ ఉంటుంది. అధికారుల నుండి సమస్యలు అధికంగా ఉంటాయి. స్థాన చలనము, ఆరోగ్యము క్షీణించుట. ఉపాసనలు ఫలించక పోవుట. పలు విధము లైన ఉపాసనల పట్ల శ్రద్ధ అధికమగుట, ఏ ఒక్కటీ కూడా అనుకూలించక పోవుట. ఇత్యాది ప్రతికూల ఫలాలు ఉంటాయి.

కన్యా రాశి యందు జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రతికూలతలు అధికంగా ఉంటాయి.


తుల:

తులా రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరమంతా కూడా ప్రతికూల ఫలాలను సూచించు చున్నది. సూచనలున్నాయి.


గురు గోచారము: 

మార్చ్ చివరి వరకు మరియు జూలై నుండి నవంబర్ వరకు తృతీయ స్థానమున ప్రతికూలుడు. ఏప్రిల్ నుండి జూన్ వరకు మరియు నవంబర్ నుండి వత్సరాంతం వరకు చతుర్థ స్థానమున ప్రతికూలుడు. ఈ వత్సరాంతం వరకు కూడా ప్రతికూల ఫలాలు లభించు సూచనలున్నాయి. పట్టుదల మరియు ధైర్యం కాస్త తగ్గుట, భ్రాతృ విరోధము, అనారోగ్యము,థైరాయిడ్ సమస్యలు, వ్యవహార నాశనము,బంధు విరోధము ఇత్యాది ప్రతికూలతలు అధికముగా ఉండు సూచనలున్నాయి. నవంబర్ నుండి చతుర్థ స్థానమున గురు భ ప్రతికూలుడు. తత్ప్రభావము వలన మాతృ సంబంధమైన అనారోగ్యమునకు చెందిన చింత అధికమగుట, అనారోగ్యము, స్థాన చలనము, ఉద్యోగ భంగము. అధిక ధన వ్యయము. విద్యార్థులకు మాత్రం మిశ్రమ ఫలాలు లభిస్తాయి. చేపట్టిన పనులందు అవరోధాలు అధికంగా ఉంటాయి. ఇట్టి రాశిలో జన్మించిన వారికి వత్సరాంతం వరకు కూడా వివాహ ప్రయత్నములు అనుకూలించవు.


శని గోచారము: 

ఇట్టి రాశిలో జన్మించిన వారికి వత్సరాంతం వరకు కూడా అర్ధాష్ఠమ స్థానమున శని భ ప్రతికూలుడగుట వలన కార్య భంగము, శ్రమతో కూడిన ఫలితము, అధిక శ్రమ మరియు స్వల్ప ఫలము, అనారోగ్యము, దేహ మరియు శారీరిక పీడ. శ్రమకు తగిన ఫలితము లభించక పోవుట, విద్యార్థులకు ఇట్టి చిక్కులు అధికం. మాతృ సంబంధమైన అనారోగ్యము, పదోన్నతులు నిలచిపోవుట ఇత్యాది ప్రతికూల ఫలములు అధికముగా ఉండు సూచనలున్నాయి. కాని తులా రాశి వారికి యోగ కారకుడగుట వలన కొంతమేర ఊరట లభించు సూచనలున్నాయి. ఇట్టి రాశిలో జన్మించిన వారు క్రొత్త పనులకు దూరంగా ఉండాలి.


రాహువు గోచారము: 

సెప్టెంబర్ వరకు భాగ్య స్థానమున కలసి రాకపోవుట, అవకాశములు చివరి క్షణంలో చేజారిపోవుట అలసత్వము, కీర్తి నష్టము, మీ వల్ల అన్యులకు చిక్కులు ఎదురగుట. సెప్టెంబర్ మొదలు వత్సరాంతం వరకు అష్టమ స్థానమున ప్రతికూలుడు అగుట వలన స్వల్ప అనారోగ్యము. అల్లర్జీల వలన చిక్కులు. కల్తీ ఆహారము వలన చిక్కులు. స్వల్ప ప్రమాదాలు. వృధా ఖర్చులు అధికం. శ్వాసకోశము చిక్కులు, వృధా సంచారము. ఇత్యాది ప్రతికూలతలు ఉండు సూచనలున్నాయివృశ్చిక:

వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో శుభ మరియు మిశ్రమ ఫలములను పొందు సూచనలున్నాయి.


గురు గోచారము: 

మార్చ్ చివరి వరకు, తిరిగి జూలై నుండి నవంబర్ వరకు ద్వితీయ స్థానమున గురు భ శుభుడు. కుటంబ సౌఖ్యము, కీర్తి వృద్ధి, చక్కని ఆర్థికాభివృద్ధి, ధన లాభములు, ప్రమోషన్ లు, ఉద్యోగ ప్రయత్నములు ఫలించుట. విద్యార్థులకు అనుకూలత. మేధస్సు పెంపొందుట, మిత్రుల వలన లాభము, సర్వత్రా సంతోషం ఇత్యాది శుభ ఫలములు అధికంగా ఉంటాయి. చక్కని కార్యసిద్ధి. వివాహ ప్రయత్నములందు అనుకూలత. ఏప్రిల్ నుండి జూలై వరకు, అటుపిమ్మట నవంబర్ నుండి వత్సరాంతం వరకు తృతీయ స్థానమున ప్రతికూలుడు. ఇట్టి స్థానమున నీచగతుడై శని భ తో కలిసి ఉండుట వలన ప్రతికూల ఫలాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు. గొంతుకు చెందిన చిక్కులు, థైరాయిడ్ సమస్యలు, హార్మోనుల సమస్యలు, మధుమేహ సమస్యలు, ఊహించని సంఘటనలు, ఊహించని స్వల్ప ప్రమాదాలు. వ్యవహార నాశనము, బంధువులతో విభేదము, ధన నష్టము, ఉద్యోగ రీత్యా ప్రతికూలతలు. వివాహ ప్రయత్నములకు ప్రతికూలము.


శని గోచారం: 

వత్సరాంతం వరకు తృతీయ స్థానమున శని శుభుడగుట వలన సర్వత్రా శుభ ఫలితములు అధికం. పనులు వేగాన్ని పుంజుకొనుట, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట, ధన లాభము. కీర్తి ప్రతిష్టలు, పదోన్నతులు,విద్యార్థులకు అనుకూలము, ప్రయాణ మరియు వ్యవహార లాభము, చక్కని ఆరోగ్యము, సర్వత్రా ఆనందము, చెవి ముక్కు మరియు గొంతుకు చెందిన చిక్కులు. ఇత్యాది శుభ ఫలితములు అధికముగా ఉండు సూచనలున్నాయి.


రాహు గోచారము: 

సెప్టెంబర్ వరకు అష్టమ స్థానమున రాహువు ప్రతికూలుడగుట వలన అనుకోని అనారోగ్య సమస్యలు, ఎలర్జీ లకు చెందిన చిక్కులు, విషపు ఆహార చిక్కులు, జీర్ణకోశమునకు చెందిన చిక్కులు, ఊహించని ప్రమాదాలు లేదా అనారోగ్య సమస్యలు. ఆర్థిక మోసాలు ఇత్యాది ప్రతికూల ఫలములు. అటుపిమ్మట వత్సరాంతం వరకు సప్తమ స్థానమున ప్రతికూలుడగుట వలన అనుకోని ఒడుదుడుకులు మరియు మార్పులు, మానసిక ఒత్తిడులు, చంచలత్వము అధికమగుట. నిర్ణయాత్మక శక్తి తగ్గుట. పనులు సమయానుసారముగా వెనకబడుట. ఉదార మరియు నేత్ర సంబంధమైన చిక్కులు. వస్తు నాశనము, ధన నష్టము ఇత్యాది ప్రతికూల ఫలములు ఉండు సూచనలున్నాయి.ధనుస్సు:

ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం కొంత ఊరట లభించి మిశ్రమ ఫలములు లభించు సూచనలున్నాయి.


గురు గోచారము: 

మార్చ్ చివరి వరకు మరియు జూలై నుండి నవంబర్ వరకు జన్మ రాశిలో సంచరిస్తున్న గురు భ ప్రతికూలుడు. కాని రాశ్యాధిపతి గా కొంత మిశ్రమ ఫలాన్ని ప్రసాదించే సూచనలున్నాయి. విద్యార్థులకు మిశ్రమ ఫలాలు లభిస్తాయి. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించవు. స్థాన చలనమునకు అవకాశాలు అధికము. వృధా సంచారము. నివాస మార్పు, మానసిక చింత అధికం, ఉద్యోగ రీత్యా ప్రతికూలతలు. స్వల్ప అనారోగ్యము. ప్రధానముగా మధుమేహముతో బాధపడుతున్న వారికి చిక్కులు అధికము. మార్చ్ చివరి నుండి జూలై వరకు మరియు అటుపిమ్మట నవంబర్ నుండి వత్సరాంతం వరకు ధన స్థానమున శుభుడు. కాని నీచ క్షేత్రమున ఉండుట మరియు శని భ కలిసి ఉండుట వలన సంపూర్ణ శుభ ఫలాలు లభించవు. కొంత మిశ్రమ ఫలం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారులకు రాబడి పెరుగుతుంది. కార్య విజయము కొంత శ్రమతో కూడుకొని ఉంటుంది. మిత్రుల మరియు సన్నిహితుల ద్వారా లాభము, కీర్తి లాభము, దాన ధర్మాదులు నిర్వహించుట, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. వివాహ ప్రయత్నాలయందు అనుకూలత.


శని గోచారము: 

వత్సరాంతం వరకు కూడా శని భ ధన స్థానమున ప్రతికూలుడు. అధిక ధన వ్యయం, గౌరవ నాశనం, ధన హాని, పరస్పర దూషణలు, అనారోగ్యము,కుటుంబ కలతలు, ఋణ బాధలు, నోరు మరియు దంత సమస్యలు, నేత్ర సంబంధిత చిక్కులు, ఉన్నత విద్య యందు చిక్కులు ఇత్యాది ప్రతికూలతలు అధికముగా ఉండు సూచనలున్నాయి. వ్యాపారులు భారీ పెట్టుబడుల పరముగా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలం లభిస్తుంది.


రాహువు గోచారము: 

సెప్టెంబర్ వరకు సప్తమ స్థానమున రాహువు మరియు జన్మ రాశిలో కేతువు ప్రతికూలుడు. అనుకోని ఒడుదుడుకులు, అవకాశాలు చేజారిపోవుట, మానసిక చింత, అనిశ్చితి,భాగస్వాములతో చిక్కులు. ఉద్యోగ మరియు వ్యాపార పరముగా ఒడుదుడుకులు. మానసిక ఒత్తిడులు, చంచలత్వము అధికమగుట. నిర్ణయాత్మక శక్తి తగ్గుట. పనులు సమయానుసారముగా వెనకబడుట. ఉదార మరియు నేత్ర సంబంధమైన చిక్కులు. వస్తు నాశనము, ధన నష్టము ఇత్యాది ప్రతికూల ఫలములు ఉండు సూచనలున్నాయి. సెప్టెంబర్ మొదలు వత్సరాంతం వరకు షష్ఠ స్థానమున శుభుడు అగుట వలన శుభ ఫలితాలను ఇస్తాడు. శతృ నాశనము, కార్య లాభము, సర్వ కార్య సిద్ధి, ధన లాభము, తలపెట్టిన పనులు విజయవంతమగుట, గౌరవ మర్యాదలు, వస్త్ర లాభము ఇత్యాది శుభ ఫలితాలు ఉంటాయి.మకరము:

మకర రాశిలో జన్మించిన వారికి  వత్సరాంతం వరకు కూడా ప్రతికూల ఫలములను సూచించు చున్నది.


గురు గోచారము: 

వత్సరాంతం వరకు కూడా గురు గోచారము ప్రతికూల ఫలాన్ని సూచించు చున్నది. మార్చ్ చివరి వరకు, జూలై నుండి నవంబర్ వరకు వ్యయ గురువు ప్రతికూలుడగుట వలన స్థాన చలనము, ఉద్యోగ వృత్తి మరియు పదవీ భంగము, వ్యర్థ ప్రయాణాలు, మానసిక చింత, గురు భేదము, జ్ఞాన హీనత, ధార్మిక కార్యములందు అధిక ధన వ్యయము ఇత్యాది ప్రతికూల ఫలములు అధికముగా ఉంటాయి. మార్చ్ చివరి నుండి జూన్ వరకు, పిదప జూలై నుండి నవంబర్ వరకు జన్మ గురు ప్రతికూలుడు. స్వల్ప అనారోగ్యము. స్థాన చలనము, ఉద్యోగ భంగ యోగాలు, మానసిక చింత, వస్తు నాశనము, దూర ప్రయాణాలు,వృధా సంచారము, ఖర్చులు అధికం, బంధు విరోధము ఇత్యాది ప్రతికూల ఫలాలు ఉంటాయి. ఈ సంవత్సరం మకర రాశిలో జన్మించిన విద్యార్థులు శ్రమతో కూడిన ఫలములను పొందు వారగు సూచనలున్నాయి. సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలము. ఇట్టి రాశిలో జన్మించిన వారికి వివాహ ప్రయత్నము లందు ప్రతికూలతలు ఉంటాయి.


శని సంచారం: 

జన్మ శని వలన ఏలినాటి శని. తత్ప్రభావము వలన ఖర్చులు అధికం, వృధా సంచారం, అనవసరమైన ఖర్చులు, సన్నిహితులతో విభేదాలు. పెట్టుబడులు నిలిచి పోవుట. మానసిక చింత. శ్రమతో కూడిన ఫలాలు. సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలాలు. ఫలితం లేని ప్రయాణాలు. శారీరిక బాధలు, అనారోగ్యము, కీళ్ళకు మరియు చర్మ సంబంధిత చిక్కులు, తేజస్సు క్షీణించడం, భార్య లేదా భర్తలకు అనారోగ్యం, ప్రమాదాలు,మనశ్చింత అధికం. కాని శని భ రాశ్యాధిపతి అగుట వలన ఇట్టి చిక్కులు వీరికి స్వల్పముగానే ఉండు సూచనలున్నాయి. శరీరం లోని గ్రంథులు మరియు హార్మోనులకు చెందిన చిక్కులను ఎదుర్కోను వారు, దీర్ఘ వ్యాధులను ఎదుర్కోను వారు జాగ్రత్తగా ఉండాలి.


రాహువు గోచారము: 

6 వ స్థానమున సెప్టెంబర్ వరకు రాహువు శుభుడు అగుట వలన కార్య విజయము, శతృ నాశనము ఇత్యాదిగా ఇష్టకార్య సిద్ధి, కీర్తి ఇత్యాది శుభ ఫలితాలు సూచించు చున్నది. కాని ఏలినాటి శని మరియు జన్మ గురు భ వలన ఇట్టి ఫలాలు సంపూర్ణంగా లభించవు. సెప్టెంబర్ మొదలు వత్సరాంతం వరకు పంచమ రాహువు ప్రతికూలుడు. ఇట్టి గోచారము వలన మానసిక చింత అధికమౌతుంది. నిర్ణయాత్మక శక్తి తగ్గుతుంది. సంతాన పరమైన చిక్కులు అధికమౌతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగాలయందు ఒత్తిడి పెరుగుతుంది. దురాలోచనలు వస్తాయి, శ్వాసకోశ సంబంధిత చిక్కులు ఎదురౌతాయి. ఉబ్బసము ఇత్యాది వ్యాధుల ద్వారా జాగ్రత్తగా ఉండాలి. ఎలర్జీ లకు చెందిన చిక్కులు అధికమౌతాయి.కుంభము:

కుంభ రాశి వారికి ఈ సంవత్సరంలో మిశ్రమ మరియు ప్రతికూల ఫలాలు ఉంటాయి.


గురు గోచారం: 

మార్చ్ చివరి వరకు మరియు జూలై నుండి నవంబర్ వరకు ఏకాదశ లాభ స్థానమున గురు భ శుభుడగుట వలన శుభ ఫలాలు అధికం. అన్నింటా లాభం, కార్య విజయం, ఉద్యోగ లాభం, వ్యాపారాభివృద్ధి, ధన మరియు కీర్తి లాభం, శుభ కార్యాలు, విద్యార్థులకు అధిక శుభ ఫలం. తేజో వృద్ధి, పదోన్నతులు ఇత్యాది శుభ ఫలాలు అధికం. ఇట్టి సమయంలో వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా చక్కని ఫలాలను పొందు సూచనలున్నాయి. మార్చ్ చివరి నుండి జూన్ వరకు అటుపిమ్మట నవంబర్ నుండి వత్సరాంతం వరకు వ్యయ స్థానమున ప్రతికూలుడు అగుట వలన స్థాన చలనము, ఉద్యోగ భంగ యోగాలు, స్వయం ఉపాధులందు ఉన్న వారికి ప్రతికూలతలు అధికం, అధిక ధన వ్యయము, వృధా ఖర్చులు. అర్థము లేని ప్రయాణాలు, పెట్టుబడుల పరంగా నష్టాలు. ఇట్టి సమయంలో వీరు క్రొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. వ్యాపార పరంగా ఆర్ధిక లావాదేవీలందు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు కూడా ప్రతికూలంగా ఉంటుంది.


శని గోచారం: 

వ్యయ స్థానమున శని సంచారము వలన ఏలినాటి శని కలదు. అధిక ధన వ్యయం, వృధా సంచారం, విచారము, వ్యయ ప్రయాసలు, అధిక శ్రమతో కూడిన ఫలాలు. స్థాన చలనం. పెట్టుబడుల పరంగా ప్రతికూలతలు. భారీ పెట్టుబడులకు దూరంగా ఉండాలి. దూర ప్రయాణాలు. చేపట్టిన పనులందు ప్రతికూలతలు అధికం. అందవలసిన దానం సమయానికి అందక పోవుట. బంధు జన విరోధము. కీళ్ళకు మరియు చర్మ సంబంధిత చిక్కులు (ప్రధాన కాళ్ళకు చెందిన) ఇత్యాది ప్రతికూల ఫలాలు ఉంటాయి. వృద్ధులు, వయస్సు మీరిన వారు, అనారోగ్యముతో బాధపడుతున్న వారు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలి. కాని జన్మ రాశ్యాధిపతి గా ఇట్టి రాశిని వారిని ఎక్కువగా బాధపెట్టడు. కావున ప్రతికూలతలు తక్కువగానే ఉండు సూచనలున్నాయి.


రాహువు గోచారము: 

పంచమ స్థానమున సంచరిస్తున్న రాహువు మానసిక చింత మరియు ఒత్తిడిని అధికముగా ప్రసాదించు సూచనలున్నాయి. వత్సరాంతం వరకు కూడా ఇట్టి చిక్కులు ఉంటాయి. అనిశ్చితి, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు,మానసిక ఒత్తిడులు. అనాలోచిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. సెప్టెంబర్ నుండి చతుర్థ స్థానమున రాహువు అనుకోని మార్పులను, ఊహించని మార్పులను,ఒడుదుడుకులను ప్రసాదించు సూచనలున్నాయి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి.మీనము:

మీన రాశి వారికి ఈ సంవత్సరం దాదాపుగా శుభ ఫలాలే లభించు సూచనలున్నాయి.


గురు గోచారం: 

మార్చ్ చివరి వరకు అటుపిమ్మట జూలై మొదలు నవంబర్ వరకు రాజ్య స్థానమున గురు సంచారము మిశ్రమ లేదా ప్రతికూల ఫలములను సూచించు చున్నది. పలు విధములైన ప్రతికూలతలు, కార్య విఘ్నము, అవాంతరాలు అధికం, వృధా సంచారం, వృత్తి రీత్యా ప్రతికూలతలు ఇత్యాది ప్రతికూల ఫలాలు అధికంగా ఉంటాయి. ఆర్థికంగా మాత్రం అనుకూలంగానే ఉంటుంది. దానం సమయానుసారంగా అందుతుంది. విద్యార్థులకు మిశ్రమ లేదా శుభ ఫలాలు అందుతాయి. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. మార్చ్ చివరి నుండి జూన్ వరకు అటుపిమ్మట నవంబర్ నుండి వత్సరాంతం వరకు ఏకాదశ లాభ స్థానము లందు గురు శుభుడు. సర్వత్రా శుభ ఫలితాలు ఉంటాయి. చక్కని ఆర్థికాభివృద్ధి. ధన లాభము. కార్య సిద్ధి. తలపెట్టిన పనులు విజయవంతమగుట. తేజో వృద్ధి, కీర్తి లాభము, పదోన్నతులు, వ్యాపారులు మరియు విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు నెరవేరు సూచనలు.


శని గోచారం: 

వత్సరాంతం వరకు ఏకాదశ లాభ స్థానమున శని శుభుడు అగుట వలన తల పెట్టిన కార్యములందు విజయము, ఉద్యోగ మరియు వ్యాపారాభివృద్ధి, అధిక ధన లాభము, సర్వత్రా శుభ ప్రదమైన ఫలములు లభించు సూచనలున్నాయి. మనస్సు హాయిగా ఉండుట, తలపెట్టిన పనులు విజయవంతమగుట. సంతాన పరముగా అనుకూలము. విద్యార్థులకు వ్యాపారులకు అనుకూల సమయం. క్రొత్త అవకాశాలు లభించుట. పదోన్నతులు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. ఇత్యాదిగా గల శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి.


రాహువు గోచారము: 

సెప్టెంబర్ వరకు చతుర్థ స్థానమున వత్సరాంతం వరకు కూడా రాహువు ప్రతికూలుడగుట వలన తలపెట్టిన పనులందు ఒడుదుడుకులు అధికం. అవకాశాలు చివరి క్షణమున చేజారిపోవుట. నిర్ణయాత్మక శక్తి తగ్గుట. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కాని శని మరియు గురు గోచారము అనుకూలముగా ఉండుట వలన ఇట్టి ప్రతికూలతలు తక్కువగానే ఉంటాయి. సెప్టెంబర్ మొదలు తృతీయ స్థానమున రాహువు శుభుడు. ఇట్టి స్థానమున వత్సరాంతం వరకు శుభ ఫలితాలు ప్రసాదిస్తాడు. చక్కని కార్యసిద్ధి. ధన లాభము, ధైర్యము, కార్యానుకూలత, అనూహ్య ధన లాభము, సంపూర్ణ ఆరోగ్యము, చెవి ముక్కు మరియు గొంతుకు చెందిన చిక్కులు మాత్రం స్వల్పంగా ఉంటాయి.


గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్న గ్రహాలకు చేసుకోవాల్సిన శాంతులు:


గురు:

గురు భ మూలమన్త్ర జప శాంతులు. బ్రాహ్మణులకు పసుపు రంగులో గల వస్త్ర దానము. పేద విద్యార్థులకు చేయూతను అందించుట. శ్రీ దత్తాత్రేయ ఆరాధన.


శని:

శని భ మూలమన్త్ర జప శాంతులు. పేదలకు అన్నదానము. వృద్ధులకు మరియు రోగ గ్రస్తులకు సేవ చేయుట. తగిన విధంగా వారికి చేయూతను అందించుట. శ్రీ మహావిష్ణు ఆరాధనలు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం.


రాహువు:

రాహువు భ మూలమన్త్ర జప శాంతులు. శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన. శ్రీ దేవి సప్తశతి పారాయణాలు. శ్రీ లలితా సహస్రనామ పారాయణం. యోగాభ్యాసము వలన మనస్సు నిశ్చలముగా ఉంచుటకు ప్రయత్నించాలి.||శుభం భూయాత్||