Sri Matru Panchakam

Sri Adi Shankara Virachita Matru Panchakam

Sri Adi Shankara Virachita Sri Matru Panchakam  


  

ఓం శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః


శ్రీ శంకర భగవత్పాద విరచిత మాతృ పజ్ఞ్చకం


‘ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవాలి’


శ్రీ శంకర భగవత్పాదులు కేరళలోని కాలడి లో నంబూద్రి కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో తండ్రిగారు దివంగతులు అయినారు. తల్లి ఆర్యాంబ. శంకర భగవత్పాదుల వారు సంన్యాసత్వం స్వీకరించే ముందు తల్లిగారి ఆజ్ఞను అర్థిస్తారు. దానికి ఆర్యాంబ సరేనంటూ కూడా ఒక చిన్న నిబంధన పెడుతుంది. తన మరణించే సమయంలో తన వద్ద ఉండి తన కర్మకాండలన్నీ జరిపించాలని కోరుకుంటుంది. దానికి శంకరుడు ఒప్పుకుని సంన్యాస మార్గాన్ని ఎన్నుకుంటాడు. కొంత కాలానికి తల్లికి శరీరాన్ని వదిలివేసే సమయం ఆసన్నమౌతుంది. అది శంకరుల వారు తన దివ్య దృష్టితో గ్రహించి తక్షణమే తల్లి వద్దకు చేరుకుంటాడు. మరణ శయ్య పై ఉన్న తల్లిని చూసిన వెంటనే ఆయన నోటినుండి ‘మాతృ పజ్ఞ్చకం’ అనే 5 శ్లోకాల మాలిక వెలువడుతుంది. వేదాంతం లేకుండా తల్లి ప్రేమను చక్కగా వివరించిన ఇట్టి ‘మాతృ పజ్ఞ్చకం’ ప్రపంచ మాతృ దిన సందర్భంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మాతృ దినం రాగానే తల్లిని, పితృ దినం రాగానే తండ్రి గాని జ్ఞాపకం చేసుకోవడం కాదు. వీరు ఇరువురు కూడా నిత్య పూజనీయులు. పాశ్చాత్య సంస్కృతి వచ్చిన పిమ్మట ఈ విధంగా ప్రత్యేకమైన దినాలు వచ్చాయి. మన హిందూ సంస్కృతిలో సదా ‘మాతృ దేవో భవ – పితృ దేవో భవ’ అని ప్రతి నిత్యం ఈ ఇరువురిని ధ్యానం చేసుకోవడం మన ధర్మం. నాకు జన్మనిచ్చిన మాతాపితరులు నమస్కరిస్తూ వ్రాస్తున్న శ్రీ ఆది శంకర ‘మాతృ పజ్ఞ్చకం’:


మాతృ పజ్ఞ్చకం

హరిః శ్రీ గురుభ్యో నమః


ఆస్తాం తావదియం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యథా

నైరుచ్యం తనుశోషణం మలమాయీ శయ్యా చ సాంవత్సరీ |

ఏకస్యాపి న గర్భభారభరణక్లేశస్య యస్యాః క్షమో

దాతుం నిష్కృతిమున్నతోఽపి తనయః తస్యై జనన్యై నమః ||౧||

ప్రసూతి సమయంలో భయంకరమైన నొప్పిని భరించిన దానవు నీవు, నేను గర్భంలో ఉన్నపుడు నన్ను మోస్తూ నీవు నీ ఆరోగ్యాన్ని కోల్పోయి పూర్తిగా బలహీన పడిన దానవు, ‘మలమాయీ శయ్యా చ సాంవత్సరీ’ నేను జన్మించిన పిమ్మట ఒక సంవత్సర కాలం పాటు నన్ను నీతో కూడా పడుకోపెట్టుకోవడం వలన శయ్య ను మలమూత్ర మయం చేసిన నేను, అట్టి దుర్గంధాన్ని సంతోషంగా భరించావు; అంతేకాదు, నవ మాసాలు నన్ను గర్భంలో మోయడానికి నీవు పడ్డ కష్టాలు; ఇవన్నీ కూడా అత్యంత ఉన్నతమైన సంతతి ఏమి చేసినా కూడాను ఈ ఋణం తీరేది కాదు. ‘తస్యై జనన్యై నమః’అట్టి ఓ జననీ నీకు నమస్సులు.


గురుకులముపసృత్య స్వప్న కాలే తు దృష్ట్వా

యతిసముచితవేషం ప్రారుదో మాం త్వముచ్చైః |

గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం

సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః ||౨||

స్వప్నంలో నేను సంన్న్యాసి వేషధారణలో కనబడే సరికి బాధపడి మా గురుకులానికి వచ్చి పెద్దగా రోదించావు. ఆ సమయంలో నీ దుఃఖం ఆ గురుకులంలో ఉన్న వారందరికి బాధ కలిగించింది, అందరిని కలచివేసింది. అంతటి గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తూ ఉన్నాను.


న దత్తం మాతస్తే మరణసమయే తోయమపి వా

స్వధా వా నో దేయా మరణదివసే శ్రాద్ధవిధినా |

న జప్తో మాతస్తే మరణ సమయే తారకమనుః

అకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతరతులామ్ ||౩||

ఓ జననీ! సమయం మించి పోయాక వచ్చాను. నీ మరణ సమయంలో కొన్ని నీళ్ళు కూడా నీ గొంతులో నేను పోయలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి ‘స్వధా’ను కూడా ఇవ్వలేదు. ప్రాణం పోయే సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు అసమానమైన దయను చూపించు తల్లి!!


ముక్తామణి త్వం నయనం మమేతి

రాజేతి జీవేతి చిర సుత త్వమ్ |

ఇత్యుక్తవత్యాస్తవ వాచి మాతః

దదామ్యాహం తణ్డులమేవ శుష్కమ్ ||౪||

ఓ జననీ! నన్ను ప్రేమ లాలిస్తూ ‘నువ్వు నా ముత్యానివి! నా రత్నానివి! నా కంటి వేలుగువురా నాన్న! నువ్వు చిరంజీవి గా ఉండాలి’ అని ప్రేమగా పిలిచిన నీ నోటిలో – ఈ నాడు కేవలం కొన్ని ‘తణ్డులమేవ శుష్కమ్’ శుష్కమైన లేదా పొడిగా ఉన్న బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను క్షమించు తల్లీ!


అంబేతి తాతేతి శివేతి తస్మిన్

ప్రసూతి కాలే యదవోచ ఉచ్చైః |

కృష్ణేతి గోవింద హరే ముకుందే

త్వహో జనన్యై రచితోయమంజలిః ||౫||

నన్ను ప్రసవించే కాలంలో పంటి బిగువున ఆపుకోలేని బాధను ‘అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!’ అని అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన ఓ తల్లీ! నీకు నేను నమస్కరిస్తున్నాను.


ఇతి శ్రీ శజ్ఞ్కర భగవత్పాద విరచిత మాతృ పజ్ఞ్చకం సమాప్తం


నాస్తి మాతృ సమో ఛాయా నాస్తి మాతృ సమా గతిః |

నాస్తి మాతృ సమం త్రాణం నాస్తి మాతృ సమా ప్రియ ||

మాతృ మూర్తిని మించిన ఛాయా లేదు (ఇట్టి ఛాయలో మనుజుడు చల్లగా జీవించ గలడు. ఎంతటి ఎండలోనైనా కూడా చల్లదనాన్ని ప్రసాదించు నది, ఎన్ని కష్టాలు ఉన్నా ఉపశమనాన్ని ప్రసాదించు నది). మాతృ మూర్తిని మించిన ఆశ్రయం మరొకటి లేదు. మాతృ మూర్తిని మించిన రక్షణ మరెక్కడా లేదు. మాతృ మూర్తిని మించిన జీవన దాత మరోవరూ ఈ సృష్టిలో లేరు.


మాతృ పజ్ఞ్చాకాన్ని చదివిన ప్రతి ఒక్కరి కంటి వెంట తప్పనిసరిగా నీరు రావాల్సిందే. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఈ నాడు కనీసం ‘ఎలా ఉన్నారు?’ అని అడిగే సంతానం కూడా లేరు. నేను కొంత కాలం క్రితం ఒక వృద్ధాశ్రమానికి వెళ్లాను. అందులో వృద్ధులైన తల్లిదండ్రులు, పిల్లల ప్రేమకు నోచుకోని వారిని ఎంతోమందిని చూసాను. వారి కష్టాలు వింటే కంటతడి పెట్టని వారుండరు. ధనార్జన ప్రధాన ధ్యేయంగా ఈనాడు ఎంతోమంది విదేశాలకు వెళ్తున్నారు. అనివార్య పరిస్థితులందు తల్లిదండ్రులను భారతదేశంలో వదిలి వెళ్తున్నారు. కనీసం వారిని ఎలా ఉన్నారు? అని ఆప్యాయంగా పలకరించని వారు ఎంతో మంది ఉన్నారు. వారి స్థితిగతుల గూర్చి కనీసం పట్టించుకోని వారున్నారు. అలాంటి వారు ప్రధానంగా ఈ మాతృ పజ్ఞ్చాకాన్ని చదవాలి. ఇది వారిలో తప్పక మాత్రపు తెస్తుందని నేను ఆశిస్తున్నాను.


సృష్టిలో గల మాతృ మూర్తులందరికి, ప్రేమ అనురాగాలను పంచే సంపూర్ణ స్త్రీ జాతికి నమో నమః


నమిలికొండ విశ్వేశ్వర శర్మ

image40