Sri Bhagavatam

'Sri Bhagavata Adhyatmika Prasthanam' - 'Sri Bhagavata' - 'The Spiritual Enlightenment'

 

Introduction - ఉపోద్ఘాతము


శ్రీ   భాగవతం ~ ఆధ్యాత్మిక ప్రస్థానం


       శ్రీ భాగవతం గ్రంధం జ్ఞాన కారకం , మోక్షకారకం. ఈ భాగవతం లో ఎన్నో రహస్యాలున్నాయి. నిజానికి భాగవతానికి వ్యాఖానం చేయడం గొప్ప సాహసం కూడా. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భారతీయ అధ్యాత్మికత, తత్త్వశాస్త్రం చదువుకున్న వాళ్ళు మాత్రమే శ్రీ భాగవతానికి వ్యాఖ్యానం చేయగలరు.  


        శ్రీ భాగవతం లో ఎందరో భక్తులు తమదైన రీతిలో ఆధ్యాత్మిక సాధన చేశారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలను పొందారు. సృష్ట్యాదినుండీ  శ్రీ మహావిష్ణువు ధరించిన  అవతారాలన్నీ ఈ భాగవతం లో  కనిపిస్తాయి. ఒక్కో ఆవతారం లో  ఒక ప్రత్యేక తత్త్వం, స్వరూపం, శక్తి , ఒక విశిష్ట  జ్ఞానబోధ , భక్తులను అనుగ్రహించే విలక్షణ సంవిధానం కనిపిస్తాయి.  


         ఒక్కో యుగం లో ఒక ప్రత్యేక ఆవశ్యకత , ఆ కాలానికి అవసరమైన జ్ఞానం, పరిణామం చెందుతున్న మానవాళి స్థితి ని బట్టి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో కూడా వైలక్షణ్యం కనిపిస్తుంది , ఒక దర్శనం కలుగుతుంది. రామాయణ , మహాభారతాది ఇతర గ్రంధాలను చదివేటప్పుడు కన్నా ,  శ్రీ  భాగవతాన్ని అధ్యయనం చేసేటప్పుడు మనం ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి.


        శ్రీ భాగవతం అనగానే, “ ఇందులో కేవలం శ్రీ కృష్ణుడి కధ ఉంటుంది” అనే సామాన్య భావన ప్రజల్లో వ్యాప్తి లో ఉంది.  శ్రీ కృష్ణావతారం ఇందులోని పన్నెండు స్కంధాల్లో రెండింటిలోనే ఉన్నది. అనేక యుగాల్లోని భక్తుల , భాగవతుల కధలు, వారి జీవితాల్లోని అత్యంత వేదనా భరితమైన పరిస్థితులు, వారి సాధనలు , వారు పొందిన దర్శనాలు మనకి కనిపిస్తాయి.


         ఎంతటి కఠినమైన కర్మ లు ముంచెత్తుతున్నా , భగవంతుడు పరీక్షిస్తున్నా,  సద్గురువుల ఉపదేశం తో జ్ఞానం పొందడానికే , మోక్షం సాధించడానికే ఆ భక్తులందరు తపించారు. అద్భుతమైన మంత్ర శాస్త్రం కూడా ఇందులో దాగి ఉంది. కొన్ని విశేష సందర్భాల్లో ఈ మంత్ర శాస్త్రం బోధించబడింది. దానిని మనం స్వీకరిస్తే మన జన్మ పునీతమవుతుంది. 


        కర్మ సిద్ధాంత సారం , పునర్జన్మ రహస్యాలు, మానవుడి మహా ప్రస్థానం , సృష్టి పరిణామం, మానవుడి స్వ స్వరూపం మొదలైన ఆధ్యాత్మిక సారాన్నంతటినీ  సంస్కృత భాగవతం లో వేద వ్యాసుడు అందించాడు. దానిని తేట తెలుగు లో పోతన అందించాడు.


           వేద వ్యాసుడిది జ్ఞాన దృష్టి , పోతన ది భక్తి దృష్టి. వ్యాసుడిది బుద్ధి వివేచన . పోతనది హృదయాన్ని భక్తి తో నింపె హృదయ లాలిత్యం. హృదయం, బుద్ధి రెండు ఎలా  సమ్మిళితం చేస్తే, ఆత్మజ్ఞానం కలుగుతుందో భక్తుల కధల్లో వారిద్దరూ బోధించారు.


          ఏ భక్తులు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారు ? ఎటువంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నా, శ్రీ హరిని హృదయ మధ్యం లో నిలిపి , జీవితాన్ని ఎలా దర్శించారో  మనం తెలుసుకొంటే, మన జీవితాలకి  ఒక అద్భుతమైన మార్గ దర్శనం కలుగుతుంది. ఈ లక్ష్యం తోనే నేను మీ అందరితో ఈ

భాగవతాన్ని పంచుకుంటున్నాను. 


 డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్ 

image41

Sri Bhagavatam

'Srimad Bhagavatam - Adhyatmika Prasthanam' - 'Spiritual Enlightenment'

Srimad Bhagavatam - Adhyatmika Prasthanam - Spiritual Enlightenment on Sri Krishna's Consciousness

 

శ్రీ భాగవతం ~ ఆధ్యాత్మిక ప్రస్థానం – 002


అహంకారాన్ని గుర్తించడమే చాలా కష్టం. అధికారం ధనం యవ్వనం సౌందర్యం - ఈ నాలిగింటి లో ఏ ఒక్కటి ఉన్నా అహంకారం తో కూడిన మాటలు అప్రయత్నం గా నోటి నుండి వెలికి వస్తాయి. శక్తి ని సంపాదించుకున్నా అది ఒక అధికారమే.


విద్య నిజానికి వినయాన్ని ఇవ్వాలి. మూర్ఖుడికి అది కూడా అహంకారాన్ని కలిగిస్తుంది. ధనం వల్ల శక్తి కానీ అధికారం వల్ల వచ్చిన శక్తి కానీ నిగ్రహం తో ప్రజలకి మేలు చేయాలి. తపోశక్తి కూడా నిగ్రహం లేక పోతే ప్రజలకి ఎంతో అపకారం చేస్తుంది. ఎందరో. మహానుభావులు. ఆత్మ సంయమనం లేక పోవడం వల్ల శాపాలు పెట్టి తమ తపఃశ్శక్తి ని కోల్పోయారు. అందుకే పతంజలి మహర్షి ముందుగా శమం చెప్పాడు. అంటే మనస్సు ని నిగ్రహించడం ఇది ఆధ్యాత్మిక ప్రస్థానం లో ధ్యానం చేసే వారికి మొదటి సాధన.


మనకి కానీ మన వాళ్ళకి కానీ ఒక ఆపద అవమానం దుఃఖం వచ్చినప్పుడు మనలో క్రోధం కట్టలు త్రెంచుకుని ప్రవహిస్తుంది ఆ క్షణం లో నోటినుండి ఎంత కఠినమైన మాటలు వస్తాయో ఊహించ లేము. ఎవరినైనా ఎంత మాట ఐనా అనే ప్రమాదముంది. మనస్సు ని నిగ్రహించడం వాక్కుని నిగ్రహించడం నిజమైన ఆధ్యాత్మికత. దీనికి ఎంతో సాధన కావాలి భక్తి ఆధ్యాత్మికత గా పరిణామం చెందాలి. 


ఉత్తములు తాపసులు భాగవతోత్తములు తమకు జరిగిన మాన అవమానాలను పరిగణించరు. పరీక్షిత్తు మహారాజు వనం లో వేటాడుతూ ఉండగా, అతడికి మౌనంగా తపో దీక్ష తో ఉన్న శమీక మహర్షి కనిపించాడు. దప్పిక గా ఉంది మంచినీరు ఇవ్వమని పరీక్షిత్తు అతడిని వేడుకుంటాడు. తపస్సు లో ఉన్న శమీకుడు గమనించడు . దాహం తో ఉన్న తనకి మంచినీరు ఇవ్వ లేదని కోపం వచ్చి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి, శమీకుడి మెడలో ఒక చచ్చిన పాము ను వేసి పరీక్షిత్తు వెళ్ళిపోతాడు. పర్ణశాలకి వచ్చిన కుమారుడు శృంగి, అక్కడ గుర్రపు డెక్కల గుర్తులు చూసి, ఎవడో ఒక రాజు తన తండ్రి శమీకుడి మెడ లో చచ్చిన సర్పాన్ని వేశాడని గ్రహించాడు. మహా క్రోధం తో చేతి లోకి జలాన్ని తీసుకుని, “దుర్మద క్రీడా చరించు రాజు హర కేశవు లడ్డిన నైనా చచ్చు బో ఏడవనాడు తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతిన్ “ అనగా “ఈ పని చేసిన వాడు నేటికీ ఏడవనాడు హరి హరాదులు ఆడ్డం వచ్చినా తక్షకుడి భయంకర విషాగ్ని జ్వాల చేత కాటు వేయబడి మరణించు గాక” అని భయంకరంగా పరీక్షిత్తుని శపించాడు. జరిగింది తెలుసుకుని శమీకుడు ఎంతో విచారిస్తాడు. పుత్రుడు తో ఇలా అంటాడు.


పొడిచిన దిట్టిన గొట్టిన 

బడుచుందురు గాని పరమ భాగవతులు డా 

రోడబడరు మారు సేయగ 

గొడుకా ! విభుడెగ్గు సేయ గొరడు నీకున్ .

చెలగరు కలగరు సాధులు 

మిళితములై పరుల వలన మేలున్ కీడున్ 

నెలకొనిన నైన నాత్మకు 

నొలయవు సుఖ దుఃఖ చయము లుగ్రము లగుచున్ -- శ్రీ భాగవతం ప్రధమ స్కంధం 486, 487


కుమారా ! కొట్టినా తిట్టినా తాపసులు, భాగవతోత్తములు పరమ భక్తులైన వారు శాంతం తో భరిస్తారే కానీ , ప్రతీకారం చేయడానికి అంగీకరించరు. (శాపాల వల్ల తపో ధనం అంతా క్షయం అయి పోతుంది) నీ శాపానికి ప్రతి శాపం ఇవ్వగలిగిన సమర్థత ఉన్నా ఆ రాజు శాపం పెట్టడు. సజ్జనులు ఇతరులు చేసిన ఉపకారానికి పొంగి పోరు . అపకారానికి క్రుంగి పోరు. మహాత్ముల ఆత్మలని సుఖ దుఃఖాలు ఆవహించవు. సజ్జనుడు అయిన రాజు కి ఆపద కలిగితే రాజ్యమంతా క్షోభిస్తుంది. ఆ పాపం కూడా మనదే అవుతుంది పుత్ర. మనం కూడా “ఎంత తప్పు కి ఎంత శిక్ష“ అనే సంయమనం పాటించాలి. మనం ఒకరికి శిక్ష వేస్తే దాని ఫలం మరొకరు అనుభవించవచ్చు. 

ఆ శ్రీకృష్ణుడు ప్రియ మిత్రులందరికీ వివేకాన్ని శాంతాన్ని ప్రసాదించుగాక. 


 

శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం - 3


ఆధ్యాత్మిక ప్రస్థానం లో వేగం గా ప్రయాణం చేయాలని కోరుకునే వారు నిరంతరం తమని తాము పరిశీలించుకుంటూ ఉండాలి. ఇతరులని నొప్పించడం ఎంత తప్పో...నొచ్చుకుంటు ఉండడం ..దేనికో ఒక విషయానికి చింతిస్తూ ఉండటం కూడా అంతే తప్పు. "నేను కాబట్టి ఇన్ని సమస్యలు అనుభవిస్తూ ..ఇంత ధైర్యం గా ఉన్నను, అందరూ సుఖ పడిపోతున్నారు.." అనుకుంటూ తన మీద తానే జాలి పడి పోతుంటారు. దీనినే SELF PITY అంటారు. ఇది చాలా సమస్యలు తెస్తుంది. అహంకారాన్ని పెంచవచ్చు, లేదా విపరీతం గా కృంగి పోవచ్చు.


కర్మ సిద్ధాంతం ప్రకారం ‘సర్వం స్వయం కృతమే’. ఎందరో మహానుభావులు కూడా సర్వ సమర్థులై ఉండి కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రపంచం లో మనం ఒక్కళ్ళమే కష్టాలు పడిపోతున్నామని అనుకుంటాము. మనల్ని చూసి" అయ్యో! అనే వాళ్ళు , సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరా? అని ఆక్రోశించిన సందర్భాలూ మన జీవితం లో ఉంటాయి. మహా శక్తిమంతులు అయి ఉండి, ఎన్నో దైవ శక్తులు తోడు ఉన్న వాళ్ళు కూడా, మనకంటే ఊహాతీతంగా కష్ట పడటం చూస్తుంటే, మనకో సత్యం తెలుస్తుంది. ప్రతి కష్టం మనకి ఒక శక్తి ని ఇస్తుంది. దుష్కర్మని దూరం చేస్తుంది. సహనాన్ని ధైర్యాన్ని కలిగిస్తుంది. పాండవులు అరణ్యాల్లో ఉండి ఎన్నో అవకాశాలు శక్తులు దైవ కృపలు సంపాదించుకున్నారు. ఆ కష్టాలు వాళ్ళకి వరాలు అయ్యాయి. 


భాగవతం లో భీష్ముడు పాండవులని తలచుకుని ఇలా చింతిస్తాడు. 

రాజట ధర్మజుండు, సుర రాజ సుతుండట ధన్వి , శాత్రవో

ద్వేజకమైన గాండీవము విల్లట , సారధి సర్వభద్ర సం

యోజకుడైన చక్రి యట, ఉగ్ర గదాధరుడైన భీము డ 

య్యాజీకి డోడువచ్చునట , యాపద గల్గుటేమి చోద్యమో !

శ్రీ మద్భాగవతం - ప్రధమ స్కంధం 211.


ధర్మరాజంతటి వాడు రాజట! మహావీరుడైన దేవతల రాజు అయిన ఇంద్రుడి కుమారుడు అర్జునుడు యుద్ధం లో నిలచాడట. శత్రు భయంకరమైన గాండీవము అతడి ధనుస్సు యట. సారధీ గా చక్రము ధరించిన శ్రీ కృష్ణుడు నిలిచాడట. ప్రచండ గదా దండ ధారి అయిన భీముడు కొండంత అండట. ఇంతటి సహాయ సంపత్తి కలిగినా పాండవుల కి అరణ్య వాస అజ్ఞాత వాసాలు తప్ప లేదు ఇదేమి చోద్యమో!! 


మనం అందరం ఎంతటి కష్టాలు అనుభవించవలసి వచ్చినా, అవి మనకి గొప్ప స్ఫూర్తి ని శక్తి కలిగిస్తాయని, మన దుష్కర్మలని కరిగిస్తున్నాయని గ్రహించాలి. భగవంతుడిని కూడా ఈ కష్టాలు తొలగించమని కోర కూడదు. “నాతో తోడు ఉండు కృష్ణా !" అని ప్రార్థించాలి.

ఆ వెన్న దొంగ మీ కష్టాలన్నీ ఎత్తుకు పోవుగాక. 


------------------------------------


 

భాగవత చాతుర్మాస్యం - ఆధ్యాత్మిక ప్రస్థానం - 4


ఆధ్యాత్మిక సాధన చేస్తున్నవారు నిరంతరం తమలో చెలరేగే భావోద్రేకాలని, అనురాగాలు, పక్షపాతాలని గమనిస్తూ ఉండాలి.మనస్సు ఎప్పుడు కొందరు అయినవారని, కొందరు కానివారని చెబుతుంటుంది. స్వధర్మం చేయవలసి వచ్చినప్పుడు .మనస్సు చూపే ఈ పరస్పర విరుద్ద భావాలు తీవ్ర సంఘర్షణ ని కలిగిస్తాయి...మనం అందరం దీనిని అనుభవిస్తున్నాము.. ఇది సత్యం..మనం ఒక్కసారి కురు పితామహుడు భీష్ముడిని ఒక్కసారి తలచుకోవాలి. బహుశా ఆయన అనుభవించిన ఘోరమైన మానసిక సంఘర్షణ. మనకి ఎన్నో పాఠాలు చెబుతుంది.


కురుపితామహుడు భీష్ముడు ఎటువంటి పరిస్థితులోను తన కర్తవ్యాన్ని మరచి పోడు. ఎవరి సమక్షం లో ఉన్నాడో వారు ఎటువంటి మహానీయులో కూడా మరచిపోడు. అత్యంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా, తానే వారిని వధించడానికి పూనుకున్నా, వారి లోని ఔన్నత్యాన్ని స్మరిస్తూనే ఉంటాడు. భగవంతుడి నే ఎదిరించి పోరాడుతున్నా, కర్తవ్యాన్ని. మరచి పోడు, ఆత్మార్పణ కి. వెనుకాడడు. ఇది మనకెంతో ఆదర్శం.


సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు మహాభారత యుద్ధం లో తన ముందు అర్జునుడి రధ సారధి గా కనిపిస్తున్నా, కర్తవ్యం మరిచి పోకుండా, శరాలు ఆయన పై గుప్పించాడు. లీలలు మాయల తో నటన సూత్రధారి శ్రీకృష్ణుడు క్రోధాన్ని అనుభవించడుగా అభినయించాడు. సుదర్శన చక్రాన్ని చేతబట్టి తనపైకి దూకుతున్న శ్రీ హరి ని చూసి కన్నీళ్లు కారుస్తూ ఇలా అంటాడు:


"కుప్పించి ఎగసిన గుండలంబుల కాంతి

గగన భాగం బెల్ల గప్పి కొనగ 

నురికిన నోర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి గదల.

జక్రంబు జేబట్టి చనుదెంచు రయమున బై నున్న పచ్చని పటము జార

నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ”

"గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు

విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టి 

దేరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు"

శ్రీ భాగవతం. ప్రధమ స్కంధం 222 పద్యం


"ఆనాడు రణ క్షోణి లో నా బాణ వర్షాన్ని భరించలేక, నామీదికి దూకే నా స్వామి వీర గంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కన్నులకి కట్టినట్లు కనిపిస్తున్నది. కుప్పించి పై కేగరినప్పుడు కుండలాల కాంతులు గగనమంతా వ్యాపించాయి. ముందుకు దూకినప్పుడు బొజ్జ లోని ముజ్జగాల బరువు భరించలేక భూమి కంపించి పోయింది. చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచె వేగానికి పైనున్న బంగారు పట్టు వస్త్రం జారీ పోయింది. నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవద్దని మాటి మాటికి కిరీటి వెనక్కి లాగుతున్నా, లెక్క చేయకుండా "అర్జునా! నన్ను వదులు. ఈనాడు భీష్ముని రూపుమాపి నిన్ను కాపాడుతాను.." అంటూ ఏనుగు పైకి దూకే సింహం లా నా పైకి దూకే ఆ గోపాల దేవుడే నాకు రక్ష.

"ఇతడు నా నమ్మిన బంటు. ఇతడిని కాపాడటం నా కర్తవ్యం సుమా. అంటూ అర్జున సారధ్యాన్ని అంగీకరించి, నోగల మధ్య కూర్చుని, ఒక చేతిలో వయ్యారంగా పగ్గాలు పట్టుకుని , మరొక చేతిలో కొరడా

ధరించి , పరమోత్సాహం గా అశ్వాలను కదిలిస్తూ, చూసేవాళ్లను ఆశ్చర్యం లో ముంచుతున్న పార్ధ సారధిని ప్రశంసిస్తున్నాను.


మాటలతో, మందహాసాలతో, ప్రవర్తన లతో, ప్రణయ కోపాలతో, వాలు చూపులతో, గోప కాంతల వలపు లను దోచుకునే వాసుదేవుని మనస్సు లో మరీ మరీ సేవిస్తాను. అంటూ ఆ శ్రీహరికి ఆత్మార్పణ చేసుకున్నాడు. కురుపితమహుడు.


ఇన్ని అభినయాలు చేసి భీష్ముడికి మోక్షం ఇచ్చిన శ్రీ కృష్ణుడు, ప్రియ మిత్రులందరికీ సకల సౌభాగ్యాలు

ప్రసాదించుగాక. 


.....................................భాగవత చాతుర్మాస్యం..ఆధ్యాత్మిక ప్రస్థానం - 5


ఐశ్వర్యాలని. భోగాలని సంపదలను ఎంత కాలం అనుభవించినా వాటి పై మొహం తీరడం ఎంతో కష్టం. కుటుంబం తో ఇంకా అద్భుతమైన సిరి సంపదలను అనుభవిస్తూ, జీవించాలనే అనిపిస్తుంది. ఒకరోజు వీటన్నింటినీ వదిలి వెళ్లాలని ప్రతి ఒక్కరికి తెలిసినా, మొహాలు త్రెంచుకోవడం ఎంతో కష్టం. మహారాజ భోగాలు జీవితాంతం అనుభవించినా, సమస్త ఆత్మీయ పుత్ర పరివారాలు తన కళ్ళ ముందు నశించినా,ధృతరాష్ట్రుడు మొహాలని వదలలేక పోతుంటే, విదురుడు ఇలా బోధిస్తాడు:


"కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులం ముందటామ్

గని ప్రాణేచ్చల నుండు జంతువుల నే కాలంబు దుర్లంఘ్య మై 

యనివార్య స్థితి జంపునట్టి నిరు పాయంబైన కాలంబు న

చ్చే నుపాంతంబున ,మారు దీనికి మదిం జింతింపు ధాత్రీస్వరా..!!


" రాజా ! ప్రపంచం లోని మానవులు బంగారు భవనాలను , పుత్ర కళత్ర మిత్ర పరివారాలను ఎప్పుడు ఎదురుగా చూసుకుంటూ, ప్రాణాల మీద తీపి పెంచుకుంటూ ఉంటారు. అయితే అతిక్రమించ లేని కాలం వారిని చంపి తీరుతుంది. కాలాన్ని ఎవరు ఎదిరించలేరు. ఏ ఉపాయాలు పని చేయవు. అటువంటి కాలం నీ సమీపానికి వచ్చి, నీ కోసం ఎదురు చూస్తోంది. మహారాజా దీనికి ప్రతిక్రియ ఏదైనా ఆలోచించండి.


"పుట్టంధుడవు, పెద్దవాడవు , మహా భోగంబులా లేవు, నీ

పట్టేల్లం జెడిపోయే; దుస్సహ జరాభారంబు పై గప్పే, నీ

చుట్టాలెల్లను బోయి; రాలు మగడున్ శోకంబునం మగ్నులై 

కట్టా దాయల పంచ నుండ దగవే కౌరవ్య వంసాగ్రణీ. !!


"ఓ కురుకుల శిరోమణీ !! అసలు నీవు పుట్టుకతోనే అంధుడవు. పైగా ఇప్పుడు ముడుకాళ్ళ ముసలి వైనావు. మహారాజ భోగాలన్నీ అంతరించాయి. అధికారం అడుగంటింది. భరించారని వార్ధక్యం పై బడింది. నా అన్నవారు అందరూ గతించారు. ఇప్పుడు ఈ విధం గా బ్రతికి చెడ్డ మీ భార్యాభర్తలు బండెడు దుఃఖం తో మునిగి తేలుతూ అయ్యయ్యో ! దాయాదులైన పాండవుల పంచ లో పడి ఉండటం ఏమంత బాగుంది.


"పెట్టితిరి చిచ్చు గృహమున బట్టితిరి ద దీయ భార్య, పాడ డవులకుం,

గొట్టితిరి, వారు మనుపగ నెట్లయిన భరియింప వలెనే. ఈ ప్రాణంబులన్!"


"మీరు పాండవుల కొంపకు చిచ్చు పెట్టారు. పాండవ పత్నిని నిండు సభ లో చెర బట్టారు. ఆ అమాయకులని అన్యాయం చేసి అరణ్యాలకి వెళ్లగొట్టారు. ఇప్పుడు ఈ విధం గా వారి అండ చేరి వారు పెట్టిన తిండి తిని ప్రాణాలు నిలుపుకుంటున్నారు..


"బిడ్డలకు బుద్ధి సె ప్పని , గ్రుడ్డికి బిండంబు వండికొని పోండిదే పై బడ్డాడని భీముమ్ డోర గొడ్డే ము లాడం గ కూ డు కుడిచెద వదిపా "


"ఆనాడు బిడ్డలకు బుద్ధి చెప్పని ఈ గ్రుడ్డి వాడు ఈ నాడు సిగ్గు లేకుండా మా ఇంటి మీద పడ్డాడు. ఈ కళ్ళు లేని కబొది కి ఇంత పిండం వండి పట్టుకెళ్లి పడేయండి" అంటూ భీముడు పలికె పరుష వాక్కులు వింటూ, ఆ దిక్కుమాలిన తిండి తింటూ, ఎలా ఉంటున్నావు మహారాజా !!


"ఇక ఈ జన్మ లో కన్న కొడుకుల ముఖాలు చూడలేవు కదా. వెనుకటి దర్పం తో జీవించ లేవు కదా. నీ మనుమల ముద్దు పలుకులు వినలేవు కదా. అగ్రహారాలు దానాలు గ్రహించడానికి బ్రాహ్మణులని రమ్మని పిలువ లేవు కదా. ఎందుకయ్యా ఇంకా ఈ బ్రతుకు...." ఈ విధం గా విదురుడు ధృతరాష్ట్రుడికి వైరాగ్యాన్ని ఉపదేశించాడు.


ఇంద్రియ నిగ్రహాన్ని చెబుతూ, భోగాల పై వ్యామొహాన్ని మనం అందరం ఎదో నాడు పరిత్యజించాలనే బోధ శ్రీ భాగవతం లో ఇలా వినిపించింది.

శ్రీ భాగవతం..ప్రధమ స్కంధం..పద్యాలు. 310..~. 314.


"ధనమే మనల్ని ఎప్పుడు కాపాడుతుంది" అని ప్రజల్లో ఒక నమ్మకం. అందుకే "ధనం మూలం ఇదం జగత్" అని కూడా లోకోక్తి. దనం ఏ రీతి లో సంపాదించినా లోకం పెద్దగా పట్టించుకోదు.


"మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక సంబంధాలే" అన్నాడు కార్ల్ మార్క్స్. డబ్బు ఏమి చేసి సంపాదించవన్నది కర్మ పునర్జన్మ లో చాలా పెద్ద విషయం. డబ్బు చితి లో కాలే వరకు మాత్రమే వెంట వస్తుంది. డబ్బు  సంపాదించడానికి ఎన్నుకున్న మార్గాలు జన్మ జన్మ లకి వెంట వస్తాయి. ఎందరి నోళ్లు కొట్టి సంపాదించిన ధనం ఈ జన్మ లోను సుఖము ఆనందము. ఇవ్వక పోగా జన్మ జన్మ కీ వెంటాడుతోంది.

"చేసిన పాపం కట్టి కుడుపుతోంది" అంటారు. ఇంకో ముఖ్య విషయం. ఇలా నీచంగా డబ్బు సంపాదించాలని బుద్ధి ప్రవృత్తి కూడా వచ్చే జన్మ కి వెంట వస్తుంది.


లోకోక్తి ఉన్నది "ఎవరు పుడుతూనే చెడ్డ వారు కాదు కదా" అని. కానీ ఏ గుణాలు ప్రవృత్తులు లక్షణాలు స్వభావం అన్నీ పుట్టుక తోనే నిద్రాణం గా ఉంటాయి. ఒక్కో వయస్సు లోఒక్కొ గుణం వెలికి వస్తుంది. మనం ఎన్నో నిధులు మన తో నిత్యం ఉండాలని ఉంటాయని భావిస్తుంటాము. కష్టపడి సంపాదించుకుంటాం కూడా. మనం సంపాదించుకున్న ధనం "కొద్ది కాలమే మనకి అందుబాటు లో ఉండదు" అని తెలిసినా ఎంతో వేదనక గురి అవుతున్నాము. శాశ్వతం గా ఒక రోజు ఈ నిధిని వదిలి వెళ్లక తప్పదు అని తెలిసీ. ఎందుకీ దుఃఖం మనసా! 

శ్రీ భాగవతం లో శుక్రాచార్యుడు బాలి చక్రవర్తి తో 


"కులమున్ రాజ్యము తేజము నిలుపు .....విశ్వంభరుడు...వీడు 

విష్ణువు. దానం గీనం వద్దు " అని బోధించాడు.

" కారే రాజులు !రాజ్యముల్ కలుగవే ! గర్వోన్నతిన్ పొందరే ! 

వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే ! ! " భూమి పై

పేరైనం కలదే !శిబి ప్రముఖులుం ప్రీతిన్ యసః కాములై 

ఈరె కోర్కెలు వారిన్ మరచిరే ఇక్కలముం భార్గవా !"

పోతన భాగవతం.8 వ స్కంధం 590 పద్యం


అయ్యో! మూడు లోకాలు కాచే ఆ హస్తం నన్ను మూడు అడుగుల నేల యాచిస్తోంది. శుక్రాచార్యా! ఎవరయ్యా ధనం మూట కట్టుకుని వేళ్ళ గలిగినవాళ్ళు! ఓ మనసా! నిత్యం గా సత్యం గా మనతో వచ్చే నిధులు చూడాలి. నిత్యం ప్రియంగా మాట్లాడే వాక్కు ఒక నిధి. అల ఒకరికి ఆనందం కలిగించాలని కోరిక, వారు ఆనందిస్తూ ఉంటె చూడాలనే కోరిక వలన అలా ప్రియభాషణం చేయ గల శక్తి క్రమంగా పెరుగుతుంది.


ఇది జన్మ జన్మ కీ ఒక సంపదగా మన లో వృద్ధి అవుతుంది. దీని తో బాటు ఒకరు మన మాటలకి నొచ్చుకుంటే మనం ఎంత మాత్రం సహించలేము. దీని వలన ప్రేమ కరుణ మనలో పేరుగుతాయి. ఎంతో ప్రియంగా మాట్లాడే వారిని మనకి తెలియకుండానే ఆరాధిస్తాము. వారి గురించి చెబుతాము. ఆ మాటలని మననం చేస్తాము. చివరికి మనలో ఆ గుణం ఒక మహాద్భుత సంపద గా నిలిచి. ఆదర్శవంతం అవుతుంది. ఇది తరగని శాశ్వత నిధి గా మన వెంట జన్మ జన్మలకీ వస్తుంది. 


...........


  

శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం - 6


మానవుడు జీవితం లో తన మృత్యువు గురించి తప్ప మిగిలిన అన్ని విషయాల గురించి ఆలోచిస్తాడు. 

మృత్యువు ఇప్పట్లో దరి చేరదని అనుకుంటాడు. మరికొంతమంది, భక్తి ఆధ్యాత్మిక విషయాల గురించి చెబితే, "ఇప్పుడు నాకేమంత వయస్సు వచ్చింది. ఇవన్నీ వినడానికి. .." అనడం కూడా వినిపిస్తుంది.

 మనం ఈ భూలోక జీవితం లో ప్రతి ఒక రోజు గడిస్తే, మన ఆయుర్దాయం లో ఒక రోజు గడిచి పోయిందని గుర్తించాలి. జ్ఞానాన్ని పొందడానికి, సేవ చేయడానికి, ప్రేమ ని పంచడానికి ఒక అవకాశం అయిపోయిందని గ్రహించాలి. కాలం యొక్క విలువ గుర్తిస్తే, ఎంతో పొందవచ్చు, సద్వినియోగం చేసుకోవచ్చు. మనం చేయాలనుకున్న పని కి సమయం తప్పకుండా దొరుకుతుంది. ఎప్పుడో ఒకప్పుడు చేద్దామని అనుకున్న పనికి  అసలు సమయమే దొరకదు. జ్ఞాన దృష్టి తో జీవితాన్ని చూసిన వారు అతి కొద్ది కాలం లోనే అద్భుతమైన ప్రగతి సాధించగలరు.


పరీక్షిత్తు మహారాజు. ఎంతో దుఃఖం తో కృంగి పోయి ఉంటాడు. వేటాడుతూ, దాహం తో అడవిలో తిరుగుతూ ఉండగా, తపస్సు చేసుకుంటూ ఉన్న శమీక మహర్షి ని మంచినీరు ఇమ్మని అడిగితే, ఆయన తపస్సు లో మునిగి, మౌన ముద్ర లో ఉంటే, అది అహంకారమని భావించి, ఆయన మెడ లో ఒక చచ్చిన పాము వేసి వెళ్ళిపోతాడు. ఆశ్రమానికి వచ్చిన శమీక పుత్రుడు శృంగి , ఈ పని చేసిన రాజు ఏడు రోజుల్లో తక్షకుడి విషానికి గురి అయి మరణిస్తాడని శాపం పెడతాడు.


పరీక్షిత్తు దుఃఖం తో మునులతో ఇలా అంటాడు:

ఓపిక లేక చచ్చిన మహారగముం గొని వచ్చి కోపినై,

తాపసు మూపు పై నిడిన దారుణ చిత్తుడ మత్తుడం మహా

పాపుడ మీరు పాప తృణ పావకు లుత్తము లయ్యలార , నా

పాపము వాయు మార్గము కృపాపరు లార విధించి చెప్పరే!!


"దయానిధులైన తపో నిధులారా ! నేను సహనం కోల్పోయి, కోపాన్ని ఆపుకోలేక చచ్చిన సర్పాన్ని తెచ్చి మునీంద్రుని మూపు పై వేసిన పాపాత్ముడిని, ప్రమత్తుడిని. క్రూర చిత్తుడని. పాపమనే అరణ్యాన్ని దహింప చేసే పావకులు. సం యమీంద్రులు. అయ్యలారా !నా పాపం పరిహారం అయ్యే మార్గం సెలవీయండి. తక్షకుడి భయంకర విషాగ్నికి సంకోచం లేకుండా నా శరీరం సమర్పిస్తాను. శ్రీ కృష్ణ కధా శ్రవణం లో ఆసక్తి కలిగేలా మీరు అనుగ్రహించండి. హరి భక్తుల చరిత్రలు వినిపించి ఏడు దినాల్లో నాకు కైవల్యం ప్రసాదించండి" అని అంటాడు.


పరీక్షిత్తు మహారాజు దుఃఖాన్ని గమనించి, ఋషులు తర్కిస్తుండగా, శుక మహర్షి ప్రవేశిస్తాడు. పరీక్షిత్తు తో ఇలా అన్నాడు. "రాజా ! శ్రీ మహా విష్ణు ని తెలుసుకోకుండా మాయ మేయ సంసారం లో మోహాల్లో చిక్కి, వ్యామోహాల్లో తేలుతున్న వారు, ఈ సంసార బంధం నుండి ఎన్నటికీ బయట పడలేడు. ఒక్క క్షణమైనా హరి నామం స్మరిస్తే చాలు ..అది ముక్తిని ఇస్తుంది..


" కౌరవేశ్వర ! తొల్లి ఖత్వాన్గుడను విభుం డిల నేడు దీవుల నేలు చుండీ 

శక్రాది దివిజులు సంగ్రామ భూముల నుగ్ర దానవుల కు నోడి వచ్చి

తమకు దో డడి గిన ధర నుండి దివి కేగి దానవ విభుల నందర వధింప

వర మిత్తు మనుచు దేవత లు సంభాషింప జీవిత కాలంబు సెప్పు డిదియ

వరము నాకు నొండు వర మొల్ల ననవుడు నాయు ఒక ముహూర్త మంత తడవు

గల ద టంచు బలుక గగన యానమున న మ్మానవేశ్వరుండు మహికి వచ్చి"

శ్రీ భాగవతం రెండవ స్కంధం..9


"కౌరవ నాధా ! పూర్వం "ఖట్ వామ్గుడు" అనే రాజు సప్త ద్వీపాలను పరి పాలిస్తూ ఉండే వాడు. ఇంద్రాది దేవతలు యుద్ధం లో భీకరు లైన రాక్షసుల చేతిలో ఒడి పోయి ఆయన దగ్గరకు వచ్చి తమకు సాయపడమని ప్రార్థించారు. ఆయన భూలోకం నుండి వెళ్లి దానవ రాజులందరిని సంహరించాడు. అప్పుడు దేవతలు సంతోషించి ఆ రాజుని వరం కోరుకోమని అడిగారు". “నే నెంత కాలం బ్రతుకుతానో చెప్పండి. ఇదే నేను కోరే వరం. మరో వరం 

నాకు అవసరం లేదు " అన్నాడు. "నీకు ఆయువు ఇక ఒక ముహూర్త కాలమే ఉంది. అని దేవతలు అన్నారు. వెంటనే ఆ రాజు విమానం ఎక్కి భూలోకానికి వచ్చాడు.

సమస్త ఐశ్వర్యాన్ని సామ్రాజ్యాన్ని ప్రాణ ప్రియమైన భార్యల్ని పుత్రులని హితులని అందరిని ప్రగాఢమైన వైరాగ్యం తో పరిత్యజించాడు.


"గోవింద నామ కీర్తన గావించి భయంబు దక్కి ఖట్వంగ ధరి

త్రీ విభుఁడు సూ ర గోనియేను, గైవల్యము దొల్లి రెండు గడియల లోనన్”

శ్రీ భాగవతం రెండవ స్కంధం 11


"ఈ విధంగా కైవల్యాన్ని కోరి ఆ రాజు గోవింద నామ సంకీర్తనం చేస్తూ రెండు గడియల్లో మోక్షం పొందాడు.  ఓ రాజా! విను, నీకు ఏడు రోజు ల తరువాత కదా మరణం. అంత వరకు పర లోక సాధన మైన పరమ శుభాన్ని పొందడానికి ఎంతో సమయం ఉంది. హరి కధా శ్రవణం చేయి. భక్తి ని జ్ఞానం గా, జ్ఞానాన్ని వైరాగ్యం గా మార్చి యోగి వి కావాలి. రాజా! యోగి పాద మూలం తో మూలాధార చక్రాన్ని అనగా గుద స్థానాన్ని అదిమి పడతాడు. ఆ పై ప్రాణ వాయువును బిగపట్టి బొడ్డు వద్ద ఉన్న మణి పూరక చక్రానికి తీసుకు పోతాడు. అక్కడ నుండి హృదయం లోని అనాహత చక్రానికి, అక్కడ నుండి వక్షం లో ఉన్న విశుద్ద చక్రానికి, అక్కడ నుండి ఆ చక్రాగ్రముండే తాలు మూలానికి , అక్కడ నుండి కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రానికి ప్రాణ వాయువును తరలిస్తాడు. ఆ పైన కళ్ళు చెవులు ముక్కు నోరు, ఇవి మూసుకుని ఏ కోరికలు లేని వాడై అర్ధ ముహూర్త కాలం ఇంద్రియాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. తరువాత బ్రహ్మ రంధ్రం భేదించి పరబ్రహ్మ లో లీనమవుతాడు.

శ్రీ. భాగవతం...రెండవ స్కంధం 29.


మనం అందరం మనకి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేద్దాం. .కర్మల పరంపర నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ శ్రీ కైవల్యం పొందుదాం.


శ్రీ కృష్ణ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు


----------------------


శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 7


మీ గురించి మీకు తెలుసా? మీ అహంకారాన్ని మీరు గుర్తించే ప్రయత్నం చేసారా? మీ గురించి మీరు కొంచెం తెలుసుకోవడానికి ఒక చిన్న సాధన. 


 1. మీకు చాలా ఇష్టం అయిన ఒక వ్యక్తిని, విషయాలని, పుస్తకాలని నమ్మకాలని ఎవరైనా బాగా నిందిస్తూ అవమానిస్తూ మాట్లాడితే, మీ లో చెలరేగే భావోద్వేగాలని పరిశీలించండి.

 2. మీకు ఎంతమాత్రం ఇష్టం లేని వ్యక్తులు, విషయాలు, మీరు చాలా అన్యాయం అని భావించే విషయాలని సమర్థిస్తూ, పొగుడుతూ ఎవరైనా మాట్లాడితే, మీలో కలిగే భావోద్వేగాలని పరిశీలించండి.

3. మిమ్మల్ని ప్రత్యక్షం గా నిందిస్తూ కఠినంగా మాట్లాడుతూ 

ఉంటె, లేదా మిమ్మల్ని బాగా ప్రశంస ల తో ముంచెత్తు తు మాట్లాడే వారె చుట్టూ ఉంటె , మీలో కలిగే మనో భావాలని పరిశీలించండి.


మీలో ఉన్న అహంకారం మీకు అర్ధం అవుతుంది.

1. మన అహంకారం ఎన్నింటి తో నో తాదాత్మ్యం అవుతుంది. ప్రాధమిక స్థాయిలో నా శరీరమే నేను. ఇదో అహంకారం. "నేను అందం గా ఉన్నాను...అందం గా లేను.." ఈ భావాలు స్థిరం గా ఉంటాయి. దీనికి భంగం ఎవరైనా కలిగిస్తే కోపం వస్తుంది. పొగిడితే చాలా ఆనందం కలుగుతుంది. ఈ రెండు అహంకారాలే. ఈ శరీరం నేను కాదు . "నేను ఆత్మ ని", అనే భావం ఎప్పుడూ ఉండాలి

2. మీ కోరికలు కూడా మీకన్నా భిన్నమయినవి. అవి మీవి కావు. ఒక్కోసారి ఇతరుల కోరికలు కూడా మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు.. వీటిని ఎవరైనా విమర్శించి, ఇవి తప్పు అంటే మీకు కోపం రావచ్చు. అహం దెబ్బ తింటుంది.

3. మీరు ఎంతో కాలం కష్టపడి సంపాదించుకున్న జ్ఞానాన్ని ఎవరైనా ఒక్క మాటలో నిందిస్తూ విమర్శిస్తే తట్టుకోవడం కష్టం. అహం చాలా దెబ్బ తింటుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు మనం సంపాదించిన జ్ఞానం లో మనమే బంధించబడి, అంత కన్నా భిన్నంగా ఎవరైనా చెబితే ఎంతో బాధ పడతారు. ఆ జ్ఞానం తో తాదాత్మ్యం అయిపోయి అదే నేను అనుకుంటూ అహంకారం పెంచుకుంటూ ఉంటాము. శాస్త్ర పాండిత్యం ఒక్కోసారి అహంకారాన్నే పెంచుతుంది. అందుకే, అది శంకరులు "డుకృహ్ కరణాలు పనికి రావన్నాడు – నహీ-నహీ రక్షతి డుకృహ్ కరణే". కాబట్టి జ్ఞానం నిండిన బుద్ధి తపించే మనస్సు కూడా "మనం" కాదు.

 4. నా ఇల్లు, నా వస్తువులు, నా ఆస్తి, నా భోగాలు, నా భార్య, నా పిల్లలు. వీటి లో వేటిని ఎవరైనా నిందిస్తే, పిచ్చి 

కోపం వస్తుంది. ఇదంతా అహంకారమే. మీ గురించి మీకు తెలుసా? మనలో అహంకారం ఎన్నో రూపాల్లో ఉంటుంది. గుర్తించడం ఎంతో కష్టం. ఈ అహంకారం మానవుడి లో ఎలా ఏర్పడుతున్నదో శ్రీ భాగవతం వివరం గా చెబుతున్నది.


ఆ భగవంతుడి చేత మాయ ఏర్పడుతుంది. ఈ మాయ వల్ల కాలము జీవుల అదృష్టము, స్వభావము అప్రయత్నం గా సిద్ధిస్తాయి. సృష్టి కార్యం కోసం వివిధ రూపాలను తయారు చెయ్యడం కోసం వీటిని ఆయన ఉపయోగించుకున్నాడు. ఈశ్వరుడి చేత అధిష్ఠింప బడిన మహాత్ తత్త్వం ద్వారా కాలం నుండి త్రిగుణాలు, స్వభావం నుండి పరిణామం, జీవుడి అదృష్ట రూపం లో ఉన్న కర్మ నుండి జన్మ సిద్ధించింది.

రజో గుణం చేత సత్త్వ గుణం చేత,వృద్ధి పొందిన మహాత్ తత్త్వం వికారానికి లోనయ్యింది. దీని నుండే 

తమోగుణం ప్రధానం గా కలిగింది, పంచ భూతాలు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల రూపం తో అహంకారం జనించింది. ఈ అహంకారం మళ్లీ వికారానికి లోనై ద్రవ్య శక్తి అయిన తామసం అనీ, క్రియాశక్తి అయిన రాజసమనీ, జ్ఞానశక్తి అయిన సాత్త్విక మనీ మూడు రూపాలు ధరించింది. తామసాహంకారం నుండి ఆకాశం పుట్టింది. శబ్దం ఆకాశానికి గుణం అయింది. ఆకాశం నుండి స్పర్శ గుణ ప్రధానమైన వాయువు పుట్టింది. తనకి కారణమైన ఆకాశం లోని శబ్దం, తన స్వీయ గుణం స్పర్శ రెండు కూడా వాయువుకి ఉన్నాయి. ఈ వాయువు నుండే రూపం స్పర్శ శబ్దం అనే మూడు గుణాలతో బాటు తేజస్సు జనించింది. తేజస్సు నుండి రసం రూపం స్పర్శమ్ శబ్దం అనే నాలుగు గుణాలతో బాటు జలం జనించింది. ఆ జలం నుండి గంధం రసం రూపం స్పర్శమ్ శబ్దం అనే అయిదు గుణాలతో. భూమి జనించింది. ఇవన్నీ తామసాహంకారం కలిగినవే.


సాత్త్వికాహంకారం నుండి మనస్సు పుట్టింది. దానికి చంద్రుడు అధిపతి. ఈ సాత్త్వికాహంకారం నుండి దిక్కులు, వాయువు సూర్యుడు వరుణుడు అశ్వినీ దేవతలు అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు మిత్రుడు ప్రజాపతి అనే పదిమంది దేవతలు పుట్టారు. తేజో రూపమైన రాజసాహంకారం నుండి శ్రవణం మొదలైన అయిదు జ్ఞానేంద్రియాలు, వాక్కు, మొదలైన అయిదు కర్మేంద్రియాలు బుద్ధి ప్రాణం కలిగాయి.

 బ్రహ్మ నారదుడికి చెప్పిన సృష్టి స్వరూపాన్ని, పరీక్షిత్ మహారాజుకు శుక మహర్షి వివరించాడు.

శ్రీ భాగవతం. రెండవ స్కంధం 86


----------------------------------


శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 8


ఇంద్రియాలని. జయించని వాడి కి ఆధ్యాత్మిక ప్రస్థానం లో ప్రయాణం చేయడం చాలా కష్టం. వాక్కు రుచి స్పర్శ వినికిడి వాసన, ఈ అయిదు ఇంద్రియాల ద్వారా మానవుడు సుఖాల అనుభూతి పొందుతున్నాడు. ఆనందం అనుభూతి ఇచ్చేది మనస్సు. ఈ అయిదు ఇంద్రియాలు నిరంతరం మానవుడిని సుఖాలు భోగాలు పొందమనే చెబుతాయి.


మనసు ద్వారా వీటిని నిగ్రహించాలి. మనస్సు కూడా సుఖ సుఖాల వెంట పరుగెడుతూ, సత్య స్వరూపాన్ని గ్రహించలేదు. ఈ మనసు ని బుద్ధి ద్వారా, బుద్ధి అందించే. వివేకం వలన భోగాల కోసం ఇంద్రియాలని నిగ్రహించ వచ్చును. బుద్ధి కూడా గతం లోని మన కర్మ లను బట్టే సంకల్పిస్తుంది. అందుకే ఆత్మ జ్ఞానం సద్గురువుల ముఖతః కానీ ఆధ్యాత్మిక సారాన్ని జ్ఞానాన్ని ఇచ్చే గ్రంధాల ద్వారా పొందాలి.


శుక మహర్షి పరీక్షిత్తు కి బోధిస్తూ ఇలా అంటాడు:

"పవనములు జయించి పరిహృత సంగుడై ఇంద్రియముల గర్వమెల్ల మాపి.

హరి విశాల రూపమందు చిత్తము చేర్చి నిలుప వలయు బుద్ధి నెరపి బుధుడు"

పండితుడైన వాడు వాయు బంధనం చేసి, సంసారం తో, సకల భోగాలు వ్యామోహాల్లో చిక్కక, వాటిని నిగ్రహించి, ఇంద్రియాలను జయించి , బుద్ధి బలం తో మనస్సు ను శ్రీ హరి విశాల స్వరూపం లో నిలుపాలి.


"స్వామీ! ధారణ ఎలా నిలుస్తుంది?? బుద్ధిని ఎలా నిలుపాలి. ? అని పరీక్షిత్తు ప్రశ్నించాడు.

"హరి మయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని 

లేదా హరిమయము కాని ద్రవ్యము, పరమాణువు లేదు వంశ పావన వింటే"

ఓ రాజా విశ్వమంతా విష్ణు మయము. విష్ణువు విశ్వమయుడు. ఇందులో సందేహం లేదు విష్ణుమయం కాని పదార్థం ఈ ప్రపంచం లో ఒక్క పరమాణువు కూడా లేదు.  


"రాజా ! ప్రారబ్ధ కర్మ నశించగా శరీరం త్యజించాలని అనుకున్న సన్యాసి దేశ కాలాల కోసం ఎదురు చూడడు. ఆ భావన కలుగ గానే అతడు సుఖాసీనుడవుతాడు. మనస్సు తో ప్రాణ వాయువును నిగ్రహిస్తాడు. మనస్సు యొక్క వేగాన్ని దాని సమస్త వికారాలను బుద్ధి తో అరికడతాడు. బుద్ధిని క్షేత్రజ్ఞుడనే జీవాత్మ తో సంధానం చేస్తాడు. జీవాత్మని శుద్ధాత్మ తో చేరుస్తాడు. శుద్ధాత్మని పరమాత్మ లో లీనం చేస్తాడు. అలా చేసి శాంతాత్ముడై కార్యాలన్నింటినీ పరిత్యజిస్తాడు. ఆ పై నిత్యం అయిన ఆనందం కోరుకుంటాడు.


శ్రీ భాగవతం. రెండవ స్కంధం..27 


--------


  

శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 9


మానవుడు. కర్మ ల చేత బంధనం పొంది జనన మరణ చక్రం లో చిక్కుకుంటున్నాడు. ప్రతి కర్మ కి వెనుక ఒక కారణం ఉన్నది. ప్రతి కారణం తిరిగి ఒక కర్మ గా మారుతుంది. కర్మ ఒక చక్రం. మనస్సు కర్మలకి కేంద్ర బిందువు. అదే కర్మ క్షేత్రం.


మన ఆలోచన లే మన శీలాన్ని స్వభావాన్ని సృష్టిస్తాయి. మన స్వభావం శీలమే, మన లో కోరికల ని సృష్టిస్తుంది. మన లోని కోరికలు మనకి అవకాశాల్ని కల్పిస్తుంది. ఈ అవకాశాలకు తగినట్లు మన చుట్టూ వాతావరణం ఏర్పడుతుంది. మన చుట్టూ ఏర్పడే వాతావరణం బట్టి మన సమస్త కర్మలు ఉంటున్నాయి. ఇదీ కర్మ చక్రం. దీనిని బట్టి మనకో విషయం స్పష్టం. మన ఆలోచనలు సంకల్పాలు చాలా శక్తిమంతమైనవి. వీటిని జాగ్రత్త గా గమనిస్తూ, మరింత శక్తిమంతం గా రూపొందించుకోవాలి. మనలోని ఇచ్చా జ్ఞాన క్రియా శక్తులు సంకల్పాన్ని ఎంతో శక్తిమంతం చేస్తాయి.


 ఒక రోజు లో మన లోని ఆలోచనలు. కోరికలు సంకల్పాలు ఎలా ఉన్నాయో మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. వీటికి తగినట్లుగానే మనం కర్మలు చేస్తున్నాం. అవే ప్రస్తుత కర్మల ని, రాబోయే జన్మల్లోని కర్మలను నిర్ధారిస్తున్నాయనే కర్మ సిద్ధాంత రహస్యాన్ని గ్రహించాలి. మనకి ఏమాత్రం తెలియని విషయం ఏమిటంటే, ఎంత కర్మ కు ఎంత ఫలమో, ఎవరు ఏ కర్మ ఫలాన్ని ఎలా అందిస్తారో తెలియదు. శ్రీకృష్ణుడు అందుకే భగవద్గీత లో "కర్మణ్యే వాధికారస్తే..." - " కర్మలు చేయడమే నీ పని కానీ, ఫలాన్ని ప్రశ్నించకు. నిష్కామమ్ గా చేయి.


కర్మలు చేయడం మానరాదు. కర్మానుష్టానంచేస్తూ, కర్మ ఫల త్యాగం చేయమన్నాడు.

 దీనిని. బ్రహ్మ నారాదుడుడికి చెప్పిన సృష్టి నిర్మాణ రహస్యాలను, శుక మహర్షి పరీక్షిత్తు కి వివరిస్తూ,

ఓ రాజా ! శరీర నిర్మాణానికి ఉపయోగపడే పృథివి అగ్ని వాయువు ఆకాశం జలం, పుట్టుకకి కారణం అయిన 

కర్మలు, కర్మ ప్రవృత్తికి హేతువైన కాలం, కాలం మార్పుకు కారణమైన మానవుడి స్వభావం, ఆ కర్మ ఫలాన్ని అనుభవించే జీవుడు, అందరూ వాసుదేవ స్వరూపులే అని తెలుసు కో .ఆ శ్రీ హరి కన్నా అన్యమయింది లేదు. ఈ లోకాలన్నింటినీ నియమించే వాడు శ్రీమన్నారాయణుడే. గుణ రహితుడైన ఆయన నుండి రజస్సు, సత్త్వము, తమస్సు అనే మూడు గుణాలు పుడుతున్నాయి. అవే ఉత్పత్తికి స్థితికి, లయానికి కారణం అవుతున్నాయి.


కార్యం, కారణం, కర్త యొక్క భావాల్లోని ద్రవ్యాలైన పంచభూతాలను, జ్ఞాన రూపాలైన దేవతలను, క్రియా రూపాలైన ఇంద్రియాలను ఈ సత్త్వ రజ తమో గుణాలు ఆశ్రయిస్తున్నాయి. ఈ గుణాలే మన చేత సమస్తం చేయిస్తున్నాయి.


జీవుడు సదా ముక్తుడే అయినా, ఈ త్రిగుణాలు అతడిని బంధిస్తున్నాయి. జీవుడిని ఇలా నిరంతరం 

మాయ లో ముంచే ఈ మూడు గుణాలను సృష్టించి, ఆ శ్రీ హరి ఏమాత్రం గోచరించకుండా లీలా వినోదుడై విహరిస్తుంటాడు.


శ్రీ భాగవతం రెండవ స్కంధం 84


------------------

  

శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 10


శ్రీ కృష్ణుడి ని మించిన చెలికాడు సఖుడు ఇంకెవరు లేరు. జాతి మత కుల లింగ వివక్షత లేకుండా అందరిని ఆదరిస్తారు. పేద గొప్ప భేదాలు చూపించడు. చిన్న నాటి స్నేహాలు కల కాలం జ్ఞాపకం పెట్టుకుని ఒకప్పటి మధుర స్నేహాన్ని ఎల్లకాలం చూపే వాడు అందరి వాడు గోపన్న. భాగవతం లో శ్రీ కృష్ణ కుచేల మైత్రి అందరినీ 

కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది. కుచేలుడు సందేహిస్తూ, తనని గుర్తు పడతాడో పట్టడొ , అప్పటి స్నేహం ఇంకా అతడికి గుర్తు ఉన్నదా. అని సంశయిస్తూ. అయ్యో ఎవరికైనా ఏదైనా పారితోషికమైన ఇద్దామంటే నా వద్ద ఏదీ లేదు కదా! అని బాధ పడుతూ 3 గుప్పెళ్ల అటుకులు చెంగున మూట కట్టి బయలు దేరాడు. దూరం నుండి కుచేలుడి ని చూసి పరుగు పరుగున వచ్చాడు శ్రీ కృష్ణుడు. దూరాభారం తో, అలిసి పోయి చినిగిన వస్త్రాలతో బక్క చిక్కి దీనుడై ఉన్న కుచేలుడిని గట్టిగా కౌగలించుకున్నాడు.


కరమర్ధి నెదురుగా జని, పరిరంభణ మాచరించి, బంధుస్నేహ 

స్ఫురణం దోడ్తెచ్చి , సమాదరమున గుర్చుండబెట్టే దాన తల్పమునన్.

అట్లు గుర్చుండ బెట్టి నెయ్యమున గనక కలశ సలిలంబుచే గాళ్ళు కడిగి భక్తి

దజ్జలంబులు దనదు మస్తకమున దాల్చి లలిత మృగ మద ఘనసార మిళితమైన

మలయజము మేన జోబ్బిల్ల నలది యంత శ్రమము వాయంగ దాళ వృంతమున విసిరి 

బంధు రామోద కలిత ధూపంబు లొసగి మించు మణి దీపముల నివాళించి మరియు

సురభి కుసుమ మాలికలు సిగ ముడిం దురిమి, కర్పూర మిళిత తాంబూలంబు, నిడి , ధేనువు నొసంగి , 

సాదరంబుగా స్వాగతం బడిగిన, నప్పు డవ్విపృండు మెనం బులకాంకురంబు లంకురింప నానంద బాష్ప జలబిందు సందోహుండయ్యే : 

నట్టి యెడం బద్మలోచనుండు మన్నించు నంగనామణి యగు రుక్మిణీ కర కంకణ రవంబు లోలయం జామరలు వీవం దజ్జాత వాతంబున ఘర్మ సలిలంబు నివారించుచుండ ....."

పోతన. భాగవతం 


"శ్రీ కృష్ణుడు ఆదరాభిమానాలతో కుచేలుడికి ఎదురుగా వెళ్ళి కౌగిలించుకున్నాడు. అనురాగం ఉట్టి పడేలా స్వాగతం పలికి ఆప్యాయంగా తీసుకుని వచ్చి తన పానుపు మీద కూర్చుండబెట్టాడు. బంగారు కలశం లోని నీళ్ళతో అతడి పాదాలను కడిగాడు. ఆ జలాన్ని భక్తి తో శిరస్సు మీద చల్లుకున్నాడు. కుచేలుడి సిగ లో పూలదండలు ముడిచి కర్పూర తాంబూలము ఇచ్చి, గోదానం చేసి ఆదరపూర్వకంగా స్వాగతం చెప్పాడు. కుచేలుడి శరీరం పులకించింది. కన్నుల నుండి ఆనందాశ్రువులు స్రవించాయి. శ్రీకృష్ణుని పట్టపు రాణి కర కంకణాలు ఘల్లు ఘల్లు మనగా వింజామర వెచ్చింది.


ఇదీ శ్రీ కృష్ణుడి స్నేహ అమృత వాహిని ప్రపంచం లోనే స్నేహానికి ప్రతీక 

ఇటువంటి స్నేహామృతం మన అందరి లో నిండి ప్రకాశించుగాక 

బృందావన మన లో స్నేహం పరిమళించుగాక


-----------------------------


శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 11


మానవులందరు జపాలు తపాలు దానాలు ధర్మాలు తీర్థ యాత్రలు వ్రతాలు యజ్ఞాలు ఆలయ ప్రతిష్టలు అన్నదానాలు ఇంకా ఎన్నో పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు. ఈ సత్కర్మ ల ఫలితం గా ఎన్నో భోగాలు సంతోషాలు ఇంద్రియాలకు లభిస్తాయి. వీటి వల్ల భార్య పిల్లలు కూడా సుఖాల్లో తేలియడతారు. ఏమి చేస్తే జ్ఞానం లభిస్తుంది ? ఏమి చేస్తే మోక్షం కైవల్యం లభిస్తుంది.


దుష్కర్మ ఎంత బంధనమో. సత్కర్మ కూడా అంతే బంధనం. మనం ఎన్నో సత్కర్మలు చేస్తాం. ముఖ్యం గా ఎన్నో దానాలు చేస్తాం. దానం కొద్దీ బిడ్డలు అంటారు. మనం చేసే దానాలు మన పిల్లలకి మంచి చేస్తుందని, రక్షణ గా ఉంటుందని నమ్ముతాం. ఇది కొంత వరకు సత్యమే. దాన ధర్మాలు చేయమన్నారు. దానం చేయడం అంటే తెలుసు. ధర్మం చేయడం అంటే ఏమిటి.? 


దానాలు పూర్తి ఫలం ప్రసాదించ బడాలంటే అది ధర్మ యుక్తం కావాలి. ధర్మ విరుద్ధం గా జీవించే వాడు చేసిన దానాల కి కర్మ ఫలం గా సుఖాలు భోగాలు ఐశ్వర్యం సిరి సంపదలు అధికారాలు లభిస్తాయి కానీ, ఆనందం జ్ఞానం మోక్షం లభించవు. దాన కర్ణుడు అద్భుతమైన దానాలు చేసి, ఎంతో కీర్తి పొందాడు. ఇతరుల అవమానం సహించలేక. తన పరాక్రమాన్ని శౌర్యాన్ని, దుర్మార్గుడని తెలిసి కూడా దుర్యోధనుడి కి అమ్ముకున్నాడు. తెలిసి కావాలని ఒక అధర్మానికి దుర్మార్గానికి సహాయం చేసే వారికి చాలా భయంకరమైన కర్మ ఫలం ఉంటుంది. మహాభారతమంతా పాండవులకి జరిగిన ప్రతి అన్యాయం లో కర్ణుడికి ప్రత్యక్షం గానో, పరోక్షం గానో పాత్ర ఉంది.


కర్ణుడు చేసిన అత్యద్భుతమైన దానాలు అన్నీ అతడికి భోగాలని అంగ రాజ్యాన్ని, సిరి సంపదలను దాన కర్ణుడనే 

బిరుదును ఇచ్చాయే కానీ, అతడు అనుభవించిన ఏ కష్టం నుండి, శాపం నుండి కాపాడ లేక పోయాయి. కళ్ళ ముందు పుత్రులు మరణిస్తున్నా, ఏ దాన ఫలం అతడికి కించిత్ ఆనందాన్ని రక్షణ ని ఇవ్వలేక పోయాయి. దుర్మార్గం చేసి, ఎంతో గొప్ప దానాలు చేసినా అవి కాపాడతాయా. సుఖాలు ఇస్తాయి అంతే. కాబట్టి, ఏ దానం చేసినా, "నా హం కర్తా. హరి కర్తా" నేను కర్త ని కాను, హరి యే కర్త అనుకోవాలి. కర్తృత్వం హరికే ఇవ్వాలి. "సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు" అని ప్రతి కర్మని శ్రీ కృష్ణుడికి అర్పించాలి. అప్పుడు కర్మ ఫలం అంటదు. జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది.


ఈ దాన ధర్మాల రహస్యాన్ని శుక మహర్షి పరీక్షిత్తు కి జ్ఞాన బోధ చేస్తూ, "ఓ రాజా! నీవు సద్యో ముక్తి, క్రమ ముక్తి అనే రెండు మార్గాలు అడిగావు. ఈ రెండు వేద గీతల్లో వివరించ బడినాయి.


"తపముల చేసియైన మరి దానము లెన్నియు జేసియైన , నే

జపముల జేసియైన, ధన సంచయ మెవ్వని జేర్పకున్న హే

య పదములై దురంత విపదంచిత రీతిగ

నొప్పుచుండు న

య్య పరిమితుం భజించెద నఘోఘ నివర్తను భద్ర కీర్తనున్.


"ఎన్నెన్ని తపస్సు లు దానాలు జపాలు చేసినా, వాటి వల్ల కలిగే ఫలాలను ఏ పరమేశ్వరుడికి అర్పించకుంటే, అవన్నీ నింద కు పాత్రమై చివరికి అవన్నీ ఆపదలు గా పరిణ మిస్తాయి. (కర్ణుడికి అదే జరిగింది) పరిమితి లేని వాడు, సర్వ పాపాలు తొలగించే వాడు, మంగళ మయ కీర్తనుడు అయిన ఆ పరమేశ్వరుడిని సేవిస్తున్నాను. ఓ పరీక్షిత్ మహారాజా! ఈ సంసారం లో ప్రవేశించిన వాడికి తపస్సు యోగం మోక్ష మార్గాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటికన్నా సులభమైనది భక్తి మార్గం.


శ్రీ కృష్ణ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు.


--------------


శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 12


శ్రీ మహా విష్ణువు లోనే సర్వం నిండి ఉంది. ఆయన వల్లనే సమస్త లోకాలు సృష్టి స్వరూపము ఏర్పడుతున్నది. ఈ సృష్టి స్వరూప వివరాన్ని బ్రహ్మ ఒకప్పుడు నారదుడికి వివరించాడని శుక మహర్షి పరీక్షిత్తుకు బోధించాడు...

"ఓ రాజా ! ఈ పదునాలుగు లోకాలు శ్రీ మహావిష్ణువుకు నడుము పై నుండి పై శరీరమంటారు. శ్రీ మహావిష్ణువుకు కటి స్థలం భూలోకం. నాభి భువర్లోకం. హృదయం సువర్లోకం. వక్షం మహర్లోకం. కంఠం జన లోకం. స్థనాలు తపోలోకం. శిరస్సు సనాతనమైన బ్రహ్మ నివసించే సత్య లోకం. జఘనం అతల లోకం. తొడలు వితల లోకం. మోకాళ్ళు సుతల లోకం. పిక్కలు తలాతలం. చీల మండలు మహాతలం. కాలి ముని వేళ్ళు రసాతలం . అరికాలు పాతాళం. ఈ కారణం గా ఆయన్ని లోకమయుడని భావిస్తారు.


శ్రీ మన్నారాయణుడి ముఖం నుండి సమస్త ప్రాణుల వాక్కులు, వాక్కు కి అధిష్టానమైన అగ్ని పుట్టాయి. చర్మం రక్తం. మాంసం మెదడు ఎముకలు మజ్జ శుక్లము ఇవి ఏడూ ఆ దేవుని ఏడూ ధాతువులు అని చెబుతారు. వాటి లో రోమాలు ఉష్ణిక్ ఛందస్సు, చర్మం ధాత్రీ ఛందస్సు, మాంసం త్రిష్టుప్ ఛందస్సు, స్నాయువు అనుష్టుప్ ఛందస్సు, శల్యం జగతీ ఛందస్సు, మజ్జ పంక్తి ఛందస్సు, ప్రాణం బృహతీ ఛందస్సు అని వ్యవహరిస్తారు.


దేవతలకి అర్పించే పురోడాశ రూపమైన హవ్యానికి, పితృదేవతలకి సమర్పించే కవ్యానికి, అమృతాన్నానికి,

ఆరు రుచులకి, రసనేంద్రియానికి, రసానికి అధీశ్వరుడైన వరుణుడికి, విష్ణుదేవుని రసనేంద్రియమే జన్మ స్థానం. అలాగే అన్ని ప్రాణాదులకు, వాయువు కు విష్ణు ని నాసా రంధ్ర మే స్థానం. దగ్గర గాను, దూరంగాను

వ్యాపించే వాసన లకు, ఓషధులకు, అశ్వినీ దేవతలకు ఆ మహా విష్ణువు ఘ్రాణేంద్రియము స్థానం.

దేవ లోకానికి, సత్య లోకానికి, తేజస్సుకు, సూర్యుడికి, సకల నేత్రాలకు, లోక నేత్రుడైన ఆ పరమాత్ముని నేత్రాలే నివాసం. దిక్కులకు, ఆకాశానికి ,శ్రవణం కి,శబ్దాలకు సర్వేశ్వరుని చెవులే జన్మ భూమి. ప్రాశస్త్యం కలిగిన వస్తువుల కి, కొనియాడ తగిన సౌందర్యాలకు పరమ పురుషుని శరీరమే స్థానం. స్పర్శ కీ గాలికి శరీరం యొక్క మెరుపుకి ఆయన శరీరమే కారణం. సమస్త మైన చెట్లు తీగలు పవిత్రమైన వృక్షాలు పొదలు తీగల కి ఆయన రోమాలు స్థానం.

రాళ్లు లోహాలు ఆయన గోళ్లు. మబ్బులు ఆయన శిరోజాలు, మెరుపులు, ఆయన మీసాలు, లోక పాలకుల పరాక్రమాల కి లోకాల క్షేమానికి శరణానికి నారాయణుడి పరాక్రమం పుట్టిల్లు. సమస్త కోరికలకు శ్రేష్టమైన వరాలకు శ్రీ మహా విష్ణువు పాద పద్మాలే నిలయం.


జలం శుక్లము పర్జన్యుడు ప్రజాపతి సృష్టి. వీటన్నింటికీ ఆ సర్వేశ్వరుడి పురుషామ్గం జన్మ స్థలం. సంతతికి కామం మొదలైన పురుషార్థాలకు మనస్సు కి హాయి కలిగించే ఆనందాలకు, శరీర సుఖానికి అచ్యుతుని గుహ్య ఇంద్రియం స్థానం. యముడికి సూర్యుడికి మల విసర్జనానికి ఆ దేవుని గుదెంద్రియం ఇల్లు. హింస కి నిరృతికి మృత్యువు కి ఆ నరకానికి ఆ సర్వేశ్వరుడి గుదం నెలవు. అవమానానికి అధర్మానికి అవిద్యకి చీకటి కి అంతం లేని ఆ దేవుని పృష్ఠ ప్రదేశం నివాసం. నద నదీ సమూహాల కు ఈశ్వరుడి నాడీ సంఘం ఇల్లు. కొండల కు పర్వతాలకు ఆయన ఎముకలు జన్మ స్థానాలు. ప్రధానానికీ, అన్న రసానికి సముద్రాల కు భూతాల నిలయానికి ఆ స్వామి ఉదరమే 

నెలవు. మానసిక వ్యాపార రూపమైన లింగ దేహానికి మహాద్భుతమైన ఆ శ్రీమన్నారాయణుడి హృదయం సృష్టి స్థానం.

మంత్ర జపం చేసే వారు ఈ ఒక్కొస్థానాన్ని దృష్టి లో ఉంచుకుని జపం చేస్తారు. వ్యాధులు బాధలు ఈతి బాధలు

కష్టాలు వచ్చిన వారు. ఆ శ్రీ హరి ఒక్కో స్థానాన్ని జపిస్తారు.*


  

శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 13


మీరు ఒకసారి మీ గురించి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆలోచించుకోండి. ఒకరోజు లో మీరు హృదయాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారా? మేధాశక్తి ని ఎక్కువ గా ఉపయోగిస్తారా? సంగీతం సాహిత్యం కళలు రసాస్వాదనచేసే వారు హృదయాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. శాస్త్రాల మీద దృష్టి పెట్టి లౌకిక వ్యవహారాల్లో మునిగి పోయి, ధనార్జన మీదే దృష్టి పెట్టేవారు మేధా శక్తి మీద తెలివితేటల మీద ఎక్కువ గా దృష్టి పెడుతుంటారు. ఆత్మ జ్ఞానం కలిగిన వారు మాత్రమే జ్ఞానం గురించి వైరాగ్యం గురించి ఆలోచించ గలరు.


ఈ లోకం లో భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి ఎంతో వినిపిస్తుంది. భక్తి హృదయానికి సంబంధించినది. జ్ఞానం బుద్ధి కి సంబంధించినది. వైరాగ్యం ఆత్మ సంబంధి. భక్తుల కథలు వింటూ, మననం చేస్తూ, భగవంతుడి రూపాన్ని హృదయం లో నిలిపి ఆనందం తో పరవశించి పోవడం హృదయ సంబంధం. భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు పురాణాల లో గురించి భగవంతుడి గురించి చర్చించి బోధించడం మేధా సంబంధం. బుద్ధి సంబందం. కేవలం పాండిత్యం సంపాదించడానికి తెలివితేటలు మేధా శక్తి చాలు. కానీ ఈ ఆధ్యాత్మిక గ్రంధాలు చదవాలంటే, సత్య స్వరూపం తెలుసు కోవాలంటే జ్ఞానం పొందాలంటే బుద్ధి అవసరం.


ఆత్మ జ్ఞానాన్ని పొందాలని తపిస్తున్న పరీక్షిత్ మహారాజు శుక మహర్షిని ఇలా అడిగాడు.

"మునీశ్వరా! సమస్త భూతాల తోటి కలయిక లేని ఆత్మ కు ఆ భూతాలతో సాంగత్యం ఎలా కలిగింది? అది అకారణం గా కలిగిందా? లేక కర్మ వల్ల కలిగిందా? మహా కాలాన్ని, సూక్ష్మ కాలాన్ని అనుసరించే జీవులు ఏ కర్మలు చేసి ఏ లోకాలకు ప్రయాణం సాగిస్తారు? ఏ ఏ కర్మల వల్ల వాళ్లకు దేవతా శరీరాలు వస్తాయి? ఆ కర్మ పద్ధతి వివరించండి. ఇంకా సత్త్వాది గుణాలకు ఫలాలైన దేవాది స్వరూపాలు కోరే జీవులు ఏ ఏ కర్మలు ఏ విధం గా చేయాలి? ఆ కర్మల ను ఎవరికి సమర్పించాలి? వాటిని ఎవరు స్వీకరిస్తారు? భూమి పాతాళం దిక్కులు ఆకాశం గ్రహాలు నక్షత్రాలు పర్వతాలు నదులు సముద్రాలు దీవులు ఎలా ఉద్భవించాయి? అని. పరీక్షిత్తు శుక మహర్షిని అడిగాడు.


శుక మహర్షి ఇలా సమాధానం చెబుతూ "ఓ రాజోత్తమా! జీవుడే భూతాలకు మేలు చేకూర్చే వాడు. జ్ఞానమే

స్వరూపం గా కలిగిన వాడు. అలాంటి వాడికి శరీరం తో ఎలా సంబంధం కలిగింది? అని అంటావా! జగత్తు అంతటినీ వ్యాపించిన ఆ శ్రీ మహా విష్ణువు మాయ అనేది లేక పోతే, జీవుడికి దేహం తో సంబంధం కలుగదు. నిద్రించే వేళా స్వప్నం లో దేహాలతో సంబంధం గోచరిస్తోంది కదా! ఇదే విధం గా శ్రీ మన్నారాయణుడి యోగ మాయా ప్రభావం వల్ల జీవుడు పంచ భూతాలతో కూడిన దేహం తో సంబంధం కల వాడవుతాడు. ఆ మాయా గుణాల వల్లనే క్రమం గా బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అనే దశలు పొందుతాడు. మనుష్య దేవతాది ఆకారాలను కూడా అతడు స్వీకరిస్తాడు. "నేను" అనే అహంకారాన్ని "నాది" అనే మమకారాన్ని పెంచుకుంటాడు. సంసార మాయ లో బద్ధుడవుతాడు..

ఈ విధం గా బద్ధుడై వర్తించే జీవుడికి భగవంతుడి మీద భక్తి తో ముక్తి ఎలా కలుగుతుంది? అని అడుగుతావా!

అది చెబుతాను విను. ప్రకృతికి, పురుషుడికి అతీతమైన బ్రహ్మ స్వరూపాన్ని ఎప్పుడు జీవుడు తీవ్రం గా ధ్యానిస్తాడో, అప్పుడు ఈ మొహం నుండి విడి వడుతాడు. అహంకార మమకార మయ మైన సంసారం నుండి విముక్తుడై ముక్తి ని పొందుతాడు. అంతే కాదు. జీవుడికి ఈశ్వరుడి కి శరీరాలతో సంబంధాలు కనిపిస్తున్నాయి.


భగవంతుడు కూడా ఒక శరీరం ధరించే ఉన్నాడు. అట్టి భగవంతుడి మీద భక్తి కలిగి ఉంటే, జీవుడికి ముక్తి ఎలా సిద్ధిస్తుంది? అని అడిగావు. అవిద్య కు లోనైన వాడు జీవుడు. ( అవిద్య అంటే అసత్యాన్ని సత్యం గా, ఆశాశ్వితాన్ని శాశ్వతంగా, భ్రమ లని వాస్తవాలు గా, లేని దాన్ని ఉన్నట్లుగా, భావించడాన్ని అవిద్య అంటారు) అవిద్య వలన జీవుడు నిరంతరం కర్మలు చేస్తూ వాటికి తగిన శరీరాన్ని ధరిస్తాడు. (ఇందుకే భగవద్గీత లో శ్రీ కృష్ణుడు "జ్ఞాని కాని వాడు సదా కర్మలు ఆచరిస్తూనే ఉంటాడు" అని అన్నాడు) ఈ దేహం మిథ్యా రూపమైంది. భగవంతుడు యోగ మాయ తో కూడిన వాడు. ఆయన తన యోగ మాయ ప్రభావం వల్ల తన ఇష్టానుసారం జ్ఞాన మయమైన లీలా శరీరాన్ని కల్పించుకుంటాడు. అందువల్ల మోక్షానికి సాధనం అయిన జ్ఞానానికై తన సేవ కల్పించ బడిందని భగవంతుడైన ఈశ్వరుడు బ్రహ్మ తో చెప్పాడు. బ్రహ్మ నిష్పటం గా తపస్సు చేసి, ఆ శ్రీ మహా విష్ణువు ని ఆరాధించాడు. అప్పుడు తన జ్ఞానా నంద ఘనమైన స్వరూపం బ్రహ్మకి చూపిస్తూ, శ్రీ మహా విష్ణువు పై వివరాలు తెలిపాడు. అందువల్ల జీవుడికి భగవంతుడి పై భక్తి తప్పకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అని శుక మహర్షి పరీక్షిత్తుకు వివరించాడు. 


సర్వం నిండిన విష్ణు సహస్ర నామ పారాయణ ఎంతో శ్రేష్టం. 


*

  

శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 14


మన కళ్ళ ముందు కనిపించే ఈ ప్రపంచం ఒక మాయ. మనకి అవిద్య ఆవరించడం వలన దేని వాస్తవ రూపాన్ని 

గ్రహించ లేక పోతున్నాము. భ్రమలు, భోగాలు అధికారాలు వ్యామోహాలు ఐశ్వర్యాలు, జీవుల మధ్య చుట్టరికాలు, అన్నీ తామరాకు పై నీటి బొట్టు లాంటివి. కొద్ధి కాలమే నిలిచినా, ఇవే సత్యం అని అనిపిస్తాయి. వీటి కోసమే ప్రతి క్షణం తపిస్తూ, వీటిని పొందడం కోసం, నిలుపుకోవడం కోసం ఇతరులను హింసిస్తూ ఎందరో జీవిస్తున్నారు.

శుక మహర్షి పరీక్షిత్తు తో " ఓ రాజా ! ఒకప్పుడు శ్రీ మహా విష్ణువు బ్రహ్మ తో ఇలా సృష్టి స్వరూపం, ఆవిర్భావం, పరిణామం గురించి వివరించాడు. 


"ఓ చతుర్ముఖా ! నీకు ఈ జగత్తు నిర్మించడానికి హేతువైన మాయ గురించి అడిగావు. నీకు వివరిస్తాను. చూసినప్పుడు దాని లో వెండి లేక పోయినా ఉన్నట్లే అనిపిస్తుంది. ఇదే విధం గా ఒక లేని వస్తువు ఉన్నట్లుగా మనసుకు అనిపిస్తుంది. సత్యాన్ని గ్రహించినప్పుడు, ఆ వస్తువు యదార్ధం గా లేదని స్పష్టం అవుతోంది. ఇది దేని వల్ల జరుగుతోందో, అదే నా మాయ అని గ్రహించు. నా రూపాన్ని నీ హృదయం లో నిలుపుకో .. అన్నాడు.


*


శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 15


నిత్య జీవితం లో పూజలు చేయడం ద్వారా హోమాలు ఇతర శాంతులు పరిహారాల ద్వారా సమస్యలని దుష్కర్మ ల నుండి విముక్తి పొందటానికి ప్రయత్నం చేయవచ్చునా? చేస్తే ఫలిస్తాయా ? 


ఈ ప్రశ్నలు మన మనస్సు లో నిరంతరం వస్తూనే ఉంటాయి. మనల్ని వేధించే ఏ దుష్కర్మనీ సమస్యని 

అయినా అధిగమించాలి అని చేసే ప్రయత్నం తప్పు కాదు. కొందరు ఇవి గతం లో మనం చేసిన పాపాలు కదా! వీటిని తప్పించుకోవడానికి ప్రయత్నించడం దోషం అని వాదిస్తూ ఉంటారు. 


"బయట చీకటి గా ఉంది. నా దగ్గర టార్చ్ లైట్ ఉన్నా వేసుకోకూడదు అనుకోవడం ఇలాంటిదే. నీ ప్రయాణానికి ఇబ్బంది కలిగించే చీకటి అనే దుష్కర్మ ఉన్నట్లే, సత్కర్మ చేయడానికి సహకరించే టార్చి లైట్ అనే సాధనం కూడా భగవంతుడు అందించాడు. ఇదేవిధంగా లభించే సర్వ విధ సాధనాల ద్వారా కర్మలను ఎదిరించాలే తప్ప, ఇది నా, తలరాత, అనుకుంటూ. కర్మలకి లొంగి పోకూడదు.


కర్మలని ఎదిరించే పద్ధతులు కొన్ని మనకి సూచించారు.


1. ఆత్మ విశ్వాసం. మనం అనుభవిస్తున్న ప్రతి వేదన కష్టం అవరోధం దుఃఖం ఇబ్బందులు వ్యాధులు కష్టాలు, అప్పులు శత్రుత్వాలు అన్నీ మనమే గతం లో సృష్టించాము. ఈ జన్మ లో కానీ గత జన్మలో కానీ ఇవన్నీ మనమే. స్వయంకృతం గా చేశామని ముందు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇతరులు కేవలం మన దుష్కర్మలని ఒక ప్లేట్ లో పెట్టి అందిస్తున్నారనే విషయం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనం ఎదుర్కొనే సమస్యల వలన కలిగే బాధ సగం తగ్గుతుంది. అందరూ మనల్ని బాధ పెట్టె వారే! అనే భావన నుండి విముక్తం అయి, కొంత ఉప శాంతి లభిస్తుంది. మనం మనస్సు ద్వారా గత జన్మలలో చేసిన దుష్కర్మలని ఇలా జ్ఞానం ద్వారా వివేకం ద్వారా జయించ వచ్చును. జ్ఞానం వలన కర్మ ని జయించే పద్ధతి ఇది. జ్ఞానం వలన మనస్సు స్థిరం గా ఉంటే శరీరం కూడా శక్తిమంతం గా ఉంటుంది. మనస్సు ప్రభావం శరీరం మీద చాలా ఎక్కువ.


2. జపాలు తపాలు హోమాలు ఇతర ఉప శాంతులు. ఇవి ఎవరికి వర్తిస్తాయి అన్నది ప్రధాన విషయం. ఒక సందేహం రావచ్చును. ఏ కర్మ చేసినా దానికి తగిన కర్మ ఫలం ఉంటుంది కదా. అప్పుడు ఒక్కొక్కరికి భిన్న ఫలాలు ఎందుకు వస్తాయి? 


దీనికి ఒక పురాణ కధ జ్ఞాపకం తెచ్చుకోవాలి. హిరణ్యకశిపుడు రావణుడు మొదలైన రాక్షసులందరికీ అద్భుతమైన అస్త్ర  శస్త్ర సంపద ఉన్నది. మరి ఎందుకు ఒడి పోయారు. వాళ్ళు కూడా అద్భుత యజ్ఞ యాగాదులు చేసిన వారే కానీ, సత్యం ధర్మం వారి వైపు లేదు. వారి దుష్కర్మలు వారి శక్తిని. పుణ్య ఫలాన్ని క్షయం చేసాయి. అందువలన వారి పూజలు వరాలు. వారిని కాపాడ లేదు ఇదే విధం గా నిత్యా జీవితం లో ఒక సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తూ జీవించే వారి కి పూజలు హోమాలు తప్పకుండా ఫలిస్తాయి. ఎవరికీ ఏ అపకారం చేయని ఉత్తములకి ఈ పరిహారాలు కొంత ఉప శాంతి ఇస్తాయి. అవి కూడా అదృఢ కర్మలు, దృడాఽదృఢ కర్మ లని జయించడానికి ఈ పూజలు పనికి వస్తాయి. వ్యాధుల విషయం లో ఇవి గొప్పగా పనిచేస్తాయి. శత్రుత్వాలు రుణాల విషయం లో బాగా పనికి వస్తాయి. గతం లోని దుష్కర్మ వలన పైన చెప్పుకున్న వేదన కీడు జరిగింది. శక్తిమంతం గా ఇప్పుడు చేసిన కర్మ వలన క్రొత్త ఫలాలు వచ్చాయి. అయితే ఇవి స్వార్ధానికి. దుర్మార్గులకి అంత గొప్పగా సహకరించవు. శుక్రాచార్యుడు ఎన్ని యజ్ఞాలు రాక్షసుల చేత చేయించినా అవన్నీ వ్యర్ధమే ఐనాయి.


ఒక పొరబాటు వలన, అజ్ఞానం వలన, జరగ బోయే పరిణామాలు తెలియకుండా చేసిన దుష్కర్మల నుండి కొంత రక్షణ ఈ పూజల వలన లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో మేలు చేద్దామనే ఉద్దేశ్యం తో కొంత మందికి బాధ వేదన కలిగించ వచ్చును. అయినా ఆ కర్మ కి తిరిగి వేదన తప్పదు. ఒక అగ్ని ప్రమాదం లో ఉన్నవారిని రక్షించడం కోసం ఎంతో సదుద్దేశం తో అగ్ని లో దుకినప్పుడు, ఒళ్ళు కాలకుండా ఉండదు కదా. అలాగే, మేలుచేసినా ఎదుటి వారికి వేదన కలిగిస్తే. శిక్ష తప్పదు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకి క్రమ శిక్షణ నేర్పిద్దామని తీవ్రం గా కొడతారు. ఈ కర్మ వారిని అనివార్యంగా వెంటాడుతోంది. ఉద్దేశ్యం మంచిది కాబట్టి, వీరికి కొంత పూజల వలన ఊరట లభిస్తుంది. 


పరీక్షిత్తు మహారాజుకు శుక మహర్షి భాగవత సారం , జ్ఞాన స్వరూపాన్ని వివరిస్తూ 


"ఓ రాజా! ఒకప్పుడు నారదుడు వ్యాస మహర్షి బోధించగా , వ్యాసుడు నాకు బోధించాడు" జీవులు అనుభవించే కర్మలు త్రివిధాలు. సంచితం, ప్రారబ్ధం, ఆగామి. ఇంతవరకు జీవులు అనుభవించిన సమస్త కర్మల్లోని ఫలమంతా కలిపి "సంచిత కర్మ" అంటారు. అందులో నుండి ప్రస్తుతం వర్తమానం లోని జన్మ కి నిర్ధారించడ బడిన కర్మను

"ప్రారబ్ధ కర్మ" అంటారు. వర్తమానం లోని కర్మ కలిపి భవిష్యత్తు గా మారుతుంది. దీనినే "ఆగామి" అంటారు. ఇది ప్రాధమిక మైన కర్మ స్వరూపం. *


శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 16


శుక మహర్షి పరీక్షిత్తుకు శ్రీ మహాభాగవతం లో భగవంతుడిలో నుండి శరీర నిర్మాణం గురించి ఇలా వివరించాడు:

“ఓ రాజా! త్వగింద్రీయాన్ని అధిష్టించిన వాడు, స్పర్శమ్ అనే గుణం కలిగిన వాడు, లోపలా వెలుపలా వ్యాపించిన వాడు అయిన వాయువు నుండి హస్తాలు పుట్టాయి. అవి బలం కలిగినవీ, వాస్తు గ్రహణం లో నేర్పు కలిగినవీ అనేకమైన పనులు చేయ గలిగినవీ , వాటికి ఇంద్రుడు అధిష్టాన దేవత.


తనకు ఇష్టం వచ్చినా చోటికి పోయే సామర్ధ్యం కల ఈశ్వరుడి నుండి పాదాలు పుట్టాయి. వాటికి శ్రీ మహా విష్ణువు అధిష్టాన దేవత. ప్రజానంద మనే అమృతం కాంక్షించే భగవంతుడి నుండి పురుషాంగం, ఉపస్తా జనించాయి. వాటికి అధి దేవత ప్రజాపతి. స్త్రీ సంభోగం మొదలైనవి, వాటి పనులు. మిత్రుడు అధి దేవత గా కల “పాయువు“ అనే ఇంద్రియాన్ని “గుదం“ అని కూడా అంటారు. అది భుజించిన పదార్ధాల్లోనో నిస్సారమైన అంశాన్ని త్యజించడానికి సాధనం అవుతుంది. అది ఉభయ మలాలను విసర్జిస్తుంది.


ఒక శరీరం వదలి వేరొక శరీరాన్ని ధరించాలని అనుకున్నప్పుడు, మొదటి శరీరం వదలడానికి సాధనంగా “బొడ్డు“ అనే ద్వారం పుట్టింది. “ప్రాణం“, “అపానం“ బంధింపబడే స్థానం అదే. ఆ బంధం విడిపోవడమే మృత్యువు. పై శరీరాన్ని, క్రింది శరీరాన్ని వేరు చేసేది కూడా ఆ నాభి స్థానమే. ఆహార పానీయాలు మొదలైన వాటిని ధరించడానికి పేగులు, పొట్ట, నాడీ సమూహం కల్పించ బడినాయి. వాటికి నదులు సముద్రాలు అధి దేవతలు. వాటి వల్ల తుష్టి, పుష్టి అనే ఉదరాన్ని ధరించే రస పరిణామాలు కలిగాయి. ఆ విరాట్ పురుషుడు తన మాయను ధ్యానించేటప్పుడు, కామానికీ, సంకల్పాలకు స్థానమైన హృదయం పుట్టింది. ఆ హృదయం నుండీ మనస్సు, చంద్రుడు, కాముడు, సంకల్పము పుట్టాయి.


ఆ పైన జగత్తును సృష్టించే విరాట పురుషునకు శరీరం లో త్వక్కు, చర్మం, మాంసం, రక్తం, మేధ,మజ్జ, ఎముకలు, అనే ఏడు ధాతువులు; పృథివి జల తేజో రూపాలైన ఏడు ప్రాణాలు, ఆకాశ జల వాయువుల నుండీ జనించిన గుణ స్వరూపాలైన ఇంద్రియాలు, అహంకారాన్ని కలిగించే గుణాలు, అన్నీ వికారాలు స్వరూపంగా కల మనస్సు, విజ్ఞాన రూపమైన బుద్ధి జనించాయి. ఇదంతా ఆ పరమేశ్వరుడి భౌతిక శరీరమే. ఇంతేకాదు. ఆ భౌతిక శరీరం క్రమంగా పృథివి, జలం, తేజస్సు, వాయువు, గగనం, అహంకారం, మహత్తత్వం, అవ్యక్తం - అనే ఎనిమిది ఆవరణాలతో వ్యాప్తమై ఉన్నది. సంపూర్ణమైన వైభవం తో బ్రహ్మాండాన్ని మించినదై అత్యుజ్జ్వలంగా ప్రకాశిస్తున్నది. విరాట్ పురుషుడి సూక్ష్మ రూపం విలక్షణమైనది. దానికి మొదలు తుది లేవు. అది నిత్యమైంది. మనస్సుకు వాక్కు కు గోచరం కానిది.


“ఓ రాజా! మహా తేజస్సు తో నిండిన భగవంతుడి స్వరూపాన్ని గురించి నేను నీకిప్పుడు చెప్పాను. స్థూలమనీ, సూక్ష్మమనీ, రెండు రూపాలతో విలసిల్లే, ఆ భగవంతుడి ఆకారాన్ని, ఆ పరమాత్ముడి మాయా ప్రభావం వల్ల దివ్యా తేజో ధనులైన మునులు కూడా తెలుసుకోలేరు. వాచ్యమై, వాచకమై నామరూప క్రియలు దాల్చిన ఈశ్వరుడు సమస్త లోకాలకు నియామకుడై ఉన్నాడు. జ్ఞానమయ స్వరూపుడైన ఆ శ్రీమన్నారాయణుడు ప్రజాపతులను, ఋషులను పితృదేవతలను, ప్రీతి తో సృష్టించాడు.


“ఇంకా విను రాజా! జీవులు తాము చేసిన నానా విధాలైన కర్మలను బట్టి సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, చారణులు, గరుదులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, భేతాళాలు, కింపురుషులు, కూశ్మాండులు, గుఃయకులు, ఢాకినులు, యక్షులు, యాతుధానులు, విద్యాధరులు, అప్సరసలు, నాగులు, గ్రహాలు, మాతృగానాలు, తోడేళ్లు, సింహాలు, సూకరాలు, పక్షులు, మృగాలు, ఎలుగుబంట్లు, చేపలు, పశువులు, చెట్లు, - వీటి జాతుల్లో పుట్టి పెరిగి నీటి లోనూ, నింగి లోనూ, నేల మీదా సంచరిస్తారు. సత్త్వగుణ, రజో గుణ, తమో గుణాలు కలిగి ఉంటారు. ఈ ప్రాణికోటి అంతా తిర్యక్కులు, సురలు, అసురులు, నరులు, గిరులు, మొదలైన రూపాల్లో ఉంటుంది.


ఇంతే గాక శ్రీ హరి ఎప్పుడు తనకు కర్తృత్వాన్ని అంగీకరించడు. ఇదంతా ఆ మాయకే అని ఆరోపిస్తాడు. తాను నిరవద్యుడు, నిరంజనుడు, నిష్కించనుడు, అధ్యుడు, నిరపేక్షుడు, నిష్కళంకుడు, అయిన వాడై శాశ్వతాన్ని పొందుతాడు. ఈ విధంగా ఆ శ్రీమన్నారాయణుడు ధర్మ స్వరూపుడై, తానే పశుపక్ష్యాదులు నదులు, గిరులు సురలు మొదలైన రూపాలు ధరిస్తాడు. తానే ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు, పోషిస్తాడు, సంహరిస్తాడు.


 

డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్ 

image42

SRI BHAGAVATAM

'Srimad Bhagavatam - Adhyatmika Prasthanam' - 'Spiritual Enlightenment'

Srimad Bhagavatam - Adhyatmika Prasthanam - Spiritual Enlightenment on Sri Krishna's Consciousness 


Section # 02

  

శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 17


శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు సాక్షాత్తు యమ ధర్మరాజు అంశ తో జన్మించిన విదురుడి గురించి ఇలా చెబుతున్నాడు:


ఓ రాజా! కౌరవుల వద్దకు రాయబారిగా వెళ్ళిన శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు అతిధి గా వెళ్లకుండా విదురుడు గృహానికి వెళ్ళాడు. అంతటి మహనీయుడు విదురుడు. విదురుడి వృత్తాంతాన్ని పరీక్షిత్తు అడగగా శుక మహర్షి ఇలా చెప్ప సాగాడు:

“ఓ చక్రవర్తీ! దుష్టుడైన ధృతరాష్ట్రుడు తన కుమారులైన దుర్యోధనాదులను చాలా గారాబం గా పెంచాడు. తండ్రి పాండు రాజు స్వర్గస్తుడు కాగానే ఆయన కుమారులైన పాండవులు ధృతరాష్ట్రుడి ని ఆశ్రయించారు.

“పెట్టిరి విషాన్న; మంటం, గట్టిరి ఘనా పాశములను; గంగానది లో 

నెట్టిరి రాజ్యము వెడలం, గొట్టిరి; ధర్మంబు విడిచి కుతిలాత్మకులై “

ఈ విధంగా వచ్చిన పాండవులను చూసి అసూయతో కౌరవులు వారికి విషాన్నం పెట్టారు. పెద్ద పెద్ద తాళ్ళతో కట్టారు. గంగా నది లో నెట్టారు. రాజ్యం నుండి కూడా వెళ్ళ గొట్టారు. లక్క ఇంట్లో పాండవులు మై మరచి నిద్ర పోతుండగా, క్రూరాత్ములైన కౌరవులు వారి ఇంటికి నిప్పు అంటించారు. పండితులు ఎంతో ప్రశంసించిన రాజసూయ యాగం లో పూజనీయమైన అవబృధ స్నానం తో పరమ పవిత్రమైన పాంచాలి కొప్పు పట్టుకుని నీచాతి నీచం గా నిండు కొలువు లోపలికి ఈడ్చుకుని వచ్చాడు.


ఈ విధం గా కౌరవులు పాండవులకు చేయని అపకారమే లేదు. గుడ్డి రాజు కుమారులకు ఎదురు చెప్పలేక పోయాడు. మాయ జూదం లో పాండవులను ఓడించి పాండవులను అరణ్య వాస అజ్ఞాత వాసాలకు పంపారు. వారు జూద నియమాలను పూర్తి చేసి తిరిగి వచ్చినా, వారికి వారి రాజ్య భాగ మీయలేదు. ధర్మరాజు నియోగం పై శ్రీ కృష్ణుడు రాయబారిగా ధృతరాష్ట్రుడి కొలువు కి వెళ్ళాడు. యుద్ధం వలన బంధు నాశనం కలుగుతుంది. పాండవులకి తగిన రాజ్య భాగం ఇమ్మని బోధించాడు. సభ లో కౌరవ సామ్రాజ్య మహామంత్రి అయిన విదురుడు ధృతరాష్ట్రుడికి ఇలా బోధించాడు:


“ఓ కురు రాజా ! అధర్మం లో నడచి వంశ క్షయం చేయకు. నీ కొడుకు దుడుకుతనం విన్నప్పుడల్లా భీమసేనుడు కాలు తగిలిన కాల సర్పం లా మండి పడతాడు. ఎలా పర్యాలోచించినా అతడి చేతిలో నీ కుమారులకు మరణం నిశ్చయం. 

“నీ పుత్రుల శౌర్యంబును, చాపాచార్యాప గాత్మజాత కృప భుజా 

టోపంబును గర్ణు దురా, లాపంబును నిజముగా దలంతె మనమున్ “

“ఓ రాజా ! నీ కన్నకొడుకుల ప్రతాపాలు, ద్రోణాచార్య భీష్మాచార్య కృపాచార్యుల పటాటోపాలు, అంగరాజు అసందర్భ ప్రలాపాలు – ఇవన్నీ నిజమే అని నమ్ముతున్నావా? అయితే విను. ఏ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఈ ప్రపంచం చరాచర జంతుజాలం టో ప్రకాశిస్తోందో, బ్రహ్మదేవుడు, మహా దేవుడు మొదలైన దేవతలు, ముని గణం అంతా ఏ దేవుని దివ్య కళల తో జన్మించారో , ఎవ్వడు అనంతుడో, ఎవ్వడు అచ్యుతుడో ఆ పురుషోత్తముడే దయాపయోనిధి అయిన శ్రీ కృష్ణుడు.


“అట్టి జగన్నివాసుడు మురాసుర భేది పరాపరుండు చే 

పట్టి సఖుండు వియ్యమును బాంధవుండున్ గురుడున్ విభుండునై 

యిట్టలమైన ప్రేమమున నెప్పుడు దొడ్పడుచుండు వారలన్ 

జూట్టన వ్రేల నెవ్వరికి జూపగ వచ్చును బార్ధివోత్తమా !”

“మహారాజా ! అన్నీ లోకాలను తన లో దాచుకున్నవాడు, మారుడు అనే రాక్షసుడిని సంహరించిన వాడు,

సర్వశ్రేష్టుడు అయిన శ్రీ కృష్ణుడు చెలికాడై, వియ్యంకుడై, చుట్టమై, ప్రబోధకుడై, ప్రభువై, అతిశయించిన అనురాగం తో ఎల్లప్పుడు పాండవులకు తోడుగా నిలుస్తుంటాడు. అలాంటి వారిని వ్రేలెత్తి చూపడానికి ఎవరికైనా సాధ్యం అవుతుందా ? అందుకని నా మాట విని పాండవులకి రాజ్యభాగం ఇచ్చి కుల బంధు నాశనం కాకుండా కాపాడు . ఒక్కడి కోసం వంశం నాశనం చేసుకుంటావా? ఇదెక్కడి రాజనీతి “మహారాజా! ఈ దుర్యోధనుడిని విడనాడు. వంశ మర్యాదని ప్రభుత్వాన్నీ ప్రతాపాన్నీ కాపాడు“ అని ప్రార్థించాడు. దుర్యోధనుడు మహోగ్రమైన క్రోధం తో ఇలా అన్నాడు. 


“దాసీ పుత్రుని మీర లు, దాసీనుం జేయ కిటకు దగునే పిలువగా?

నాసీనుండై ప్రేలెడు, గాసిలి చెడిపోవ వెడలగా నడువు డికన్ “ 

శ్రీ మహాభాగవతం మూడవ స్కంధం 35.

“దాసీ పుత్రుడిని తీసుకొని ఆసనం ఇచ్చి కూర్చో బెట్టారు. ఇటువంటి వాళ్ళను ఈ సభకు ఎందుకు పిలిపించారు. కుదురుగా కూర్చొని అధిక ప్రసంగాలు చేస్తున్నాడు. వెంటనే ఈ తుంటరిని మెడపట్టీ గెంటి వేయండి. తిక్క కుదురుతుంది.


ఈ విధంగా దుర్యోధనుడు పలికిన మాటలకు విదురుడి మనస్సు ఎంతో క్షోభించింది. కర్తవ్యం గుర్తు తెచ్చుకుని, మారు మాటాడకుండా, ధనుర్బాణాలు విడిచి పెట్టి, ఆగ్రహాన్ని అణచుకొని, అరణ్యానికి వెళ్లిపోయాడు. అని శుక మహర్షి విదురుడి వృత్తాంతాన్ని పరీక్షిత్తుకి వివరించాడు. 


*

  

శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 18


కౌరవ సభలో తనకు జరిగిన అవమానాన్ని భరించలేక, కురు సామ్రాజ్య మహామంత్రి, సాక్షాత్తు యమధర్మరాజు అంశ తో జనించిన ధృతరాష్ట్ర సోదరుడు అయిన విదురుడు తీర్ధాటనలకు, పుణ్యక్షేత్ర దర్శనాలకు బయలుదేరాడు.  శ్రీ కృష్ణుడు స్వయంగా కోరి ఎంచుకుని, కౌరవ రాజ మర్యాద లను కాదని, విదురుడి ఆతిధ్యాన్ని స్వీకరించాడు. 

అంతటి మహనీయుడు విదురుడు. ఈ విదుర పాత్ర గురించి, ఆయన వృత్తాంతం, జన్మ రహస్యం పై ప్రజా బాహుళ్యం లో ఎక్కువ అవగాహన లేదు.


కురు మహా సామ్రాజ్యానికి వారసుడు లేని దుస్థితి ఏర్పడింది. భీష్ముడు తన ప్రతిజ్ఞ కారణంగా సింహాసనాన్ని స్వీకరించలేదు. శంతన మహారాజు భార్య అయిన మహారాణి సంతానం ఇద్దరు కుమారులు. పెద్దవాడు చిత్రాంగదుడు, చిన్నవాడు విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు గంధర్వ రాజు చేతిలో మరణించగా, విచిత్రవీర్యుడు కి పట్టాభిషేకం జరిగింది. కాశీరాజు తన కుమార్తెలయిన అంబికా అంబాలిక అంబ లకు స్వయంవరం చాటించాడు. కాశీరాజు కౌరవ సామ్రాజ్యం తో వైరం పూని హస్తినాపురానికి ఆహ్వానం పంపలేదు. ఇది అవమానం గా భావించిన భీష్ముడు, స్వయంవరానికి వెళ్ళి, తన సోదరుడిని వరించడం కోసం ఈ కన్యలను తీసుకు వెళుతున్నానని ప్రకటించి, రాజులని నిగ్రహించి, ముగ్గురు కన్యలను హస్తినాపురానికి తీసుకు వస్తాడు. అంబ మాత్రం తాను సాళ్వ మహారాజుకి మనసిచ్చానని చెప్పగా, భీష్ముడు గౌరవ మర్యాదలతో ఆమెను సత్కరించి పంపుతాడు, అంబిక అంబాలిక లను విచిత్రవీర్యుడికి ఇచ్చి కళ్యాణం జరిపిస్తాడు. 


నిరంతర మహారాజ భోగాలతో శృంగార కేళీ విలాసాలతో మునిగి తేలుతూ, చిక్కి శల్యావశిష్టుడై విచిత్రవీర్యుడు మరణిస్తాడు. సింహాసనం పై రాజు ఎవరు అనే సమస్య వచ్చింది. భీష్ముడిని వివాహం చేసుకోమని సత్యవతీ దేవి ఎంత బ్రతిమి లాడినా, ఆమె తండ్రి తన మాట వెనక్కి తీసుకుంటానని చెప్పినా భీష్ముడు తన పట్టుదల వీడడు. “దేవర న్యాయాన్ని” అనుసరించి, సత్యవతి దేవి తనకు పరాశర మహర్షి యందు జన్మించిన వేద వ్యాసుడిని ఆహ్వానిస్తుంది. విచిత్రవీర్యుడి భార్యలైన అంబికా అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించి, కురు మహా సామ్రాజ్యానికి వారసుడిని అనుగ్రహించమని కోరుతుంది.


“అవసరజ్ఞుం డయి వ్యాసుడే తెంచే నంత నత్త పసి

కవిల గడ్డంబును కవిల జడలును కవిల కన్నులును 

తవిన యన్నున నల్లనైన దీర్ఘపుం దనువును జూచి 

యువిడ గన్నుంగావ మొగిచి యుండే భయమున “

ఆంధ్ర మహాభారతం నన్నయ . ఆది పర్వం. 254.


అది తగిన వేళ అని తెలిసిన వ్యాస మహర్షి ప్రత్యక్షమయినాడు. అప్పుడు ఆ ముని యొక్క గోరోజనమ్ వంటి రంగులో ఉన్న గడ్డాన్నీ, జడలను, వాటికి తగినట్లుగా ఉన్న నల్లగా పొడుగైన దేహాన్నీ చూసి, అంబిక భయం తో కన్నులు గట్టిగా మూసుకుంది. వ్యాసుడు అంబిక కు పుత్రుడు కలుగుతాడని చెప్పాడు. మదించిన పదివేల ఏనుగుల బలం కలవాడు, బుద్ధియే చూపుగా కలిగిన శక్తి తో, దేహబలం పరాక్రమం కలవాడైనా, తల్లి పొరబాటు వలన గుడ్డితనం సంప్రాప్తిస్తుంది అని చెప్పాడు. దీనికి దుఃఖించిన సత్యవతి, అంబాలిక ని వారసుడి కోసం, వ్యాసుడి సన్నిధికి పంపిస్తుంది. ఆమె కూడా వ్యాసుడి రూపం వేషం చూసి, భయపడి తెల్లబోయింది. అంబాలికకు గొప్ప దేహ బలం పౌరుషం కలిగిన వాడు, సర్వ ధర్మాలు తెలిసిన వాడు అయినప్పటికీ , పుట్టుక తో పాండువర్ణం తో ( విపరీతమైన తెలుపు) జన్మించాడు. అంబిక కు అంధుడైన సంతానం కలిగింది కాబట్టి, మరొక అవకాశం ఇవ్వమని వ్యాసుడిని ప్రార్థించింది.


అంబిక మాత్రం ఆ మహర్షి రూపాన్ని వేషాన్నీ అంగీకరించ లేక, తన దాసి ని అలంకరించి పంపింది. ఆ దాసి వ్యాస మహర్షిని భక్తి తో సేవించింది. మాండవ్య మహర్షి శాప కారణం గా యమధర్మ రాజు వేదవ్యాసుడి ద్వారా, ధర్మ శాస్త్ర పండితుడిగా ఎదురు లేని బలం కలిగిన వాడు గా ఆ దాసికి జన్మించాడు. అతడే విదురుడు. 


యమధర్మ రాజు మాండవ్య మహాముని వలన శాపం పొందిన వృత్తాంతం అతి ఆశ్చర్యకరమైనది. మాండవ్యుడు సకల పుణ్య తీర్ధాలు తిరిగి ఒక పట్టణానికి దూరం గా అడవి లో ఆశ్రమం కట్టుకుని నివసించాడు. ఒక దొంగ రాజ ధనాన్ని దొంగిలించి పారిపోతూ, రాజ భటులకు చిక్కుతానేమో అనే భయం తో, మాండవ్య మహర్షి ఆశ్రమం లో పడేసి పారి పోయాడు. ఆ దొంగలకు ఈ మునియే మారు వేషం లో ఉన్న నాయకుడని భావించి, భటులు బంధించి, రాజు సన్నిధి లో నిలిపారు. రాజు విచారించకుండానే శూలం పై కొరత వేసి నిలిపారు. ముని శ్రేష్టుడైన ఆ మహా ముని ఇంతటి ఘోరమైన శిక్ష వేయబడినా, మనస్సు లో కలత చెంద కుండా, ఎటువంటి వికారం పొందకుండా, ప్రశాంతం గా ఆ శిక్ష అనుభవిస్తు తపస్సు కొనసాగించాడు.


 లో వచ్చి, “ ఓ ముని శ్రేష్టుడా! నీకు ఇంతటి బాధ కలిగించిన వారు ఎవ్వరు?” అని అడిగారు. మీ ప్రశ్నలకు సమాధానం మీకు తెలియదా ? “ఆవశ్య మనుభోక్తవ్యమ్ కృతం కర్మ శుభాశుభమ్ “.  “జీవుడు తన సుఖ దుఃఖాలకు తానే కర్త. అంతా స్వయం కృతమే” అన్నాడు. రాజ భటులు ఇది విని, రాజుకు చెప్పగా , రాజు వచ్చి పాదాల పై పడి క్షమించమని కోరుతాడు. బంధ విముక్తి కలిగిస్తాడు. 


మాండవ్య మహాముని మహా తపస్సు చేసి లోకాలన్నీ దాటి యమధర్మ రాజు వద్దకు చేరుకుంటాడు. “ఓ యమధర్మ రాజా! ఇటువంటి భయంకరమైన శిక్ష కు తగినంత పాపం నేను ఏమి చేశాను? ఇంతటి కఠిన శిక్ష నాకు తగునా ?“ అని ప్రశ్నించాడు. “ ఓ మహర్షి ! నీవు చిన్నప్పుడు తూనీగలను ఎగరనీయకుండా, వాటిని పట్టి సూదులకు గృచ్చావు. దాని ఫలాన్నే నీవు అనుభవించవలసి వచ్చింది హింస చేసే వారు దాని ఫలాన్ని అనుభవించక తప్పదు కదా“ అన్నాడు యమధర్మ రాజు. ఈ మాటలకు కోపించిన మాండవ్యుడు “పుట్టినది మొదలు పదునాలుగేళ్లు దాటే వరకు పురుషుడు ని ‘బాలుడు’ అంటారు. అతడు ఏమి చేసినా, ఆ పాపానికి ఘోర శిక్ష పొందడు. అతడికి ఇతరులు కీడు చేస్తే వారు పాపులు అవుతారు. ఇది నేను చేసిన కట్టడి. నీవు ఇట్టి ధర్మాన్ని గుర్తించకుండా బాల్యం లో స్వల్పమైన దోషాన్ని చేసిన నాకు, కఠినమైన శిక్ష వేశావు. కాబట్టి నీవు మానవ లోకం లో నిమ్న జాతి వనితకు జన్మించు“ అని శాపం ఇచ్చాడు. 


ఈ కారణం గా యమధర్మ రాజు భూలోకం లో ఈ విధంగా విదురుడిగా జన్మించాడు. ఇది మహనీయుడైన విదురుడి వృత్తాంతం.


*

  

శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 19


యాదవ వంశ నాశనం గురించి భాగవతం లోని అంశం కొంత విపులం గా మహాభారతం లో వివరించ బడింది. ద్వారకా వీధుల్లో ఋషులు వెళుతున్న సమయం లో విధి చేత ప్రేరేపించబడి, వృష్ణి వంశానికి చెందిన కొందరు యువకులు కపట వినయం ఒలకబోస్తూ, ” ఈ స్త్రీ బభృడి భార్య. ఈ అమ్మాయికి సంతానం కలుగుతుందా లేదా? అని అడిగారు. దివ్యదృష్టి తో చూసిన ఋషులు కోపించి “ ఈతడు శ్రీ కృష్ణుడి కుమారుడైన సాంబుడు. ఇతడు యాదవ కుల నాశనమైన ఒక రోకలిని కంటాడు పొండి“ అన్నారు. 


“దామోదరుడు హలధరుడు దక్కంగ యాదవు లెల్లరు నమ్ముససలము 

నద్భుతశక్తి గీటడగుదు రబ్బల దేవుండు దనదైన దేహ మధిక 

నిష్టమై విడిచి వార్నిధి బ్రవేశించు భూశయ్య నుండంగ నా చక్రధరుని 

జర యను రాక్షసి వెరవున బట్టి క్ర మించు బొండని చెప్పి, మెచ్చుగాదు!! 

 మనము కృష్ణు నింక గను టనియేడు బుద్ధి నమ్మహా మునీందృ లపుడు మరలి

యాత్మవాసములకు నరిగిరి తదనంత తదనంత రంబ క్రుష్ణు దవ్విధంబు వినియే !! 

ఆంధ్ర మహాభారతం మౌసల పర్వం ప్రధమాశ్వాసమ్ 


బలరామ కృష్ణులు తప్ప తక్కిన యాదవులంతా ఆ రోకలికున్న విచిత్ర శక్తి చేత నశిస్తారు. బలరాముడు యోగ నిష్ట చేత తన శరీరం వదలి సముద్రం లో ప్రవేశిస్తాడు. శ్రీ కృష్ణుడు నేలపై పడుకొని ఉండగా జర అనే రాక్షసి ఆయనను ఆక్రమిస్తుంది. ఆయన దేహం వదిలేస్తారు. ఇక పొండి” అని వారిని పంపి వేసి ఇప్పుడు మనం శ్రీ కృష్ణుడిని చూడటం సమంజసం కాదు అని ఆలోచించి మునులు ఆశ్రమానికి తిరిగి వెళ్లిపౌయారు. 


వెనువెంటనే శ్రీకృష్ణుడికి ఈ వార్త తెలిసింది. శ్రీకృష్ణుడు తన సమీపం లోని బంధువులని పిలిచి,”ఇది విధి నియామకం, అంతే తప్ప మన యాదవ కుమారుల మూర్ఖత్వం చేత దాపురించిందని మీరు మాత్రం దుఃఖించ కండి” అన్నాడు.

నిజానికి యాదవ కుల వినాశనానికి మరొక కారణం కూడా ఉన్నది. కురు పాండవుల లో పిల్లలందరి మరణానికి శోకిస్తూ గాంధారి పట్టరాని క్రోధం తో శ్రీకృష్ణుడిని చూసి ఇలా అన్నది. “పాండవ కౌరవులు తమలో తాము అసూయతో యుద్ధానికి సిద్ధపడితే నీవు వారికి అడ్డుపడకుండా పోయావు. న్యాయం తెలిసినవారు, సమర్ధులు అయిన భీష్మాదులు ఉండి కూడా, నీవు సకల ధర్మవేత్త, మధురభాషి అయి ఉండి కూడా అన్నీ పనులు చేతనైన వాడివని పేరు పొంది కూడా, నిర్లక్ష్యం చేశావు, దుర్యోధనుడిని నాశనం చేయడానికే నీవు రాయబారాలు చేశావు.  రాజులను, వారి సైన్యాలను, పేరు లేకుండా చేశావు. అందరూ మరణించారు. అన్నీ ప్రాంతాలు బీడు అయ్యాయి. చేసిన దానికి ఫలాన్ని నీవు కూడా అనుభవించు. 

నీ వైభవం సర్వనాశనం అయ్యేటట్లు నా శాపాగ్ని లో నిన్ను కాల్చి పారేస్తాను. వినుము: 


“పూని పాతివ్రత్య పుణ్య ఫలంబున సంపాదితంబైన సార తపము  

బలిమి సాధనముగా బలికెద నుత్తమ జ్ఞాతుల దమలోని సంగరంబున 

బొలియా జేసితి గాన పొలియుదు రన్యోన్య ఘాతకులై భవద్ జ్ఞాతి జనులు 

నీవును దప్పక నేడాదిగా ముప్ప దారగు నేడైన యద్దినమున 

నరయ దిక్కెవ్వరును లేని యగ్గలంపు కుత్సితంపు దేరంగునా కూలువాడ

విట్లు మీ వధూజనులు నేడ్చువారు పతుల సుతులును బంధుల బనవి పనవి “

ఆంధ్ర మహా భారతం స్త్రీ పర్వం ద్వితీయాశ్వాసం 161.


“ఎంతో దీక్ష తో పతివ్రతగా ఇంత సుదీర్ఘ జీవితాన్ని గడపిన పుణ్యానికి ఫలంగా లభించిన తపఃశక్తితో చెబుతున్నాను. ఉత్తములైన దాయాదులను తమలో తాము పొరాడి మరణించేటట్లు చేశావు. నీ దాయాదులు కూడా ఇలాగే ఒకరినొకరు కొట్టుకు ఛస్తారు. చూడు! నీవు కూడా సరిగ్గా ఈయనటికి 36 సంవత్సరాలు పూర్తి అయిన రోజున చూడటానికి దిక్కు ఎవరు లేని రీతిలో క్రూరంగా మరణించ బోతున్నారు. నా మాట తప్పదు. ఈ రోజు వీళ్ళందరూ ఎలా ఏడుస్తున్నారో, అదేవిధంగా నీ యాదవ కాంతలు కూడా భర్తలను కొడుకులను బంధువులను పేరుపేరునా తలచుకొని కుమిలికుమిలి ఏడుస్తారు. పొమ్ము కృష్ణా ! అన్నది.


శ్రీకృష్ణుడు మందహాసం చేశాడు. “అత్తా! గాంధారీ దేవీ! యాదవులకు మహామునులు ఇచ్చిన ఘోర శాపం ఎలాగూ ఉండనే ఉన్నది కదా! అనవసరంగా నీ తపఃశ్శక్తి అంతా వ్యర్ధం చేసుకున్నావు. నీవు కొత్తగా ఏమి చెప్పావు దాన్ని చెప్పు?” అన్నాడు. విను యాదవులకు నాశనం తప్పదు. వారిని వేరెవరు చంప లేరు. అందుచేత ఘోర యుద్ధం లో ఒకరినొకరు చంపుకుని మరణిస్తారు అని శ్రీ కృష్ణుడు ఆ శాప రహస్యాన్ని వివరించాడు.


*


శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 20


అధ్యాత్మిక ప్రస్థానం లో వేగంగా పరిణతి చెందాలని భావించేవారు కొన్ని ముఖ్య విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం పురాణాల్లో శాపాలు వరాల గురించి వింటున్నాము. యోగులకు ఋషులకు తపస్సు చేసిన వారికి, గొప్ప తపఃశ్శక్తి కలుగుతుందని తెలుసుకున్నాము. ఈ శక్తి ని ఉపయోగించి ఒక వరం కానీ శాపం కానీ వారు ఇవ్వగలుగుతున్నారు. వారి నోటి వెంట వచ్చిన వాక్కుని, వారి లోని శక్తి యే సత్యంగా ఆవిర్భవింప చేసిందనే విషయం మనం గ్రహించాలి. 

సృష్టి లో సమస్త విషయాలు ఒకరికి వర్తించి, మరొకరికి వర్తించకుండా ఉండవు. ఇవి మనకి కూడా వర్తిస్తాయనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకి కూడా, మనం చేసే పూజలు, జపాలు, వ్రతాలు, సాధనలు, పారాయణాలు, దానాలు, ధ్యానాలు, మంత్ర జపాలు ఇంకా ఎన్నో కారణాల వలన ఎంతో శక్తి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఉత్తమ మైన ధార్మిక జీవనం గడపడం వలన అద్భుతమైన శక్తి కలుగుతుంది. వీరు సత్యం పలుకగా, పలుకగా, సత్యమే చూస్తూ, సత్యమే సర్వత్రా దర్శిస్తూ ఉండేవారికి, ఇంకా ఎంతో గొప్ప శక్తి కలుగుతుంది. సత్యానికి అనుగుణంగా ధర్మబద్ధంగా జీవించడం వలన కలిగిన అద్భుత శక్తి ఇది. 


మానవుడు పైన చెప్పుకున్న విశిష్ట కర్మలన్నీ నాలుగు ఇంద్రియాల ద్వారా చేస్తూ, అయిదవ ఇంద్రియం అయిన వాక్కు ద్వారా పోగొట్టుకుంటున్నాడు. మనం పలికే వాక్కుని మన లోని శక్తి సత్యం చేయాలని చూస్తుంది కాబట్టి, మన వాక్కు ద్వారా మన లోని శక్తి ఖర్చు అవుతుంది. అందుకే ఒక రోజు లో మౌనం ద్వారా మన లోని శక్తి ని మనం భద్ర పరచాలి. భగవద్గీత లో శ్రీ కృష్ణుడు అత్యంత రహస్యమైన సత్యం “మౌనం“ అన్నాడు. దీని దృష్ట్యా మనం కూడా నిత్యం శాపాలు వరాలు ఇచ్చేసి మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నామని గుర్తించాలి. మరి “మనం వరం ఇస్తే అది నిజం కావడం లేదుగా” అనే సందేహం రావచ్చును. మన వాక్కుని సత్యం చేయ కలిగిన శక్తి ఇంకా మనకి రాలేదు కానీ, ఇప్పటివరకు సంపాదించిన శక్తి మాత్రం వాక్కు వలన ఖర్చు అవుతోంది. 


మన దేహం అనే పెద్ద టాంకు లోకి నాలుగు ఇంద్రియాలు అనే చిన్న పంపుల ద్వారా శక్తి వచ్చి చేరుతోంది. వాక్కు అనే పెద్ద పంపు ద్వారా విపరీతం గా శక్తి వెలికి పోతోంది. అందువలన ఈ టాంకు నింపాలంటే ముందు వాక్కు, అంటే పంపు కట్టేయాలి. అప్పుడు టాంకు నిండుతుంది. ఇదీ శాపాలు వరాలు లో ఉన్న రహస్యం. పతంజలి మహర్షి దీనినే “దమం” అన్నాడు. ఆది శంకరులు, బుద్ధుడు కూడా ఈ వాక్కు మీద సంపూర్ణమైన అదుపు సాధించ గలిగితే, ఆధ్యాత్మిక ప్రస్థానం లో చాలా పెద్ద విజయం సాధించినట్లే అని అన్నారు. 


*


శ్రీ భాగవతం - ఆధ్యాత్మిక ప్రస్థానం – 21


భాగవతం లో ఉద్ధవుడు విదురుడికి యాదవులు పొందిన వివిధ శాపాల ఘట్టాన్ని చెబుతున్నాడని, శుక మహర్షి పరీక్షిత్తుకి వివరిస్తున్నాడు.

“ఓ విదురా! మునుల శాపం అనంతరం ఆ మరునాడు సాంబుడి కడుపులో నుండి ఒక రోకలి బయట పడింది. చాలా భయంకరం గా, కఠినం గా ఉన్న రోకలి ని చూసి యాదవులంతా ఈ వార్త వసుదేవుడికి విన్నవించుకున్నారు. ఎంతయో భయభ్రాంతుడైన వసుదేవుడు ఆ రోకలి ని సముద్రం వద్ద రాళ్ళపై అరగదీయ మన్నాడు. ”ఆ విధం గా అయినా ముని శాపం వ్యర్ధం అవుతుంది కదా” అని భావించాడు. ఆ రోకలి అరిగి పోయినా, దాని సారం అంతా ఆ సముద్ర తీరాన తుంగ చెట్ల రూపం లో భయంకరం గా పెరిగింది. ఈ విషయాన్ని ఎవరు గమనించలేదు. అది యాదవుల కోసం ఎదురుచూస్తోంది.


ఓ ధర్మ స్వరూపుడా! గాంధారి చెప్పిన 36 సంవత్సరాలు యాదవులకి ఆనందం గా గడిచాయి. ద్వారకా నగరం లో కనీవినీ ఎరుగని ఉత్పాతాలు సంభవించడం ప్రారంభం అయినాయి. ఒకసారి యాదవులంతా శ్రీ కృష్ణ సహితం గా ప్రభాస తీర్థానికి వెళ్లారు. ఆ నదీ జలాల్లో స్నానం చేశారు. చిత్ర విచిత్ర భోజనాలు విందులు సిద్ధం చేసుకున్నారు. పిండివంటలు వండుకున్నారు. మనోహరమైన అలంకారాలు చేసుకున్నారు. మద్య సహితం గా మత్తు పానీయాలు తెచ్చుకున్నారు. బ్రాహ్మణులందరికీ దాన ధర్మాలన్నీ శాస్త్ర సమ్మతం గా చేశారు. ఆ తరువాత అక్కడ దృశ్యం మారిపోయింది. 


శ్రీకృష్ణుడు నన్ను పిలిచి ఉద్ధవా! నీవు బదరీవనానికి తపస్సు కై వెళ్ళమని ఆదేశించాడు. బలరాముడు తనకు మహా ప్రస్థానానికి వెళ్లడానికి అనుమతి ఇమ్మని శ్రీకృష్ణుడిని అడిగాడు. శ్రీ కృష్ణుడు మౌనం గా వీడ్కోలు చెప్పాడు. బలరాముడు వనం లో ఒంటరిగా ఒక మహా వృక్షం క్రింద శాంత చిత్తుడై, యోగ సమాధి లో కూర్చున్నాడు. శ్రీ కృష్ణుడు చూస్తుండగా బలరాముడి ముఖం నుండీ ఒక మహా సర్పం వెలికి వచ్చింది. ఆ మహా సర్పం ఎర్రటి కాంతి తో వేయి నోళ్లతో ప్రకాశిస్తున్నది. ప్రకాశిస్తున్న పడగలతో ఒక చిన్న పర్వతం లా తేజస్సు తో ఉన్నది. ఆ విధం గా బలరాముడు తన యోగ శక్తి తో దేహాన్ని వదిలిపెట్టి సముద్రం లో ప్రవేశించాడు. ఆదిశేషువు రూపమైన ఆ బలరాముడుకి వరుణుడు స్వాగతం చెప్పాడు. ఆది శేషువు వైకుంఠానికి చేరుకున్నాడు. 


యాదవులంతా దాన ధర్మాలు చేసిన తరువాత మహా ప్రీతి తో విందు భోజనాలు చేసి, తమకం తో విపరీతం గా మత్తు పానీయాలు సేవించారు. శాపాలన్నీ తమ ప్రభావం చూపించడం మొదలయింది. మత్తు పెరిగింది, మదం ఆవహించింది, ప్రేలాపనలు మొదలైనాయి. యాదవుల్లో వృష్ణి, భోజ అంధక వంశాల వారంతా పరిహాసాలాడుతూ, విమర్శలు చేసి, నిందల్లోకి దిగి, దూషణ లు చేస్తూ, పోరాటాలకు దిగారు. ఆయుధాలకి శాపం ఆవరించింది. చుట్టూ చూశారు. సముద్రం తీరాన ఎత్తుగా వాడియైన తుంగ పెరిగి కనిపించింది. ఒకరిని ఒకరు కొట్టడం మొదలు పెట్టారు.


సాత్యకి కృతవర్మ ని చూస్తూ, ప్రద్యుమ్నుడి ని చూస్తూ “ఓయి కృతవర్మా! శత్రువులు నిద్ర లో ఉన్నప్పుడూ నిజం గా వారు మరణించినట్లే, అట్లాంటి స్థితి లో ఉన్నవారిని చంపడానికి ఏ వీరుడు ముందుకు రాడు. ఒక రాజకుమారుడైన కృతవర్మ అశ్వత్థామ తో కలిసి పాండవ శిబిరం లో రాత్రి పూట పాండవుల కుమారులైన ఉప పాండవులని, పాండవ సేనాధిపతి దృష్టద్యుమ్నుడి తో సహా, సేన యొక్క మరణానికి కారకుడయ్యాడు. ఛీ! నీవూ ఒక వీరుడవా? అన్నాడు. ఆ తరువాత కలహం పెరిగి పోయింది. పరస్పరం దూషణలు పెరిగి పోయాయి. మహాభారత యుద్ధం లో ఒకరు చేసిన అధర్మాలను మరొకరు చెబుతూ, మారణ కాండ సాగించారు. 


మునుల శాపం వలన ఆవిర్భవించిన రోకలి ని పొడి చేసి నీటిలో కలిపినా, అది తన ప్రభావం సంపూర్ణం గా చూపింది. శ్రీకృష్ణుడి కుమారులైన ప్రద్యుమ్నుడు, అతడి కుమారుడైన అనిరుద్ధుడి తో సహా యాదవుల్లోని సమస్త వంశాలు అంతరించాయి. గాంధారీ దేవి, మునుల శాపాలన్నీ ఫలించాయి. శ్రీకృష్ణుడు సాక్షీ భూత చేతస్కుడై నిలిచాడు. 

డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్