Panchang Knowledge

కార్యభేదము చేత నిషిద్ద తిథులు:

 శ్లో:

షష్ఠ్యాష్టమీభూతవిధుక్షయేషు నో సేవేత నా తైలపలే క్షురం రతమ్ |

నాభ్యజ్ఞ్జనం విశ్వదశద్వికే తిథౌ ధాత్రీఫలైః స్నానమమాద్విగోష్వసత్ ||౭||


షష్టి, అష్టమి, చతుర్దశి మరియు అమావాస్య తిథులందు క్రమ పద్ధతిలో పురుషులు తైలాభ్యన్జ్ఞ్జనము, మాంస భోజనం, క్షౌరము మరియు స్త్రీ సంభోగము చేయకూడదు. అనగా షష్టి నాడు తైలాభ్యన్జ్ఞ్జనము, అష్టమి నాడు మాంసాహార భోజనము, చతుర్దశి నాడు క్షౌరము మరియు అమావాస్య నాడు స్త్రీ సంభోగము చేయరాదు. అదే విధంగా ఏకాదశి, దశమి మరియు ద్వితీయ తిథులందు అభ్యంజ్ఞ్జనము చేయరాదు. అమావాస్య, సప్తమి మరియు నవమి తిథులందు ఆమలక (ఆమ్ల) స్నానం చేయరాదు.


వివరణ: నిత్య అభ్యంజ్ఞ్జనం (అనగా నిత్యం తలస్నానం చేయువారికి) చేయు వారికి ఇది వర్తించదు. కాని తైలాభ్యన్జ్ఞ్జనము నకు మాత్రం పైన చెప్పబడిన సూత్రం తప్పక పాఠించాలి. అష్టమి నాడు మాంసాహార భోజనం అనారోగ్యమునకు హేతువు కాగలదు. చతుర్దశి నాడు క్షౌరము వలన శరీరము నందలి ఓజా శక్తి తగ్గు సూచనలున్నాయి. అదేవిధంగా అమావాస్య నాడు స్త్రీ సంభోగము కూడా ఉభయులకు అనారోగ్యమునకు హేతువు మరియు పుట్టబోయే సంతానము మతిభ్రమణ యోగములతో జన్మించే అవకాశం కలదు. 

image38

Panchang Knowledge

నిషిద్ద తిథి - దగ్ధ యోగములు

దగ్ధ యోగము అనగా ఏమి?


మనకు నిత్యమూ పజ్ఞ్చాన్గం లో దగ్ధ యోగము అని కనిపిస్తూ ఉంటుంది. దగ్ధ యోగములు ఎలా ఏర్పడతాయో  చూద్దాము:


నిషిద్ద దగ్ధ యోగములు:


షష్ఠ్యాదితిథయో మన్దాద్విలోమం ప్రతిపద్-బుధే |

సప్తమ్యర్కేధమాః  షష్ఠ్యాధ్యామాశ్చ రదధావనే ||


శనివారము మొదలు విలోమ క్రమంలో రవివారం వరకు, షష్టి మొదలు అనులోమ క్రమంలో గల తిథులు అధమ సంజ్ఞలు అనబడును. ఇట్టి సంజ్ఞలు శుభ కార్యములకు నిషిద్ధములు. అనగా:  శనివారము షష్టి, శుక్రవారము సప్తమి, బృహస్పతివారం అష్టమి, సౌమ్యవారం నవమి, భౌమవరం దశమి, ఇందువారం ఏకాదశి, భానువారం ద్వాదశి తిథులు ఉన్న ఎడల అవి ‘దగ్ధయోగములు’ అని అనబడును. ఇట్టి దగ్ధ యోగములు శుభకార్యములకు నిషిద్ధములు. ఇట్టి యోగములను ‘క్రకచ’ యోగములు అని కూడా ఉంటారు. మరియు, బుధవారం ప్రతిపద, రవివారం సప్తమి కూడా అధమములే. ఇట్టి యోగములను ‘సంవర్తక’ యోగములు అని అంటారు. ప్రతిపద, షష్టి మరియు అమావాస్య తిథులు దంత ధావనమునకు నిషిద్ధములు. అనగా ఇట్టి తిథులందు దంత ధావనము చేయరాదు.


(ముహూర్త నిర్ణయ సమయంలో తమ చతురత మరియు విజ్ఞతను ఉపయోగించి ముహూర్త నిర్ణయం చేయాలి. సిద్ధాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రయోగం చేయరాదు. భాను సప్తమి, కృష్ణ పక్షం లో బుధవారం ప్రతిపద, శుక్రవారం సప్తమి, శుక్ల పక్షమిలో భానువారం ద్వాదశి తిథులను ముహూర్త ప్రయోగమునకు ఉపయోగించ వచ్చును. కాని అట్టి ముహూర్తంలో ఇతర శుభ యోగాలను కూడా పరిగణలోకి తీసుకోవలసిన వస్తుంది. ప్రతిపద షష్టి మరియు అమావాస్య తిథులందు దంతధావనం చేయరాదనే సిద్ధాంతము ఈరోజుల్లో కష్టమే. ఈ సూత్రము నిర్ణయము చేసిన రోజులందు ఉన్న ఆహార నియమాలు ఇప్పుడు లేవు. అప్పుడు గల ప్రకృతి ఇప్పుడు లేదు. కావున ఇట్టి సిద్ధాంతము ఈరోజుల్లో వర్తించదని చెప్పుకోవచ్చు)


నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి

Panchang Knowledge

Tithi & Ruled Devata

Panchang Knowledge, Panchangam, Muhurat Knowledge Etc.తిథీశా వహ్నికౌ గౌరీ గణేశోఽహిర్గృహో రవిః |


శివో దుర్గాన్తకో విశ్వే హరిః కామః శివః శశీ ||౩||


వహ్ని, కః, గౌరీ, గణేశః, అహిః, గృహః, రవిః, శివః దుర్గా, అన్తకః, విశ్వే, హరిః, కామః, శివః, శశీ, (ఏతే) తిథీశాః. అనగా అగ్ని, బ్రహ్మా, పార్వతి, గణేశ, సర్ప, కార్త్తికేయ, సూర్య, శివ, దుర్గ, యమ, విశ్వేదేవ, హరి, కామదేవ, శివ మరియు చన్ద్రమా అనునవి దేవతా క్రమంలో ప్రతిపదతో ప్రారంభమైన 15 తిథులకు అధిపతులు. అనగా ప్రతిపద – వహ్ని లేదా అగ్ని, ద్వితీయ – కః లేదా బ్రహ్మా, తృతీయ – గౌరీ లేదా పార్వతి, చతుర్థి – అహిః లేదా గణేశ, పంచమి – గృహః లేదా సర్ప లేదా శేషుడు, షష్టి  - కార్తికేయ లేదా సుబ్రహ్మణ్య, సప్తమి – సూర్య, అష్టమి – శివ, నవమి – దుర్గ, దశమి – యముడు,  ఏకాదశి – విశ్వేదేవ, ద్వాదశి – శ్రీ మహావిష్ణు, త్రయోదశి – కామః లేదా మన్మథుడు, చతుర్దశి – శివుడు, పౌర్ణమి – చన్ద్రుడు మరియు అమావాస్య – పితృ దేవతలు.

ఏ దేవతకు ఏ తిథి నిర్ణయించ బడినదో అట్టి తిథి నాడు యా దేవతను ఆరాధించడం వలన శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి. మనం దాదాపుగా అదేవిధంగా చేస్తూ ఉంటాము. అగ్ని కార్యాలకు మరియు అగ్ని ప్రతిష్టలకు ప్రతిపద శుభ ప్రదమైనది. బ్రహ్మను పూజించుటకు ద్వితీయ తిథి శుభప్రదమైనది. అదే విధంగా ఇట్టి తిథి వేద పండితులను, గురువులను పూజించుటకు కూడా శుభప్రదమైనది. తృతీయ నాడు గౌరీ పూజకు శుభప్రదమైనది. అందుకే చైత్ర శుద్ధ తృతీయ నాడు ‘గౌరీ తృతీయ’ అని అంటాము. ఆ రోజు గౌరీ దేవతను పూజించుటకు శుభప్రదమైనది. చతుర్థి నాడు శ్రీ గణపతి ఆరాధన శుభప్రదమైనది. అందుకే ‘సంకష్టహర చతుర్థి’ కృష్ణ పక్షంలో చతుర్థి నాడు ఉంటుంది. అదే విధంగా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ‘వినాయక చవితి’ పండగ జరుపుకుంటాము. పంచమి నాడు సర్పారాధనకు శుభప్రదమైనది. అందుకే ‘నాగుల పంచమి’ నాడు నాగ దేవతను పూజిస్తాము. షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాము. ‘సుబ్రహ్మణ్య షష్టి’ గూర్చి దాదాపుగా అందరికి తెలిసినదే. సప్తమి నాడు సూర్యారాధన శుభప్రదమైనది. అందుకే మాఘ శుద్ధ సప్తమి నాడు శ్రీ సూర్య జయంతి, రథ సప్తమిని జరుపుకుంటాము. అష్టమి నాడు శివారాధన శుభప్రదమైనది. అష్టమి ఆయుష్య సంబంధమైనది అగుట వలన మృత్యు లేదా అపమృత్యు సంబంధిత శాంతులకు శివారాధన అత్యంత శుభప్రదమైనది. అందులోకి అష్టమి నాడు చేయడం ఇంకనూ శుభ ఫలితములను ప్రసాదించును. నవమి నాడు దుర్గారాధన చేస్తాము. ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు ‘మహార్నవమి’ గా మనం దుర్గాదేవి ని పూజించడం అందరికి తెలిసినదే. దశమి నాడు యముడిని పూజిస్తాము. యముడు ధర్మ దేవత. అందుకే ఆయనను యమ ధర్మరాజు అని అంటాము. ధర్మ సంబంధమైన, మత సంబంధమైన, దేవతా సంబంధమైన మరియు ఇతర అన్ని విధములైన శుభ కార్యములకు దశమి శుభప్రదమైనది. చైత్ర శుద్ధ దశమి నాడు ‘ధర్మరాజ దశమి’ అని అంటాము. ఆ రోజున ధర్మరాజును (యముడిని) పూజిస్తాము. ఏకాదశి నాడు విశ్వేదేవ లేదా రుద్రుడిని పూజించడం అత్యంత శుభప్రదమైనది. అనగా శ్రీ రుద్రారాధనకు ఏకాదశి శుభప్రదమైనది. ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణు ఆరాధన శుభప్రదమైనది. ఆదిత్యులను పూజించుటకు కూడా శుభప్రదమైనది. అందుకే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ద్వాదశి తిథికి చాలా ప్రాధాన్యత కలదు. త్రయోదశి – త్రయోదశి తిథి మిత్రుత్వాలు చేయుటకు, గర్భాదానాది శు కార్యాలకు శుభప్రదమైనది. చతుర్దశి శివారాధనకు శుభప్రదమైనది. మాఘ బహుళ చతుర్దశి నాడు ‘మహా శివరాత్రి’ జరుపుకుంటాము, అదే విధంగా ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు ‘మాస శివరాత్రి’ జరుపుకుంటాము. పౌర్ణమి నాడు చంద్రారాధన శుభప్రదమైనది. ‘కోజాగిరి పౌర్ణమి’ గూర్చి తెలియని వారుండరు. ఆశ్వయుజ పౌర్ణమి నాడు చాలా ఘనం గా జరుపుకుంటారు. ఇది అధిక శాతం ఉత్తర భారతదేశం వారికి సంప్రదాయం గా ఉన్నది. అమావాస్య నాడు పితృ దేవతలను పూజించడం అందరికి తెలిసినదే. అమావాస్య నాడు పితృ దేవతలకు తర్పణాలు, మరియు భాద్రపద అమావాస్య ‘మహాలయ అమావాస్య’ నాడు పితృ దేవతలకు జరుపు శ్రాద్ధ కర్మలు జరుపుకోవడం అందరికి తెలిసినదే.


ముఖ్య గమనిక: పైన సూచించినవి ఆయా తిథుల అధిపతులు మరియు వాటి ఆరాధన కు చెందినవి మాత్రమే. ముహూర్త నిర్ణయానికి వీటిని ప్రామాణికంగా తీసుకోరాదు. 

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి

Learn More

This is the Knowledge Base for Hindu Panchang. Learn about Panchang

Panchangam

Panchang for

(Panchangam, Telugu Calendar, Auspicious and Inauspicious times of the Day, Festivals, Planetary Transits Etc)


Coming Soon


నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి


image39