Guru Grahachara

Results of Jupiter's Transit in Sagittarius

Guru Grahachara - Jupiter in Sagittarius - Results of Jupiter's Transit in Sagittarius


ఓం శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః

శుభ గ్రహాః


ధనుస్సు రాశిలో బృహస్పతి గోచార ఫలము


బృహస్పతి 05.11.2019 నాడు ఉదయం గం. 05:17 ని. స్వక్షేత్రమైన ధనుస్సు రాశిలో ప్రవేశము. ప్రవేశాత్ తత్పరదినే ‘పుష్కర వాహిని’ పుష్కర ప్రారంభః అనగా 05.11.2019 నుండి పుష్కర వాహిని నదికి పుష్కరాలు ఆరంభం (పుష్కర వాహిని మధ్య భారత దేశంలో మొదలై, గోదావరి నర్మదా నదుల మధ్య ప్రాంతంలో ప్రవహిస్తూ గుజరాత్ లోని సూరత్ వద్ద అరేబియన్ మహాసముద్రం లో కలుస్తుంది. పుష్కర వాహిని నదిని తాప్తి లేదా తపతి నది అని అంటారు). నవగ్రహలన్నిటి లోకి శని మరియు బృహస్పతి గ్రహాల గోచారాలకు విశేషమైన ప్రాధాన్యత కలదు. కార్య సాధనకు బృహస్పతి – పనులందు ఆటంకాలు లేకుండా వేగంగా పరుగేత్తాలంటే శనేశ్వరుడు. ఈ ఇరువురి అనుకూలత గోచారంలో చాలా అవసరము. రెండవ ప్రధాన కారణము – ఈ రెండు గ్రహాలు ఒక సుదీర్ఘ కాలం పాటు రాశులందు సంచరించుట వలన అట్టి ప్రభావము మనపైన తప్పక ఉంటుంది.


బృహస్పతి ధనుస్సు రాశిలో ప్రవేశించిన పిమ్మట ఆయన 30.03.2020 నాడు త్వరణ గమనం (Acceleration) వలన మకర రాశిలో ప్రవేశించును. తిరిగి వక్రగతి తో 30.06.2020 నాడు పునః ధనస్సులో ప్రవేశించి చివరిగా 20.11.2020 నాడు మకర రాశిలో ప్రవేశించును. 20.11.2020 నాడు ధనస్సులో ప్రవేశించిన మొదలు తుంగభద్రా నదికి పుష్కరాలు. ఈ మధ్య కాలంలో కొన్ని కాలెండర్లు మరియు కొన్ని వెబ్ సైట్ లందు త్వరణ గతిన బృహస్పతి ధనస్సులో ప్రవేశించిన తేది 30.03.2020 మొదలు పుష్కరం అని వ్రాసారు. కాని అది శాస్త్ర సమ్మతము కాదు. బృహస్పతి ఒక రాశిలో దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తారు. అట్టి కాలాన్ని జ్యోతిష శాస్త్రంలో ‘బార్హస్పత్యమానం’ అని అన్నారు. అనగా బృహస్పతి యొక్క ఒక సంవత్సరం. ఇట్టి గ్రహాలు కొన్ని సందర్భాలందు త్వరణ మరియు వక్ర గతులందు అతి వేగము గాను లేదా వక్రీకరించి రాశులను మారు అవకాశం ఉంది. ఇది ఖగోళ శాస్త్ర సంబంధమైనది, ఇట్టి గమనాలకు జ్యోతిష ప్రాధాన్యత కలదు కాని సంవత్సర కాలమానం లెక్కించుటకు ఇట్టి గతులనూ పరిగణలోకి తీసుకోరాదు. కావున పుష్కరము 20.11.2020 నుండి మాత్రమే ఉంటుంది.


బృహస్పతి స్వక్షేత్రమున సంచరించుట వలన బ్రహ్మోపదేశము నకు శుభ సమయము. దేశ ఆర్థికాభివృద్ధి మెరుగుపడు అవకాశముంది. విద్య మరియు ఆర్ధిక రంగ సంస్థల అభివృద్ధి చక్కగా ఉంటుంది. నీతినియమాలతో దేశాన్ని పాలిస్తారు. దేశంలో ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం పాలకులు చేస్తారు. న్యాయ వ్యవస్థల అభివృద్ధి చక్కగా ఉంటుంది. వేద విద్య అభివృద్ధి చెందుతుంది. ప్రజలు ధర్మ కార్యాలు నిర్వహించుటకు వెనకాడరు. విద్యావేత్తలు గౌరవించా బడతారు. వేద విద్యను అధ్యయనం చేసిన వారు గౌరవించా బడతారు. ప్రజలు యజ్ఞ యాగాదులను దండిగా ఆచరిస్తారు. ధర్మ కార్యాచరణ ఎక్కువగా ఉంటుంది. జనవరి వరకు ధనస్సులో గురు భ శని భ తో కలిసి ఉండుట వలన ఇట్టి సమయమున దేశ ఆర్థిక పురోగతి మందగతిన సాగుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ లు, తత్సంబంధిత పనులు వెనకబడు అవకాశముంది. జనవరి ద్వితీయార్థం నుండి అభివృద్ధి చక్కగా ఉంటుంది. కాని ధనుస్సు రాశిలో గురు చండాల యోగ ప్రభావము వలన ఆర్ధిక నేరాలు, ఆర్ధిక మోసాలు పెరిగే అవకాశం ఉంది. కాని ఇట్టి మోసాలు చేయు వారి పట్ల న్యాయ వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కొన్ని అనూహ్య మైన పరిణామాలను ఎదుర్కోను అవకాశం ఉంది. ధనుస్సు రాశిలో బృహస్పతి గోచార ఫలము మేషాది ద్వాదశ రాశుల వారి పైన ఏ విధంగా ఉంటుందో తెలుసుకొందాము:


మేషము

మేష రాశి వారికి ఇట్టి గోచారము అత్యంత శుభ ఫలములను ప్రసాదించు సూచనలు ఉన్నాను, గోచార రీత్యా జనవరి మొదలు శని భ. దశమ స్థానమున ప్రతికూలుడగుట వలన ఇట్టి శుభ ఫలములు సంపూర్ణంగా లభించు సూచనలు అగుపడుట లేదు. చక్కని కార్యసిద్ధి, తలపెట్టిన పనులందు అనుకూలత, ఆశ నెరవేరుట, శుభ కార్యములు, వివాహ ప్రయత్నాలు సఫలీకృతమగుట, చక్కని ఆర్థికాభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు, తేజో వృద్ధి, పదోన్నతులు, సంఘములో చక్కని గౌరవ మర్యాదలు, విద్యార్థులకు శుభ ఫలాలు అధికము, వ్యాపారుల చక్కని వ్యాపారాభివృద్ధి, స్థిరాస్తుల పరముగా అనుకూలత, ఆకస్మిక ధన యోగాలు, ధార్మిక కార్య చింతన ఇత్యాది శుభ ఫలాలు సూచించు చున్నను శని భ. అ వలన అవరోధాలు అధికముగా ఉండు సూచనలు ఉన్నాయి. శ్రమతో కూడిన ఫలములను పొందు వారగు సూచనలు ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగ వ్యాపారములందు, వృత్తు లందు మందగతి, కార్యానుకూలత తగ్గుట, విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలములు, ఆస్తుల వ్యవహారములందు మాంద్యత అధికముగా ఉండుట మరియు ఇతర కార్య వ్యవహారములందు ప్రతికూలతలు అధికముగా ఉండు సూచనలున్నాయి. ఇట్టి ప్రతికూలతలు జనవరి మొదలు కాస్త అధికమగు సూచనలున్నాయి. శని భ జప శాంతులు కొంత ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి.


వృషభము

వృషభ రాశి వారికి అష్టమ స్థానమున గురు గోచరము వలన ప్రతికూల ఫలాలు అధికముగా ఉండే సూచనలున్నాయి. గోచార రీత్యా శని మరియు గురు భ. ఇరువురు ప్రతికూలమగుట వలన వీరికి ఇబ్బందులు అధికాముగానే ఉండే సూచనలున్నాయి. వృత్తి రీత్యా అనుకోని చిక్కులు, స్తబ్దత, ఉద్యోగ భంగ యోగాలు, అధిక ధన వ్యయము, అనారోగ్యము, ప్రధానముగా జీర్ణ కోశము మరియు శరీరము నందలి గ్రంథులు, హార్మోనులు, మధుమేహము, శ్వాస కోశమునకు చెందిన చిక్కులు గల వారికి అధిక ప్రతికూలతలు, కాలేయ సంబంధిత చిక్కులు. గృహ సమస్యలు, మరియు కలహాలు, రాజదండన భయము, అశాంతి, తేజోహీనత, స్వల్ప ప్రమాదాలు, విద్యార్థులకు మరియు వ్యాపారులకు కూడా ప్రతికూలతలు అధికము, చొర భయము, సోమరితనము,పనుల పట్ల శ్రద్ధ తగ్గుట. – మొదలగు గా గల ప్రతికూల ఫలాలు లభించు సూచనలున్నాయి. జనవరి మొదలు అవకాశాలు చివరి క్షణమున చేజారిపోవుట. కార్యసిద్ధి లోపించి ఉండుట ఇత్యాది ప్రతికూల ఫలాలు అధికంగా ఉండు సూచనలున్నాయి. గురు శని భ జప శాంతులు కొంత ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి.


మిథునము

మిథున రాశి వారికి సప్తమ స్థానమున బృహస్పతి సంచారము శుభ ఫలములను అధికముగా ప్రసాదించును. చక్కని కార్యసిద్ధి, తలపెట్టిన పనులందు విజయ ప్రాప్తి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమగుట, శారీరిక సౌఖ్యము, సంపూర్ణ ఆరోగ్యము, సంతాన సౌఖ్యము, గృహమునందు శుభ కార్యాలు, వివాహ ప్రయత్నాలు సఫలమగుట, అధికారుల ద్వారా అనుకూలత, ధార్మిక కార్యాసక్తి, భాగస్వాములతో అనుకూలత మరియు వారి ద్వారా ప్రయోజనం, ధన ప్రాప్తి, చక్కని ఆర్థికాభివృద్ధి మరియు సంపూర్ణ ఆనందము మొదలగు గా గాల శుభ ఫలాలు అధికముగా ఉండే అవకాశముంది. విద్యార్థులకు శుభ ఫలాలు అధికముగా ఉంటాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శని భ జనవరి వరకు ప్రతికూలుడు అగుట వలన ఇట్టి శుభ ఫలాలు కొంత తక్కువగాను మరియు అటుపిమ్మట చక్కని ఫలితములు లభించు సూచనలున్నాయి. జన్మ రాశిలో రాహువు గోచరము వలన కార్యసిద్ధి యందు స్వల్ప అనిశ్చితి కొనసాగు సూచనలున్నాయి. మానసిక ఒత్తిడితో కూడిన ఫలాలు లభిస్తాయి. ఒడుదుడుకులు అధికంగా ఉంటాయి. ఇట్టి ఫలాలు వత్సరాంతం వరకు కూడా కొనసాగు సూచనలున్నాయి. శని మరియు రాహువు భ జప శాంతులు కొంత ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి.


కర్కాటకము

కర్కాటక రాశి వారికి ఆరవ స్థానమున గురు సంచారము ప్రతికూల ఫలాలను ప్రసాదించు అవకాశముంది. ఉద్యోగులకు ప్రతికూలతలు, వివాదాలు, ఉన్నతాధికారులతో చిక్కులు, రాజ దండన భయము, చిక్కులు మరియు వివాదాలు, అపకీర్తి, చొర భయము, శత్రు భీతి, బంధు మిత్ర విరోధము. అనారోగ్యము, ప్రధానముగా శరీరము నందలి గ్రంథులు, శ్వాస కోశము, మధుమేహము, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రతికూలతలు అధికముగా ఉంటాయి. పితృ భేదము, అవకాశములు చేజారిపోవుట. వ్యయ స్థానమున రాహువు స్థితి వలన అధిక ధన వ్యయము. అనవసరమైన ఖర్చులు అధికం. లావాదేవీలందు వివాదాలు అధికం. జనవరి వరకు షష్ఠ స్థానమున శని గోచరము శుభమగుట వలన ఇట్టి ప్రతికూలతలు తక్కువగా ఉన్నను అటుపిమ్మట అధికమగు సూచనలున్నాయి. పనులందు స్తబ్దత, మందగతిన సాగుట, స్థాన చలనము, వ్యాపారము లందు స్తబ్దత, పెట్టుబడులు నిలిచి పోవుట. ధన నష్టము. ధనము పరుల హస్తగతమగుట. విద్యార్థులకు ప్రతికూలతలు. వివాహ ప్రయత్నములు అనుకూలించక పోవుట. అధర్మ కార్య చింతన అధికమగుట. గురు శని మరియు రాహువు భ జప శాంతులు కొంత ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి.


సింహము

సింహ రాశి వారికి పంచమ స్థానమున గురు సంచారము శుభ ఫలాలను అధికముగా ప్రసాదించే సూచనలున్నాయి. వీరికి చక్కని ఉద్యోగ వ్యాపారాభివృద్ధి, చక్కని కార్యసిద్ధి, సంతాన లాభము, ఇష్ట కార్య సిద్ధి, దైవ మరియు ధార్మిక కార్యాసక్తి, దైవానుగ్రహము, ఉపాసకులకు శుభ ఫలాలు అధికము, విద్యార్థులకు శుభ ఫలాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట, జ్ఞాపక శక్తి పెరుగుట, ధన లాభము, చక్కని ఆర్థికాభివృద్ధి, బంధు ప్రీతి మరియు వారి వలన లాభము పొందుట, కీర్తి ప్రతిష్టలు పెరుగుట మరియు సంపూర్ణ ఆరోగ్యము, వివాహ ప్రయత్నాలు ఫలించుట, గృహమునందు శుభ కార్యములు, తీర్థయాత్రలు, సంతాన సౌఖ్యము ఇత్యాది గా గల శుభ ఫలాలు అధికముగా ఉండు సూచనలున్నాయి. ఇట్టి రాశి వారికి జనవరి నుండి శని భ కూడా అత్యంత శుభుడు అగుట, రాహువు ఏకాదశమున శుభుడు అగుట వలన ఈ వత్సరాంతం వరకు కూడా ఈ రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి.


కన్య

కన్యా రాశి వారికి అర్దాష్టమ స్థానమున గురు సంచారము స్వల్ప ప్రతికూల లేదా మిశ్రమ ఫలాలను ప్రసాదించు సూచనాలున్నాయి. ఇట్టి రాశుల వారికీ ఉద్యోగ రీత్యా స్థాన చలనము, ఉద్యోగ భంగము, స్వల్ప అనారోగ్యము, మాతృ సంబంధ అనారోగ్యము, విద్యార్థులకు మిశ్రమ ఫలాలు, ఆస్తుల పరముగా ప్రతికూలతలు, అధిక ధన వ్యయము, ఆదాయానికి మించి వ్యయము, ధన నష్టము, యాచక నైచ్యము, కార్య విఘ్నము, మనోవ్యాకులత, వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట - మొదలగు గా గల ప్రతికూల ఫలములు లభించు సూచనలున్నాయి. కాని విద్యార్థులకు మిశ్రమ ఫలాలు లభిస్తాయి. ఇట్టి రాశి వారికి వత్సరాంతం వరకు కూడా శని మరియు రాహువులు ప్రతికూలులగుట వలన ఈ సంవత్సరమంతా కూడా ప్రతికూల ఫలాలు అధికంగా ఉంటాయి. గురు శని మరియు రాహువుల జప శాంతులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి.


తులా

తులా రాశి వారికి తృతీయ స్థానమున గురు సంచారము వలన ప్రతికూల ఫలాలు అధికముగా లభించు సూచనలున్నాయి. కార్యభంగము, అధిక ధన వ్యయము, బంధువులతోను మరియు సన్నిహితులతోను విరోధము, వృధా సంచారము, వ్యవహార నాశనము, భ్రాతృ విరోధము, విద్యార్థులకు ప్రతికూల ఫలాలు, ఉద్యోగులకు పదోన్నతులు నిలచిపోవుట, వ్యాపారులకు ప్రతికూలతలు, స్వయం ఉపాధులందు ఉన్న వారికీ కూడా ప్రతికూలతలు అధికము, పట్టుదల సడలింపు,అనూహ్య సంఘటనలు, బంధు విరోధము, శారీరిక శ్రమ అధికం, అనారోగ్యం, మాతృ సంబంధమైన అనారోగ్యము, శరీరము నందలి గ్రంథులకు చెందిన చిక్కులు, హార్మోనులకు చెందిన చిక్కులు, మధుమేహము, థైరాయిడ్ సమస్యలు – మొదలగు గా గల ప్రతికూలతలు ఉండే సూచనలున్నాయి. ఇట్టి రాశిలో జన్మించిన వారికి జనవరి నుండి అర్ధాష్ఠమ స్థానమున శని భ కూడా ప్రతికూలుడు అగుట వలన జనవరి మొదలు ఇట్టి చిక్కులు అధికమగు సూచనలున్నాయి. ఇట్టి రాశి వారు క్రొత్త పనులకు దూరంగా ఉండాలి. క్రొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. భాగ్య స్థానమున రాహువు వలన అవకాశాలు చివరి క్షణమున చేజారిపోవు సూచనలు. గురు శని మరియు రాహువుల జప శాంతులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి.


వృశ్చిక

వృశ్చిక రాశి వారికి ఇట్టి గోచరము వలన శుభ ఫలాలు అధికముగా ఉండే సూచనలున్నాయి. కార్య సాఫల్యత, పదోన్నతులు, చక్కని ఆర్థికాభివృద్ధి, ఆస్తుల విషయంలో అనుకూలతలు మరియు ధన లాభము, భాగస్వాముల ద్వారా లాభపడుట, రావలసిన ధనము చేతికి అందుట, శుభ కార్యాలు, వివాహ ప్రయత్నాలు సఫలీకృతమగుట, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట, కీర్తి ప్రతిష్టలు, కుటుంబ సౌఖ్యం, దానధర్మాదులను నిర్వహించుట, మనో నిబ్బరము, స్వయం సంతృప్తి, విద్యార్థులకు శుభ ఫలాలు, ఉద్యోగ మరియు వ్యాపారాలందు ఉన్న వారికీ శుభ ఫలాలు, ఉన్నతాధికారుల అనుగ్రహము, ఉత్తములు మరియు ఉన్నతమైన వ్యక్తుల సాంగత్యము, ధర్మాచరణ, కీర్తి ప్రతిష్టలు, సంతాన రీత్యా అనుకూలతలు, సర్వత్రా సంతోషము – మొదలగు గా గల శుభ ఫలములు. ఇట్టి రాశి వారికి జనవరి నుండి ఏలినాటి శని అయిపోవుట వలన జనవరి మొదలు శుభ ఫలాలు ఇంకనూ అధికమగు సూచనలున్నాయి. కాని అష్టమ రాహువు గోచరము స్వల్ప ప్రతికూలతలు ప్రసాదించు సూచనలున్నాయి. రాహువు భ జప శాంతులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి.


ధనుస్సు

జన్మ రాశిలో గురు సంచారము ప్రతికూల మైన ఫలితాలు ప్రసాదించు సూచనలున్నాయి. వీరికి స్థాన చలనము, ఉద్యోగ భంగ యోగాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవుట, పదోన్నతులు నిలిచి పోవుట, శత్రుభీతి, ఋణ బాధలు, కార్యభంగము, వృధా సంచారము, అధిక ధన వ్యయము, కీర్తి ప్రతిష్టలకు భంగము వాటిల్లుట, సంతానముతో విభేదాలు, అనారోగ్యము, మనశ్చింత, వివాహ ప్రయత్నములందు అవరోధము – మొదలగు గాల ప్రతికూలతలు. కాని జన్మ రాశ్యాధిపతి గా గురు భ ఇట్టి ప్రతికూలతలను స్వల్పముగానే ప్రసాదించు సూచనలున్నాయి. ఇట్టి రాశి వారికి ఏలినాటి శని వలన ఇట్టి ప్రతికూలతలు అధికాముగానే ఉండు సూచనలున్నాయి. పనులందు మాంద్యత, బంధు విరోధము, అధిక ధన వ్యయము, వృధా సంచారము, పదోన్నతులు నిలచిపోవుట, పెట్టుబడులు నిలిచి పోవుట ఇత్యాది ప్రతికూలతలు అధికముగా ఉండు సూచనలున్నాయి. సప్తమ స్థానమున రాహువు వలన అనిశ్చితి అధికంగా ఉంటుంది. అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోతూ ఉంటాయి. నిర్ణయాత్మక శక్తి తగ్గుతుంది.


మకరము

మకర రాశిలో జన్మించిన వారికి ఇట్టి గోచారము ప్రతికూల ఫలాలను ప్రసాదించు సూచనలున్నాయి. ఏలినాటి శని వలన కూడా చిక్కులు ద్విగుణీకృతము అగు సూచనలున్నాయి. ఉద్యోగులకు ప్రతికూలతలు అధికము, స్థాన చలనము, ప్రతికూల స్థానాలకు బదిలీలు, రాజ దండన భయము, ఆదాయ క్షీణత, ధన నష్టము, వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట, బంధు మరియు మిత్ర విరోధము, విద్యార్థులకు ప్రతికూలము మరియు వ్యాపారులకు లాభాలు క్షీణించుట మరియు ధన నష్టము, వృధా సంచారము, మనోవ్యాకులత, నివాస మార్పు, ఆస్తులకు చెందిన లావాదేవీలందు ప్రతికూలతలు, ఆస్తి నష్టము, శరీర సౌఖ్యము లోపించుట – మొదలగు గా ప్రతికూలతలు. వీరికి ఏలినాటి శని ప్రభావము వలన ధన నష్టము, బంధు విరోధము, శారీరిక శ్రమ అధికం, ఆరోగ్యం క్షీణించుట, శారీరిక బాధలు అధికం, చర్మ మరియు కీళ్ళకు చెందిన చిక్కులు, శరీరము నందలి హార్మోనులకు చెందిన చిక్కులు, సన్నిహితులు దూరమగుట ఇత్యాది ప్రతికూల ఫలాలు అధికంగా ఉంటాయి. కాని రాశి నాథుడిగా గురు శని భ కొంత తక్కువగానే ఇబ్బంది పెట్టు అవకాశాలు ఉన్నాయి. పేదలకు అన్నదానాలు, శ్రీ హనుమాన్ ఆరాధన, శని మరియు గురు భ జప శాంతులు కొంత ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి.


కుంభము

కుంభ రాశి వారికి ఏకాదశ లాభ స్థానములందు గురు భగవానుడు శుభ ఫలాలను ప్రసాదించు సూచనలున్నాయి. కాని గోచార రీత్యా జనవరి నుండి ప్రారంభమగు ఏలినాటి శని వలన ఇట్టి శుభ ఫలాలు హరించి వేయబడు సూచనలున్నాయి. శుభ స్థానమున సంచరించు గురు భగవానుడు చక్కని కార్య సిద్ధిని ప్రసాదించుట, ఆర్థికాభివృద్ధి, కీర్తి మరియు తేజో వృద్ధి, ఉద్యోగ ప్రయత్నములందు స్వల్ప ప్రతికూలతలు ఉన్నను చివరిగా ఇట్టి ప్రయత్నాలు ఫలించుట, విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలాలు మరియు విజయము, వ్యాపార రంగము లందు ఉన్న వారికీ కూడా అధిక శ్రమతో కూడిన ఫలాలు, ఆదాయము అధికముగా ఉన్నను అందుకు సమానముగా ఖర్చులు, వివాహ ప్రయత్నాలు ఫలించుట, గృహము నందు శుభ కార్యాలు, ఆస్తుల ద్వారా ధన లాభము, కీర్తి, తేజోవృద్ధి, విజయ ప్రాప్తి, పదోన్నతులు - మొదలగు గా శుభ మరియు మిశ్రమ ఫలాలు లభించు సూచనలున్నాయి. జనవరి మొదలు ప్రారంభమగు ఏలినాటి శని వలన పనులందు స్తబ్దత ఏర్పడు సూచనలు, అధిక ధన వ్యయము, కాని ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది. వీరు క్రొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. నూతన వ్యాపారాలకు దూరంగా ఉండాలి. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి, చంచలత్వం అధికంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. శని రాహువు భ జప శాంతులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి.


మీనము

మీన రాశి వారికి దశమ స్థానమున సంచరించు గురు భ. ప్రతికూల ఫలాలను ప్రసాదించు సూచనలున్నాయి. గోచార రీత్యా జనవరి మొదలు ఏకాదశ లాభ స్థానమున శని భ వలన ఇట్టి ప్రతికూలతలు స్వల్పముగానే ఉండు సూచనలున్నాయి. ఉద్యోగ పరమైన చిక్కులు అధికము, ఉద్యోగ భంగ యోగాలు, ప్రతికూల స్థానములకు బదిలీలు, స్థాన చలనము, నివాస మార్పిడి, కార్య విఘ్నము, పనులందు అవాంతరాలు అధికమగుట, ఖర్చులు అధికం, వృధా సంచారము, ధన నష్టము, మానసిక అశాంతి, వివాహ ప్రయత్నాలు విఫలమగుట, విద్యార్థులకు మిశ్రమ ఫలాలు, ఉద్యోగ ప్రయత్నము లందు ఉన్న వారికి ప్రతికూలము, వ్యాపారులకు అనిశ్చితి. కాని దశమ స్థానమున సంచరించు గురు భగవానుడు మీన రాశి వారికి స్వల్ప మిశ్రమ ఫలాలను మాత్రమే ప్రసాదించు సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధికముగా ఉండక పోవచ్చును. విద్యార్థులకు మరియు విద్య రంగములందు ఉన్న వారికి ప్రతికూలతలు అధికముగా ఉండక పోవచ్చును. చతుర్థ స్థానమున రాహువు వలన ఉద్యోగ వ్యాపారము లందు అనుకోని ఒడుదుడుకులు, మార్పులు ఎదురగు సూచనలున్నాయి. ఉద్యోగ మరియు వ్యాపార పరముగా మార్పులు చేపట్టునపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇట్టి నిర్ణయాలందు జాగ్రత్తగా ఉండాలి. గురు మరియు రాహువు భ జప శాంతులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి.


ముఖ్య గమనిక: పైన వివరించిన గోచార ఫలాలు సాధారణ ఫలాలు మాత్రమే. ఇట్టి గోచర ఫలాలను మీ జాతక చక్రమున ఉన్న శుభాశుభ గ్రహ యోగాలు మరియు జన్మకాల దశలు ప్రభావితము చేయుట వలన పైన వివరించ బడిన శుభాశుభ ఫలితము లందు మార్పులు సంభవించే అవకాశం ఉంది. అత్యంత ప్రతికూల గోచారమందు శుభ ఫలాలు మరియు అత్యంత శుభ గోచరమందు ప్రతికూల ఫలాలు లభించే అవకాశముంది. జాతకులు పైన వివరించ బడిన గోచర ఫలాలను అత్యంత జాగ్రత్తగా అన్వయించు కోవాలి. అనుభవస్తుడైన జ్యోతిషుడిని సంప్రదించాలి.


Important Note: The above-mentioned results are generalized results only. The Planetary position and Yogas present in the Janma Kundli and the Janma Kaala Dasha will influence these Gochara Results, due to which the said results may or may not become fruitful. All the above said results should be used with a great caution.


"సర్వేజనాః సుఖినో భవంతు - లోకాః సమస్తా సుఖినో భవంతు"


నమిలికొండ విశ్వేశ్వర శర్మ - नमिलिकोण्ड विश्वेश्वर शर्म


Copyright © 2019Sri Gayatri Veda Vision - All Rights Reserved

No part of this publication may be reproduced, distributed, or transmitted in any form or by any means, including photocopying, recording, or other electronic or mechanical methods, without the prior written permission of the publisher.