image11

HIndu Festivals

Dasara 2018

దసరా పండగ ఏరోజు జరుపుకోవడం శ్రేష్టం?


దసరా పండగ ఏరోజు జరుపుకోవడం శ్రేష్టం? ఇదే ఈనాటి అతిపెద్ద ప్రశ్న.

హిందువుల పండగలు శ్రీ సూర్య సిద్ధాంత పంచాంగం ను అనుసరించి జరుపుకోవడం ఉత్తమం. శ్రీ సూర్య సిద్ధాంత పజ్ఞ్చాన్గాన్ని అనుసరించి అక్టోబర్ 18 నాడు నవమి మధ్యాహ్నం 2 గంటల వరకు కలదు. శ్రవణ నక్షత్రము అదే రోజు మధ్య రాత్రి 12:11 ని వరకు కలదు. అక్టోబర్ 19 నాడు దశమి సాయంకాలం 04:06 ని వరకు కలదు మరియు శ్రవణ నక్షత్రము పరదినమైన అక్టోబర్ 19 నాడు లేదు. ఈ విషయంలో ధర్మసింధు మరియు నిర్ణయ సింధు కాస్త భిన్నమైన అభిప్రాయాలను తెలియచేయు చున్నాయి. శ్రీ అపరాజితా దేవి పూజ మరియు శమీ వృక్ష పూజకు శ్రవణ నక్షత్రము అత్యంత ప్రధానమైనది. అక్టోబర్ 18 నాడు దాదాపుగా అపరాహ్ణం మొదలు మధ్య రాత్రి వరకు దశమి మరియు శ్రవణ నక్షత్రం రెండూ ఉంటున్నాయి. కావున అక్టోబర్ 18 నాడు ‘దసరా పండగ’ జరుపుకోవడం శ్రేష్టం. సాయంకాలం శ్రీ అపరాజితా దేవి పూజ, శమీ వృక్ష పూజ మరియు సీమోల్లంఘనం.


‘తిథిద్వయం’ సంభవించిన నాడు ఈ విధమైన క్లిష్టమైన పరిస్థితులు రావడం సహజం. జ్యోతిష మరియు ముహూర్త శాస్త్ర ప్రామాణిక గ్రంథాలు కూడా పలు విధములైన ప్రమాణాలు ఇస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇట్టి ప్రమాణాలను తమకు అనుగుణంగా అన్వయించుకోవడం చాలా సహజం. అంతే కాదు ప్రతి వాడు తమ వాదననే గొప్పదని వాదించడం. ఇవన్నీ విన్న ప్రజలందరూ ఒక విధమైన గందరగోళానికి గురి కావడం అంతకంటే కూడా తథ్యం. అందుకే నేను ప్రధానంగా ప్రాంతాచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను. ‘పండగలు’ సాంఘీక మరియు సామాజిక కార్యక్రమాలు. వీటికి ఇట్టి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఉంటాయి. శాస్త్రం సంగతి పక్కనపెట్టి అట్టి ఆచారాన్ని పాఠించడమే మన విధి. పూర్వం రోజుల్లో ఒక ప్రాంతానికి ఒక సిద్ధాంతి మాత్రమే ఉండే వారు. వారు ఏవిధంగా చెబితే ఆవిధంగా ఆ ప్రాంత ప్రజలందరూ నడచుకునేవారు. కాని రానురాను జనాభా పెరిగిన కొలది సిద్ధాంతులు పెరిగారు, అన్నిటికీ మించి మన కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా అభివృద్ధి చెందింది. ఎదో ఒక ప్రాంతానికి చెందిన పండితుడు తన పరిజ్ఞానంతో ప్రమాణాలు చెప్పడం సహజం. అట్టి ప్రమాణాలు ఈనాటి కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా అభివృద్ధి చెంది ఉండడం వలన అన్ని ప్రాంతాల వారికీ తెలిసి పోతున్నది. తాము ఆచరించే దానికి భిన్నంగా అట్టి సలహాలు ఉంటే వారు గందరగోళానికి గురికావడం కూడా తథ్యం. ఇట్టి పరిస్థితులందు నేను ఒకే సలహా ఇవ్వదలచాను ‘మిత్రులందరూ మీరు నివసించే ప్రాంతంలో ఏవిధంగా ఈ పండగలు జరుపు కుంటున్నారో మీరు కూడా వారిని అనుసరించాలి. అదే ప్రాంతాచారం. దీనికి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు మరియు గందరగోళానికి గురి కావలసిన అవసరం కూడా లేదు. ఈ విషయంలో నేను ఇతర పండితులతో విభేదించడం కూడా లేదు’. “అవశ్యం పితురాచారః – అవశ్యం ప్రాంతాచారః. లేదా మీ కుటుంబంలో గల పెద్దలు పూర్వీకులు ఏవిధంగా సూచిస్తే మీరు కూడా దాన్నే పాటించండి. సందేహించే అవసరం లేదు”. నేను చెప్పిన విధంగా ఇవి సాంఘీక మరియు సామాజిక ఆచారాలు మాత్రమే. అతిగా ఆలోచించి గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. చక్కగా, హాయిగా, ఉల్లాసంతో పండగ జరుపుకోండి. ఆనందించండి. స్వస్తి.


స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాం | 

గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ||


నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి

Dasara 2018

 శ్రీ విళంబి లో దసరా పండగ

Find out more