Penumbral Lunar Eclipse

Penumbral Lunar Eclipse 10.01.2020

Penumbral Lunar Eclipse

ఛాయా బింబ చన్ద్ర గ్రహణం


10.01.2020 నాడు సంభవించ నున్న ఛాయా బింబ చన్ద్ర గ్రహణం పరిగణనలోకి వస్తుందా? అసలు ఛాయా చన్ద్ర గ్రహణం అంటే ఏమిటి?


ఇవి చన్ద్ర గ్రహణము ను సూచించు చిత్రములు. అసలు చన్ద్ర గ్రహణం ఎలా ఏర్పడుతుంది? సూర్యుడికి మరియు చంద్రుడికి మధ్య భూమి వచ్చినపుడు భూమి యొక్క ఛాయ చంద్రుడి పైన పడడం వలన చన్ద్రుడు స్వల్ప కాలం కొరకు కనుమరుగౌతాడు. మనం ఏదేని ఒక వస్తువును చూడాలంటే ఆ వస్తువు పై పడిన సూర్య కిరణాలు లేదా వెలుతురు వక్రించి మన కంటిని చేరినపుడే మనం ఆ వస్తువును చూడగలము. గ్రహణ సమయంలో సూర్య రశ్మి చంద్రుడిపై పడక పోవుట వలన చన్ద్రుడు మన కంటికి కనిపించదు. అదే విధంగా సూర్య గ్రహణం కూడాను. గ్రహణ సమయంలో సూర్యుడు మరియు భూమికి మధ్య చన్ద్రుడు వచ్చినపుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణం మూడు విధాలుగా సంభవిస్తుంది.

1. సంపూర్ణ చన్ద్ర గ్రహణం

2. పాక్షిక చన్ద్ర గ్రహణం

3. ఛాయా చన్ద్ర గ్రహణం

అదే విధంగా పై ఛాయా చిత్రంలో గల పదాల గూర్చి తెలుసుకుందాము. రెండవ ఛాయా చిత్రంలో Umbra అని ఒక నల్లని నీడ కనిపిస్తుంది. ఇది భూమి యొక్క నల్లని నీడ. ఇట్టి నీడలో పూర్తిగా కప్పబడి యున్న చన్ద్రుడు వలన సంపూర్ణ చన్ద్ర గ్రహణం ఏర్పడుతుంది. Umbra – నల్లని నీడకు పైన క్రింద మరొక నీడ గల ప్రాంతం కనిపిస్తుంది. దీన్నే Penumbra – నీడ యొక్క ఛాయ అంటారు. ఇది మనం నిత్య  జీవితంలో కూడా గమనించ వచ్చు. ఏదేని ఒక వస్తువు యొక్క నల్లని నీడకు పైన క్రింద దాని ఛాయ కనిపిస్తుంది. అదే విధంగా గ్రహణ సమయంలో కూడా నల్లని నీడకు ఇరువైపులా కొంత ఛాయ కనిపిస్తుంది. చన్ద్ర గ్రహణం విషయంలో, చంద్రుడు ఇట్టి ఛాయ Penumbra లో కొంత భాగం మరియు Umbra నల్లని నీడలో కొంత భాగం ఉన్న ఎడల అది పాక్షిక చన్ద్ర గ్రహణం అవుతుంది. చన్ద్రుడు సంపూర్ణంగా Penumbra ఛాయా లోనే ఉంటే దానిని Penumbral Lunar Eclipse ఛాయా చన్ద్ర గ్రహణం అని అంటారు. ఇట్టి గ్రహణం ఒక పొగ గల ప్రాంతంలో చన్ద్రుడు ఉన్నట్లుగా కనిపిస్తుంది.


ఇట్టి గ్రహణమే 10.01.2020 నాడు సంభవించు ఛాయా బింబ చన్ద్ర గ్రహణం. ఇది భారత కాలమానం ప్రకారం 10.01.2020 రాత్రి 10:37 నుండి 11.01.2020 నాడు ఉదయాత్పూర్వం 02:42 వరకు ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా చూడవచ్చు. ఎలాంటి నిర్బంధం లేదు. ఇట్టి ఛాయా చన్ద్ర గ్రహణాలు తరచు వస్తూ ఉంటాయి. ఇవి ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఇట్టి ఛాయా చన్ద్ర గ్రహణాలకు జ్యోతిష సిద్ధాంతాలను అనుసరించి ఏవిధమైన ప్రాధాన్యత లేదు మరియు ఇట్టి గ్రహణ పట్టింపు కూడా లేదు. కావున తెలిసీ తెలియని, మిడిమిడి జ్ఞానం గల వారి మాటలు నమ్మి ఇట్టి గ్రహణానికి అనవసర ప్రాధాన్యతను ఇవ్వ వలసిన అవసరం కూడా లేదు. గర్భిణీ స్త్రీలకూ కూడా ఏ విధమైన నిషేధాలు, నిర్బంధాలు లేవు. వారు సామాన్య జీవనాన్ని గడప వచ్చును.


స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం - న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।

గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం - లోకాస్సమస్తా స్సుఖినోభవంతు. ।।


"स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां - न्यायेन मार्गेण महीं महीशाः ।

गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं - लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।


నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి

नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति

image37

Annular Solar Eclipse

Annular Solar Eclipse 26.12.2019


Annular Solar Eclipse 26.12.2019


ఓం శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః

శుభ గ్రహ


  

26.12.2019 కేతు గ్రస్త అర్ధాధిక గ్రాస కంకణాకార సూర్య గ్రహణం:


మార్గశిర బహుళ అమావాస్య గురువారము మూల నక్షత్ర యుక్త – అర్ధాధిక గ్రాస, కేతు గ్రస్త, కృష్ణ వర్ణ, అపసవ్య గ్రహణం. ఇట్టి గ్రహణము దక్షిణ భారతదేశం లోని దాదాపుగా అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. గ్రహణం దక్షిణ భారతదేశంలో మాత్రమే దృశ్యమానం అయినా కూడాను గ్రహణ గోచారము దేశంలో నివసించు ప్రతి ఒక్కరికీ కూడా వర్తిస్తుంది. సౌదీఅరేబియా, ఒమాన్, దక్షిణ భారతదేశం, ఇండోనేషియా లోని కొన్ని భాగాలు, వాతావరణం అనుకూలించిన ఎడల ఆసియా ఖండంలో దాదాపుగా అన్ని ప్రాంతాలు,తూర్పు ఉత్తరా ఈశాన్య ఆఫ్రికా, ఉత్తర పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతములందు ఇట్టి పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం గ్రహణ సమయం:


స్పర్శ ప. 08:12

మధ్య ప. 09:38

మోక్ష ప. 11:22

(తూర్పు ఆగ్నేయ మధ్యే ఆగ్నేయాసన్నేస్పర్శ నైఋతి దిశి మోక్షః)


నిత్యభోజన ప్రత్యాబ్దికా నిర్ణయము:

నిత్యభోజన ప్రత్యాబ్ధికములు యథావిధిగా తగు కాలమున నిర్వహించు కోవాలి. అనగా పుష్య శుద్ధ పాడ్యమి కి చెందిన అబ్ధికములు మొక్షానంతరము స్నాన వచనాదులు చేసి నిర్వహించు కోవాలి.

అర్ధాదికము అగుట వలన మూలా నక్షత్రములో రాబోవు 3 మాసములు శుభ ముహూర్తములు గ్రహించుట శాస్త్ర సమ్మతము కాదు.


గ్రహణ గోచరము:

  

కుంభ, మీన,  కర్కాటక, తుల - శుభ ఫలం

మేష, సింహ, మిథున, వృశ్చిక - మధ్యమ ఫలం

ధనుస్సు, మకరం, వృషభం, కన్య - అధమ ఫలం


గ్రహణ శాంతి:

మూల నక్షత్ర జాతకులు, ధనుస్సు, మకరం, వృషభం మరియు కన్య రాశులందు జన్మించిన వారికి గ్రహణ శాంతి. ఇట్టి వారు వెండితో చేసిన చన్ద్ర బింబమును, బంగారుతో చేసిన సూర్య మరియు నాగ ప్రతిమలను (యథాశక్తి వెండి తో చేసినవి కూడా) ఆవు నెయ్యి (చన్ద్ర గ్రహణానికి ఆవు పాలు) తో నిండిన రాగి పాత్ర యందు ఉంచి, తిల, వస్త్ర దక్షిణలతో సహా క్రింది విధంగా సంకల్పించి బ్రాహ్మణుడికి ధనం చేయాలి:


గ్రహణ సంకల్పం:

సంకల్పం: మమ జన్మ రాశి – జన్మ నక్షత్రాద్యరిష్ట స్థాన స్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభ ఫల ప్రాప్త్యార్థం బింబ దానం కరిష్య” అని సంకల్పించిన పిదప “గ్రహణ సూచితారిష్ట పరిహారార్థం శుభ ఫల ప్రాప్త్యార్థం బింబ దానం తుభ్యం సంప్రతే నమమ” అని చెప్పుకుంటూ బ్రాహ్మణుడికి దానం ఇచ్చి యథాశక్తి సంభావన తో వారిని సత్కరించి వారి ఆశిస్సులు పొందాలి.


శ్లో: 

గ్రస్యమానే భావేత్స్నానం, గ్రస్తే హోమార్క చంద్రకే ।

మండలే ముచ్యమానేతు దానం ముక్తౌతు మజ్జనం ।।

అనగా గ్రహణం పట్టుచుండ స్నానం, గ్రహణం పూర్తిగా పట్టిన పిదప జప హోమాదులును, విడుపున దానమును, మొక్షానంతరము తిరిగి స్నానమును; చంద్ర సూర్య గ్రహణము లందు ఆచరించ వలయును


శ్లో: 

సర్వం గంగా సమం తోయం సర్వ్ వ్యాస సమా ద్విజా ।

సర్వం భూమి సమం దానం, తద్దానం మేరు సన్నిభం ।।

అనగా గ్రహణ కాలమున వాపి కూప తటాకాదులందలి జలమంతయు గంగా జలముతో సమానమై ఉండును. బ్రాహ్మణులందరు వ్యాస ముని సమానులు. ఏ చిన్న దానమైనను భూదానముతో సమానమైన ఫలితాన్నిస్తుంది. మేరు పర్వతమంత ఉన్నతమైన ఫలములను పొందవచ్చని పెద్దలు చెప్పియున్నారు. కావున గ్రహణ సమయంలో యధా విధి స్నానాన్ని ఆచరించి జప హోమ దానాదులను ఆచరించుట అత్యంత పుణ్య ప్రదము, ఆరోగ్య కరము మరియు శుభప్రదమగును


స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం - న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।

గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం - లోకాస్సమస్తా స్సుఖినోభవంతు. ।।
 

स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां- न्यायेन मार्गेण महीं महीशाः ।
गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं- लोकाः समस्ता सुखिनो भवन्तु ।।


నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति